31, మార్చి 2013, ఆదివారం

తల్లియు దండ్రివై

తల్లియు దండ్రివై గురుడు దైవమ వీవయి రామచంద్ర యు
త్ఫుల్లసరోజనేత్ర పెడబుధ్ధుల జోలికి పోవకుండ నా
కెల్ల విధంబులన్ హితము నెప్పుడు జూపెదవయ్య నేను నీ
చల్లని నీడలో బ్రతికి చక్కగ నీ పదసీమ చేరెదన్


(వ్రాసిన తేదీ: 2013-1-27)

30, మార్చి 2013, శనివారం

తల్లియు తండ్రియున్

తల్లియు తండ్రియున్ గురుడ వీవయి రామచంద్ర యు
త్ఫుల్లసరోజనేత్ర పెడబుధ్ధుల జోలికి పోవకుండ నా
కెల్ల విధంబులన్ హితము నెప్పుడు జూపెద వయ్య నేను నీ
చల్లని నీడలో బ్రతికి చక్కగ నీ పదసీమ చేరెదన్


(వ్రాసిన తేదీ: 2013-1-27)

29, మార్చి 2013, శుక్రవారం

శ్రీపతిదివ్యసన్నిధికి

ఉ. శ్రీపతిదివ్యసన్నిధికి చేరగ నెంచు ముముక్షులార మీ
రే పగిదిన్ ప్రయత్నములన నెంతటి నిష్టను చేయుచున్న వా
రా పరమాత్మ రాఘవుని యందు తిరంబగు భక్తి  గల్గుచో
మీ పని చాల హాయి మరి మేలగు మార్గము లేదు భూమిపై


(వ్రాసిన తేదీ: 2013-1-25)

28, మార్చి 2013, గురువారం

కనుగొనుమా మహాత్మ

కనుగొనుమా మహాత్మ  క్షణకాలము ముందర నిన్ను గూర్చి నా
మనసున నున్న భావముల మంచిపదంబుల చంపకంబులన్
గొని తనివార కూర్చుటకు కొంత ప్రయత్నము చేయ సిధ్దమై
తిని మరి యంతలో మరొక దిక్కున కేగెను బుధ్ధి రాఘవా!


(వ్రాసిన తేది: 2013-1-25 )

27, మార్చి 2013, బుధవారం

షట్పదలు

తెలుగు ఛందస్సులలో‌ షట్పదల గురించి ముచ్చటించు కుందాం.  నిన్న శంకరాభరణం బ్లాగులో కొన్ని కుసుమషట్పదలు వ్రాసాను.  ఈ రోజు నా యీ శ్యామలీయం బ్లాగులో షట్పదల గురించి కొంచెం వివరించి వ్రాస్తే బాగుంటుందని అనిపించింది. 

షట్పదలు కన్నడదేశంలో చాలా ప్రసిథ్థం కానీ తెలుగులో వీటికి కావ్యప్రయోగగౌరవం శూన్యం. కన్నడంలో షట్పదలకు మాత్రలతోనే‌ కొలత. మన తెలుగు లాక్షణికులు మాత్రం దీన్ని దేశిగణాల్లో కొలిచారు.  ఈ షట్పదలు గేయరూపమైన ఛందస్సు. అందుచేత వీటి లక్షణాన్ని గణవిభజనతో‌ కాక మాత్రావిభజనతో చూడటం సముచితంగ ఉంటుంది.

కన్నడషట్పదలలో 10 రకాలున్నాయి. అవి (1)శరషట్పద, (2)కుసుమషట్పద, (3)భోగషట్పద, (4)భామినీషట్పద, (5)పరివర్థినీషట్పద, (6)వార్థకషట్పద (7)తలషట్పద (8)జలషట్పద (9)విషమషట్పద (10)ప్రౌఢషట్పద అనేవి. వీటి లక్షణాలు చూద్దాం

1. శరషట్పద
మాత్రా విభజన:
        4  +   4
        4   +  4
        4   +  4  +  4  +  2
        4  +   4
        4   +  4
        4   +  4  +  4  +  2

దీనికి ఒక ఉదాహరణ శ్రీశ్రీగారి కవిత్వం నుండి యిలా:

మరోప్రపంచం 
మరోప్రపంచం
మరోప్రపంచం పిలిచిందీ
పదండి ముందుకు
పదండి తోసుకు
పోదాంపోదాం పైపైకీ

ముందే చెప్పుకున్నట్లు షట్పదులు గేయఛందస్సులు. ఈ మరోప్రపంచం గేయం మకుటం శరషట్పది కావటం జరిగిందిలా.  లేదా శ్రీశ్రీగారు భజగోవిందం ఆధారంగా వ్రాసారేమో?

భజగోవిందం
భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే స
న్నిహితే కాలే
నహినహి రక్షతి డుకృంకరణే


2. కుసుమషట్పద

మాత్రావిభజన:
        5  +   5
        5   +  5
        5   +  5  +  5  +  2
        5  +   5
        5   +  5
        5   +  5  +  5  +  2

౩. భోగషట్పద 

మాత్రావిభజన:
        3   +  3  +  3  +  3
        3   +  3  +  3  +  3
        3   +  3  +  3  +  3  +  3  +  3  +  2
        3   +  3  +  3  +  3
        3   +  3  +  3  +  3
        3   +  3  +  3  +  3  +  3  +  3  +  2

4. భామినీషట్పద

మాత్రావిభజన:
        3   +  4  +  3  +  4
        3   +  4  +  3  +  4
        3   +  4  +  3  +  4  +  3  +  4  +  2
        3   +  4  +  3  +  4
        3   +  4  +  3  +  4
        3   +  4  +  3  +  4  +  3  +  4  +  2


5. పరివర్థినీషట్పద

మాత్రావిభజన:
        4   +  4  +  4  +  4
        4   +  4  +  4  +  4
        4   +  4  +  4  +  4  +  4  +  4  +  2
        4   +  4  +  4  +  4
        4   +  4  +  4  +  4

        4   +  4  +  4  +  4  +  4  +  4  +   2


6. వార్థకషట్పద

మాత్రావిభజన:
        5   +  5  +  5  +  5
        5   +  5  +  5  +  5
        5   +  5  +  5  +  5  +  5  +  5  +  2
        5   +  5  +  5  +  5
        5   +  5  +  5  +  5
        5   +  5  +  5  +  5  +  5  +  5  +  2


ఉదాహరణ:
   లోకాలు కూలినా కూలిపో  నీవయ్య
   లోకేశు లందరూ తూలిపో నీవయ్య
   ఏకాకివై నీవు చిద్విలాసుండవై యుండేవు నారాయణా
   నీకన్న మాకెవ్వ రెక్కువే కాదయ్య
   నీ కటాక్షంబునే నమ్ముకున్నామయ్య
   శ్రీకామితాకార సద్భక్తమందార సర్వేశ నారాయణా

 
 


7. తలషట్పద

మాత్రావిభజన:
        3   +  3
        3   +  3
        3   +  3  +  3  +  2
        3   +  3
        3   +  3
        3   +  3  +  3  +  2


8. జలషట్పద 

మాత్రావిభజన: 
        3   +  4
        3   +  4
        3   +  4  +  3  +  2
        3   +  4
        3   +  4
        3   +  4  +  3  +  2
9.  విషమషట్పద

మాత్రావిభజన:
        4   +  5
        4   +  5
        4   +  5  +  4  +  5  +  2
        4   +  5
        4   +  5
        4   +  5  +  4  +  5  +  2

10. ప్రౌఢషట్పద

మాత్రావిభజన:
        4   +  5  +  4  +  5
        4   +  5  +  4  +  5
        4   +  5  +  4  +  5  +  4  +  5  +  2
        4   +  5  +  4  +  5
        4   +  5  +  4  +  5
        4   +  5  +  4  +  5  +  4  +  5  +  2


షట్పదులలో యతి నియమం గురించి:

షట్పదిలో యతి అవసరం లేదు. అప్పకవి యీ పద్యాన్ని నిర్యతి అనీ అనంతుడు దీన్ని 'వళ్ళు దొరగ' అనీ చెప్పారు.
కన్నండంలో యతి లేదు. తెలుగులో యతి నియమం లేని పద్యం యిదొక్కటే.


షట్పదులలో ప్రాస నియమం గురించి:
  
షట్పదలు 6 పాదాల పద్యాలే.  కాని తెలుగు లాక్షణికులు వీటిని 4 పాదాలుగా చేసారు!
ఇలా చేయటానికి వారు పొట్టిపాదాల జంటలను కలిపి ఒక్కో జంటనూ ఒక్కో పాదంగా చూపారు.
ఆ పైన ప్రాస నియమం యధావిధిగా వడ్డించారు.
ఇలా 6 పాదాలనూ కలిపి 4 చేసిన విధానం చూసి రావూరి దొరస్వామి శర్మగారు వీళ్ళకి షట్పద సరిగా తెలియలేదని ఆక్షేపించారు.

గమనిక:  ఈ వ్యాసం ప్రస్తుతానికి అసంపూర్ణం. ఎందుకంటే చాలా షట్పదావిశేషాలకు ఉదాహరణలు ఇంకా ఇవ్వవలసి ఉంది కాబట్టి. పైగా మరికొన్ని విషయాలు ఇంకా వ్రాయవలసి ఉంది కూడా.

ఆధారగ్రంధం:  
   తెలుగులో దేశిఛ్ఛందస్సు ప్రారంభ వికాస దశలు - డా॥సంగనభట్ల నరసయ్యగారు.  (ద్వితీయముద్రణ)

శ్రీకర నిన్ను గొల్చుటకు

శ్రీకర నిన్ను గొల్చుటకు చిత్తము సుస్థిరశాంతియుక్తమై
లేకునికిం పురాకృతము లీలగ నిట్టటు త్రోయుచుండగా
శోకనిమగ్నబుధ్ధినయి సొక్కుచు లోకపు పాడునూతిలో
భేకము రీతి నుంటి రఘువీర కృపాకర కావరావయా


(వ్రాసిన తేదీ: 2013-1-24)

26, మార్చి 2013, మంగళవారం

బంగరు లేడి యుండదని

ఉ. బంగరు లేడి యుండదని బాగుగ సీత యెఱుంగ లేదె తా
వెంగలి యేమి రాఘవుడు వెంబడి పోవగ దాని జూచి మీ
దం గలుగంగ నైన కథ దానవనాశన మన్నమాట నా
యింగితహీనదస్యపతి యేమి యెఱుంగమి రామలీలయే


(వ్రాసిన తేదీ: 2013-1-24)

25, మార్చి 2013, సోమవారం

ఏ నిష్ఠా నియమంబులు

శా. ఏ నిష్ఠా నియమంబు లే వ్రతము లే నెన్నండు కొంచెంబు గా
నైనం బూనక తప్పు చేసితిని రామా నన్ను మన్నించి యో
ధ్యానాతీతమహత్స్వరూప వరదా దాక్షిణ్యముం జూపి య
జ్ఞానంబున్ వెడలించి నిన్ను గొలువం సంసిధ్ధునిం జేయవే


(వ్రాసిన తేదీ:‌ 2013-1-23)

21, మార్చి 2013, గురువారం

సీతను గొంచు బోయినను

ఉ. సీతను గొంచు బోయినను చేరి పదంబులు పట్టి మ్రొక్కుచో
నాతనికే నయోధ్య కడు నాదర మెప్పగ నిత్తునన్న వి
ఖ్యాతదయాసముద్ర నిను గాక మరొక్కని చూడబోమయా
భూతలవాసులందు సరి పోలెడు వానిని రామ భూవరా


(వ్రాసిన తేదీ: 2013-1-23)

20, మార్చి 2013, బుధవారం

నిశల వెలుంగు లల్లుకొను

చం. నిశల వెలుంగు లల్లుకొను నేయమృతాంశుని కాంతి చేత నా
శశి శుభవృష్టి వృధ్ధియును సంక్షయముం గొనుచుండు నిత్యమున్
విశదయశోవిలాసి రఘువీరు దయామృత వృష్టి నిత్యమున్ 
దశదిశలేలు చుండు నిజదాసచకోరక పూర్ణచంద్రుడై


(వ్రాసిన తేదీ: 2013-1-23)

19, మార్చి 2013, మంగళవారం

భరతుడు వచ్చి

చం. భరతుడు వచ్చి పాదుకలు పట్టుక పోయెను కాననంబులన్
తిరుగుట యింక నెట్టులని దేవ యొకించుక సంశయింతువో
నరకపరీక్ష లోర్చినది నాదగు చర్మము దీని పాదుకల్
మరియు ప్రశస్త మేమి యను మానము లేక గ్రహించవే ప్రభూ


(వ్రాసిన తేదీ: 2013-1-23)

18, మార్చి 2013, సోమవారం

కైకమ్మ లాగికొనుచో

కం. కైకమ్మ లాగికొనుచో
నీకొక గద్దియకు కలుగ నిత్తునె లోపం
బో కాకుత్స్థ కృపామయ
చేకొనుమా నాదు హృదయ సింహాసనమున్


(వ్రాసిన తేదీ: 2013-1-23)

17, మార్చి 2013, ఆదివారం

వనవాసంబు నెపంబు

మ. వనవాసంబు నెపంబు జేసికొని నా స్వామీ జగద్వంద్య నీ
ఘనకోదండవిముక్తదివ్యశరసంఘాతంబులన్ సర్వదై
త్యనికాయంబును సంహరించితివి ధాత్రిన్ ధర్మమూర్తీ జగ
జ్జనసంరక్షక రామచంద్ర ఖగరాట్సంచార సర్వేశ్వరా


(వ్రాసిన తేదీ: 2013-123)

16, మార్చి 2013, శనివారం

నరలోక మనుదాని నడతయే యిట్టిది


నరలోక మనుదాని నడతయే యిట్టిది
ఎఱుక లేని జనులతో నిరుకైన లోకమిది

ఎవరి కేమి కావలెనో యెవరికినీ తెలియదే
యెవరి బ్రతుకు తీరుతెన్ను లెవరికినీ తెలియవే
యెవరి కేది ప్రాప్తమన్న నెఱుగు దారియె లేదే
యెవరి దురా శేమి చేయు నెవరికినీ తెలియదే

అహరహమును కాసులకై యలమటించు బ్రతుకులే
యిహపరాల మర్మముల నెఱుగ లేని బ్రతుకులే
కుహనాప్రేమలకు చిక్కి కునారిల్లు బ్రతుకులే
సహజీవనమాధుర్యపు చవి మరచిన బ్రతుకులే

తఱచు తాపత్రయమ్ముల తగులు కొన్న వీరి కా
యెఱుక నీదు కృప లేక యెన్నడును కలుగదే
యెఱుకపరచ లేరు సత్య మెంత వార లైనను
యెఱుకపరచ జూడ రామ యెదురగు నవమానము


ఈ యీ యాశల

శా. ఈ యీ యాశల సాలెగూండ్లబడి యెన్నే మార్లు జన్మంబుల
న్యాయంబై చనె నింకనైన సదయా నాపై కృపంజూపవే
నీయందే కలకాలమున్నిలువగా నీవయ్య నాచిత్తమున్
మాయం బాపవె నీకు మ్రొక్కెదను రామా సర్వలోకేశ్వరా


(వ్రాసిన తేదీ: 2013-1-22)

15, మార్చి 2013, శుక్రవారం

ఆశలు లేని దెవ్వరికి

ఉ. ఆశలు లేని దెవ్వరికి న్నివిధంబుల తృప్తి మీరగా
నాశలు తీరె నెవ్వరికి నాశల వెంబడి పర్వులెత్తి పే
రాశలు వెక్కిరించ తుద కాయువు తీరెడు వేళ నిన్ను నా
త్మేశు భజించ నైతి నని యేడ్తురు రామ సమస్త మానవుల్


(వ్రాసిన తేదీ: 2013-1-22)

14, మార్చి 2013, గురువారం

దనుజుల ద్రుంచినావు

చం. దనుజుల ద్రుంచినావు కడు ధర్మముగా ప్రజ నేలినావు భూ
జనులకు ధర్మమార్గమన చక్కని నీ చరితంబు పాఠమై
మనగ రహించినావు చెడు మార్గము బట్టిన నేటి నేతలన్
మనుపవె నేటికైన ఋజుమార్గమునం కరుణాబ్ధి రాఘవా


(వ్రాసిన తేదీ: 2013-1-22)


13, మార్చి 2013, బుధవారం

జరుగనీ నీ యిఛ్ఛ జగదీశ్వరా

జరుగనీ జరుగనీ జగదీశ్వరా
జరుగనీ నీ యిఛ్ఛ పరమేశ్వరా

పరమయోగిరాజగణవందితచరణా
వరదాయక సకలలోకపాలననిపుణా
నిరుపమానశుభవితరణకరుణాభరణా
పరాత్పరా భక్తహృదయపద్మవిహరణా

సకలజగంబులను నీవె చక్కగా చేసి
అకళంకస్థితినిల్పి యాదరము నించి
ఒకనా డన్నింటిని నీ వుపసంహరించి
ప్రకటింతువు శ్రీరామ పరమమగు లీల

భావింపగ నీ యంశనె పకృతిలో నించి
జీవుడనని నన్ను నీవె చేసితివి బలిమి
నీవు కరుణ నా యవిద్య నీవేళ విరచి
కావించితివి స్వస్వరూపావబోధమును


ధారుణి నేడు చూడ

ఉ. ధారుణి నేడు చూడ వసుధాధిప శ్రీరఘురామచంద్ర సా
ధారణ మాయె సజ్జనుల దైన్యపరిస్థితి చెడ్డవారికే
తీరున గాని దండన విధించెడు నాధుడు లేడు నేతలే
క్రూరులు నేరగాళ్ళగుట కోర్వగలే మిక రక్షసేయవే


(వ్రాసిన తేదీ:  2013-1-22)

12, మార్చి 2013, మంగళవారం

అరెరే యెట్లు జనస్వమున్

మ. అరెరే యెట్లు జనస్వమున్ ఖలులు స్వాహా చేయుచున్నారనన్
సరిగా తిండికి లేని వాడయిన నాశ్చర్యంబుగా కోట్లలో
శరవేగంబున ప్రోగుచేసికొనునే స్వల్పాధికారంబు తా
నరచేతంగొన నేర్చెనేని రఘునాధా వేగ రక్షింపవే


(వ్రాసిన తేదీ:  2013-1-22)


11, మార్చి 2013, సోమవారం

నీతిని దప్పు వారు

ఉ. నీతిని దప్పు వారు నవినీతికి హారతు లెత్తువారు దు
ర్నీతిపరాయణత్వమున నిత్యవినూత్నవిచిత్ర వైఖరుల్
జాతికి నేర్పువారనగ సర్వవిధంబుల భ్రష్టులైరి మా
నేతలు వీరి వంచి కరుణించవె శ్రీవర రామభూవరా


(వ్రాసిన తేదీ :2013-1-22)

9, మార్చి 2013, శనివారం

సంపద ప్రోగు చేయగను

ఉ. సంపద ప్రోగు చేయగను చక్కగ దానిని లెక్కవేయగన్
సొంపుగ కాలముం గడుపజొచ్చి తుదిన్ యము డేగుదెంచి నీ
సంపద పాపపుణ్యముల సంచయమే యని నవ్వ నేడ్వకే
జొంపగు భక్తి రాఘవుని జొచ్చెద నేశరణం బవశ్యమున్


(వ్రాసిన తేదీ :2013-1-21)


8, మార్చి 2013, శుక్రవారం

బాహుబలంబు లాభమని

ఉ. బాహుబలంబు లాభమని భావన చేసిన నేమి లాభ మే
బాహుబలంబు చేత సమవర్తికి లొంగక యుండవచ్చు నా
బాహువు లోరి నీవగుట వట్టిది గాని ప్రశంశనీయమౌ
బాహువులున్న రాఘవుడ వశ్యము దూరము తోలు కాలునిన్


(వ్రాసిన తేదీ: 2013-1-21)

7, మార్చి 2013, గురువారం

నను నడిపించే నా రామా

నను నడిపించే నా రామా ఎం
     తని నిను నే పొగడుదురా నా
మనవిని విని కరుణించితివి నా
     కనులకు వెలుగై నిలచితివి

విడిదిగ నిచ్చితి వీ భువనము నే
     నడుగక యే  కడు గడుసరి వీవు
అడుగిడి యిచ్చట విహరించుచు  తు
     ష్టుడనై యుంటిని జడుడ నైతిని 
తడబడు నాలో ధైర్య మూదితివి
     బడలిక దీర్చి భయము బాపి న 
న్నెడ బాయనని  విడమరచితివి     
     యెడద నిండి నా వాడ వైతివి

శ్రీకర శుభకర చిన్మయరూప
     యే కానుక లర్పింతునురా యీ
లోకము లన్నీ సృజియించినది 
     నా కోసమని సెలవిచ్చితివి
నీ కొక కోటి దండము లయ్యా
     నా కొఱకై యారాట పడుదువు 
చీకటి లేదే చింతలు లేవు
     నీ కూరిమియే నిరతము కలదు 
 
చాలు చాలు నా కదియే సఖుడా
     కాలరూపుడా కామితప్రదుడా 
మేలు చేయు నీ కలిమి గల్గి నా
     కీ లోకములో నేమి భయమురా
నీలో  భువనానీక మున్నది
     నా లోపల నీ  తేజ మున్నది
నా లావెప్పుడు నీవేలే వే
     యేలా నీవును నేనొక టేలే
  

ఎంత యమాయకత్వమున నెంగిలి

ఉ. ఎంత యమాయకత్వమున నెంగిలి పండ్లను బెట్టె నామె తా
నంతగ మాతృభావమున నాకలి దీర్పగ సంతసించి నీ
వంతట ప్రేమతో శబరి కాదర మొప్పగ రామచంద్ర త
చ్చింతితమైన మోక్షమును చెచ్చెర నిచ్చితి వో కృపామయా 


(వ్రాసిన తేదీ: 2013-1-21)


6, మార్చి 2013, బుధవారం

ఇది నీ విచ్చిన జీవితము

ఇది నీ విచ్చిన జీవితము
తుది యిది మొదలిది యని తెలియని యొక
నది వలెనే సాగి పోయేదీ

జడివాన వలె కురిసే నీ దయ
బడయగ చిడిముడి పడు చిరు నది వలె
సుడులు తిరుగుచూ సాగేదీ
వడివడి పరుగుల వయ్యారి యిదీ
  
నిలకడ యను మాటే లేనిది
ఉలుకుల కులుకుల ఉరుకుల పరుగుల
గలగలల విలవిలల నడకల
పలు గతు లలరగ ప్రవహించేదీ
 
నిను వెదకుచు భువి తిరుగునది
అనిశము నిను కన నారాటమ్మున
మినుముట్టగ ఘోషించునదీ
నిను కలసిన క్షణమున నీ వయ్యేదీ

 

పరమదయాలవాల

చం. పరమదయాలవాల రఘువల్లభ తొల్లిటి పాపపుణ్యముల్
నరులకు జన్మహేతువు లనంబడు నట్లగు జన్మచక్రమున్
చొరబడి పాపపుణ్యముల జోలికి పోవకయుండ వచ్చునే
పరమపదంబు జేర్చు తమపాదములంబడి వేడకున్నచో


( వ్రాసిన తేదీ: 2013-1-21)


5, మార్చి 2013, మంగళవారం

ఎంత యమాయకత్వమున

ఉ. ఎంత యమాయకత్వమున నేమియెరుంగని యట్టి బోయ డ
త్యంత ముదాన తావక పదాంబుజయుగ్మము భక్తి గొల్చి తా
నంతకు నింత యిమ్మనక నక్కజమైన పదంబు నొందడే
యింతన వచ్చునే యినకులేశ్వర నీకరుణాప్రసాదమున్


(వ్రాసిన తేదీ: 2013-1-21)


4, మార్చి 2013, సోమవారం

నీ మౌనం నన్ను బాధిస్తోంది

నా గానం నిన్ను శోధిస్తోంది
నీ మౌనం నన్ను బాధిస్తోంది
ఈ గాలికీ యీ నేలకూ
యీ కాలానికీ తెలుసు నా పోరాటం
దాగి వినేవుగా నీకూ
బాగానే ప్రభూ తెలుసు నా ఆరాటం

నా హృదయం నిన్ను మరువదురా
నీ హృదయం నాకు తెలియదురా
ఏ నాటికీ ముమ్మాటికీ
మానేది కల్లరా రా నా యీ గానం
నాదప్రియుడవు నీవే
ఏదో నాటికి మెచ్చేదే యీ గానం

పోనీ చల్లని చూపే చాలు
పోనీ చక్కని నవ్వే చాలు
నీ కోసమే యీ గానము
నీ కానందం కలిగిందా నాకది చాలు
లోకానికి యేలికవే నీవు
నీ రుకాస్కురిసిదా నాది చాలు

కొందరు మంత్రతంత్రముల

. కొందరు మంత్రతంత్రముల కొందరు మీరిన బుధ్ధి సంపదన్
కొందరు భోగభాగ్యముల కొందరు ప్రాభవ మెంచు నట్టి వా
రందర కంటె భిన్నముగ నాశ్రితవత్సల జ్ఞానవంతు లే
కొందల పాటు లేక నిను కోరి భజించి తరింతు రెప్పుడున్


(వ్రాసిన తేదీ: 2013-1-21)


3, మార్చి 2013, ఆదివారం

మహిమలు జూపు వారలును

చం. మహిమలు జూపు వారలును మాటల గారడి చేయు వారలున్
మహిని విశేషసంఖ్య ఋజుమార్గము నందు రహించు వారికే
యహితము గూర్చుచున్ మిగుల హాని యొనర్చుచు నున్నవార లా
యిహపర నష్టకారణుల నింక సహింపగ రాదు రాఘవా


(వ్రాసిన తేదీ: 2013-1-21)

2, మార్చి 2013, శనివారం

ఊరక రామరామ

ఉ. ఊరక రామరామ యను చుండిన నేమి ఫలంబు చిత్త మే
మారక రామచంద్రసుకుమారమనోజ్ఞపదాంబుజంబులన్
మీరిన భక్తి గొల్చుటయు మిక్కిలి సత్యము గాని నాడు సం
సారసముద్రతారణ మసాధ్యము సూ నరజన్మ కెన్నడున్


(వ్రాసిన తేదీ: 2013-1-21)

1, మార్చి 2013, శుక్రవారం

నేటికి రావణాసురుని

ఉ. నేటికి రావణాసురుని నీతిపరుండని ప్రస్తుతించ నా
రాటము జూపు వారి కన నాయెను వారల దుష్ట వాదనా
పాటవ మెల్ల నా యముని పాశము కంఠము నంటు దాక నా
ర్భాటమె గాక రామునకు రాదుకదా యొక లోప మెన్నడున్




(వ్రాసిన తేదీ:  2013-1-18)