9, జులై 2024, మంగళవారం

ప్రేమగ రెండక్షరములు


ప్రేమగ రెండక్షరములు 
    రామ యని పలుకరా
ఆమాటయె చాలునురా 
    అమితఫలము కలుగునురా

ఆమాటయె సత్యమని
    అఖిలజగము నెఱుగునురా
ఆమాటయె నిత్యమని
    ఆత్మశుధ్దిగ నమ్మరా
ఆమాటయె నిన్నుకాచు
    నాయుధముగ నుండునురా
ఆమాటయె నీకు ముక్తి
    నందించెడు మంత్రమురా

ఆమాటయె ప్రాణముగా 
    అమ్మ సీత యున్నదిరా
ఆమాటయె మంత్రముగా 
    హనుమ నిలచి యున్నాడుర
ఆమాటను నమ్ముకొని 
    యందరు మునులున్నారుర
ఆమాటకు తిరుగులేదు 
   అదియె ప్రేమగ పలుకరా

ప్రేమగ నాసదాశివుడు 
    విడువక స్మరియించునురా
ప్రేమగ సజ్జనులు సతము 
    పిలచి మురియుచుందురురా
ప్రేమగ సద్భక్తులెల్ల 
    పిలచి ముక్తులగుదురురా
ప్రేమతో పిలుచువారికి 
    రాముడెపుడు పలుకునురా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.