బ్రహ్మాస్త్రము వేయవయా రావణుని పైన
బ్రహ్మజనక ఎందులకీ బంతులాట
ఒకటికాదు రెండుకాదు ఓహో రామా
ఒక వారము దినములాయె నోయి నేటికి
ఒకొటొకటిగ నూఱుతలల నుత్తరించినా
అకటకటా వీడు చచ్చుటన్నది లేదే
సమరవిజయశీల రామ సమీపించెను
కుమతి రావణునిచావు కొఱకు సురవరులు
విమలమనస్కులు పల్కిన వేళ శీఘ్రమే
సమయించుము వీని రామచంద్రుడా యిక
మిన్న యని బ్రహ్మాస్త్రము మేదినీశుడా
ము న్నగస్త్యు డిచ్చె నీకు ముదమారగా
తిన్నగా నద్దాని వేయ దేవదేవుడా
నిన్ను వరించేను జయము నిశ్చయంబుగా
నాదొక సందేహం, శ్యామలరావు గారు. త్రిమూర్తులకు కులం ఆపాదించలేము కదా. వారిలో ఒకరు బ్రహ్మ దేవుడు. మరి ఆ బ్రహ్మ గారి మునిమనుమడైన రావణుడు బ్రాహ్మణుడు అని ఏ ప్రాతిపదికన అంటున్నారు పండితులు?
రిప్లయితొలగించండిదశరథుడి కొడుకు కాబట్టి రాముడు దాశరథి. రఘువు వంశం వాడు కాబట్టి ఆయన రాఘవుడి. కుంతి కొడుకులు కౌంతేయులు, ధృతరాష్ట్రుడి కొడుకులు ధార్తరాష్ట్రులు. ఇలా అపత్యార్ధంలో వాడటం సంస్కృతభాషా విధానం. పులస్త్యుడి వంశం వాడు కాబట్టి రావణుడు పౌలస్త్యుడు. పులస్త్యుడు నవబ్రహ్మల్లో ఒక బ్రహ్మ. కాబట్టి రావణుడు బ్రహ్మవంశం వాడుగా ఒక బ్రాహ్మణుడు. అంతే నండి. (నిజానికి రావణుడు తనని తాను క్షత్రియుడుగా చెప్పుకున్న సందర్భాలున్నాయి!)
తొలగించండిఓహో, బ్రహ్మ సంతతి కాబట్టి బ్రాహ్మణుడు అనచ్చు, అంతే గానీ కులానికేమీ సంబంధం లేదు అంటారా? ఇది సబబుగానే ఉంది. థాంక్స్.
తొలగించండి