20, మార్చి 2023, సోమవారం

మాటలాడవు నీవు పాటలాపను నేను

మాటలాడవు నీవు పాటలాపను నేను
సాటిలేని దిటువంటిది సఖ్యము మనది
 
బుధ్ధిమంతుడవు నీవు బుధ్ధిహీనుడను నేను
బుధ్ధు లిట్లు వేరయ్యును పొడమె నెయ్యము
బుధ్ధి నాకు గరపుటకై పుడమి కీవు వచ్చితివి 
బుధ్ధి కొంత గలిగి నిన్ను పొగడువేళ
 
రామచంద్ర నీదు కరుణ సామాన్యము కాదయ్యా
పామరుడను నిన్ను గూర్చి పాడుచుంటిని
ఏమిపాట లివి యనుచు నెంచకుండగా దొసగుల
స్వామి నీవు వినుచుందువు సఖ్యత మీఱ

నీవు మెచ్చి పలుకుదువని నేను పాడునది లేదు
భావంబులు నీదయయే పాటలె నావి
నా వను నవియును లేవు నా యీపలుకులును నీవె
కావున వేరేమి పలుక కారణమున్నే


19, మార్చి 2023, ఆదివారం

హరి చేసేదేమో అందమైన లీల

హరి చేసేదేమో అందమైన లీల
నరుడు చేసేదేమో నానాగోల

ధర మీద నరుని పెట్టి తలలోన తెలివి పెట్టి
హరి యాట మొదలుపెట్టు నటు పిమ్మటను
నరుడు మాయ తెగులుపట్టి హరియాట వదలిపెట్టి
మరియేదో దారిపట్టి తిరుగుచుండేను

మరపుమందు మ్రింగినట్లు మరులతీవ త్రొక్కినట్లు
హరియిచ్చిన బుధ్ధినే మరిచిన పిదప
హరియాటే మరచినట్లు హరియెవరో తెలియనట్లు
నరుడేమో ధరపైనే తిరుగుచుండేను

హరినామము తనబుధ్ధికి స్ఫురియించే దెప్పుడో
హరేరామ హరేకృష్ణ యనేదెప్పుడో
నరుడు తన్నుతానెఱిగి సరిగ నాడే దెప్పుడో
హరిలీల లోనెఱిగి మురిసే నపుడు

18, మార్చి 2023, శనివారం

రామనామమా నన్ను రక్షించుమా

రామనామమా నన్ను రక్షించుమా ఇంక
ఆమోక్షపదము నా కందించుమా

వచ్చి నానాలుకపై నిచ్చలు నివసింపవే
హెచ్చు ప్రేమతో నినుస్మరించుచుందునే
పిచ్చిపిచ్చి ధనములను వేడుటలేదే నిన్ను
ముచ్చటగా కోరుదునే ముక్తి యొక్కటే
 
కోరరాని వేమి నిన్ను కోరుటలేదే నేను
నోరు విడచి మోక్షమొకటె కోరుచుంటినే
భూరికృపతోడ నన్ను బ్రోవవలయునే సం
సారమందు నిలువగా జాలను సూవె

నారామనామమనుచు నమ్ముకొంటినే మన
సారా జిహ్వాగ్రమందు గారవింతునే
కారుణ్యము చూపి నన్ను కావవలయునే ఈ
ధారుణిపై మరలపుట్టు తలపేలేదే

చక్కగ రాముని సన్నిధి చేరి

చక్కగ రాముని సన్నిధి చేరి
మ్రొక్కుట యన్నదే ముక్తికి దారి

చక్కగ శ్రీహరి చరితామృతము
మిక్కిలి శ్రధ్ధగ మీరు చదువుచు
చక్కగ శ్రీహరి సంకీర్తనము
మిక్కిలి చేయుచును మీరు ధీరులై
 
చక్కగ హరినామ జపముచేయుచు
నిక్కువమగు భక్తితో నిలచుచు మీరు
చక్కగ హరిభక్తజనుల తోడను
మిక్కిలి యనురక్తి మెలగుచు మీరు

చక్కగ శ్రీరామచంద్రుని సేవ
నెక్కుడు శ్రధ్ధతో నెల్లవేళల
నక్కజముగ చేయుట యందే మీరు
మక్కువ చూపుచు మహాభక్తులై

సీతారామ సీతారామ చేరితి నిన్ను

సీతారామ సీతారామ చేరితి నిన్ను
నాతోడుగ నాదేవుడ నడపుము నన్ను

చచ్చిపుట్టి చచ్చిపుట్టి చాలవిసివితి యిక
చొచ్చుమనుచు తనువులీయ జూడకు నాకు
వచ్చి నీపాదములను పట్టితి చూడు కడు
ముచ్చటగా దయచేయుము మోక్షము నాకు

చేరి యల్పమానవులకు సేవచేయను తని
వార నీకు సేవచేయ భావించెదను
కోరరాని కోరికలను కోరను నిన్ను నే
కోరునట్టి మోక్షమొకటి కొసరుము నాకు

నిన్ను మించి దయాశాలి నెన్నడు గనము నీ
కన్న బంధుమిత్రు లెవరు కలుగరు నాకు
నిన్ను వేడి పొందరాని దన్నది కలదె హరి
తిన్నగాను మోక్షమిమ్ము దేవదేవుడ


17, మార్చి 2023, శుక్రవారం

వ్రతమును సడలింతునా

వ్రతమును సడలింతునా నే
నితరుల నుతియింతునా
  
సతతము నీనామస్మరణము చాలని
మతిమంతుడనై మసలుచు నుండి
క్షితినల్పంబుల చెందుట కొరకై
ధృతిచెడి యితరుల దేబిరింతునా

ఎవరే మిచ్చెద రిచ్చినను మోక్ష
మెవ రిత్తురయా యినకులతిలక
భువనాధీశ్వర మోక్షప్రదాయక
ఎవరి మెప్పునో యేల కోరెదను

తారకనామము దక్క మరొక్కటి
చేరగ నీయని చిత్తము నాదే
దారితప్పి మరి వేరొక మంత్రము
చేరనిచ్చి నాజిహ్వాగ్రంబున 
 

13, మార్చి 2023, సోమవారం

నిన్నే నమ్మితి కాదా రాఘవ

నిన్నే నమ్మితి కాదా రాఘవ నన్ను సాధించుట మేలా
ఎన్నడు నీపాదములనే విడువని నన్ను కటాక్షించ వేలా

ఇన్నిన్ని లోకంబు లున్నవి పోరా యెంతో చక్కగాను వాని
నెన్నెన్ని యందాలతో నింపి యుంచితి నెందైన నుండగ రాదో
యన్నను వినకుండ నీపాదసన్నిధి యదిచాలు నాకంటి గాదా
మన్నీడ యికనైన దయతోడ నామొఱ మన్నించరాదా రామా

ఎంత వేడినగాని ఎన్నెన్ని తనువుల యిఱికించుచున్నావు నన్ను
సుంతైన కనికర ముంచగ రాదా చోద్యము చూచుట మాని
అంతకంతకునాట దుర్భరం బగుచుండ ఆడలేకున్నాను స్వామీ
ఇంతటితో నాట చాలించి విశ్రాంతి నిప్పించ వలయును రామా

తారకనామంబు పాడుచుండమని దయతోడ సెలవిచ్చి నావు
తారకనామంబె పాడుచుండిన గాని దయచూడ కున్నావు నీవు
తారకనామంబు కంటెను మంత్రంబు తలప నింకొక్కటి లేదే
తారకనామ ప్రభావంబు చూపర దయచూడవయ్యా రామా

10, మార్చి 2023, శుక్రవారం

మధురం మధురం‌ మధురతరం

మధురం మధురం‌  మధురతరం మధురతమం జనులారా


రాముని నామమె మధురం మధురం రామస్మరణమె శుభదం
రాముని చరితమె మధురం మధురం ప్రేమామృత భరితం
రాముని పలుకే‌ మధురం మధురం కోమలపదసంభరితం
రామధ్యానమె మధురం మధురం మామకహృదయానందం
రాముని గుణమే మధురం మధురం భూమిజనైకనుతం
రాముని తత్త్వమె మధురం‌ మధురం బ్రహ్మాదికవినుతం
రాముని సేవయె మధురం మధురం క్షేమకరం సుఖదం
రాముని కరుణయె మధురం మధురం ప్రసాదించు మోక్షం


7, మార్చి 2023, మంగళవారం

భక్తితో మ్రొక్కితే

భక్తితో మ్రొక్కితే వద్దువద్దందువా 

ముక్తిలేదు నీకు పోపొమ్మందువా


అందరు నీబిడ్డలే యనుచుండవా నీ

వందరకును సముడవై యలరుచుండవా

కొందరినే యాదరించి కొందరిని చీదరించు

చుందువా యెన్నడైన చోద్యముగాను


నీపాదము లాశ్రయించి నిలచియున్నంతనే

పాపాత్ముడైన నగును పరమభాగవతుడు

పాపములును తాపములును శాపములును  మానవుడు

నీపాదము లాశ్రయించ నేర్చుదాకనే


రామరామ యనుదాకనె పామరుడు కదా

రామా యనగానె యాదరమున బ్రోవనెంతువు

రామరామ యని నీకు రయమున మ్రొక్కెనా

రామచంద్ర మోక్షమునే ప్రసొదింతువే 


పొగడండీ పొగడండీ

పొగడండీ పొగడండీ పురుషోత్తముని పొగడండీ

పొగడండీ పొగడండీ పుణ్యచరిత్రుని పొగడండీ


శ్రీరఘురాముని పొగడండీ సీతారాముని పొగడండీ

ఘోరదనుజులను కాటికిపంపిన కోదండరాముని పొగడండీ

మారజనకుని పొగడండీ మంజులగాత్రుని పొగడండీ

తారకరాముని పోగడండీ ధర్మస్వరూపుని పొగడండీ


శివునివింటి నవలీలగ నెత్తిన చిన్మయరూపుని పొగడండీ

అవనీతనయాపతియై వెలసిన ఆనందరాముని పొగడండీ

భువనేశ్వరుని పొగడండీ భూరికృపాళుని పొగడండీ

భవనాశంకరు పొగడండీ పతితపావనుని పొగడండీ


మునిజనవినుతుని పొగడండీ మోక్షదాయకుని పొగడండీ

జననాధోత్తము పొగడండీ జ్ఞానస్వరూపుని పొగడండీ

ఇనకులేశ్వరుని పొగడండీ గుణసాగరుని పొగడండీ

మన హరిని సదా పొగడండీ మరిమరి యందరు పొగడండీ 


6, మార్చి 2023, సోమవారం

చూచిపోవచ్చితిమో సూర్యకులతిలక

చూచిపోవచ్చితిమో సూర్యకులతిలక
చూచి తరించితిమిలే శోభనాకార
 
సీతామాత యిటుప్రక్క చిరునగ వొలుక
నీతమ్ముడు లచ్చుమన్న నిలువ నావంక
వాతసూతి కొలుచుచుండ పాదసీమను
పూతచరిత్రుడవు నిన్ను పొడగంటిమి

కొలువుతీరియున్న నిన్ను తిలకించితిమి
తిలకించి మిక్కిలిగా పులకించితిమి
పులకించుచు కీర్తనలే పలుకుచుంటిమి
పలుకుపలుకునందు మధురభావము లూర
 
నిగమగోచరుడవు నీవు నీరజాక్షుడవు
జగదీశ్వరుడవు నీకు సాగి మ్రొక్కెదము
తగునిట్లే దినదినమును దరిసెనము మా
కగును గాక రామచంద్ర యంతే చాలు

 

ఎన్నగ నీరాముడే యీశ్వరుడు కావున

ఎన్నగ నీరాముడే యీశ్వరుడు కావున
అన్నివేళలందు వాని ధ్యాసయే మనకు
 
ఎన్నిమార్లు రామరామ యన్నను కాని
ఎన్నడైన విసువుకల్గు టున్నదా మనకు
ఎన్నిమార్లు రామకథను విన్నను కాని
ఎన్నడైన విసువుకల్గు టున్నదా మనకు

ఎన్నిమార్లు శ్రీరాముని కన్నుల గనిన
ఎన్నడైన తనివితీరు టున్నదా మనకు
ఎన్నిమార్లు రాముని కీర్తించిన కాని
ఎన్నడైన చాలు ననుపించునా మనకు

ఎన్నిమార్లు రామసేవ నున్నను కాని
ఎన్నడైన అలసిపోవు టున్నదా మనకు
ఎన్నిమార్లు రాముని ధ్యానించిన కాని
ఎన్నడైన చాలనుకొను టున్నదా మనకు
 

4, మార్చి 2023, శనివారం

దినదినమును శ్రీహరి తత్త్వంబును

దినదినమును శ్రీహరి తత్త్వంబును

మననము.చేయుట మంచిపని


హరియే బ్రహ్మంబను సంగతిని

  మరువక యుండుట మంచిపని

హరి సంకీర్తన మన్నివేళలను

  మరువక చేయుట మంచిపని 


హరిభక్తులతో చర్చలలో రుచి

  మరగుట యన్నది మంచిపని

హరిసేవారతి నానందపు రుచి

  మరగుట యన్నది మంచిపని


మంచివాడు మారాముడు హరి యని

  యెంచుట  మిక్కిలి మంచిపని

అంచితముగ మది తారకనామము

  నెంచి రమించుట మంచిపని


గొప్పవాడవయ్యా నీవు

గొప్పవాడవయ్యా నీవు కోదండరామా మా

తప్పులు మన్నించి కాచు దయామయా రామా


ఆర్తజనత్రాణపరాయణుడవైన రామా బహు

ధూర్తరక్షోగణములను దునుమాడే రామా

మూర్తిగొన్న బ్రహ్మమవని పొగడబడే రామా స

త్కీర్తితోడ యుగయుగముల తేజరిల్లు రామా


సదావసుంధరాసుతాసమర్చిత రామా సం

పదలకెల్ల మూలమైన పట్టాభిరామా

సదాచతురాననాదిచర్చితగుణ రామా ఆ

పదల నెల్ల పోనడచే పరమవీర రామా


కూరిమితో భక్తజనుల చేరదీయు రామా సా

మీరి హృదయపీఠమున మెఱయుచుండు.రామా

కోరిన కోరికలు తీర్చు గుణముగల రామా భవ

తారకమని పేరొందిన పేరుగల రామా 


3, మార్చి 2023, శుక్రవారం

ఎంతవాడో యీరాము డంతటిదే మాసీత

ఎంతవాడో యీరాము డంతటిదే మాసీత
ఇంతకన్న దొడ్డజంట యిలలో కల్ల

ఎంతటి యందగాడో యీరామచంద్రుడు
అంతటి యందగత్తె యవనిజాత
ఎంత గుణవంతుడో యీరామచంద్రుడు
అంత సౌశీల్యవతి యవనిజాత
 
ఎంత గంభీరుడో యీరామచంద్రుడు
అంత యుచితజ్ఞయు నవనిజాత
ఎంత ధర్మజ్ఞుడో యీరామచంద్రుడు
అంతటి ధర్మజ్ఞయు నవనిజాత
 
ఎట్లు యజ్ఞసంభవుడో యీరామచంద్రుడు
అట్లే యజ్ఞసంభూత యవనిజాత
ఎట్లు శివుని విల్లెత్తె నీరామచంద్రుడు
అట్లే మున్నెత్తె దాని నవని జాత  

2, మార్చి 2023, గురువారం

వీనులవిందుగ

వీనులవిందుగ నాలుగుమాటలు వినిపించవె ఓమనసా

ఆనాలుగు శ్రీరామునిగూర్చి ఐతే మంచిది మనసా


రాముని పొగడే నాలుకె నాలుకరా యనరాదా మనసా

రాముని జూచెడి కన్నులె కన్నులురా యనరాదా మనసా


రాముని తెలిపే చదువే చదువన రాదా ధాటిగ మనసా

రాముని సేవకులే బంధువులన రాదా సూటిగ మనసా


రాముని కొలిచే బ్రతుకే చక్కని బ్రతుకన రాదా మనసా

రాముని నమ్మిన చిత్తమె చిత్తమురా యనరాదా మనసా


రాముని కంటెను దైవము లేడనరాదా యొప్పుగ మనసా

రాముని భక్తులు కడుధన్యులనరాదా యొప్పుగ మనసా 


రాముని భజనయె పరమసుఖంబన రాదా నిత్యము మనసా

రాముని నామమె తారకమంత్రమురా యనరాదా మనసా