మానిత సిధ్ధులు మహిమలు యశములు
నేనెపుడైనను కోరితినా
పోనీ సిరిసంపద లైనను ఘన
భోగము లైనను కోరితినా
నీనామము నా నాలుకపైనే
నిలువ నీయమని కోరితిని
నీనిజతత్త్వము నిచ్చలు తలచే
నిలకడ నిమ్మని కోరితిని
నీనిజభక్తుల సత్సాంగత్యము
నిత్యము నిమ్మని కోరితిని
మానక నీమంగళరూపము నా
మనసున నిలుపగ కోరితిని
నిరంతరముగా నీసేవలలో
నిలచియుండుటను కోరితిని
పరమాత్ముడవగు నిను సేవించుచు
పండిపోవుటను కోరితిని
పరుల నెప్పుడును తలపక నిన్నే
భావించుటనే కోరితిని
శరణాగతవత్సలుడవు నిన్నే
శరణము మరిమరి కోరితిని
నిను నే కోరిన వన్నియు నుచితము
లని తెలిసియు కరుణించవుగా
ఘనుడవు కరుణామయుడ వైనను
నను కరుణించగ తలచవుగా
ఇనకులతిలకా దశరథతనయా
యీ బెట్టెందుకు రఘురామా
కొనకంటను నను తిలకించిన నీ
ఘనతకు లోటగునా రామా