19, అక్టోబర్ 2026, సోమవారం

ధర మీద పుట్టించి తైతక్క లాడించి

 
ధర మీద పుట్టించి తైతక్క లాడించి
హరి నీవు మాతోడ నాడేవులే బలే

ఆంతు తెలియగ రాని వింతలు కల్పించి 
అంతంతమాత్రపు నాటకు రుచిపెంచి
చింతలు కల్పించి చిందులు వేయించి
అంతలోనే యెంచి యవలకు పంపించి

వేల వేసంబులు వేయించి పిమ్మట
జాలిని చూపించి చాలించి యాటను
లీలగ వేరొక్క రీతిగ నాడింప
ఆలోచనము చేసి మేలైన విధమెంచి

పామరత్వము బాపి బహు దీవనలు సేసి
రామనామ మిచ్చి రంజుగ పాడించి
నామపారమ్యము నలుగడ చాటింప
భూమిని నీభటుల పొలుపుగ మమ్మిట