౩
అవిద్యానామంత స్తిమిర మిహిరోద్దీపనకరీ
జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతి ఝరీ
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి
అమ్మ పాదధూళికణం మహిమను శ్రీశంకరాచార్యులవారు మరింతగా వర్ణిస్తున్నారు.
ఇంతకు ముందు తనీయాంసం పాంసుమ్ అనే శ్లోకంలో బ్రహ్మవిష్ణుమహేశ్వరులకూ అమ్మవారి పాదధూళికణమే ఏ విధంగా సృష్టిని నిర్వహించేందుకు సమర్థత నిస్తోందో చెప్పారు కదా.
ఇప్పుడు ఈ సృష్టికి అధిపతులైన వారికేనా అమ్మ యొక్క అనుగ్రహం? అందులో ఉన్న మనబోటి వారి సంగతేమిటీ అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకాన్ని వ్రాస్తున్నారు.
ఈ సృష్టిలో ఉన్న మనం పామరులం. అంటే తత్త్వజ్ఞానం లేని, దాన్ని ఒంట పట్టించుకోలేని మూర్ఖులం. అంటే అజ్ఞానులం అన్నమాట. దాని కారణంగా మనం జడత్వం చెంది అనేక మైన కష్టాల్లో పీకల్లోతుగా కూరుకుపోయి బయటపడే దారి తెలియక బాధలు పడుతుంటాం. ఎందుకంటే ఈ చావుపుట్టుకల పరంపర అనేది సముద్రపుకెరటాల వలే నిరంతరాయమైనది. కెరటాలు ఎప్పటికీ సముద్రాన్ని విడిచి ఒడ్డెక్కలేవో అలాగే మనం కూడా ఈ భవసాగరంలో నుండి బయట పడలేం. అలాంటి మనను అమ్మ అనుగ్రహం ఎలా రక్షిస్తుందో చెబుతున్నారు.
అమ్మ పాదధూళి కణం అనేది చీకటి నిండిన ఊరికి సూర్యోదయం వంటిది.
అమ్మ పాదధూళి మందబుధ్ధికి దొరికిన జ్ఞానపుష్పాల మకరంద ప్రవాహం వంటింది.
అమ్మ పాదధూళి దరిద్రుడి చేతికి దొరికిన చింతామణి మాల వంటిది.
అమ్మ పాదధూళి భవసాగరంలోంవి ఉధ్దరించే విష్ణువు యొక్క అదివరాహం కోర వంటిది.
దట్టమైన చీకటిలో ఉన్న వాడికి ఏమీ కనిపించదు. కాళ్ళదగ్గర ఉన్నది పామైన తెలియదు! తన శరీరావయవాలే తనకు తెలియవు. ఇది బయట చీకటి కమ్ముకుంటే మనబోటి వాళ్ళ పరిస్థితి. ఐతే మనకు ఆట్టే స్పృహలో ఉండని చీకటి మరొకటి ఉంది. అది లోపలి చీకటి. ఆ చీకటి పుణ్యమా అని తానెవరూ అన్నది తనకి తెలియదు. వేదం తత్త్వమసి అంటే తత్-త్వం-అసి ఆ సచ్చిదానంద పరబ్రహ్మం నీవే సుమా నిజానికి అని చెబుతుంది. కాని మన అవగాహనలోకి రాదు. తాను ఈశ్వరాంశ సంభూతుడనని మరపించే దాని పేరే మాయ, దాని కారణంలో తనలో పేరుకు పోయిన చీకటి తానొక కష్టాలు పడుతున్న జీవుణ్ణీ అనే భ్రమలో ఉంటాడు. ఇదే లోపలి చీకటి అంటే. ఈ చీకటికే వేదాంతంలో అవిద్య అని పేరు.
శతాభ్దాల చీకటి గుయ్యారం ఐనా ఒక్క వెలుగురేఖలో పటాపంచలు కదా. అమ్మ అనుగ్రహంతో ఆమె పాదధూళి లభిస్తే అది చీకటిప్రపంచానికి ఏకంగా సూర్యోదయం వంటిదే! ఇంక అజ్ఞానం సమూలంగా నాశనం ఐపోతుంది.
చీకటికీ ఉన్న వాళ్ళ ముఖ్యలక్షణం ఒకటి గమనించారా? ఎక్కడికైనా కదలాలంటే చచ్చే భయం. ఏది తన్నేసి ఏమి దెబ్బలు తగిలించుకుంటామో లేదా పోయి ఏ గోతిలోనూ నూతిలోనో పడతామో అని. కదలిక లేకపోవటమే జడత్వం చెందటం అంటే. మామూలుగా మనం నిత్యం గమనించే చీకటి సంగతి ఇది. అలాగే అవిద్య లేదా అజ్ఞానం అన్న చీకటి తనలో నిండిపోతే? ఆ జీవుడి ఆత్మ జడం ఐపోతుంది. ఏమీ తెలుసుకోలేడు. ఏ విద్యలు నేర్చితే ఏమి ఫలమో తెలియదు. అత్మవిద్య అనేది ఒకటుందనే దృష్టి కూడా ఉండదు కాబట్టి అటు అడుగు వేయలేడు. చీకటి కదా అటు ఎలా కదలాలో కూడా తెలియదు. ఉన్న అవిద్యతో ఉన్న సంసారంలోనే ముందుకూ వెనక్కూ కదులుతూ ఉంటాడు కాని చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ ఉండదు. అలా అతడి ఆత్మ జడస్థితిలో ఉంటుంది. అలా పడి ఉన్న వాడికి కల్పవృక్షపుష్పాల అమృతమకరందం ఒక పాయలాగా వచ్చి ముంచెత్తి సేదదీరిస్తే పరిస్థిత్ ఎలా ఉంటుందో ఊహించండి. ఎంతో కొత్త ఉత్సాహం వస్తుంది. అమృతపానం భయాలన్నింటినీ పటాపంచలు చేస్తుంది కదా. తనకు నాశనం లేదు అని భరోసా కలిగాక ముందుకు దూకి దారి వెదుక్కుందుకు ఏమీ సంకోచం ఉండదు కదా?
ఇంతవరకూ అజ్ఞానం అనే చీకటిలో జడత్వంతో పడి ఉన్నాడు. అమ్మ పాదధూళి కణం పుణ్యమా అని ఆ చీకటి విడిపోయి అమృతం దొరికి మూందుకు దూకుతున్నాడు. ఆ ధూళికణమే అతడికి ఉన్న గొప్ప కోరికలను తీర్చే చింతామణి మాల. ఇంతక్రితం దాకా ఉన్న కోరికలు వేఱు. అవి అజ్ఞానం కారణంగా ఈ ప్రాపంచికమైన క్షుద్రవిషయాల మీది కోరికలు. అమ్మ దయ దొరికిన వాడికి ఉండే కోరికలు గొప్పవి అవి నిరంతరం అమ్మ అనుగ్రహం, అమ్మ సాన్నిద్యం అనేవి. చిన్న కోరికలను చిన్న చిన్న సాధనాలు తీర్చి ఉండవచ్చును ఇన్నాళ్ళూ. పైగా అవి సిగ్గుపడవలసిన పిచ్చిపిచ్చి కోరికలాయె. మరి ఇప్పటి కోరికలో? అవి మహత్తరమైనవి. గొప్ప ఫలితాలనిచ్చే సాధనమూ మహత్తరమైనదే కావాలి కదా? ఒక ఆవు కావాలీ అంటే ఊళ్ళో డబ్బున్నాయన ఇవ్వగలడు. ఒక పరగణాకు ప్రభువును కావాలీ అంటే పోయి రాజుగార్ని ఆశ్రయించాలి కాని వేరే విధంగా పని జరగదు కదా? అందుకే గొప్ప ఫలితాలనిచ్చే సాధనమూ మహత్తరమైనదే కావాలనటం. నిజమే కదా. తనకున్న కోరికలను తీర్చగల మహత్తరసాధనం ఏమిటీ అంటే అది అమ్మ పాదధూళి రేణువే. లోకోత్తరమైన మణి పేరు చింతామణి. అది అడిగిందల్లా - ఎంత దుస్సాధ్యమైనదైనా ఇవ్వగలదు తక్షణమే. అలాంటప్పుడు బోలెడు చింతామణులతో చేసిన మాల మహిమ ఎలాంటిదై ఉంటుందంటారు? అమ్మ పాదధూళి కణం అటువంటి చింతామణి మాల వంటిది అని ఆచార్యుల వారు చెబుతున్నారు.
సరేనండీ, ఎలాంటి ఎలాంటి కోరికలు ఉన్నా అవి తీరిపోయాక కలిగే నిస్వార్థమైన దృష్టి మోక్షం మీద. అంటే ఇంక ఏ కోరికలూ లేక జన్మరాహిత్యాన్ని పొంది సంసారసాగరాన్ని తరించటం అన్న మాట. అవును కదా, అమ్మ అనుగ్రహం దొరికిన వాడు ఆవిడను అడిగేది అదే కదా? దాని సంగతి ఏమిటీ అనవచ్చును. శంకరాచార్యులవారు ఆ సంగతి కూడా చెబుతున్నారు. ఈ జనన మరణాలతో కూడిన సంసారం అనేది మహా సముద్రం వంటిది. అందులో పడటమే కాని బయటకు రావటం దుర్లభం! పూర్వం శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తి సముద్రంలో ములిగిపోయిన భూమిని అవలీలగా తన కోరతే పైకి ఉధ్ధరించాడు. ఈ కథ అందరికీ తెలిసిందే కదా. ఆచార్యులవా రంటారూ, అమ్మ పాదధూళి కణమే ఆ ఆదివరాహం కోరలాగా సంసారసాగరంలోంచి ఉధ్దరించి మోక్షం ప్రసాదిస్తుందీ అని. ఇంకేం కావాలీ?
ఈ శ్లోకాని పారాయణం పక్షంరోజులపాటు రోజూ వేయిసార్లు చొప్పున చేయాలి. ఫలితం సద్విద్యాబుధ్ధులు, ఐశ్వర్యం. నైవేద్యం మినపగారెలు. |
27, సెప్టెంబర్ 2014, శనివారం
సౌందర్యలహరి - 3 అవిద్యానామ్ ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అమ్మ గురించి ఒక త్రసరేణువైనా బుఱ్ఱలోకిపోతే! ఆనందః.
రిప్లయితొలగించండి