30, సెప్టెంబర్ 2014, మంగళవారం

సౌందర్యలహరి - 6 ధనుః పౌష్పం ...



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


6

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరుదాయోధనరథః 
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే 


గత శ్లోకంలో విష్ణువు గురించీ మన్మథుడి గురించీ‌ప్రసక్తి వచ్చింది. ఇక్కడ కొంచెం విపులీకరిస్తున్నారు ఆచార్యులవారు.
     
శ్రీమన్నారాయణుడు జగన్మోహనకరమైన మోహినీ అవతారాన్ని ధరించాడూ అంటే అందులో ఆశ్చ్యర్య పోవలసింది ఏమీ లేదు.  అమ్మవారు శ్రీమహావిష్నువుకు చెల్లెలుగా ప్రతీతి.  అందుకే ఆవిడను నారాయణి అని కూడా అంటారు.  అలాగే వైష్ణవి అని కూడా అంటారు. అందుచేత అన్నగారిమీద అభిమానంతో ఆవిడ ఆయనకు తనరూపసౌందర్యవిశేషంలో లేశమాత్రం ప్రసాదించి దానితో ఆయన గడబిడ సృష్టించి రాక్షసలోకాన్ని మోహపెట్టటానికి సాయపడింది. శ్రీ నారాయణతీర్థులవారి తరంగాలను వినే ఉంటారనుకుంటాను.  అందులో‌ ఒకటి జయ జయ వైష్ణవి దుర్గే అన్నది వినే ఉంటారు కదా.  అలాగే‌ సుప్రసిథ్థమైన సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్న దేవీ స్తుతిశ్లోకం జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆయన్ను అమ్మవారు అనుగ్రహించటంలో ఇబ్బంది ఏమీ లేదు.  అయన స్వయంగా మహాసమర్థుడు. అవసరమైన చోట చెల్లెలుగారూ బాగానే సహాయ పడ్డారు. చాలా బాగుంది. అందుచేత విష్ణువు విషయంలో ప్రత్యేకించి విడమరచి చెప్పవలసింది ఏమీ‌ లేదు.

మరి మన్మథుడు కూడా అమ్మవారి భక్తుడేనూ ఆయన ఆవిడ అనుగ్రహంతో లోకాల్ని కల్లోలపరుస్తూ ఉంటాడు నిత్యం అన్నారు కదా గత శ్లోకంలో శ్రీశంకరులు.  అదేలాగూ అని అనుమానం వస్తుంది.  అసలీ మన్మథుడు కనీసం తనకంటూ ఒక శరీరం కూడా లేనివా డాయెను. ఏదో అమ్మవారి దయ కారణంగా తన భార్య ఐన రతీదేవికి మాత్రం పూర్వరూపంలో కనిపించగలడు.  అంతే.  అటువంటి మన్మథుడికి లోకవిజేత అయ్యే‌ పరాక్రమం ఎలా వచ్చిందీ అన్నది ఈ శ్లోకంలో చెబుతున్నారు.

ఈ‌ మన్మథుడికి ఉన్న పరికరకరాలూ పరివారమూ గురించి చూడండి మొదట.  అవెంత అవుకు సరుకో -

ఆయన విల్లు చెఱుకు గడ.  మహ గొప్పగా ఉంది. ఏ మంత గట్టి విల్లంటారు?

ఆ గొప్ప వింటికి అల్లెత్రాడు అదే నండీ నారి.  అదేమిటంటే తుమ్మెదల బారు అట.  ఇది మరీ‌ బాగుంది.  తుమ్మెదలు వరసకట్టట మేమిటీ, ఆ వరసను ఆయన లాగి బాణాలు వేయట మేమిటీ?

ఆ బాణాలు కూడా ఎటువంటి వనుకున్నారు?  పూలబాణాలు. పూలు విసిరితే ఎవరికన్నా దెబ్బ తగులుతుందా?

ఐనా అవెన్ని బాణాలని?  అయిదే అయిదట.  లోకం మీదే  విజయం సాధించే మొనగాడికి కేవలం ఐదు బాణాలతో గెలుపా? అదెలా సాధ్య మండీ?

యుధ్ధానికి బాగానే తయ్యారయ్యా డయ్యా, ఇంతకూ ఆయనకు సహాయపడే వాళ్ళన్నా కాస్త సరైనా వాళ్ళా అని అడగుతారు కదా?  ఆయనకు తోడు వసంతుడు. అంటే వసంత ఋతువు. అది నిలకడ గలదా? ఏదాదిలో అది ఉండేదే రెండే రెండు నెలలాయె. మిగతా కాలం అంతా ఎక్కడికి పోయేది తెలియదు.

ఆయనకు మంచి రధమైనా ఉందా? అబ్బే లేదండి. మలయానిలం అంటే కొండగాలి ఆయనకు ఉన్న గొప్ప రథం.  అదెప్పుడు ఎటు వీస్తుందే ఎవడికీ తెలియదాయె.  దాని మీదనా యుధ్ధానికి పోవటం.  అదీ లోకాన్నంతా గెలిచెయ్యటమూ?  ఎలా కుదురుతుందీ?

ఇంత అవకతవక యుధ్దసామగ్రీ, ఇలాంటి నిలకడలేని చెలికాని తోడూ వేసుకొని మన్మథుడు ఎలా లోకవిజయం చేసేస్తున్నాడూ అంటే దానికి బలమైన కారణం ఉందట.

శ్రీ‌శంకరులు అమ్మతో అంటూన్నారూ, తల్లీ, హిమగిరితనయా, నీ దయ ఉంటే మన్మథుడు లోకవిజేత కావటంలో కష్టం ఏముందమ్మా!  ఆయన నమ్ముకున్నది ఆ సన్నాహాని కాదు నీ దయనే. 

ఆ మన్మథఋషి నిన్ను సేవించి నీ‌ కటాక్షం వల్ల నీ‌ కడగంటి చూపుకు నోచుకున్నాడు కదమ్మా.  ఆయన కున్న ఏకైన బలం అదే.  ఆ నీ కొనకంటి చూపు ఇచ్చిన బలంతోనే మన్మథుడు ఈ లోకాన్ని ఇష్టారాజ్యంగా జయిస్తున్నాడు.

ఇక్కడ శ్రీశంకరులు చమత్కారంగా చెబుతున్నది అర్థమైనది కదా.  అమ్మ దయ ఉంటే చాలు, ఎంత అవకతవక వ్యక్తికీ, ఎంత అసమర్థుడైన వ్యక్తికీ, ఎంత దుస్థితిలో ఉన్నవాడికీ ఏ మాత్రమూ భయం లేదు.  విజయం తనదే.  అమ్మ దయ ఉన్నవాళ్ళ ముందు సమస్తలోకమూ దాసోహం కావలసిందే.

అమ్మ ఒక్క సారి క్రీగంటి చూపుతో అనుగ్రహిస్తే చాలు!

ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఐదువందలసార్లు పారాయణం చేస్తే ఫలితం వంశాభివృధ్ధి.  నైవేద్యం చెఱకుముక్కలు.




5 కామెంట్‌లు:

  1. శంకరులు ఒక మాట చెప్పేరు కదా! మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిం, అమ్మ దయుంటే అసాధ్యమేముంది.

    ఒక చిన్న మనవి. ఇదేంట్రా ఇలా పట్టుకున్నాడు అనుకోకపోతే....
    శ్లోకమూ దానికింద అర్ధమూ రాసిన తరవాత వ్యాఖ్య రాస్తే మా లాటి బోంట్లకి మరి కొద్దిగా సుకరంగా ఉంటుందేమో నని.....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా బాగుంటుంది. ఐతే ఈ‌ రోజుల్లో‌ చాలా మందికి సంస్కృతశ్లోకమైనా తెలుగుపద్యమైనా ప్రతిపదార్థతాత్పర్యాలు తెలుసుకోవటంపై పెద్దగా ఆసక్తి ఉండటం లేదు. శ్లోకభావాన్ని విపులీకరిస్తే కొంతలో కొంతగా పట్టుకుని ఆనందిస్తున్నారు. అర్థతాత్పర్యాలు కనిపించగానే ఇదంతా ఏదో తెలుగుపాఠంలా ఉందని కొంచెం‌ జంకుతున్నారు చదవటానికి. ఈ‌ అభిప్రాయం కారణంగా నేను కేవలం భావవిపులీకరణం మాత్రమే చేస్తున్నాను, మీ‌ రన్నట్లు క్లుప్తంగా అర్థతాత్పర్యాలు జతచేయటం కూడా చేస్తాను. ఐతే శ్రీశంకరుల శ్లోకంలో చమత్కారం కొంచెం సస్పెన్స్ ఉంచి చెబుతేనే బాగా మనసుకు పట్టే అవకాశం ఉంది. అదికూడా దృష్టిలో‌ ఉంచుకోవాలి.

      తొలగించండి
  2. మౌర్వీమధుకరమయీ.. గుప్త ప్రణవం దాగిన చోటు... ఈ శ్లోకం బాగా పారాయణ చేస్తే అశక్తుడనన్న భావన సాధకుడికి పోయి చేయవలసిన కార్యాన్ని నిర్వహించగలిగే శక్తిని అమ్మవారు దయతో ఇచ్చి కార్యం నిర్వహించాడు అన్న లోకకీర్తినీ కట్టబెడుతుందట! ఏమిటో అప్పుడలా ఉండేవాడు వాడే ఇంత కార్యం సాధించాడా అని అందరూ నోళ్ళెళ్ళపెడతారట!

    ధన్యవాదాలండీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేంద్రగారూ, ధన్యవాదాలు. ఈ వ్యాఖ్యానం ముఖ్యంగా సాధారణ పాఠకుల కోసం వ్రాస్తున్నది. వీలైనంత వరకూ శ్రీవిద్యావిశేషాంశాల ప్రస్తావనను ఉద్దేశపూర్వకంగా విడువటం జరుగుతున్నది. మొదట పాఠకులకు శ్రధ్ధ-భక్తి అనేవి కుదిరాక శాస్త్రీయాంశాలలోతుల గురించి ప్రస్తావించటం ప్రయోజనకరం అనుకుంటాను. అందుకే అనేక సంగతులు ఇక్కడ ప్రస్తావింఛటం లేదు. శ్రివిద్యారహస్యం ఈ స్తోత్రంలో అణువణువునా దాగి ఉన్నా మనం సులభంగా చెప్పుకోవటం కష్టం కూడా.

      తొలగించండి
    2. అవునండీ, మీరు చెప్పింది నిజమే... శ్లోకం చదివిన ఆనందంలో వ్రాయటం జరిగింది, శ్లోక వైభవాన్ని ఒక సారి స్ఫురించడంకోసం తప్ప మంత్రాలను బహిర్గతం చేయడం కోసం మాత్రం కాదు! తగు జాగ్రత్త తీసుకుంటాను..

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.