15, సెప్టెంబర్ 2014, సోమవారం

ఒక ఊరి కథ. - 2

ఆంధ్రదేశమున నూఱేండ్లకు పైచిలుకు కాలమున జి.వి.అప్పారావు గారని యొక గొప్ప నాటకరచయిత యుండుట తటస్థించెను. అట్లే మరియొక గొప్ప వ్యక్తి కె.వి.లింగం గారును నాటి కాలమున ప్రసిధ్ధులై యుండెడు వారు.  చదువరులు వారిద్ద రెవరైనది గురుతు పట్ట గలిగినచో నది సంతోషించ దగిన విషయము.

మన ప్రాంతములో వ్యక్తుల పేర్లకు చివరగా శర్మ, శాస్త్రి, నాయుడు, పంతులు, చౌదరి మున్నగు నుపనామధేయములు విరివిగా కనబడు చుండెడివి. కాని కొంతకాలమునుండి యిట్టి యుపనామములు కులసూచకములు గావున వాటిని ప్రయోగించుట నేటి కాలమున ననుచితమను నొక గొప్ప వాదము ప్రచురమై యున్నది. కావున నట్టి కులనామములను విడచి పుచ్చవలెనని భావించువారి సంఖ్య క్రమక్రమముగా పెరుగుచున్నదని చెప్ప వచ్చును. 

కాని చిత్రమేమనగా కొన్నికొన్ని యట్టి కులనామములకు మాత్ర మీ సూచన వర్తించుట లేదని తోడనే స్ఫురించును. నిదానముగ నాలోచించినచో నే కులనామము నకు గాని యీ వాదము గొప్ప విఘాతమును కలిగించినది కాదని నిర్థారణ యగును.

కులనామము లనియే ప్రత్యేకముగా వాదము చేయుటలో నెంత పస యున్నదని ప్రశ్న వేయ వచ్చును.  కులసూచకము లైన నామోపనామముల గోల నటుంచగ నామధేయముల వలన వారివారి మతములును బయటపడుచున్నవి కాదా యని తప్పక ప్రశ్నించ వచ్చును. అట్లు ప్రశ్న వేయువారును కలరు. తోడనే వారికి ఛాందసులని బిరుదము తగిలించబడుట జరుగునే కాని యట్టి ప్రశ్నయందలి సామంజస్యమును గూర్చి యోచించు వారు స్వల్పము. కొందరు బుధ్దిమంతులు వర్తమానకాలమున యోచించు చుండి రనియే తలపోయవలెను. ఏల నన  నట్టివారు తమ మతములను మాత్రము మార్చినను పాతపేర్లను మాత్రము కొనసాగించు చున్నారు.

కాని కులనామములను విసర్జించిన వారు లోకమున మఱియు నరుదు కాదని తెలియవచ్చును. వర్తమాన కాలమున నొకానొక విఖ్యాతుడైన విశ్వవిద్యాలయాచార్యు డీ విధముగా కులనాముమును విసర్జించెను. తప్పక నభినందనీయమగు విషయ మనుటకు సందియ మక్కర లేదు.  మరియు వర్తమానకాలముననే కులనామములను విసర్జించని వారు కోకొల్లలుగా రాజకీయాది సమస్త రంగములను కనిపించుచున్నారు.

కులనామముల నభివృధ్ది నిరోధకములుగా భావించు సమాజమే యైనచో సమాజమున ప్రముఖవ్యక్తు లనేకు లీ బాటలో నడువ వలసి యుండగా వాస్తవము దానికి వ్యత్ర్యస్తముగా నుండుటకు కారణమే మన్నది యాలోచనీయమగు విషయము.  పటాటోపముగా చెప్పవలె నన్నచో, నీ వాదమునకు రావలసినంతటి యాదరణము సమాజమున రాలేదు. డాంబికమును విడచి చెప్పవలయు నన్నచో నీ వాదము మేథావుల మనిపించు కొనుచున్న కొందరి వద్దనే పదిలముగా నున్నది కాని సమాజము దాని నామోదించలేదు.

ఇట్టి మేథావుల చెయుదములు చిత్రముగా నుండును. వారి రచనా చమత్కృతుల యందు గురుజాడ వేంకట అ అప్పారావు పంతులుగారి వద్ద నుండు పంతు లన్న ఉపనామ మెగిరిపోయినది. వారి నామమునకు మరికొంత కత్తిరింపు కూడ జరిగినది. కందుకూరి వీరేశలింగము పంతులు గారికి కూడ నీ గతియే పట్టినది. కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులు గారి పంతులు గిరీ యూడి పోయెనని ప్రత్యేకముగా చెప్పవలయునా?  రఘుపతి వేంకట రత్నం నాయుడు గారి నుండి నాయుడు తొలగించబడినాడు,  మన మేథావులు చేసిన యీ విధమైన  యకాండ తాండవము పుణ్యమా యని పెద్ద లనేకుల పేర్లనుండి, వీలైనచో తలలును కానిచో తప్పనిసరిగ నధమపక్షముగ తోకలును కత్తిరించబడి వారిని నేటి కాలము వారు కష్టము మీద గుర్తించవలసిన పరిస్థితి దాపురించినది.

దీనికి విరుధ్ధమగు పరిస్థితులును నేడు దేశమున కనిపించుచున్నవి. కొన్ని కొన్ని సామాజిక వర్గములవారు తమతమ కులనామములను ఉపనామములుగా తమతమ నామధేయముల తుది నుంచు కొనుట యను సంప్రదాయమునకు తెఱదీసినారు. అనేక వైరుధ్యముల సహవాసము లోకము నందు సహజమగు విషయమే యగుట సర్వులకును విదితమైన సంగతియే గావున దీనికి గాను ఱిచ్చబడవలసినది లేదు.

విషయమునకు వచ్చుటకు ముందింతటి యుపోద్ఘాత మెందు వలన ననగా మన కథాక్రమమందును దీని ప్రసక్తి యుండుట వలన. దివంగతుడైన నాయకుని నామధేయమందు గూడ నొక నుపనామముండెను. ఆ యుపనామము తోడ నతడికి ప్రసిథ్థియు మిక్కిలిగా నమరి యుండెను. కావున దాని నాతడు ప్రాణాధికముగా ప్రేమించు కొనుచుండెడి వాడని చెప్పినచో నిజమునకు బెత్తెడైనను దూరముగ చెప్పినట్లు గాకుండెను. సమవయస్కులును కొందరు వయోధికులును దక్క నూరిలో నత్యధికులకు నాయకుని పరిచయ మాయన యుపనామము తోడనే యగుట వలన నది యాతని వ్యక్తిత్వములో నొక ముఖ్యభాగముగా నుండెను.

కొన్ని కొన్ని పరిస్థితుల ననుసరించి యాయన మతాంతరమును స్వీకరించెను.  వివరముల లోనికి పోవుట వలన కథ కేమియు నుపయోగము లేదు కావున నా విషయము మనకు వర్జ్యము.  క్రొత్తమతము యొక్క పెద్దలెంత యొత్తిడి చేసినను తన వ్యక్తిత్వములో నొక భాగముగా స్థిరపడిన తన యుపనామమును మాత్రము విడచుట కాయన సమ్మతించ లేదు. సరికదా వారి యొత్తిడికి గినిసి తానొక మారు తన మతాంతరస్వీకరణణోద్యోగమునే విరమించుకొనుటకు నిశ్చయించు కొనెను.  మొదలు చెడ్డ బేర మెందుకు కావలయునని యావలి వారును తగినంతగా తగ్గి నిలువవలసి వచ్చెను.  కాని వారికి లోలోన గుఱ్ఱుగనే యుండెను.  పేరునకు మతాంతరు డాయెను కాని లోకమంతయును నాయకుని పూర్వప్రకారమే చలామణిలోనున్న యుపనామము తోడనే సంబోధించుచు నుండిరి. పరమలౌక్యుడగు నాతడును తాను మతము మారినను పూర్వమతము పట్ల నగౌరవము నే మాత్రమును జూపక యథాప్రకారమే వర్తించుట వలన నాయన గౌరవము పెరిగినదే కాని యీషణ్మాత్రమును కగ్గినది కాదు.

గ్రామనామమును మార్చవలెనని క్రొత్తమతము వారే నాయకునకు సూచించి రనియో యొత్తిడి చేసి రనియో ప్రవాదము లేకపోలేదు. అది సత్యమై యుండిన విషయ మాయనకు మాత్రమే తెలియును. తానట్లు చేసినచో తన నితరులు మిక్కిలిగా విమర్శించుటకు తావిచ్చినట్లగు నని భావించి నాయకు డందు కియ్యకొన లేదు.  తన క్రొత్తమతము వారి కోరిక ననుసరించి ప్రార్థనా మందిర మొక దానిని నిర్మించుట జేసెను.  దానికి విశేషముగ ధనమును వ్యయ పరచె ననువారును వ్యయమైన ధనమంతయును క్రొత్తమతము వారే భరించిరి కాని చేతిచమురు వదల్చు కొనుటకు నాయకుడు మూర్ఖుడా యను వారును కూడ చుట్టుప్రక్కల చెరిసగముగా నున్నారు. అది యట్లుంచగా సర్వాంగసుందరమైన ప్రార్థనామందిరము మాత్రము జనులను విశేషముగ నాకర్షించినదని చెప్పక తీరదు.

2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. రావుగారికి నమస్కారములు.

      ఈ‌శైలిలో కథాసంవిధాన మిట్లే యుండును. అట్లని కథనుండి దూరముగా జరుగుట లేదు. ఇది యొక యూరి కథయనగా నొక యూరిలో‌ జరిగిన కొన్ని పరిణామముల గురించిన సంగతులును వాటి నేపథ్యమును గూర్చి కించిద్దీర్ఘములైన ప్రసక్తులును వివరించబడుట యనివార్యమై యుండును. తత్కారణముగ కథపాకమునకు వచ్చువరకు కొంత విహంగవీక్షణము జరుగును. ప్రతి ప్రకటనుమున కొంత కథాభాగమును, కొంతగ పరిస్థితులను గూర్చిన చర్చయు, కొంతగ మానవస్వభావాదికముల చిత్రణమును సాధారణమై యుండును.

      మీరీ‌ కథ నాదరనముతో చదువుచుంటి రందులకు ధన్యవాదములు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.