30, సెప్టెంబర్ 2014, మంగళవారం

సౌందర్యలహరి - 6 ధనుః పౌష్పం ...మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


6

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరుదాయోధనరథః 
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే 


గత శ్లోకంలో విష్ణువు గురించీ మన్మథుడి గురించీ‌ప్రసక్తి వచ్చింది. ఇక్కడ కొంచెం విపులీకరిస్తున్నారు ఆచార్యులవారు.
     
శ్రీమన్నారాయణుడు జగన్మోహనకరమైన మోహినీ అవతారాన్ని ధరించాడూ అంటే అందులో ఆశ్చ్యర్య పోవలసింది ఏమీ లేదు.  అమ్మవారు శ్రీమహావిష్నువుకు చెల్లెలుగా ప్రతీతి.  అందుకే ఆవిడను నారాయణి అని కూడా అంటారు.  అలాగే వైష్ణవి అని కూడా అంటారు. అందుచేత అన్నగారిమీద అభిమానంతో ఆవిడ ఆయనకు తనరూపసౌందర్యవిశేషంలో లేశమాత్రం ప్రసాదించి దానితో ఆయన గడబిడ సృష్టించి రాక్షసలోకాన్ని మోహపెట్టటానికి సాయపడింది. శ్రీ నారాయణతీర్థులవారి తరంగాలను వినే ఉంటారనుకుంటాను.  అందులో‌ ఒకటి జయ జయ వైష్ణవి దుర్గే అన్నది వినే ఉంటారు కదా.  అలాగే‌ సుప్రసిథ్థమైన సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్న దేవీ స్తుతిశ్లోకం జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆయన్ను అమ్మవారు అనుగ్రహించటంలో ఇబ్బంది ఏమీ లేదు.  అయన స్వయంగా మహాసమర్థుడు. అవసరమైన చోట చెల్లెలుగారూ బాగానే సహాయ పడ్డారు. చాలా బాగుంది. అందుచేత విష్ణువు విషయంలో ప్రత్యేకించి విడమరచి చెప్పవలసింది ఏమీ‌ లేదు.

మరి మన్మథుడు కూడా అమ్మవారి భక్తుడేనూ ఆయన ఆవిడ అనుగ్రహంతో లోకాల్ని కల్లోలపరుస్తూ ఉంటాడు నిత్యం అన్నారు కదా గత శ్లోకంలో శ్రీశంకరులు.  అదేలాగూ అని అనుమానం వస్తుంది.  అసలీ మన్మథుడు కనీసం తనకంటూ ఒక శరీరం కూడా లేనివా డాయెను. ఏదో అమ్మవారి దయ కారణంగా తన భార్య ఐన రతీదేవికి మాత్రం పూర్వరూపంలో కనిపించగలడు.  అంతే.  అటువంటి మన్మథుడికి లోకవిజేత అయ్యే‌ పరాక్రమం ఎలా వచ్చిందీ అన్నది ఈ శ్లోకంలో చెబుతున్నారు.

ఈ‌ మన్మథుడికి ఉన్న పరికరకరాలూ పరివారమూ గురించి చూడండి మొదట.  అవెంత అవుకు సరుకో -

ఆయన విల్లు చెఱుకు గడ.  మహ గొప్పగా ఉంది. ఏ మంత గట్టి విల్లంటారు?

ఆ గొప్ప వింటికి అల్లెత్రాడు అదే నండీ నారి.  అదేమిటంటే తుమ్మెదల బారు అట.  ఇది మరీ‌ బాగుంది.  తుమ్మెదలు వరసకట్టట మేమిటీ, ఆ వరసను ఆయన లాగి బాణాలు వేయట మేమిటీ?

ఆ బాణాలు కూడా ఎటువంటి వనుకున్నారు?  పూలబాణాలు. పూలు విసిరితే ఎవరికన్నా దెబ్బ తగులుతుందా?

ఐనా అవెన్ని బాణాలని?  అయిదే అయిదట.  లోకం మీదే  విజయం సాధించే మొనగాడికి కేవలం ఐదు బాణాలతో గెలుపా? అదెలా సాధ్య మండీ?

యుధ్ధానికి బాగానే తయ్యారయ్యా డయ్యా, ఇంతకూ ఆయనకు సహాయపడే వాళ్ళన్నా కాస్త సరైనా వాళ్ళా అని అడగుతారు కదా?  ఆయనకు తోడు వసంతుడు. అంటే వసంత ఋతువు. అది నిలకడ గలదా? ఏదాదిలో అది ఉండేదే రెండే రెండు నెలలాయె. మిగతా కాలం అంతా ఎక్కడికి పోయేది తెలియదు.

ఆయనకు మంచి రధమైనా ఉందా? అబ్బే లేదండి. మలయానిలం అంటే కొండగాలి ఆయనకు ఉన్న గొప్ప రథం.  అదెప్పుడు ఎటు వీస్తుందే ఎవడికీ తెలియదాయె.  దాని మీదనా యుధ్ధానికి పోవటం.  అదీ లోకాన్నంతా గెలిచెయ్యటమూ?  ఎలా కుదురుతుందీ?

ఇంత అవకతవక యుధ్దసామగ్రీ, ఇలాంటి నిలకడలేని చెలికాని తోడూ వేసుకొని మన్మథుడు ఎలా లోకవిజయం చేసేస్తున్నాడూ అంటే దానికి బలమైన కారణం ఉందట.

శ్రీ‌శంకరులు అమ్మతో అంటూన్నారూ, తల్లీ, హిమగిరితనయా, నీ దయ ఉంటే మన్మథుడు లోకవిజేత కావటంలో కష్టం ఏముందమ్మా!  ఆయన నమ్ముకున్నది ఆ సన్నాహాని కాదు నీ దయనే. 

ఆ మన్మథఋషి నిన్ను సేవించి నీ‌ కటాక్షం వల్ల నీ‌ కడగంటి చూపుకు నోచుకున్నాడు కదమ్మా.  ఆయన కున్న ఏకైన బలం అదే.  ఆ నీ కొనకంటి చూపు ఇచ్చిన బలంతోనే మన్మథుడు ఈ లోకాన్ని ఇష్టారాజ్యంగా జయిస్తున్నాడు.

ఇక్కడ శ్రీశంకరులు చమత్కారంగా చెబుతున్నది అర్థమైనది కదా.  అమ్మ దయ ఉంటే చాలు, ఎంత అవకతవక వ్యక్తికీ, ఎంత అసమర్థుడైన వ్యక్తికీ, ఎంత దుస్థితిలో ఉన్నవాడికీ ఏ మాత్రమూ భయం లేదు.  విజయం తనదే.  అమ్మ దయ ఉన్నవాళ్ళ ముందు సమస్తలోకమూ దాసోహం కావలసిందే.

అమ్మ ఒక్క సారి క్రీగంటి చూపుతో అనుగ్రహిస్తే చాలు!

ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఐదువందలసార్లు పారాయణం చేస్తే ఫలితం వంశాభివృధ్ధి.  నైవేద్యం చెఱకుముక్కలు.
29, సెప్టెంబర్ 2014, సోమవారం

సౌందర్యలహరి - 5 హరి స్త్వా మారాధ్య ....మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


5


హరి స్త్వా మారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ 
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్     


అమ్మ శ్రీదేవి తీర్చలేని కోరిక అంటూ ఉంటుందా? ఉండదు కాక ఉండదు.  నిత్యం లోకసంరక్షణ ఒక్కటే బాధ్యతగా మెలిగే శ్రీహరి కూడా అది నిర్వహించేందుకు కావలసిన శక్తి యుక్తులన్నింటినీ స్వయంగా అమ్మే అందిస్తోందని శ్రీశంకరులు ఈ సౌందర్యలహరిని మొదలు పెజ్డుతూనే నొక్కి చెప్పారుకదా?

దేవాసురులు అమృతంకోసం పాలసముద్రాన్ని మధించిన కథ అందరికీ తెలిసిందే కదా. అలాగే ఆ సందర్భంలో రాక్షసులు ఎత్తుకుపోయిన అమృతకలశాన్ని చేజిక్కించుకుందుకు శ్రీమహావిష్ణువు మోహినీదేవిగా ఒక స్త్రీస్వరూపాన్ని ధరించి రాక్షసులను మోహంలో ముంచి ఆ అమృతాన్ని దేవతలకు పంచిన సంగతీ అందరికీ తెలుసు.

విష్ణువు ధరించిని జగన్మోహినీస్వరూపాన్ని తిలకించాలని కోరికోరి దర్శించి శివుడే ఆ మోహినీదేవిని చూసి మోహించాడని కథ. ఈ శ్లోకంలో శ్రీశంకరులు అలా శివుడి మనస్సే మోహినిని చూసి  సంక్షుభితం కావటాని ప్రస్తావిస్తున్నారు.

శ్రిశంకరులు ఇక్కడ చెప్పే విశేషం ఏమిటంటే, శ్రీమహావిష్ణువు అలా జగన్మోహినిగా అవతారం ధరించటం అమ్మవారిని ఆయన ఆరాధించటం వలన లభించిన ఆవిడ సత్కృప కారణంగానే అని.

అలాగే మనకు తెలిసినదే ఐన మరొక కథ కూడా ఈ శ్లోకంలో ఆచార్యులవారు ప్రస్తావిస్తున్నారు.  మన్మథుడు సాక్షత్తూ పరమేశ్వరుడి మీదే తన పుష్పబాణాలను ప్రయోగించి ఆయనకు తపోభంగం చేసిన సంగతీ,  అందుకు శివుడు ఉగ్రుడై తన మూడవ కన్ను తెఱచి ఆ మన్మథుడిని తన బేసికంటిమంటకు ఆహుతి చేసిన సంగతీ జగత్ప్రసిధ్ధమైన కథయే కదా. ఐతే ఆ తరువాత రతీదేవి ప్రార్థన మేఱకు   అమ్మవారు, రతిదేవి కంటికి మాత్రమే కనుపించేటట్లుగా మన్మథుణ్ణి కనికరించిన సంగతీ అందరికీ విదితమే. ఈ మన్మథుడు సామాన్యుడు కాదు, మహర్షులకూ కామవికారం కలిగించగల సమర్థుడు.  మన్మథుడు అలా మునులను మోహింపచేసిన కథ వామకేశ్వరతంత్రంలోనిది. ఆయన కంత శక్తి యెక్కడి దయ్యా అంటే, అది కూడా ఆ మన్మథుడు అమ్మవారిని ఉపాసించి సంపాదించుకున్న మహిమయే.

అమ్మవారి భక్తుల్లో ముఖ్యమైనవారిగా విష్ణువు, మన్మథుడూ, పరశురాముడు, దుర్వాసుడు మొదలయిన వారు శాక్తేయంలో ప్రసిధ్ధులు.  అమ్మవారి పంచదశాక్షరీ మంత్రం ఋగ్వేదంలో ఉంది.  దానికి ద్రష్ట ఐన ఋషి శ్రీమహావిష్ణువు.  అ పంచదశాక్షరీ మంత్రప్రభావంతోనే విష్ణువు  శివుణ్ణీ మోహింపజేసే ప్రభావాన్ని పొందగలిగాడని శ్రీశంకరుల తాత్పర్యం. మన్మధుడు కూడా అమ్మవారికి సంబంధించిన మంత్రద్రష్టలలో ఒకడు.  అయన వేఱొక పంచదశీ మంత్రద్రష్ట.

అమ్మ మహిమ ఎలాంటిదో చూసారా?  త్రిపురాలను జయించిన మహాత్ముడు శివుడు.  త్రిగుణాలనూ జయించిన జితేంద్రియులు మునులు.  వాళ్ళనూ  మోహినీస్వరూపమూ, మన్మథబాణమూ గందరగోళ పరచాయి.  ఇవి అసాధ్యమైన కార్యాలే!  ఎలా ఇవి సంభవమయ్యాయీ అంటే అంతా అమ్మదయ. అమ్మను ఆరాధించి వారు సంపాదించుకొన్న మహిమల ప్రభావం.

అమ్మను ఆచార్యులవారు ప్రణతజనసౌభాగ్యజనని అన్నారు. ప్రణతజనులు అంటే మనోవాక్కాయకర్మలా అమ్మవారిని నమ్మిసేవించేవారు అని అర్థం. అటువంటి వారికి అమ్మదయ చేత ఎలాంటి దుస్సాధ్యమైన పని ఐనా సుసాధ్యమే అని ఇక్కడ శ్రీశంకరులు ఉదాహరణలతో సహా వివరించారు.

ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ రెండువేలసార్లు పారాయణం చేయాలి. ఫలితం ఆనుకూల్యదాంపత్యం. నైవేద్యం బెల్లపు పరమాన్నం.28, సెప్టెంబర్ 2014, ఆదివారం

గుఱ్ఱం జాషువా కవి గారి జయంతి నేడు


ఈ రోజున గుఱ్ఱం జాషువా కవిగారి జయంతి.  ఘనంగా జరిపిద్దా మనుకున్నా రట దొరతనం వారు. కాని తెలుగు అకాడమీయో‌ మరేదో ఇంకా విడిపోలేదట.  అందు చేత నిధుల కొఱత పీడిస్తోందట,  ఈ‌ మాట నిన్న వార్తల్లో వినిపించింది టీవీలో.  ఏ ఛానెలో - టీవీ౯ కావచ్చు. మరొకటి కావచ్చు విషయం అది.  ఏం చేస్తాం.  ఉన్నంతలోనే కాస్త ఘనంగా చేదా మనుకున్నారేమో నేడు వార్తల స్క్రోలింగుల్లో కనిపించిది జాషువా జయంతి అని.  అదీ సంగతి. 

జాషువాగారి గురించి వ్రాయగలిగినంత గొప్పవాడిని కాను. కాబట్టి ఆయన గురించి వెబ్ లోకంలో కనిపించిన కొన్ని లింకులు క్రింద ఇస్తున్నాను.  అక్కడ చదివి కొంత తెలుసుకొని తలచుకొని ఆనందించవ చ్చును,

ప్రస్తుతం నా దృష్టికి వచ్చిన సమాచారం ఇది. అన్నీ వరుసగా చదివినప్పుడు కొంత సమాచారం చర్వితచర్వణంగా అనిపించవచ్చును.  ఫరవాలేదు.  కొన్ని కొన్ని కొత్త విషయాలూ ప్రతీచోటా కనిపించవచ్చును కదా? అందుకే చదవండి.  నా కిష్టమైన గిజిగాడు పాఠం‌మాత్రం వెబ్‌లో ఎక్కడా కనిపించలేదు దానికీ‌ లింక్ ఇద్దామనుకుంటే.

అన్నట్లు ఆ మధ్యన మన హైదరాబాదులోని టాంక్‌బండ్ వద్ద ఉన్న విగ్రహాలను కొన్నింటిని ధ్వంసం చేయటం జరిగింది కదా ఉద్యమాల నేపద్యంలో.  ఆలా ధ్వంసమైన విగ్రహాల్లో జాషువాగారి విగ్రహమూ‌ ఉందని విగ్రహాల ధ్వంసం సబబుకాదు అన్న విశాలాంధ్రవారి అప్పటి వార్తలో చదివాను.  ఆంద్రప్రదేశం వారు మేలుకొని భేషజాలకు పోకుండా 'ఈ‌ సీమాంధ్ర మహానుభావులు'గా కొత్త తాతాచార్యులముద్ర వేయించుకొన్న తమవారి విగ్రహాలను తమ రాష్ట్రానికి తరలించుకుంటే వారిని ఆ మాత్రంగా నైనా కాస్త గౌరవించినవారు అవుతారేమో అన్నది ఆ రాష్ట్రప్రభుత్వంవారు ఆలోచించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.


సౌందర్యలహరి - 4 త్వదన్యః పాణిభ్యామ్‌ ...


మొదటిశ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


4

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా .
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంచాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ 

అమ్మ శ్రీదేవి చతుర్భుజ.  అంటే నాలుగు చేతులతో విరాజిల్లే దివ్యమూర్తి.  ఆవిడ నాలుగు చేతులను గూర్చి రాబోయే యేడవ శ్లోకంలో శ్రీశంకరులు ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః అని చెబుతారు.

ఆవిడ చేతుల్లో ఒక దానిలో ధనుస్సు ఉంది. మరొక దానిలో‌బాణాలున్నాయి.  ఒక చేతిలో పాశమూ మరొక చేతిలో అంకుశమూ ఉన్నాయి. ఇలా ఆవిడ నాలుగు చేతుల్లోనూ నాలుగురకాల ఆయుధాలతో ఉంటుంది. మహాకవి కాళిదాసుగారు పుండ్రేక్షుపాశాంకుశబాణహస్తే అని చెప్పారు కదా. ఆవిడ చేతుల్లోది చెఱకు విల్లు.  ఆ బాణాలు పుష్పబాణాలు.  లలితాసహస్రంలో కూడా మనోరూపేక్షుకోదండా।   పంచతన్మాత్రసాయకా అని ఉందికదా. అలాగే రాగస్వరూపపాశాఢ్యా   క్రోధాకారాంకుశోజ్జ్వలా అనికూడా చదువుకుంటాం లలితాసహస్రంలో.  ఇప్పుడు ఆట్టే వివరాలు ఈ‌ శ్లోకంలో చెప్పుకోనవసరం లేదు.

మన గుళ్ళల్లో చూస్తూ‌ ఉంటాము. దేవుడి కుడిచేయి అభయం ఇస్తున్నట్లుగా ఉంటుంది. ఎడమచేయి వరాలిస్తున్నట్లుగా ఉంటుంది. ఔను కదా?  చేతి వ్రేళ్ళు పైకి ఉండేలా అరచేయిని మన వైపుకు చూపటం‌ అభయముద్ర.   చేతి వ్రేళ్ళు  క్రిందికి ఉండేలా అరచేయిని మన వైపుకు చూపటం‌  వరదముద్ర. అభయముద్ర అర్థం నీకేమీ భయం వద్దూ నేనున్నాను రక్షించటానికి అని చెప్పటం. వరదముద్ర అర్థం నీకేది కావాలన్నా అనుగ్రహిస్తానూ అని చెప్పటం.

అమ్మ  శ్రీదేవి నాలుగు చేతుల్లోనూ నాలుగురకాల ఆయుధాలు ధరించి ఉన్నదే మరి ఆవిడ మనకు అభయం ఇవ్వటం ఎలా? ఆవిడ మనకు వరాలివ్వటం ఎలా? అన్న ప్రశ్న వస్తోంది కదా?

శ్రీశంకరభగవత్పాదులు ఈ శ్లోకంలో పై సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు.

శ్రీదేవితో అంటున్నారూ, అమ్మా అందరు దేవతలూ చేతుల్లో అభయ ముద్రనూ వరముద్రనూ ప్రదర్శిస్తున్నారు.  నీవు మాత్రమే అలాంటి ముద్రలు ప్రదర్శించటం లేదు.  అయినా ఇబ్బంది ఏముంది?  అన్ని రకాల భయాలనూ‌ పారద్రోలటానికీ, కావాలని కోరుకునే దానికన్న అనేకరెట్లు ఘనంగా అన్ని కోరికలనూ తీర్చటానికీ నీ‌ పాదాలు రెండూ చాలమ్మా.  అవి సకలలోకాలకూ శరణం ఇచ్చేవి కదా.  అవే అన్ని విధాల భక్తకోటిని ఆదుకుంటాయి కదా ఎల్లప్పుడూ.  ఇంకా నువ్వు ప్రత్యేకంగా అభయముద్రా, వరదముద్రా అంటూ చేతుల్తో పట్టి చూపవలసిన అగత్యం ఏముంది తల్లీ అంటున్నారు.

నిజానికి అందరు దేవతలు అభయముద్రనూ వరముద్రనూ కేవలం అభినయం చేస్తున్నారు. కాని వాళ్ళకు ఆ సామర్థ్యం ఎక్కడి దమ్మా?  బ్రహ్మాది సకలదేవతల దివ్య  శక్తులకూ‌  నువ్వే అధారం కదా.  నీ‌ అండ లేనిదే శివు డంతవాడే కదల్లేడు మెదల్లేడు. మరి వాళ్ళు ప్రజకు అభయం ఎలా ఇస్తున్నారూ? వాళ్ళు వరాలు మాత్రం ఎలా ఇస్తున్నారూ?  అంటే వాళ్ళు నిజంగానే ఆ పనులు చేస్తున్నారూ అంటే అది అంతా నీ అనుగ్రహం ప్రభావంతోనే అన్న మాట. త్రిమూర్తుల చేత సృష్టిని నిర్వహింపజేసే తల్లివి నీవే వాళ్ళందర్నీ అభయప్రదానాలూ వరప్రదానాలూ చేసేందుకు అనుమతిస్తున్నావన్న మాట.  ఈ దేవతాగణం అంతా నీ దయవల్లనే వెలుగుతున్నారూ అని శ్రీశంకరులవారు చెప్పకనే చెబుతున్నారిక్కడ.

అంటే ఈ శ్లోకంలో శ్రీదేవి చరణారవిందాలను ఆశ్రయించితే చాలు,  ఏ భయం నుండి విముక్తి కోరినా సరే, అన్ని రకాల భయాలూ, భవభయం అనే అన్నింటి కన్నా పెద్దభయంతో సహా మాయమై పోతాయీ, అన్ని రకాల ఇహలోక, పరలోక భోగాలూ‌ ఏది కోరుకున్నా వాటికి వేయింతలు గొప్పదైన మోక్షంతో సహా కలుగుతాయీ అని శ్రీశంకరులు లోకానికి ఉపదేశిస్తున్నారు.

అవునూ, ఇంతకు ముందు శ్లోకంలోనే కదా అమ్మ యొక్క పాదధూళి కణం ఎంత గొప్పదో చదువుకున్నాం.  మరి ఆ పాదధూళీ కణాన్నొకదాన్ని అపేక్షించే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి కదా?  వేరే రకంగా ఎలా చేయటం ఎలా?

ఈ శ్లోకానికి పారాయణం రోజుకు వేయిసార్లు. ఫలితం రోగనాశనం, దారిద్ర్యనాశనం, అధికారప్రాప్తి. నైవేద్యం పసుపు అన్నము (పులిహోర)27, సెప్టెంబర్ 2014, శనివారం

సౌందర్యలహరి - 3 అవిద్యానామ్‌ ...
అవిద్యానామంత స్తిమిర మిహిరోద్దీపనకరీ
జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతి ఝరీ
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి

అమ్మ పాదధూళికణం మహిమను శ్రీశంకరాచార్యులవారు మరింతగా వర్ణిస్తున్నారు.

ఇంతకు ముందు తనీయాంసం పాంసుమ్‌ అనే శ్లోకంలో బ్రహ్మవిష్ణుమహేశ్వరులకూ అమ్మవారి పాదధూళికణమే ఏ విధంగా సృష్టిని నిర్వహించేందుకు సమర్థత నిస్తోందో చెప్పారు కదా. 

ఇప్పుడు ఈ సృష్టికి అధిపతులైన వారికేనా అమ్మ యొక్క అనుగ్రహం?  అందులో ఉన్న మనబోటి వారి సంగతేమిటీ అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకాన్ని వ్రాస్తున్నారు.

ఈ‌ సృష్టిలో ఉన్న మనం పామరులం.  అంటే తత్త్వజ్ఞానం లేని, దాన్ని ఒంట పట్టించుకోలేని  మూర్ఖులం.  అంటే అజ్ఞానులం అన్నమాట.  దాని కారణంగా మనం జడత్వం చెంది అనేక మైన కష్టాల్లో పీకల్లోతుగా కూరుకుపోయి బయటపడే దారి తెలియక బాధలు పడుతుంటాం.  ఎందుకంటే ఈ చావుపుట్టుకల పరంపర అనేది సముద్రపుకెరటాల వలే నిరంతరాయమైనది.  కెరటాలు ఎప్పటికీ సముద్రాన్ని విడిచి ఒడ్డెక్కలేవో అలాగే మనం కూడా ఈ‌ భవసాగరంలో నుండి బయట పడలేం.  అలాంటి మనను అమ్మ అనుగ్రహం ఎలా రక్షిస్తుందో చెబుతున్నారు.

అమ్మ పాదధూళి కణం అనేది చీకటి నిండిన ఊరికి సూర్యోదయం వంటిది.
అమ్మ పాదధూళి మందబుధ్ధికి దొరికిన జ్ఞానపుష్పాల మకరంద ప్రవాహం వంటింది.
అమ్మ పాదధూళి దరిద్రుడి చేతికి దొరికిన చింతామణి మాల వంటిది.
అమ్మ పాదధూళి భవసాగరంలోంవి ఉధ్దరించే విష్ణువు యొక్క అదివరాహం కోర వంటిది.


దట్టమైన చీకటిలో ఉన్న వాడికి ఏమీ కనిపించదు. కాళ్ళదగ్గర ఉన్నది పామైన తెలియదు! తన శరీరావయవాలే తనకు తెలియవు. ఇది బయట చీకటి కమ్ముకుంటే మనబోటి వాళ్ళ పరిస్థితి. ఐతే మనకు ఆట్టే స్పృహలో ఉండని చీకటి మరొకటి ఉంది. అది లోపలి చీకటి. ఆ చీకటి పుణ్యమా అని తానెవరూ అన్నది తనకి తెలియదు.  వేదం తత్త్వమసి అంటే తత్-త్వం-అసి ఆ సచ్చిదానంద పరబ్రహ్మం నీవే సుమా నిజానికి అని చెబుతుంది.  కాని మన అవగాహనలోకి రాదు.  తాను ఈశ్వరాంశ సంభూతుడనని మరపించే దాని పేరే మాయ, దాని కారణంలో తనలో పేరుకు పోయిన చీకటి తానొక కష్టాలు పడుతున్న జీవుణ్ణీ అనే భ్రమలో ఉంటాడు.  ఇదే లోపలి చీకటి అంటే.  ఈ‌ చీకటికే వేదాంతంలో అవిద్య అని పేరు.

శతాభ్దాల చీకటి గుయ్యారం ఐనా ఒక్క వెలుగురేఖలో పటాపంచలు కదా.  అమ్మ అనుగ్రహంతో ఆమె పాదధూళి లభిస్తే అది చీకటిప్రపంచానికి ఏకంగా సూర్యోదయం వంటిదే!  ఇంక అజ్ఞానం సమూలంగా నాశనం ఐపోతుంది.

చీకటికీ ఉన్న వాళ్ళ ముఖ్యలక్షణం ఒకటి గమనించారా? ఎక్కడికైనా కదలాలంటే చచ్చే‌ భయం.  ఏది తన్నేసి ఏమి దెబ్బలు తగిలించుకుంటామో‌ లేదా పోయి ఏ గోతిలోనూ నూతిలోనో‌ పడతామో అని.  కదలిక లేకపోవటమే జడత్వం చెందటం అంటే.  మామూలుగా మనం నిత్యం గమనించే చీకటి సంగతి ఇది.  అలాగే అవిద్య లేదా అజ్ఞానం అన్న చీకటి తనలో నిండిపోతే? ఆ జీవుడి ఆత్మ జడం ఐపోతుంది. ఏమీ‌ తెలుసుకోలేడు. ఏ విద్యలు నేర్చితే‌ ఏమి ఫలమో తెలియదు. అత్మవిద్య అనేది ఒకటుందనే దృష్టి కూడా ఉండదు కాబట్టి అటు అడుగు వేయలేడు. చీకటి కదా అటు ఎలా కదలాలో కూడా తెలియదు.  ఉన్న అవిద్యతో ఉన్న సంసారంలోనే ముందుకూ వెనక్కూ‌ కదులుతూ ఉంటాడు కాని చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ‌ ఉండదు. అలా అతడి ఆత్మ జడస్థితిలో ఉంటుంది.  అలా పడి ఉన్న వాడికి కల్పవృక్షపుష్పాల అమృతమకరందం ఒక పాయలాగా వచ్చి ముంచెత్తి సేదదీరిస్తే పరిస్థిత్ ఎలా ఉంటుందో ఊహించండి.  ఎంతో కొత్త ఉత్సాహం వస్తుంది. అమృతపానం భయాలన్నింటినీ పటాపంచలు చేస్తుంది కదా. తనకు నాశనం లేదు అని భరోసా కలిగాక ముందుకు దూకి దారి వెదుక్కుందుకు ఏమీ  సంకోచం ఉండదు కదా?
 
ఇంతవరకూ అజ్ఞానం అనే చీకటిలో జడత్వంతో పడి ఉన్నాడు.  అమ్మ పాదధూళి కణం పుణ్యమా అని ఆ చీకటి విడిపోయి అమృతం దొరికి మూందుకు దూకుతున్నాడు.  ఆ ధూళికణమే అతడికి ఉన్న గొప్ప కోరికలను తీర్చే చింతామణి మాల.  ఇంతక్రితం దాకా ఉన్న కోరికలు వేఱు. అవి అజ్ఞానం కారణంగా ఈ ప్రాపంచికమైన క్షుద్రవిషయాల మీది కోరికలు.  అమ్మ దయ దొరికిన వాడికి ఉండే కోరికలు గొప్పవి అవి నిరంతరం అమ్మ అనుగ్రహం, అమ్మ సాన్నిద్యం అనేవి.  చిన్న కోరికలను చిన్న చిన్న సాధనాలు తీర్చి ఉండవచ్చును ఇన్నాళ్ళూ.  పైగా అవి సిగ్గుపడవలసిన పిచ్చిపిచ్చి కోరికలాయె.  మరి ఇప్పటి కోరికలో?  అవి మహత్తరమైనవి.  గొప్ప ఫలితాలనిచ్చే సాధనమూ మహత్తరమైనదే కావాలి కదా?  ఒక ఆవు కావాలీ అంటే ఊళ్ళో‌ డబ్బున్నాయన ఇవ్వగలడు. ఒక పరగణాకు ప్రభువును కావాలీ అంటే పోయి రాజుగార్ని ఆశ్రయించాలి కాని వేరే విధంగా పని జరగదు కదా?  అందుకే గొప్ప ఫలితాలనిచ్చే సాధనమూ మహత్తరమైనదే కావాలనటం. నిజమే కదా.  తనకున్న కోరికలను తీర్చగల మహత్తరసాధనం ఏమిటీ అంటే అది అమ్మ పాదధూళి రేణువే.  లోకోత్తరమైన మణి పేరు చింతామణి. అది అడిగిందల్లా - ఎంత దుస్సాధ్యమైనదైనా ఇవ్వగలదు తక్షణమే.  అలాంటప్పుడు బోలెడు చింతామణులతో చేసిన మాల మహిమ ఎలాంటిదై ఉంటుందంటారు?  అమ్మ పాదధూళి కణం అటువంటి చింతామణి మాల వంటిది అని ఆచార్యుల వారు చెబుతున్నారు.

సరేనండీ, ఎలాంటి ఎలాంటి కోరికలు ఉన్నా అవి తీరిపోయాక కలిగే నిస్వార్థమైన దృష్టి మోక్షం మీద. అంటే ఇంక ఏ కోరికలూ లేక జన్మరాహిత్యాన్ని పొంది సంసారసాగరాన్ని తరించటం అన్న మాట.  అవును కదా,  అమ్మ అనుగ్రహం దొరికిన వాడు ఆవిడను అడిగేది అదే కదా? దాని సంగతి ఏమిటీ అనవచ్చును.  శంకరాచార్యులవారు ఆ సంగతి కూడా చెబుతున్నారు.  ఈ జనన మరణాలతో‌ కూడిన సంసారం అనేది మహా సముద్రం వంటిది.  అందులో పడటమే కాని బయటకు రావటం దుర్లభం!  పూర్వం శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తి సముద్రంలో ములిగిపోయిన భూమిని అవలీలగా తన కోరతే పైకి ఉధ్ధరించాడు.  ఈ‌ కథ అందరికీ తెలిసిందే కదా.  ఆచార్యులవా రంటారూ, అమ్మ పాదధూళి కణమే ఆ ఆదివరాహం కోరలాగా సంసారసాగరంలోంచి ఉధ్దరించి మోక్షం ప్రసాదిస్తుందీ అని.   ఇంకేం‌ కావాలీ?

ఈ శ్లోకాని పారాయణం పక్షంరోజులపాటు రోజూ వేయిసార్లు చొప్పున చేయాలి. ఫలితం సద్విద్యాబుధ్ధులు, ఐశ్వర్యం. నైవేద్యం మినపగారెలు.


26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

సౌందర్యలహరి - 2 తనీయాంసం పాంసుం ...మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


2

తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం
విరించిః సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ 
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ 

శ్రీశంకరభగవత్పాదులవారు మొదటి శ్లోకంలో అమ్మను గురించి ఆరాధ్యాం  హరిహరవిరించాదిభిరపి అంటే త్రిమూర్తులకూ ఆరాధ్య అని అన్నారు కదా. అలా యెందుకని అన్నదీ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు.

అమ్మా నీ యొక్క పాదపద్మాల పరాగరేణువులున్నాయే, వాటిలో ఒకదానిని గ్రహించి బ్రహ్మగారు ఈ పధ్నాలుగు లోకాల్నీ సక్రమంగా సృష్టిస్తున్నారు. ఆదిశేషుడుగా శ్రీమహావిష్ణూవే ఆపరాగరేణువునే అతికష్టంమీద వేయితలలతో అపసోపాలు పడుతూ మోస్తున్నాడు. ఇక ఈశ్వరుడైతే దానినే చక్కగ మెదిపి ముద్దగా చేసి  భస్మంగా నిత్యం ఒళ్ళంతా పూసుకుంటున్నాడు/

ఇక్కడ చరణాలు అంటె పాదాలు అని సామాన్యార్థం కాని విశేషంగా వాటిని శుక్లరజస్తమోనిర్వాణాలనే నాలుగుపాదాలుగా చెప్పుకోవాలి. ఇక్క రజోగుణప్రధానుడైన బ్రహ్మ అమ్మవారి పాదపద్మపరాగరేణూవునే చతుర్దశభువనాలుగా మళుస్తున్నాడని అర్థం.  శంకరరులు న్రహ్మసృష్టి అవికలంగా ఉందీ అని కితాబునిచ్చారు.  అవికలం అంటే ఈ గ్రహతారకాదులతో కూడిన భువనాలు ఒకదానితో ఒకటి పొరపాటునకుడా ఢీకొనకుండా అన్నమాట.

సత్వగుణం విష్ణుతత్త్వం. ఆయన ఈ బ్రహ్మగారు చేసిన భువనాల్ని వహిస్తూ అంటే వాటి భారం స్వీకరింఇ పోషిస్తూ ఉంటాడు. ఆయన్నిక్కడ శంకరులు శేషుడనే అర్థంలో చెబుతూ శౌరి అన్నారే మరి శౌరి అంటే కృష్ణుడు విష్ణువు అని కదా అని అనుమానం రావచ్చును.  బలరామకకృష్ణులు శూరుడనే రాజుగారి వంశీకులు. అందుచేత ఇద్దరికీ శౌరి అన్న మాట వాడవఛ్ఛును.  అది కాక శృతి ప్రసిధ్ధంగా సహస్రశీర్షా పురుషః అని భగవంతుని చెబుతున్నాం కదా.  అందుచేత కూడ అది సబబైనదే. మరికొన్ని సమర్థింపులూ ఉన్నాయి కాని వాటిని ప్రస్తుతం తడమటం అనవసరం.

శివుడు అమ్మవారి పాదపరాగరేణువునే భస్మంగా చేసి ఒళ్ళంతా పూసుకున్నాడని చెబుతున్నారు. శివుడు భస్మస్నానప్రియుడు. భస్మస్నానమునందు ఆయన ధరించు చున్నవి పృధివ్యాది పంచభూతాలే. అగ్నిరితి భస్మః అని ప్రారంభమయ్యే భస్మస్నానమంత్రం దీన్ని స్పష్టం చేస్తోంది కదా. ఈ పంచభూతాలూ అమ్మవారి పాదపరాగంనుండే జన్మిస్తున్నాయి. వీటి ఆధారంతోనే బ్రహ్మ సృష్టి చేసేది కూడా. ప్రళయకాలంలో తమోగుణప్రధానుడై శివుడు లోకాల్ని చూర్ణం చేసి  అలా వాటికి  తనశరీరాన్ని ఆలంబనం చేసి రక్షిస్తాడన్నమాట.

ఇక నాల్గవచరణం నిర్వాణం. అది కేవల సదాశివస్వరూపం. అది సాక్షాదానందస్వరూపం.

ఇలా ఈ శ్లోకంలో శంకరులు త్రిమూర్తుల క్రియాకలాపం అంతా ఏ విధంగా అమ్మవారి దయామాత్రమే అవుతున్నది వివరించారు. అటువంటి క్రియాకలాపనిర్వహణాశక్తులను అమ్మవారిని ఆరాధించి త్రిమూర్తులు పొందుతున్నారూ అని స్పష్టంగా తెలియబరుస్తున్నారు.

ఈ శ్లోకానికి ప్రతిదినం వేయిమార్లు పారాయణం, ఫలితం జనామోదం లభించటం,  అముష్మికం ప్రకృతివిజయం. నైవేద్యం ఆవుపాల పరమాన్నం.

25, సెప్టెంబర్ 2014, గురువారం

ఒక ఊరి కథ - 6

ఆ మాట చెప్పునపుడు పంచాయతీ నౌకరు గొంతు జీరబోయినది. ఇంత వరకు చెప్పినవాడు కంట నీరు పెట్టుకొని మౌనముగా నుండిపోయెను.

దాదాపొక నిముషము పాటు వృధ్ధమతపెద్ద కూడ మౌనముగా నాతని వంక జూచుచు నూఱకుండెను.  పిదప మెల్లగ ప్రక్కమీది నుండి దిగి లేచి వెళ్ళి గోడపై నున్న యొక బొత్తమును నొక్కెను.  ఒక కుఱ్ఱవాడు లోనికి రాగా వానిని రెండు కాఫీలు తెమ్మని పురమాయించెను.

ఇరువురును మౌనముగ కాఫీలను సేవించిరి.

మతపెద్ద కొంత తటపటాయించి తుదకు పంచాయతీ నౌకరుతో నీ‌ బాధలను  కెలకుచున్నానా, నీకు కష్టముగా నున్న యెడల చెప్పవద్దులే యనెను.

పంచాయతీ‌ నౌకరు చిన్నగ నవ్వి బాధ యన్నది నాలో నొక భాగమై పోయినది.  మీకు చెప్పుట వలన కొంతగ నుపశమించు నెడల చెప్పుటయే మంచిది గద యని మఱల కథలోనికి వచ్చెను.

షాహుకారుగారు తాను మాట యిచ్చినాడే కాని తనఖాపత్రమును మాకు పంపినది లేదు. కారణమేమో తెలియదు.  షాహుకారు కొడుకు కొంచెము బధ్ధకస్తుడు. ఒక వేళ తండ్రి తనచేతి కా పత్రము నిచ్చినను దానిని మా కందించుట మరచెనేమో తెలియదు.  లేదా షాహుకారు గారే‌ ఆ సంగతిని మరచి యుండవచ్చును.  ఒకవేళ, షాహుకారుగారి యింటిలో నెవరైన నడ్డుచెప్పినారేమో.

మతపెద్ద కల్పించుకొని మీ‌యన్నయే మీకు తనకు పత్ర మందిన సంగతి చెప్పుట మరచెనేమో యనెను.

పంచాయతీ నౌకరు నవ్వి తల నడ్డముగా నూచి యది యసంభవము. మా యన్నగా రంతటి ముఖ్యమైన విషయము మాకు చెప్ప మరచునా యని కథ కొనసాగించినాడు.

కొన్ని నెలలకు మా యన్నగారు మిత్రు లిద్దరితో‌ కలసి విహారయాత్రకు బయలుదేరెను. ఆతడు తిరిగి వచ్చుటకు వారము దినములు పట్టు ననగ నన్నాళ్ళును నగ్రహారములో నుందుమని నాయనగారు మా యన్న నొప్పించిరి.

ఇంతలో నెవరో తలుపు తట్టగా పంచాయతీనౌకరు లేచి వెళ్ళి తలుపు తీసినాడు.  ఎదురుగా నొక నూనూగు మీసముల పిల్లవాడు.

వానిని చూడగనే యేమిరా మందుల నింటి వద్ద నందించలేదా యని ప్రశ్నించెను.

మీ‌యింటి వద్దనుండియే వచ్చుట. గురువుగారు, మిమ్ములను తక్షణమే వెంటబెట్టుకొని రమ్మని మీ‌ నాయన గారి యాదేశమని యా పిల్లవాడు వినయముగా పలికినాడు.

పంచాయతీ నౌకరు బయలుదేరుచు మతపెద్దతో మిగిలిన కథ మరియొకసారి చెప్పెదననగా మతపెద్ద దానికేమి గాని నీవీ‌ పిల్లవాని కేమి నేర్పుచున్నావని ప్రశ్నించెను.

పంచాయతీ నౌకరు గుమ్మము దగ్గరకు పోయిన వాడు వెనుదిరిగి జ్యోతిష మని చెప్పి గుమ్మము దాటినాడు.

ఆత డింటికి చేరుసరికి వాని తండ్రిగారు కొంతగా నాందోళితమనస్కులై కనిపించినారు.  సంగతి యేమని ప్రశ్నించగ వారు కొంత కోపముతో నీకా మతాంతరునితో నేమి పని యని ప్రశ్న వేసినారు.

కుమారునకు విషయము బోధపడినది.  నాయనగారి యాందోళనుములో న్యాయమున్నది ఆయనకు నచ్చజెప్పవలెను కద.  కనుక  క్లుప్తముగనైనను వినయముగనే స్పష్టీకరించినాడు.

"నా కాయన తో‌ పని యున్నది"

"మతాంతరుడు నీకు చేసి పెట్టగల పని యేముండును. ఆతడు గాని నిన్ను ప్రలోభపరచునేమో‌ యని కంగారు పడినాను"

"నాయనగారూ, యిది లౌకికమగు వ్యవహారము.  ఆయనకు మన ప్రాంతములో పట్టును పెంచుకొనుట లక్ష్యము.  నా కాయన లక్ష్యమును నిరోధించుటయే లక్ష్యము"

"అట్లైనచో వానితో మంతనములు దేనికి?"

 "వేఱు మతము వాడు.  కాని యోగ్యుడైన పెద్దమనిషి. తన పని తాను చేయు చున్నాడు. అది ఆయన యుద్యోగధర్మము. అది ఆయనకు ప్రీతిపాత్రమైన పని.  నా ధర్మము వేఱు.   నా మతమును సంరక్షించుకొనుటయే నా ధర్మము.  నాకు  స్వధర్మము. మాత్రమే ప్రీతిపాత్రమైనది. అట్లని విమతస్థుడని దూరముంచినచో వారి కార్యక్రమములు నాకెట్లు బోధపడును? అందువలన తగుమాత్రము స్నేహము తప్పులేదు."

"అయినచో నతనిని నమ్మించి మోసగింతువా?"

"మోసములతో పని లేకుండగనే నా కార్యమును నెఱవేర్చుకొనగలను"

"నాయనా యిది ప్రమాదకరమైన విషయము వలె నున్నది.  వారి వద్ద ధనబలమున్నది.  అంగబలమున్నది. మనవద్ద నేమి యున్నది?  వారితో ఢీకొనుట దేనికి?"

"నా మతమును సంరక్షించుకొనుటయే నా కర్త్యవ్యము. అట్లని నేనేమియు నపాయకరమైన పనులకు దిగుట లేదు. మీరు నిశ్ఛింతగ నుండవచ్చును"

"ఏమో, నాకు నమ్మకము లేదు. మీ యన్న యట్లైనాడు.  నీ వేమో మొండిశిఖండివి.  ఇక్కడ మనకే మున్నదని యుండుట? నీ విట్లు లేని పోని గొడవలలో తలదూర్చుట. చూడగా మన మీ యూరు మారుటయే మంచిదేమో యనిపించుచున్నది."

"ఇది నా పూర్వీకులు కట్టిన యూరు. దీనిని భ్రష్టుగానిచ్చుట కోర్వవచ్చునా? కాబట్టి నాకిది తప్పదు.  ఊరు మారిన నేమగును. అక్కడ మరొక సమస్య ఉండవచ్చును. నాకు తగిన బలము నా కున్నది. మీరు చూచుచుండగనే సర్వమును సుఖాంతమగును" 

సౌందర్యలహరి - 1 శివః శక్త్యా యుక్తో


మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


1

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి


శ్రీశంకరభగవత్పాదులు అనుగ్రహించిన దివ్యస్తోత్రాల్లో సౌందర్యలహరి ఒకటి. దీనిలో అమ్మవారిని స్తుతిస్తూ నూఱు శ్లోకా లున్నాయి.

ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం.

ఏ పని చేయాలన్నా దానికి తగిన శక్తి మనకు కావాలి. లేకపోతే మనం అసలు కదలటం కూడా చేయలేం. ఎందుకంటే కొంచెం కదలాలన్నా దానికీ ఎంతో కొంత శక్తి వినియోగించక తప్పదు కదా.  అందుకే శక్తిహీనుడు చొప్పకట్టలా పడి ఉంటాడు. అసలు అతడిలో చైతన్యమే ఉండదు.

అసలు లోకంలో ఏ క్రియాకలాపం జరగాలన్నా దానికి పరమేశ్వరుడి అనుగ్రహం కావలసినదే.  అందుకనే ఒక సామెత పుట్టింది తెలుగులో.  శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదూ అని.

ఈ చీమ అనేది ఎంతటి జీవి చెప్పండి? అది కుట్టటానికి కూడా పాపం అది ఎంతో కొంత శక్తిని వినియోగిస్తుందన్నది పక్కన పెడితే, అలా ఓ చీమ కుట్టటం వల్ల మనకి కలిగే కష్టం ఏమంత చెప్పుకోదగ్గది కానే కాదన్నది విషయం. ఐతే అంత చిన్న పనికీ ఆ చీమకు శివుడి ఆజ్ఞ ఐతే కాని కార్యం లేదు.

ఇక్కడ శ్రీశంకరులు చమత్కారంగా ఈ శ్లోకంలో ఎలా ప్రార్త్ఝిస్తున్నారో అమ్మని చూడండి.

అమ్మా, ఈ శివుడున్నాడే, ఆయన నీతో కూడి శక్తియుక్తుడు అనిపించుకుంటే గాని తనంతట తానుగా ఏమీ చేయలేడమ్మా .మరి శివుడికి కూడా పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరికీ  ఆజ్ఞలు జారీ చేయాలంటే కూడా తగినశక్తి కావాలిగా?  నీవు ప్రక్కన ఉండి సాయపడబట్టి ఆయన ప్రపంచాల్ని సృష్టిస్తున్నాడు. అంతే. అంతే. లేకపోతే  కొంచెంగా నైనా  ఏ విషయంలోనైనా స్వయంగా స్పందించటానికీ ఆయనకు కుదరదు సుమా.

అమ్మా  అటువంటి నిన్ను త్రిమూర్తులూ తదితర దేవతాగణాలూ నిత్యం ఆరాధిస్తుంటే వారి చేత  నీవు లోకాలన్నింటినీ నిర్వహింపజేస్తున్నావు. అంటే వారికి నీ సాన్నిద్యం ఉండబట్టి వారికి నిన్ను స్తుతించేందుకూ  పూజించేందుకూ  సామర్థ్యం కలిగింది.

అమ్మా,  నా సంగతి ఏమని చెప్పనూ? నేనేమీ పుణ్యం చేసుకున్న వాడిని కాదే!  నీకు మ్రొక్కటానికీ నిన్ను స్తుతించటానికీ నాకు సమర్థత ఎక్కడిదీ?

ఇలా ప్రారంభం చేస్తూ అమ్మా నేను తగినంత సమర్థత లేకపోయినా సాహసించి నిన్ను స్తుతిస్తున్నానూ అనుగ్రహించూ అని చమత్కారంగా ప్రార్థిస్తున్నారు.

శ్రీశంకరులు ఇలా అమ్మవారిని గురించి స్తోత్రం శివశబ్దంతో ప్రారంభం చేస్తున్నారు.

ఈ శ్లోకానికి పారాయణం పన్నెండు రోజులు, రోజూ వేయిసార్లు చొప్పున. నైవేద్యం త్రిమధురం అంటే బెల్లం, కొబ్బరి, అరటిపళ్ళ కలిపిన మిశ్రమం. ఫలితం కార్యసిధ్ధి, సకలశ్రేయోవృధ్ధి.

22, సెప్టెంబర్ 2014, సోమవారం

ఒక ఊరి కథ - 5

మా యూ రొక సంపన్నమైన యగ్రహారము. ఊరు చిన్నదే కావచ్చును కాని పేరూరి వలె నిదియును వేదపండితులకు నిలయముగా నుండెడిదని చెప్పుకొనెడు వారు. చెప్పుకొనెడు వారనుట యెందు కనగా నేటి సంగతి వేఱుగ నుండుట వలన. 

మా యూరి పేరు శివాపురమును గాదు శివపురమును గాదు.  నిజమైన పే రనగా నది శివరామపురము. ఒకప్పుడు శివరామశాస్త్రియను వేదపండితున కెవరో మహారాజుగారు బహూకరించిన యగ్రహారము. దాని పూర్వనామ మేదో తెలియదు కాని నాటగోలె శివరామపురమైనది. ఆ పేరు వచ్చి యొక రెండువంద లేండ్లు కావచ్చు నేమో నాకు తెలియదు.

 మొదట మా యూరి పేరు శివరామపురముగా నుండగా తొలుతగా దాని నుండి రాము డెగిరిపోయినాడు.  అదెట్లు జరిగెనో తెలియదు. చివరకు వట్టి శివపురమైనది.  కొన్నాళ్ళ కెవడో మహానుభావుడు శివపురమన్న పేరు దురర్థప్రదాయకమని సిధ్ధాంతముజేసెను.

శివపుర మనగా శివుని యొక్క పురమని షష్ఠీవిభక్తిని జెప్పి దానియర్థము శ్మశానమని నిశ్చయముగా నుండును గావున పిల్లపాపలతో పాడిపంటలతో దులదూగు నూరి కట్టి నామధేయ మనుచితమని ప్రకటించి పాండిత్యప్రకర్షను జూపినాడు.  అదేమయ్యా శివుడు కేవలము శ్మశానములోనే యుండెడివా డనవచ్చునా శివమనగా నేమీ? శివప్రదత్వాత్ అను వ్యుత్పత్తిని బట్టి శివశబ్దము గావున శివుడు సర్వమంగళములకును గారకుడు. అట్లగుటచేత శివపురమని యేల ననరా దని యెవ రైనను వానిని నిలదీసిరో లేదో తెలియదు.  అదియును గాక సర్వం వశీకృతం యస్మాత్తస్మాత్ శివ ఇతి స్మృతః అని శివపురాణము నందున్నది తెలియని వాడాయెనే! మఱియు నా మహాపండితుడు గ్రామనామమును శివాపురముగ జేసినాడు. శివా యనగా శివుని యర్థాంగలక్ష్మియైన ప్రార్వతీ‌దేవి. ఆవిడ శుభప్రదాయని గావున నా విధముగా మార్చినాడట.  యేమి వెఱ్ఱి? నమశ్శివాయైచ నమశ్శివాయ యని స్తుతించబడిన యర్థనారీశ్వరతత్త్వమును గ్రహించలేక పోయినాడు.  ఒకప్పటి వేదపండితుల యగ్రహారము నందు దాని యొక్క పేరునే తప్పుబట్టు మహానుభావు లుదయించుట కేవలము కాలప్రభావము. పోనిండు పూర్వనామధేయమైన శివరామపురమని పిలచుటయే మంచిదని యేల సిధ్ధాంతము చేయలేదు. శివరాముడన్నది గూడ నర్థరహితమని భావించె నేమో తెలియదు.  కొందఱకి శివు డిష్టదైవము. వారికి విష్ణునామములు పనికిరావు. ఘంటాకర్ణుని వంటి వారన్నమాట. వారి కర్మము వారిది. మన కేమి.

పై కెగబ్రాగవలె నన్న బహుప్రయాసా సాధ్యమగు కార్య మగును కాని దిగజారుట కేమి కష్టపడవలయును? శివపురమో శివాపురమో యేదైన నేమి మగనిపేరో భార్యపేరో యేదైనను గ్రామము దైవనామాంకితమే యగుచు నున్నది కదా యనుకొను వారి నెత్తిన పిడుగుబడు కాలమును వచ్చినది. ఇప్పు డీ గ్రామనామమును మరల మార్తురట, కానిండు. నీ‌కథ చెప్పవయ్యా యనగా వీ డేల తన గ్రామమును గూర్చి ప్రస్తావించుచున్నా డని మీ కనిపించ వచ్చును. దానికి పెద్దకారణమే యున్నది. ఆ శివరామశాస్త్రిగారు మా పూర్వీకులై యుండగా నీ సంగతిని ప్రస్తావించక పోవుట యెట్లు? 

తన తమ్ము డొక బీదవాడుగా నుండగా నాయనను సమాదరించి శాస్త్రిగారే తన గ్రామమందు భూగృహాదివసతుల నేర్పరిచినారు. నేను శాస్త్రిగారి తమ్ముని నుండి యారవతరము వాడను.   అగ్రహారము నేర్పరచిన మహానుభావుడు శాస్త్రి గారీ‌ గ్రామముననే యేబది యేండ్లు కాపురముండిరి. శాస్త్రిగారి కుమారునకు వేఱొక సంస్థాన మందున పెద్ద యుద్యోగము గలిగి యాయన వలస బోయెను. శాస్త్రిగారి మనుమ డీయూర నున్న తమ భూము లన్నింటిని విక్రయించగా వాటిని కొందరు షాహుకార్లును తదితరులును మరికొందరు ధనవంతులైన బ్రాహ్మణులును విలుచుకొనిరి. వారి కుటుంబమును గూర్చి మా కటు పిమ్మట సమాచారమే లేదు. శాస్త్రిగారి కుటుంబ మిక్కడ నుండగా బ్రాహ్మణేతరులెవ్వరు గాని యగ్రహారీకులు గాలేదు. వారి మనుమని కాలము వచ్చుసరికి కొందరు వైశ్యులును మరి కొంద రన్యవర్ణముల వారు నీ‌ గ్రామమున నిండ్లును భూవసతియును గలిగి యుండు పరిస్థితి యేర్పడినది.  ఇం దెవ్వరి తప్పొప్పులును లేవు.  అంతయును కాలము చేతనే యగుచుండును.

ఈ‌యూరి శివారు గ్రామము నేడు కొంచె మించుమించుగా శివపురమంత యున్నది గాని నిజమున కదియే ప్రథాన గ్రామముగ దానిలో నొక భాగముగా మా యగ్రహారము లేచినది.  తొలినాళ్ళలో నగ్రహార మంతయును బ్రాహ్మణీకము. ఇతర వర్ణముల వారీ శివారు గ్రామస్థులుగా నుండిరి. 

కొన్ని దశాబ్దముల క్రిందట మన శివారు గ్రామము నానుకొని యున్న  కుగ్రామము మీదుగా దొరతనము వారు విశాలమైన పెద్ద రహదారిని నిర్మించిరి. శివారు గ్రామము నకు సిరియెత్తు కొనినట్లైనది.  అందరును చూచు చుండగనే శివారుగ్రామము చిన్న పట్టణ మాయెను. అప్పటికే మాగ్రామమున వేదాధ్యయనములు తగ్గి పిల్లల నింగ్లీషు చదువుల కొఱకై కొంత దూరమున నున్న పట్టణమునకు పంపుట ప్రారంభమైనది.  కొంద రా పట్టణమునకే వలసబోయిరి.  మా నాయనగారు వలస పోలేదు కాని మా కింగ్లీషు చదువులు చెప్పించిరి.  కొంత వేదాధ్యయనము కూడ చేసితిమి.  మే మనగ మా యన్నయును నేను నన్నమాట.

మా యన్న మిక్కిలి స్ఫురద్రూపి. చాల కుశాగ్రబుధ్ధి.  వానిని కాలేజి చదువులకు బంపుమని మా నాయనగారి నచ్చటి పాఠశాలవారు మిక్కిలి యొత్తిడి చేసిరి. మీ స్నేహితుడైన మా పెద్దాయన కూడ యొత్తిడి చేసెను. అయన రెండవకుమారునకును మా యన్నకును ప్రాణస్నేహము. ఇరువురకును మా యూరి షాహుకారుగారి పెద్దకొడుకు చాల స్నేహితుడు. మువ్వురును కలసిమెలసి యొకరిభుజములపై నొకరు చేతులు వేసికొనుచు నుల్లాసముగా నూరిలో తిరుగుచుండగా పరమనేత్రపర్వముగా నుండెడి దని జనులు చెప్పుకొను వారు.  ఈ మువ్వురిలో‌ మా యన్నయే నాయకుడు.  మువ్వురును కలిసియే కాలేజి చదువులకు బోయిరి. దగ్గరలో నున్న యూరికే బస్సు వచ్చును గనుక సెలవుదినములలో నింటికి వచ్చుచుండువారు. వారు వచ్చినప్పుడెల్ల గొప్ప సందడిగా నుండెది దట యూరంతయును. 

పెద్దచదువులు చెప్పించు నంతటి స్తోమత మాకెక్కడిది. షాహుకారే మీ కొడుకు నా కొడుకు కాదా యని యొప్పించి సొమ్ము సర్ధుబాటు చేసెను.  మా నాయనగారికి స్వాభిమానము కదా. వలదన్నను కొంత పొలమును తనఖా పెట్టి గాని సొమ్ములు స్వీకరించినాడు కాదు. అప్పటికే నా అప్పగార్ల పెండ్లిండ్లకు కొంతపొలము  విక్రయించినాము. మిలినది తనఖా పెట్టుటకు మా యన్నకు సమ్మతమైనది కాదు. కాని నామమాత్రపు తనఖాయే కద యని చివర కంగీకరించినాడు. అప్పటికి నాకు పదేండ్లేమో.

మాయన్నకును నాకును షష్టాష్టకము.  చుక్కెదు రందురే యట్లన్నమాట. నన్ను తరచుగ కోపము చేయుచుండువాడు.  నేను నా తల్లిని చంపి పుట్టితి ననగా నది నా దోషమే యని కోపించిన నేనేమి చేయుదును.  మా నాయనగారు మందలించినను వినువాడు కాదు. ఒకసారి వంట చేయుచుండగా పరధ్యానముగ నుండుటవలన మా నాయనగారి  చేయి కాలినది.  మాయన్న నన్ను చావబాది నాడు!  చిత్రమేమనగా కాలేజి చదువు మొద లైనప్పటి నుండియును మా యన్న మారినాడు. సెలవులకు వచ్చినప్పుడు నన్ను మిక్కిలి ముద్దుచేయు చుండువాడు.  నాతో సహపాఠము చేయుట, నాకు చదువులో సహాయపడుట చేయువాడు. మా నాయన గారికి మిక్కిలి యానందముగ నుండెడిది. 

చదువులు ముగిసి ముగ్గురు స్నేహితులును వేర్వేరు యూళ్ళలో మంచి యుద్యోగములు గడించు కొనినారు. వా రుద్యోగములు చేయుట తండ్రు లెవరికిని హితము గాకున్నను పట్టుబట్టి పోయు యుద్యోగములలో చేరిరి. వారికి గల పరస్పరప్రేమానురాగములు కావచ్చును వారి కూరిపై గల ప్రేముడి కావచ్చును వారు తరచుగ వచ్చిపోవుచునే యుండెడి వారు.  మాకును సంతోషముగనే యుండెడిది.  కాని మా నాయనగారి యారోగ్యము చెడుట వలన మా యన్న మా కాపురమును తానుండు పట్టణమునకు మార్చినాడు. వైద్యమునకు లోపము లేనందున నాయనకు స్వాస్థ్యము చేకూరినది కాని మేము తిరిగి మా యగ్రహారమునకు మరలలేదు. మరల జబ్బు తిరుగబెట్టిన నిబ్బంది యని మా యన్న వారించెను.  నాకు చదువుకొనుటకు గూడ మంచిదియే కద యని నాయనగా రంగీకరించిరి. అదియును గాక వారి కచ్చట వేదపాఠములు చెప్పుట విరివియాయెను. మా యన్న తాను మాత్రము తరచుగా నగ్రహారమునకు పోవుట మానలేదు.  ఒకసారి మువ్వురమును గలసి యగ్రహారమునకు పోతిమి.  మా షాహుకారి గారి యమ్మాయి పెండ్లి. ఏకైకపుత్రిక గావున షావుకారుగారు దానిని మిగుల నట్టహాసముగా చేసేను. మీ మిత్రుడు పెద్దాయనగారు మన యూరిలో నొక సూర్యునివలె వెలుగుచుండిరి.  రాజకీయములలోని వచ్చి రాణించుట మొదలైనది కదా.  వారికి పేరు వచ్చుట జూచి యూరివారి యానందమునకు పట్టపగ్గములు లేవు.

షాహుకారుగారింట పెండ్లికి బోయిన్నప్పుడు మాయన్న మా పొలము తనఖా విడిపించుకొను విషయను లేవదీయగా మా షాహుకారుగారు పెద్దపెట్టున నవ్వి యేమయ్యా నీవద్ద డబ్బు పుచ్చుకొన వలెనా, నీకు పెండ్లి సంబంధములు వచ్చుచున్నవట కదా, నీ పెండ్లికి నేనా పత్రమును బహుమానముగా జదివింతును పొమ్మనెను. మరల తానే  మరొక మాట చెప్పెను. నాయనా డబ్బు బహుచెడ్డది కావున మనుషుల బుద్దులు మార్చుచున్నది. ఈ‌ పెండ్లిహడావుడి ముగిసిన వెంటనే మీ స్నేహితుని చేతికిచ్చి నేనే స్వయముగా తనఖా పత్రమును నీకు బంపెదను.  నీవు కాదన రాదు. లేకున్న రేపు నా బుధ్ది మారునో మా యింట మరి యెవరి బుధ్ధులు మారునో తెలియదు కద.  నా మాట వినవలె ననెను.  పెద్దవారి మాట కెదురు చెప్పుట నాటి కింకను సంప్రదాయము కాలేదు కాబట్టి మా యన్న చేయునది లేక యూరకొనెను.

కాలమొకే విధముగా నున్నచో దాని గొప్ప యేమున్నది?

(సశేషం)

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఒక ఊరి కథ - 4

కాఫీలు వచ్చినవి. అందరు నావురావురుమని వాటి నమృతప్రాయముగ స్వీకరించిరి. కాలెడు కడుపునకు మండెడు బూడిద యన్నట్లు భోజనముల వేళ మించిపోవు నట్టి సమయములో వేడివేడి కాఫీలకు మాత్రము నోచుకొన్న ట్లైనది. అవమానమును గూర్చి యాలోచించుట దేవు డెఱుగును గాని మొదట యన్నమును గురించి యాలోచించ వలయును కద.  పంచాయతీ నౌకరు నడుగగా వాడు పూటకూటి యిం డ్లేమియును గ్రామమున లేవని చెప్పెను. వలసినచో శివారుగ్రామము నానుకొని యున్న పట్నములో మా షాహుకారిగారి యల్లుని హోటే లున్నదని చెప్పెను. అచ్చటకు పొండని చెప్పెను.  చుట్టుప్రక్కల నొక పట్న మున్నదని వీరికిని తెలియదా, వీరు వచ్చినది యచ్చట బస్సు దిగి యాటోలపైననే కదా. మరల నందరును కాళ్ళీడ్చుకొనుచు మొగసాల వద్దకు పోయి యచ్చట నున్న యాటోల నెక్కిరి. వారితో‌ బాటుగ పంచాయితీ‌నౌకరు గూడ ప్రయాణము చేసెను.  వానికి పట్నములో పని యున్నదట. విశేషమే మనగా వారితో బాటుగ షాహుకారిగారి యల్లుని భోజనశాలలో సహపంక్తి వారితో భోజనమే చేసెను. వారితో కొంత చనవు చేసుకొని మాటలాడుటయు చేసెను.

ఎంగిలిపడి లేచిన పిదప వారు తిరిగి మనుష్యలోకము లోనికి వచ్చినట్లుగా సంతసించిరి. కిం కర్తవ్య మను చర్చ యొకటి వారి మధ్య నడచినది.  రకరకములైన యభిప్రాయములు నడచినవి. కొందరు నాయకుని కుమారు డింతటి ధూర్తు డనుకొన లేదనిరి.  కొందరేమొ వానికి నాయకుని ప్రథమకోపము వచ్చినది కాని మరేమియు లేదనిరి.  కొంద రీ‌ యవినయమును పెద్దలకు నివేదించి యంతు తేల్చవలసినదే యనిరి.  కొందరు మాత్ర మిది యేదో‌ లోతయిన వ్యవహార మనియు తొందరపడరా దనియు భావించిరి.  ఈ‌ యభిప్రాయము లెట్లున్నను రాగల కార్యక్రమము నాటంకములు లేకుండ జరిపించ లేక పోయినచో తమ పరువు మాత్రము చెట్టెక్కుట ఖాయమని యందరును భయపడిరి.  తక్షణము చేయవలసిన దేమి యన్నది మాత్ర మెవ్వరికిని బోధపడలేదు.

అన్ని మాటల మధ్యన మన వృధ్దవ్యక్తి మాత్రము పూర్తిగ నాలోచనా నిమగ్నుడై యుండెను.  పూర్వము తా ననేక పర్యాయము లీ గ్రామమునకు వచ్చియుండగ దివంగత నాయకుడు పరమప్రీతితో నాదరించు చుండెడి వాడై నప్పుడు వాని కుమారుడు తద్వతిరేకముగ వర్తించుటకు కారణ ముండి తీరవలయు నని యా వృధ్దుని లోకానుభవము చెప్పుచున్న దనిన నతిశయోక్తి కాదు. ఈ సర్పంచిని తాను వాడు కుఱ్ఱవానిగ నున్నప్పటినుండి యెఱిగి యుండెను. వాడు తనకు మొన్నమొన్నటి వరకు మిక్కిలి విధేయుడు. ఇప్పు డెదురు తిరిగి నాడు. తా నందరను పట్నములో నుపాహారము లెందుకు నాయకుని యింటి షడ్రసోపేతమైన భోజనమే గలుగునని యెంతగనో‌ యూరించి లాగుకొని వచ్చెను.  తిండి లేక పోవగా నీళ్ళకాఫీ యొకటి ముఖాన కొట్టినా రదియును రెండుగంటల ప్రాంతమున.  దరఖాస్తునకు చిత్తుబుట్టయే శరణాగతి యని తెలియుచునే యున్నది.  మానావమానములు దైవసంకల్పములు.  తనకు పని యగుట ముఖ్యము. కాబట్టి వీరినందరను వెనుకకు బంపి తానొక్కడే నాయకుని పెద్ద కుమారుని తిరిగి దర్శించి మెల్లగా ప్రసన్నును చేసికొన వలయును.  అట్లు కానిచో కార్యము చెడును.  మానహానికి మించి కార్యహానికే వెఱువ వలసినది కదా.  సాయంతనమున చల్లబాటు వేళలో యువనాయకుని దువ్వుట మంచిది.  ఆత డన్నట్లుగా మిగిలిన దండు కేవలము తిండి దండుగ వారు. మరల నందరును కలసి దండెత్తినట్లు పోయినచో నాతనికి కోపము మిక్కుటమగు ప్రమాదమును గలదు.  ఒకవేళ వారితో కలసి కూర్చున్నను వారిలో నెవరైనను గాని యడ్డదిడ్డముగ నొక్క ముక్క మాట్లాడిన చాలదా తన ప్రయత్న మంతయును బూడిదలో పోసిన పన్నీ రగుటకు.

ఇట్లాలోచించి ఆయన మిగిలిన వారికి నచ్చజెప్పి వారిని వెనుకకు పంపి వేసెను. షావుకారుగారి యల్లుని హోటలు ప్రక్కనే యొక వసతిగృహ ముండెను. అందులో‌ నొక గదిని విలుచుకొని విశ్రాంతి తీసుకొన నుపక్రమించగా కొంత తడవునకు పంచాయితీ నౌకరు పిలవని పేరంటమునకు వచ్చి తలుపు తట్టినాడు.

ఇరువురును సంభాషణ లోనికి దిగిరి.  వీని నుండి సంగతి సందర్భములను గూర్చి తెలుసుకొనవలెనని వృధ్ధుడైన యా మతపెద్ద ఆలోచన. వచ్చిన పెద్దమనిషి కార్యకలాపములు కనిపెట్టి యుండవలెనని దాని వలన తనకు ముందుముందు లాభ ముండవచ్చునని నౌకరు మనసులోని యోచన.

మాటలలోనికి దించుటకు మతపెద్ద యొక ప్రశ్నను వేసెను.  ఇందాక మా షాహుకారి గారి యల్లుడంటివే, యేమి కథ యని.

పంచాయతీనౌకరు చిరునవ్వుతో మావూరి వాడే యా షాహుకారు. ఆయన బాగుపడినాడు. మేము చెడితిమి. అంత కన్నను మఱేమియును లేదనెను.

"ఆతడు మిమ్మేమైన మోసము చేసెనాడా"

"మోసము చేసి నట్లైనచో మా షాహుకా రని యెందుకందును.  ఆయన మోసము చేయలేదు.  ఒకవేళ చేసెనేమో‌ నాకు  స్పష్టముగ తెలియదు.  నాకు తెలిసి జరిగిన దంతయు మా స్వయంకృతాపరాధమే."

'జరిగిన దంతయు ననగ నేమి జరిగెను"

"లప్ప పోయి చిప్ప వచ్చెను"

"నా కేమియు బోదపడలేదు"

"చిన్న విషయమే. ఒకప్పుడు ఈ‌ వసతిగృహమున్న స్థలమును, పూటకూళ్ళిల్లున్న స్థలమును కూడ మావే. మరికొంత స్థలమును గలదు.  అంతయును మేము పోగొట్టుకొంటిమి. అంతయును నాయన సంపాదించుకొనినాడు."

"అదెట్లు"

"కాలో దురతిక్రమణీయః. మా బుధ్దులను దొలచిన పురుగు వీటిని విక్రయింప జేసినది. కాలము త్రోసికొని వచ్చినప్పుడు బుధ్దులు పెడదారి పట్టక మానునా? వినాశకాలే విపరీత బుధ్ధిః యని సామెత యున్నది కదా. మా సంగతి యది"

"నీవు సంస్కృతము తెలిసినట్లున్నావే? బ్రాహ్మణుడవా?"

"అవును బ్రాహ్మణుడనే"

"మీ బ్రాహ్మణులకు నింత చిన్నచిన్న యుద్యోగములు చేయుట నామోషీ కాదా"

"బ్రాహ్మణజన్మము లభించుట యెట్లు పూర్వకర్మానుసారమో యట్లే చిప్పచేతికి వచ్చుట కూడ. మధ్య నామోషీ దేనికి? బ్రాహ్మణపుట్టుక పుట్టి నందు కనియా లేక నౌకరీ చిన్న దనియా?"

"ఇంకను బ్రాహ్మణుడవేనా"

"అయ్యా, బ్రాహ్మణత్వము పుట్టుకచేత. నేను జందెమును తెంపి విసరి వేసినను సమాజము నన్ను బ్రాహ్మణు డనియే పిలచును."

మతపెద్ద నవ్వి యొక పాచిక విసరి చూసెను. "మేము నీ‌వు కావలె నను కొన్నచో నీ బ్రాహ్మణత్వమును వదిలించగలము"

"అదేమి మాట. బ్రాహ్మణత్వ మేమైన దయ్యమా మీరు భూతోఛ్ఛాటనము చేయుటకు?"

"నిన్ను బాధించు నది దయ్యము వంటిదే గదా? అది వదలుట మంచిదే కదా? మేము వదలించిన పిమ్మట నీ బ్రాహ్మణ్య మెగిరి పోవలసినదే!"

"ఏమి చిత్రము. మీ‌ మతములో కలసిన వా రనేకులు తమతమ కులనామములను విడువ గలిగిరా కులములను విడువగలిగిరా నేను నా బ్రాహ్మణ్యమును వదల గలుగుటకు?"

"వారు వదలగోరలేదు. దాని కేమి. నీవు వదల దలచినచో నది పెద్ద విషయము కాదు"

"నేను వదల గోరుట లేదు"

"నీకు నీ‌ బ్రాహ్మణ్య మేమి యుపకారము చేసినది?"

"అట్లని అపకారమేమి చేసినది? నా దైన్యము నకు కారణము నా ప్రారబ్ధము. నా బ్రాహ్మణత్వము కాదే."

"కాని మేము మాత్రము నీ కుపకారము చేయగలము.  నీ పేరు మార్చగలము.  నీ యూరు మార్చగలము. నీకు మంచి యుద్యోగము వేయించి జీవనము మార్చగలము. అవి చాలవా"

"చాలవు. నాలో బ్రాహ్మణుని మార్చలేరు కదా? నడమంత్రముగ మతము మారిన వాని యపరాధభావమును వాని పాత దేవుళ్ళు తీర్చలేరు.  వాని కొత్త దేవుడు కూడ తీర్చలేడు.  ఎందుకు వచ్చిన సజీవనరకము?"

పాచిక పాఱినది కాదు.

మతపెద్ద మరల నవ్వుచు నీ‌ బ్రాహ్మణ్యమునే పదిలముగా నుంచుకొనుము దాని కేమి కాని జరిగినకథ చెప్పుమనెను.  నౌకరునకు పాతవిషయములను త్రవ్వి చెప్పుటకు మనసు కాలేదు. కాబట్టి మాట మార్చబోయెను.

"మీరు నా అదృష్టమును మార్చలేరు కాని నేను మీ అధృష్టమును మార్చగలను"

"అవునా. అదెట్లు?"

మధ్యాహ్నము జరిగిన దంతయును నాకు తెలియును.  అట్లెందు కైనదియును తెలియును. మీకు తెలియని సంగతి యే మనగా సర్పంచిగారు నేటి రాత్రి యూరికి పోవుచున్నారు. మీరు వారిని కలువలేరు.

"ఏడ్చి నట్లున్నది. ఈ‌ మాట తొలుతనే చెప్పినచో నేనును మా వారితో వెనుకకు బోయి యుండెడి వాడను కదా!"

"మీ రొకవేళ పోవుదు రేమో యని చూచుచుంటిని. పోవున ట్లున్నచో చెప్పెడు వాడనే"

"నేను సర్పంచి లేనపుడు చెక్కభజన చేయుచు కూర్చున్నచో‌ నీ‌ కేమి లాభము?"

"సర్పంచి గారిని యొప్పించగల వారిని కలసుకొనవ చ్చును కదా?"

"లాభము లేదు. సర్పంచి భార్యమాట వినువా డనుకొనను"

"ఆయన తల్లిగారి మాటను జవదాటడు.  మీరు పోయి యావిడ కాళ్ళమీద పడవలెను"

ఆలోచన బాగుగనే యున్నది కాని కాళ్ళమీద పడుట యని చెప్పి తనను కొంచెముగ నెద్దేవా చేయుట మాత్రము మతపెద్దకు నచ్చలేదు.  చెప్ప దలచిన మాట చెప్పి పంచాయతీ నౌకరు వెడలిపోవుటకు నుద్యుక్తు డాయెను.

మతపెద్దగారికి కథల పిచ్చి యన్న సంగతి బయటపడినది. నీవు నీ కథను దాటవేయ వీలు లేదు. చెప్పితీరవలయు నని బలవంతము చేసెను. వాని కొక తాయిల మిచ్చుటకు సిధ్ధమైనాడు.

"నీవు నాకు నీ కథను చెప్పినచో నీకు నేను తగిన యుపకారము చేయగలను"

"నా మతమును మార్చుటయే గదా మీ చేయు నుపకారము. నా కక్కర లేదు"

"మతము మార్చుకొన బని లేదులే. నీ కుపకారము చేయుటకు నా కారణము నా కున్నది"

"యేమి కారణము"

"నీ కథను నీవు బ్రతిమలాడినను జెప్పవు కాని నా కథను నేను చెప్పవలయునా?"

పంచాయితీ నౌకరు మెత్తబడెను.

"ఊరక నడిగితిని. మీ‌ కథతో నాకు నిమిత్తము లేదు. నా కథను మీకు చెప్పెదను కాని మీ రెవ్వరికిని వెల్లడించరాదు"

పరమానందముగా నంగీకరించి మతపెద్ద కొంచెము ముందుకు జరిగి కూరుచుండెను.

(సశేషం)

18, సెప్టెంబర్ 2014, గురువారం

ఒక ఊరి కథ - 3

నాయకుని కుమారుడు కొంత తీవ్రమైన స్వభావములు కలవాడని యూరిలో నందరకును తెలియును. ఊరిలో వృధ్ధులైన వారు కొందరు నాయకుని గూర్చి యాతడొక యువకుడుగ నున్నప్పటి సంగతులును తెలిసినవారుగా నున్నారు.  వారి నోట మాత్రము తండ్రి దుడుకుదన మంతయు కొడుకునకు వచ్చిన దను మాట వినిపించుచు నుండును. కాని తండ్రిబిడ్డల మధ్యనొక తారతమ్యమును గూడ వారు ప్రస్తావించుట జరుగుచున్నది.  తండ్రి స్వభావములో పట్టుదలలకు పోవుట యనునది లేదు కాని యాతని పెద్దకుమారుడు మాత్రము పట్టుదలలకు దిగు స్వభావము కలవాడు.  ముఖ్యముగ నీ‌ నాయకుని కుమారుడా యూరికి సర్పంచి యగుట నుండి యిట్టి పోలికల ప్రస్తావనములు కనిపించుచునే యున్నవి.  పట్టుబట్టినచో నెంతకైను తెగించు నట్టి వాడీ యువకుడని యూరిపెద్దల యభిప్రాయమే కాక చాల మంది ప్రత్యక్షముగ తిలకించిన సంగతి.  ఇప్పుడీ గ్రామనామమును మార్చుటకై పూనుకొని నప్పు డది యీతని యూహ కావున జరిగితీరునని పెద్ద లనుకొనిరి. వారిలో హెచ్చుమంది కట్టిది యేమాత్రమును రుచించని పని యైనను తాము చేయగలిగినది లేదని యూరకొనిరి. కాని నే డా యువకుడే జరిగిన నామాంతరమును గూర్చి మండిపడుటను జూచి యూరి వారందరును గొప్ప యుపద్రవమే కలిగినదిగా భావించిరి. కాని చిత్రమైన విషయ మేమనగా కొత్తప్రార్థనామందిరము పైన చేరినదైన తమ యూరి పేరి మార్పును గూర్చి సన్నిహితుల వద్ద నగ్నిహోత్రుని వలె మండిపడిన వాడు క్రియలో మాత్ర మేమియును చేయక నూరకొనెను.

ఇంతలో నొకనా డూరి లోనికి కొందరు పెద్దమనుష్యులు వచ్చిరి.  వారు సరాసరిగ నీ క్రొత్త ప్రార్థనామందిరమునకు పోయిరి.  పోయిన వారు లోనికి మాత్రము పోలేదు.  బయటనే నిలువబడి చర్చలు చేసుకొనిరి.  కొత్త నామఫలకమును మాత్ర మందరును చూపులతో పరామర్శనము చేసిరి.  కొంత సేపటికి ప్రార్థనామందిరము లోని కొకడెవడో పోయి కబురు చెప్పినాడు . కొంతసేపటికి కబురు తెచ్చిన వానితో కలసి యచ్చట ప్రార్థనాధికములు జరిపించు నాతడు వెలికి వచ్చెను.  కబురు మోసిన వాడొక సైకిలుపై వెడలిపోయెను. అందరును మరికొంత సేపు మంతనము లాడు కొనిరి.  తుది నందరును కలిసి దివంగత నాయకుని యింటికి పోయిరి.

వా రచ్చటకు చేరుకొని తామ రాక నెఱిగించుకొనగా దాదా పైదు నిముషముల పిమ్మట నొకడు కొన్ని ప్లాష్టిక్ కుర్చీలను తెచ్చి యరుగుపై వేసి వారిని కూర్చుండ నియమించెను.  వా రొకరి మొగము లొకరు చూచుకొని నిశ్సబ్దముగా పోయి వాటిలో‌నాసీను లైరి.

మరియొక పది నిముసములు గడచినవి.  పావుగంట గడచినది. వచ్చి వీరిని పలుకరించిన వారు లేరు. ఆ వచ్చిన వారిలో నొకాయన యరువదికి పైబడిన వయస్సులోని వాడు. అయనకు దాహబాధ మిక్కుటము గా జొచ్చెను.  మిగిలిన వారికిని దాహముగనే యున్నది గాని ఏమి చేయుటకును తోచక నూరకొనిరి.  మరియొక పది నిముషముల పిమ్మట నొక బాలుడు బంతితో బయటకు రాగా వానితో దాహము దాహమని చెప్పుకొనిరి. వాడు లోనికి పోయి చెప్పగా మరియొక రెండు మూడు నిముషముల పిమ్మట నొక పనిపిల్ల సాధారణమైన గాజుగ్లాసులలో మంచితీర్థమును గొని తెచ్చి యిచ్చినది. ఆమె గ్లాసుల నచ్చట నుంచి లోనికి పోవుచుండగా నా వృధ్ధవ్యక్తి తన పేరును పరిచయమును చెప్పికొని తామందరమును సర్పంచిగారి కొఱకు వచ్చితి మని చెప్పికొనినాడు.

అందరును పూజామందిరములో నున్నారని చెప్పి ఆమె లోనికి పోయినది.

మరల నొక పది నిముషములు గడచిన పిమ్మట వెనుకటి పనిపిల్ల  మంచినీళ్ళ గ్లాసులను తీసుకొని పోవుటకునై వచ్చినది.  పరిస్థితి యేమని వాకబు చేయగా సర్పంచిగారికి చెప్పి వచ్చెదనని లోనికి పోయినది.  దీనిని బట్టి వీరి రాకను సర్పంచిగారికి చెప్పినవారే లేరని యర్థమై వారందరు నుసూరు మనినారు.  కొద్ది సేపటికే పనిపిల్ల వర్తమానము మోసుకొని వచ్చినది.  సర్పంచిగారు పంచాయతీ కార్యాలయమునకు పోవుచున్నా ననియు, కార్యార్థులు తనను కార్యాలయములో కలుసుకొనవలె ననియును చెప్పినారట,  వృధ్దు డనుమానముగా నా పేరు చెప్పినావా యనగా చెప్పితినని యామె ప్రత్యుత్తరమిచ్చినది. పనిబడి వచ్చిన వా రెవరైనను తనను కార్యాలయములోనే కలుసుకొనవలెనని చెప్పినారని తెలుపగా వచ్చిన వారందరును విస్తుపోయిరి. ఇట్టి మర్యాద జరుగుట కిదే ప్రథమము.  చేయునది లేక నందరును పంచాయతీ కార్యాలయము నకు బోయిరి.

వా రచ్చటికి చేరుసరికే కొందరు పంచాయతీసభ్యులు కార్యాలయములో నుండిరి. అంతలో సర్పంచి గారు వచ్చి సరాసరి లోనికి పోయెను. బల్లలపై కూర్చున్న పెద్దమనుష్యులను పలుకరించలేదు. నిజమునకు వారివంకనే చూడలేదు  వారి కది చాల యవమానముగా నుండెను.

లోపలి నుండి పిలుపు వచ్చునని వారు ప్రతీక్షించిరి కాని లోపల నొక సమావేశము ప్రారంభమైనది. ఈ విషయమును వారికి పంచాయతీ నౌక రొకడి మాటల వలన తెలిసినది. ఆ సమావేశము రమారమి యొక గంట సేపు నడచినది. బయటికి మాట లేమియును వినబడలేదు.

అప్పటికి పంచాయతీ నౌకరు బయటకు వచ్చి అయ్యగారు లోనికి రమ్మనినారని చెప్పగా నందరును లేచిరి. కాని యాతడు వెంటనే మీ యందరిలో నెవరో యొక్కరినే రమ్మని చెప్పినారనగా వారికి మిక్కిలి నిరాశ కలిగినది.  నిరాశను మించి యాగ్రహము కలిగినది.  కాని చేయునదేమి గలదు? కార్యార్థులైన వారల కాగ్రహము తగదు కదా. అందుచేత వారిలో వారొక నిముషము సంప్రదించుకొనిన పిమ్మట వారియందలి వృధ్ధవ్యక్తి తుదకు లోనికి పోయెను.

పంచాయతీ కార్యాలయములో సర్పంచిగారి గది కొంత విశాలముగనే యున్నది.  అచ్చట సర్పంచి గారు ఠీవిగా కూర్చొని యుండి కాగితములు తిరుగవేయుచుండెను.  ఈ వృధ్ధవ్యక్తి లోనికి పోగా సర్పంచిగా నున్న దివంగత నాయకుని పెద్ద కుమారుడు కనీసము ప్రత్యుథ్థానమైనను చేయలేదు.  ఊరకే కూర్చుండమని చేయాడించి యెదుట  నుండిన కుర్చీని చూపించెను. దర్శనార్థము వచ్చిన పెద్దమనిషి కది యవమానకరముగ తోచెను. కాని ఏమి చేయును?

ఆ వచ్చిన వృధ్ధుడు కూరుచుండిన పిదప మరల సర్పంచి యూరకనే యొక కాగితము లోనికి తన దృష్టిని సారించి యించుక సేపు కాలయాపనము చేసిన పిదప గాని యెదుట నున్న వ్యక్తిని పలుకరించనే లెదు.  ఆతడు యెదుట నున్న వ్యక్తి తనకు పరిచయస్తుడే కావున యెవరు మీరని యడుగ లేదు కాని యేమి పని మీద వచ్చినారని యెవరో యపరిచితుని యడుగుచున్నధోరణిలోనే యేదో యథాలాపముగ బ్రశ్నించినాడు.

వచ్చిన వ్యక్తియు నిప్పటికే  తగినంతగ నవమానించబడి నానని యెఱింగిన వాడు. ఏమియు పలుకక తన చేతి సంచిలోనుండి యొక చిన్న దస్త్రమును వెలికి దీసి దానిలో నుండి యొక దళసరికాగితమును భద్రముగా సర్పంచి చేతి కందించినాడు.  ఆ కాగితమొక  యాహ్వానపత్రమని తెలియుచునే యున్నను సర్పంచి దానిని చూచుచు  నించుకయు నుత్కంఠను ప్రదర్శించకయే తెఱచి కొంచెము పైపైన పరిశీలనము చేసి ప్రక్కకు బెట్టినాడు.

ఈ ధోరణి నంతయు చూసి వచ్చిన మానవున కేమి మాట్లడవలెనో తోచినది కాదు.

ఒక్క నిముషము సేపు నిశ్శబ్దము తాండవించినది.

చివరకు సర్పంచిగారే నిదానముగ మీరు చేయు కార్యక్రమమునకు పంచాయతీ వారి యనుమతి గైకొన్నారా యని ప్రశ్నించినాడు.

ఇది దైవకార్యక్రమము.  దీనికి పంచాయతీ వారి యనుమతము కావలెనా యని వచ్చి కూర్చున్న వ్యక్తి విస్తుబోవుచు ప్రశ్నించెను.

సర్పంచి ఖరాఖండిగా నిట్లనెను. ఎవరికి వారు సభలును సమావేశములు నిష్టారాజ్యముగ చేసికొందురా? దైవకార్యక్రమమైనను మీ యింట పెండ్లియైనను మీరు పంచాయతివారి యనుమతి లేకుండ బహిరంగకార్యక్రమములును బాకాలు నూరేగింపులును  మొదలైనవి చేయరాదు.  మీరీ యాహ్వానపతము వేసినంత మాత్రము చేత నేమగును? నిజము చెప్పవలెనన్న నిది మీరు మా యనుమతి దొరకిన పిమ్మట చేయవలసినది. మీ కార్యక్రమము వివరములతో పంచాయతీ కార్యాలయముతో ననుమతి కొరకై దరఖాస్తు చేసుకొనుడు. ఈ ఆహ్వానపత్రము దరఖాస్తుగా గ్రహించబడదు. ప్రక్కగదిలో పంచాయతీకార్యదర్శిగా రుందురు.  వారు మీరు దరఖాస్తు చేయుటకు సహాయపడగలరు. ఈ మాటలు చెప్పి ఆయన తన బల్లపై నున్న గంటను మ్రోగించగనే పంచాయతీ నౌకరు లోనికి వచ్చెను.  సర్పంచి వానితో వీరిని కార్యదర్శిగారి వద్దకు తోడ్కొని పొమ్మని చెప్పెను.

అతడేదో చెప్పబోవుటను గమనించి సర్పంచి వానితో సంగతి యేమనగా వాడును నయ్యా వీరితో మరి యారుగురు వచ్చి బయట వేచి యున్నారు కదా వారికి కాఫీలు పంపుదునా యని సందేహము వెలిబుచ్చినాడు.  సర్పంచి యట్లే యన్నట్లుగా తలయూచి మీ రొక్కరు వచ్చు పనికి గా నిందరను వెంట తెచ్చుకొనుట దేనికి యని ప్రశ్నించి తోడనే మఱల నదియును గాక యింత చిన్నపనికి మీఱేల స్వయముగా వచ్చితిరి, ఆ పెద్దమనుష్యులలో నెవరో యొకరు వచ్చిన సరిపోయెడిది కదా యని చెప్పెను.

ఎదుట నున్న పెద్దమనుష్యునకు కనులు తిరుగుచున్నట్లుగా ననిపించినది. ఏమియు మాట్లాడక నొక చిరునవ్వు వంటిది నవ్వి నౌకరు వెంట బయటకు నడచినాడు.

బయట ప్రతీక్షించుచున్న వ్యక్తులకు కూడ నాకలి మండిపోవుచున్నది.  వారికిని కనులు తిరుగుట మొదలగు చున్నది. ఊరిలో నడుగు పెట్టినప్పటి నుండియు నొక్కరి గొంతున కైనను గాని హీనపక్షముగ నొక కప్పు కాఫీ కూడ తగులలే దాయెను.


(సశేషం)

15, సెప్టెంబర్ 2014, సోమవారం

ఒక ఊరి కథ. - 2

ఆంధ్రదేశమున నూఱేండ్లకు పైచిలుకు కాలమున జి.వి.అప్పారావు గారని యొక గొప్ప నాటకరచయిత యుండుట తటస్థించెను. అట్లే మరియొక గొప్ప వ్యక్తి కె.వి.లింగం గారును నాటి కాలమున ప్రసిధ్ధులై యుండెడు వారు.  చదువరులు వారిద్ద రెవరైనది గురుతు పట్ట గలిగినచో నది సంతోషించ దగిన విషయము.

మన ప్రాంతములో వ్యక్తుల పేర్లకు చివరగా శర్మ, శాస్త్రి, నాయుడు, పంతులు, చౌదరి మున్నగు నుపనామధేయములు విరివిగా కనబడు చుండెడివి. కాని కొంతకాలమునుండి యిట్టి యుపనామములు కులసూచకములు గావున వాటిని ప్రయోగించుట నేటి కాలమున ననుచితమను నొక గొప్ప వాదము ప్రచురమై యున్నది. కావున నట్టి కులనామములను విడచి పుచ్చవలెనని భావించువారి సంఖ్య క్రమక్రమముగా పెరుగుచున్నదని చెప్ప వచ్చును. 

కాని చిత్రమేమనగా కొన్నికొన్ని యట్టి కులనామములకు మాత్ర మీ సూచన వర్తించుట లేదని తోడనే స్ఫురించును. నిదానముగ నాలోచించినచో నే కులనామము నకు గాని యీ వాదము గొప్ప విఘాతమును కలిగించినది కాదని నిర్థారణ యగును.

కులనామము లనియే ప్రత్యేకముగా వాదము చేయుటలో నెంత పస యున్నదని ప్రశ్న వేయ వచ్చును.  కులసూచకము లైన నామోపనామముల గోల నటుంచగ నామధేయముల వలన వారివారి మతములును బయటపడుచున్నవి కాదా యని తప్పక ప్రశ్నించ వచ్చును. అట్లు ప్రశ్న వేయువారును కలరు. తోడనే వారికి ఛాందసులని బిరుదము తగిలించబడుట జరుగునే కాని యట్టి ప్రశ్నయందలి సామంజస్యమును గూర్చి యోచించు వారు స్వల్పము. కొందరు బుధ్దిమంతులు వర్తమానకాలమున యోచించు చుండి రనియే తలపోయవలెను. ఏల నన  నట్టివారు తమ మతములను మాత్రము మార్చినను పాతపేర్లను మాత్రము కొనసాగించు చున్నారు.

కాని కులనామములను విసర్జించిన వారు లోకమున మఱియు నరుదు కాదని తెలియవచ్చును. వర్తమాన కాలమున నొకానొక విఖ్యాతుడైన విశ్వవిద్యాలయాచార్యు డీ విధముగా కులనాముమును విసర్జించెను. తప్పక నభినందనీయమగు విషయ మనుటకు సందియ మక్కర లేదు.  మరియు వర్తమానకాలముననే కులనామములను విసర్జించని వారు కోకొల్లలుగా రాజకీయాది సమస్త రంగములను కనిపించుచున్నారు.

కులనామముల నభివృధ్ది నిరోధకములుగా భావించు సమాజమే యైనచో సమాజమున ప్రముఖవ్యక్తు లనేకు లీ బాటలో నడువ వలసి యుండగా వాస్తవము దానికి వ్యత్ర్యస్తముగా నుండుటకు కారణమే మన్నది యాలోచనీయమగు విషయము.  పటాటోపముగా చెప్పవలె నన్నచో, నీ వాదమునకు రావలసినంతటి యాదరణము సమాజమున రాలేదు. డాంబికమును విడచి చెప్పవలయు నన్నచో నీ వాదము మేథావుల మనిపించు కొనుచున్న కొందరి వద్దనే పదిలముగా నున్నది కాని సమాజము దాని నామోదించలేదు.

ఇట్టి మేథావుల చెయుదములు చిత్రముగా నుండును. వారి రచనా చమత్కృతుల యందు గురుజాడ వేంకట అ అప్పారావు పంతులుగారి వద్ద నుండు పంతు లన్న ఉపనామ మెగిరిపోయినది. వారి నామమునకు మరికొంత కత్తిరింపు కూడ జరిగినది. కందుకూరి వీరేశలింగము పంతులు గారికి కూడ నీ గతియే పట్టినది. కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులు గారి పంతులు గిరీ యూడి పోయెనని ప్రత్యేకముగా చెప్పవలయునా?  రఘుపతి వేంకట రత్నం నాయుడు గారి నుండి నాయుడు తొలగించబడినాడు,  మన మేథావులు చేసిన యీ విధమైన  యకాండ తాండవము పుణ్యమా యని పెద్ద లనేకుల పేర్లనుండి, వీలైనచో తలలును కానిచో తప్పనిసరిగ నధమపక్షముగ తోకలును కత్తిరించబడి వారిని నేటి కాలము వారు కష్టము మీద గుర్తించవలసిన పరిస్థితి దాపురించినది.

దీనికి విరుధ్ధమగు పరిస్థితులును నేడు దేశమున కనిపించుచున్నవి. కొన్ని కొన్ని సామాజిక వర్గములవారు తమతమ కులనామములను ఉపనామములుగా తమతమ నామధేయముల తుది నుంచు కొనుట యను సంప్రదాయమునకు తెఱదీసినారు. అనేక వైరుధ్యముల సహవాసము లోకము నందు సహజమగు విషయమే యగుట సర్వులకును విదితమైన సంగతియే గావున దీనికి గాను ఱిచ్చబడవలసినది లేదు.

విషయమునకు వచ్చుటకు ముందింతటి యుపోద్ఘాత మెందు వలన ననగా మన కథాక్రమమందును దీని ప్రసక్తి యుండుట వలన. దివంగతుడైన నాయకుని నామధేయమందు గూడ నొక నుపనామముండెను. ఆ యుపనామము తోడ నతడికి ప్రసిథ్థియు మిక్కిలిగా నమరి యుండెను. కావున దాని నాతడు ప్రాణాధికముగా ప్రేమించు కొనుచుండెడి వాడని చెప్పినచో నిజమునకు బెత్తెడైనను దూరముగ చెప్పినట్లు గాకుండెను. సమవయస్కులును కొందరు వయోధికులును దక్క నూరిలో నత్యధికులకు నాయకుని పరిచయ మాయన యుపనామము తోడనే యగుట వలన నది యాతని వ్యక్తిత్వములో నొక ముఖ్యభాగముగా నుండెను.

కొన్ని కొన్ని పరిస్థితుల ననుసరించి యాయన మతాంతరమును స్వీకరించెను.  వివరముల లోనికి పోవుట వలన కథ కేమియు నుపయోగము లేదు కావున నా విషయము మనకు వర్జ్యము.  క్రొత్తమతము యొక్క పెద్దలెంత యొత్తిడి చేసినను తన వ్యక్తిత్వములో నొక భాగముగా స్థిరపడిన తన యుపనామమును మాత్రము విడచుట కాయన సమ్మతించ లేదు. సరికదా వారి యొత్తిడికి గినిసి తానొక మారు తన మతాంతరస్వీకరణణోద్యోగమునే విరమించుకొనుటకు నిశ్చయించు కొనెను.  మొదలు చెడ్డ బేర మెందుకు కావలయునని యావలి వారును తగినంతగా తగ్గి నిలువవలసి వచ్చెను.  కాని వారికి లోలోన గుఱ్ఱుగనే యుండెను.  పేరునకు మతాంతరు డాయెను కాని లోకమంతయును నాయకుని పూర్వప్రకారమే చలామణిలోనున్న యుపనామము తోడనే సంబోధించుచు నుండిరి. పరమలౌక్యుడగు నాతడును తాను మతము మారినను పూర్వమతము పట్ల నగౌరవము నే మాత్రమును జూపక యథాప్రకారమే వర్తించుట వలన నాయన గౌరవము పెరిగినదే కాని యీషణ్మాత్రమును కగ్గినది కాదు.

గ్రామనామమును మార్చవలెనని క్రొత్తమతము వారే నాయకునకు సూచించి రనియో యొత్తిడి చేసి రనియో ప్రవాదము లేకపోలేదు. అది సత్యమై యుండిన విషయ మాయనకు మాత్రమే తెలియును. తానట్లు చేసినచో తన నితరులు మిక్కిలిగా విమర్శించుటకు తావిచ్చినట్లగు నని భావించి నాయకు డందు కియ్యకొన లేదు.  తన క్రొత్తమతము వారి కోరిక ననుసరించి ప్రార్థనా మందిర మొక దానిని నిర్మించుట జేసెను.  దానికి విశేషముగ ధనమును వ్యయ పరచె ననువారును వ్యయమైన ధనమంతయును క్రొత్తమతము వారే భరించిరి కాని చేతిచమురు వదల్చు కొనుటకు నాయకుడు మూర్ఖుడా యను వారును కూడ చుట్టుప్రక్కల చెరిసగముగా నున్నారు. అది యట్లుంచగా సర్వాంగసుందరమైన ప్రార్థనామందిరము మాత్రము జనులను విశేషముగ నాకర్షించినదని చెప్పక తీరదు.

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఛానెళ్ళపై నిషేధం ఎత్తివేత గురించిన ఒక టపా పై స్పందన


వారు నిషేధం ఎత్తేయమని విజ్ఞప్తి చేయటం వరకూ బాగానే ఉంది. కాని ఆ వ్యాసం ధోరణి నాకైతే నచ్చలేదు.  ఒక వ్యాఖ్య చేదామని మొదలుపెడితే అది చాలా పెద్దదైపోయింది. అందుచేత నా పాత అలవాటు ప్రకారం, దాని ఇక్కడ ఒక విడి టపాగా ఇస్తున్నాను. కాని ఇక్కడ నుండి అంతా ఆ టపాను ఉద్దేశించే వ్రాయటం జరుగుతుంది.

తెలుగుమీడియా కబుర్ల వారూ -

మీ వ్యాసంలో కూడా అనేక అభ్యంతరకరమైన విషయాలున్నాయి. ఈ సంగతి మీకు స్పష్టంగా తెలిసే ఈ‌ వ్యాసం వ్రాసారని విశ్వసిస్తున్నాను.

మొట్ట మొదటిది, "సీఎం. కేసీఆర్ గారూ..ఇకచాలు నిషేధం ఎత్తేయరూ.." అన్నశీర్షిక.. ఈ శీర్షికను చూస్తే

- ఎత్తేయరూ అని  వేడికోలు దేకికి? కేసీఆర్‌గారు సీఎం హోదాలోనే కొన్నిఛానెళ్ళమీద నిషేధిం విధించారని మీరు నిర్థారిస్తున్నారు. కానీ దీన్ని ప్రభుత్వం ఎంతమాత్రం ఒప్పుకోవటం‌ లేదు. అటువంటప్పుడు తాము చేయని నిషేధాన్ని తాము ఎట్లా తొలగిస్తారూ కెసీఆర్‌గారు?

- మీడియా అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి నడుస్తోందనో నడవాలనో మీరు తీర్మానం చేసేస్తున్నారు. ఇది సబబా? మీడియా అంటే సర్కారీ‌మీడియా అని అర్థం తీయవచ్చునా? నిషేధించే అదికారం ఉందంటే దానికి ముందే అనుమతించే దొరతనమూ ఉండాలి కదా? అలా  మీడియాను అనుమతించటం, నిషేధించటం సర్కారువారి యిష్టారాజ్యం అని జర్నలిష్టులే అంటే ఎలా?

-ఇకచాలు అన్న మాట ఎందుకు వాడారండీ? అంటే నిషేధం అనేది మౌలికంగా సరైన చర్య అనే మీరు తీర్పు ఇచ్చేస్తున్నారు. సరైన శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ప్రభుత్వానికి క్షమాభిక్ష కోసం అర్థింపుపత్రం పంపుకుంటున్నట్లుగా ఉంది మీ ధోరణి. ఈ నిషేధం మీద మీకు సానుకూలమైన అభిప్రాయం ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.

ఈ రెండు ఛానెల్స్ ను బ్లాక్ చేసినందుకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనేది నమ్మాల్సిన సత్యం అని మీరు సెలవిచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత లేదూ అని ప్రభుత్వం రోజూ చేస్తున్న ప్రచారాన్నే మీరూ ఈరోజు చేస్తున్నారు. ఉద్యమాల పేరుతో కొందరు రాజకీయులు ప్రజల్ని విజయవంతంగానో కొండొకచో బలవంతంగానో వీధుల్లోకి ఈడ్చి అల్లర్లు సృష్టించినట్లుగా ఈ ఛానెళ్ళవాళ్ళు ప్రజల్ని సమీకరించి వీధిపోరాటాలు చేయించలేదు కాబట్టి వ్యతిరేకత ఏమీ లేదని మీ తీర్మానమా?

నిషేధం విధించడం ఈ కాలమాన పరిస్థితులు, ముఖ్యమంత్రి మొండితనం నేపథ్యంలో ఒక భయంకరమైన విషయమేమీ కాదని మీ‌ అభిభాషణ చూస్తే మీరు ఈ నిషేధం పట్ల సానుకూలంగా ఉన్నారని మీరే ప్రకటిస్తున్నట్లు వెల్లడి అవుతోంది. మీడియాపై నిషేధం‌ భయంకరమైన విషయమే అని మీ వృత్తిలో వారికి తెలియదని అనుకునే అమాయకత్వంలో లేను. నిషేధం నేడు రెండు ఛానెళ్ళమీదనైనా రేపు మరిన్నో మొత్తం ప్రభుత్వేతర ఛానెళ్ళన్నిటిమీదనో అయ్యే అవకాశం లేదా? తోటకూర దొంగిలించిన నాడే బుధ్ధి చెప్పాలన్న ఇంగితం మీకెందుకు లేదు?

ఈ అంశం మీద కవిత, వినోద్ వెళ్లి డిస్కషన్స్ లో పాల్గొనడమే పెద్ద తప్పు. ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడి జర్నలిస్టులపై నోరు పారేసుకుని బద్నాం అయ్యారు  ఆహా! ఎం చెప్పారండీ? వాళ్ళు తమ పక్షాన సరైన వాదన వినిపించలేక పోవటం జరిగిందా లేక వారి దగ్గర సరైన వాదనే లేదా? ఏది నిజమో మీకు తెలీదా?  పైగా ముఖ్యమంత్రి ట్రాప్‌లో పడటం ఏమిటీ? శాంతియుతంగా జర్నలిష్టులు మౌననిరసన చేస్తుంటే అది ఒక ట్రాప్ ఎలా అయిందీ? అలా ఎందుకయిందీ?  అయన పక్షంలో ఏ లోసుగూ లేకుంటే ఆయనకు ఇబ్బంది ఏముండిందీ? ఆయన్ను బద్నాం చేసింది ఏదన్నా ఉందంటే అది ఆయన సంస్కారహీనమైన నోరే కాని మరేదీ కాదని మీకూ‌ చక్కగా తెలుసును.

మనోళ్ళను పట్టుకుని మనమే పది కిలోమీటర్ల లోతులో బొంద పెడతామనడం కరెక్టుగా లేదు అనటం సరైనదేనా?  మీ‌ ధోరణి చూసి ఈ‌ముక్క అనక తప్పదు. మనోళ్ళు కాని జర్నలిష్టులను అలా బొందపెట్టినా మీ‌కు అభ్యంతరం లేదన్న మాట!

మీడియా కోసం ఒక ప్రవర్తనా నియమావళి అర్జెంటుగా రూపొందించాలని మీరన్నది తీవ్రమైన మాట. మీ అభిభాషణ లన్నింటిలోను‌ తీవ్రాతితీవ్రమైన సంగతి. మీడియాకు ప్రభుత్వాలు ప్రవర్తనా నియమావళిని ఇవ్వటం అంటే ప్రభుత్వం అభిమతానికి అనుగుణంగా తాళం వేయవలసిందే తప్ప, మరో దారి లేదు మీకూ అని మీడియాకు ప్రభుత్వం స్పష్టంగా హుకుం జారీ చేయటమే.

జర్నలిజం అంటే ఒక దగుల్బాజీ వృత్తి కాదని, సామాజిక గురుతర బాధ్యత అన్న మెసేజ్ వెళ్ళేలా చేయాలి.  ఆ మాట నిజమే. అలాంటి పరిస్థితి తప్పక రావాలనే కొరుకుందాం. కాని ఎలా వెడుతుందండీ అలాంటి మెసేజీ? ఇలా అదే వృత్తిలో ఉన్నవారే వృత్తిగౌరవం గురించి తెలిసీ తెలియని చిత్రమైన మాటలు వ్రాస్తుంటే. 

ఇకపోతే ఒక మాట చెప్పాలి. జర్నలిజం ప్రమాణాలు క్షీణించటానికి కారణం మీరన్నటు త్రికా స్వేఛ్చ అంటే... యజమానుల స్వేఛ్చ కాదు. జర్నలిస్టుల స్వేఛ్చ, స్వాత్రంత్రాలు అన్న స్పృహ లోపించటమే. ఐనా, ఛానెల్స్ కు ఒక ఝలక్ అవసరమైన సమయంలోనే ఇది జరిగిందని మీ రనటం‌ హర్షించలేక పోతున్నాను. ఇది ఒక రకంగా మంచి పరిణామం అని మీలా అనుకోలేను. ఎమర్జన్సీలోనూ‌ మీడియాకు ఘట్టి దెబ్బలే తగిలాయి.  ఇప్పుడు కూడా ఘట్టి దెబ్బే తగిలింది. రెండుసార్లూ ప్రభుత్వాలే ఆ దెబ్బలు వేసాయి. రెండు సార్లూ అవసరమైన దెబ్బలే అని ఆయా ప్రభుత్వాలు సమర్థించుకున్నాయి కూడా.  ముందు ముందు మరికొన్ని రాష్ట్రప్రభుత్వాలూ ఇలాంటి దెబ్బలు వేస్తాయి మీడియా మీద ఇప్పు డది సరిగ్గా స్పందించకపోతే. ఇది కూడా ఒక అనుశాసన పర్వం అని మీరూ పాపం ఆప్పట్లో వినోబాభావే గారి లాగే అపోహలో కూరుకు పోతే ఎలా? దయచేసి ఆలోచించండి. 

నాకు రాజకీయాలపైన స్పందించాలన్న ఆసక్తి లేదు.  కాని ఇది రాజకీయవిషయం కాదు. పత్రికాస్వేఛ్చ విషయం. ఒక ప్రజాస్వామ్య మూలస్థంభం యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అతిముఖ్యమైన విషయం. అందుకే చాలా అయిష్టంగానే తప్పనిసరి పరిస్థితిలో ఈ టపా వ్రాయవలసి వచ్చింది.

11, సెప్టెంబర్ 2014, గురువారం

ఒక ఊరి కథ. - 1

ఇది యొక యూరి కథ.  ఊరనగా విశేషముగా చెప్పుకొన దగినంతటి గొప్ప విస్తీర్ణము గాని జనసంఖ్య గాని గల యూరు కానే కాదు. నిజమున కది విద్యావైద్యాదిసౌకర్యముల కైనను సరిగా నోచుకొనని చిన్న యూరు. మరియు నింత చిన్నదైన యూరిని గూర్చి యొక కథ దేనికని యడుగ వచ్చును. చెప్పుకొన వలసిన కథ యున్నది కనుకనే దానిని గూర్చి చెప్పుట. దేని కని చెప్పుకొన వలయు ననగా విను వారికి దానివలన ప్రయోజనము విశేషముగా నుండుట వలన. ఈ నాటి వారి దృష్టిలో ప్రయోజన మనగా నార్థికమైన ప్రయోజనమో రాజకీయమైన ప్రయోజనమో యగుటయే ప్రయోజనము కాని మిగిలినవి ప్రయోజనములుగా గనుపించుటయే లేదు. పారమార్థికమైన ప్రయోజనమనగా వినువా రొక్కరైనను కనుపించుట దుర్లభముగా నున్నది. కనుక దీనిని చెప్పుకొనట వలన నేర్పడు ప్రయోజనమును గూర్చి ముందుగనే యుపన్యసించుట వట్టి కంఠశోష మాత్రమే యనుట నటు లుంచగా కార్యహాని యని కూడ తెలియవచ్చు చున్నది. 

ఊరి కేముండినను లేకున్నను దాని కొక పేరు మాత్ర ముండక తీరదు కదా. ఈ యూరిపేరు శివపురము. ఈ మధ్య కొందరు దానినే శివాపురమని పలుకుచున్నారు. 

ఈ పేరునకు కూడ రోజులు మూడినట్లుగా వార్తలు పుట్టుచున్నవి. ఇంత చిన్న యూరిలో జన్మించి యున్నత స్థానముల కెగబ్రాకిన రాజకీయనాయకు డొకడు మొన్నమొన్ననే కాలము చేయుట జరిగినది. ఈ నాటి ధోరణుల కనుకూలముగా నీ యూరి పేరును మార్చి యాయన పేరుతో దీని నలంకరించవలె నని పెద్దమనుష్యులు కొందరు వాదములు చేయుట మొదలు పెట్టినారు. వారు చెప్పు ప్రధానమైన కారణమేమనగా నీ యూరికి శివాపురమని పేరున్న నుండవచ్చును కాని యిచ్చట నున్న చిన్న శివాలయమునకు పౌరాణిక ప్రశస్తి కాని చారిత్రక ప్రశస్తి కాని యున్న జాడలు లేవు. కాబట్టి తమ యూరికి పేరు మార్చుటకు నెవ్వరికి గాని యభ్యంతర ముండ నక్కర లేదు. ఈ కారణమును ప్రక్కన బెట్టి యాలోచించువారికి మరియొక కారణము ప్రధానముగా తోచవచ్చును. కాలముచేసిన నాయకుడు కొన్నేళ్ళ క్రిందట సకుటుంబముగా మతమును మార్చుకొనెను. క్రొత్తమతమును వ్యాప్తిచేయుటకు కావచ్చును లేదా తమ సౌకర్యార్థము కావచ్చును తానొక నూతన ప్రార్థనామందిరమును సర్వాంగసుందరముగా నిర్మించెను. ఇది కొందరికి నచ్చలేదు. కాని వారి వద్ద పెద్దగా సొమ్ముకాని పలుకుబడి కాని లేవు కావున నిమ్మకు నీరెత్తినట్లుగా నూరకుండిరి. మరికొందరికి హర్షదాయకమైనది. వారివద్ద సొమ్ములున్నవి. వారికి చుట్టుపక్కల మిక్కిలి పలుకుబడి యున్నది. అందుచేత నీ యూరి పేరు నేడో రేపో మారుట తథ్యమనియే పెద్ద వదంతిగా నున్నది. ఈ సోది యంతయు నెందుకనగా దానికి మన కథతో సంబంధ ముండుట వలన.

చిత్రమేమనగా చనిపోయిన నాయకుడు తన యూరికి చేసిన మేలని యొక్కటి కూడ చెప్పుకొనుటకు లేదు. ఈ మాటను లోలోన గొణుగుకొను వారే కాని బయటకు చెప్పువా రెవరును లేరనియే చెప్పవచ్చును. ఒక గొప్ప నాయకుడు తమ యూరిలో పుట్టుటయే గౌరవమని భావించువారు దండిగా నున్న సమాజములో కాదని వారిని యొప్పించగల ధీరు లెవరుందురు.  

ఈ శషభిషలకు తెఱదించు సంఘటన యొకటి మెన్నమొన్ననే జరిగినది. క్రొత్త ప్రార్థనామందిరము పైభాగ మందు కొలువుదీరిన ఫలకములో గ్రామనామము మార్పు చేయుబడినది. 

ఈ మార్పు నచ్చిన వారికి నచ్చినది. నచ్చని వారి నచ్చలేదు దానికేమి యనుటకు వీలు లేదు. నచ్చని వారిలో ప్రముఖుడు దివంగత నాయకుని పెద్దకుమారుడు. అతడొక పేరు సూచించగా దాని కెవరో కొంత మార్పు చేసి ఫలకమును వ్రాయించి మందిరము పైకెక్కించిరి. అత డగ్గిమీద గుగ్గిలమన్నట్లు లేచెను.


(సశేషం)

1, సెప్టెంబర్ 2014, సోమవారం

బాపూరమణీయం

ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
రాత గీత భువిని రాజ్యమేలె
రాత నిన్న చనెను గీత నేడు చనెను
రాత గీత దివిని రాజ్యమేలు

కం. రావోయీ బాపూ అని
తా వాత్సల్యంబు మీఱ దశరథసుతుడా
కైవల్యము నిచ్చుటకై
రావించుకొనెను రమణను రమ్మన్నట్లులే

ఆ.వె. బాపు రమణ లేని వసుధనే మెచ్చడు
రమణ బాపు లేక రమణ కాడు
రమణ ముందుగానె రాముని చేరగా
బాపు చేరె రామ పాద మిపుడు

శా. ఓ బాపూ భవదీయమైన తను 
వీ యుర్విన్ విసర్జించినన్
నీ బొమ్మల్ తెలుగిళ్లకిచ్చితివి 

పోని మ్మంతియే చాలులే
నీ బంగారు కలంబు చూపగల 

వన్నెల్ చిన్నెలున్ స్వర్గమం
దే బాగొప్పగ నాంధ్రమాత 

యశమున్ హెచ్చింపగా వెల్గుమా


(పై బొమ్మ ఆంధ్రజ్యోతివారి సౌజన్యంతో)