28, సెప్టెంబర్ 2014, ఆదివారం

సౌందర్యలహరి - 4 త్వదన్యః పాణిభ్యామ్‌ ...


మొదటిశ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


4

త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా .
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంచాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ 

అమ్మ శ్రీదేవి చతుర్భుజ.  అంటే నాలుగు చేతులతో విరాజిల్లే దివ్యమూర్తి.  ఆవిడ నాలుగు చేతులను గూర్చి రాబోయే యేడవ శ్లోకంలో శ్రీశంకరులు ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః అని చెబుతారు.

ఆవిడ చేతుల్లో ఒక దానిలో ధనుస్సు ఉంది. మరొక దానిలో‌బాణాలున్నాయి.  ఒక చేతిలో పాశమూ మరొక చేతిలో అంకుశమూ ఉన్నాయి. ఇలా ఆవిడ నాలుగు చేతుల్లోనూ నాలుగురకాల ఆయుధాలతో ఉంటుంది. మహాకవి కాళిదాసుగారు పుండ్రేక్షుపాశాంకుశబాణహస్తే అని చెప్పారు కదా. ఆవిడ చేతుల్లోది చెఱకు విల్లు.  ఆ బాణాలు పుష్పబాణాలు.  లలితాసహస్రంలో కూడా మనోరూపేక్షుకోదండా।   పంచతన్మాత్రసాయకా అని ఉందికదా. అలాగే రాగస్వరూపపాశాఢ్యా   క్రోధాకారాంకుశోజ్జ్వలా అనికూడా చదువుకుంటాం లలితాసహస్రంలో.  ఇప్పుడు ఆట్టే వివరాలు ఈ‌ శ్లోకంలో చెప్పుకోనవసరం లేదు.

మన గుళ్ళల్లో చూస్తూ‌ ఉంటాము. దేవుడి కుడిచేయి అభయం ఇస్తున్నట్లుగా ఉంటుంది. ఎడమచేయి వరాలిస్తున్నట్లుగా ఉంటుంది. ఔను కదా?  చేతి వ్రేళ్ళు పైకి ఉండేలా అరచేయిని మన వైపుకు చూపటం‌ అభయముద్ర.   చేతి వ్రేళ్ళు  క్రిందికి ఉండేలా అరచేయిని మన వైపుకు చూపటం‌  వరదముద్ర. అభయముద్ర అర్థం నీకేమీ భయం వద్దూ నేనున్నాను రక్షించటానికి అని చెప్పటం. వరదముద్ర అర్థం నీకేది కావాలన్నా అనుగ్రహిస్తానూ అని చెప్పటం.

అమ్మ  శ్రీదేవి నాలుగు చేతుల్లోనూ నాలుగురకాల ఆయుధాలు ధరించి ఉన్నదే మరి ఆవిడ మనకు అభయం ఇవ్వటం ఎలా? ఆవిడ మనకు వరాలివ్వటం ఎలా? అన్న ప్రశ్న వస్తోంది కదా?

శ్రీశంకరభగవత్పాదులు ఈ శ్లోకంలో పై సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు.

శ్రీదేవితో అంటున్నారూ, అమ్మా అందరు దేవతలూ చేతుల్లో అభయ ముద్రనూ వరముద్రనూ ప్రదర్శిస్తున్నారు.  నీవు మాత్రమే అలాంటి ముద్రలు ప్రదర్శించటం లేదు.  అయినా ఇబ్బంది ఏముంది?  అన్ని రకాల భయాలనూ‌ పారద్రోలటానికీ, కావాలని కోరుకునే దానికన్న అనేకరెట్లు ఘనంగా అన్ని కోరికలనూ తీర్చటానికీ నీ‌ పాదాలు రెండూ చాలమ్మా.  అవి సకలలోకాలకూ శరణం ఇచ్చేవి కదా.  అవే అన్ని విధాల భక్తకోటిని ఆదుకుంటాయి కదా ఎల్లప్పుడూ.  ఇంకా నువ్వు ప్రత్యేకంగా అభయముద్రా, వరదముద్రా అంటూ చేతుల్తో పట్టి చూపవలసిన అగత్యం ఏముంది తల్లీ అంటున్నారు.

నిజానికి అందరు దేవతలు అభయముద్రనూ వరముద్రనూ కేవలం అభినయం చేస్తున్నారు. కాని వాళ్ళకు ఆ సామర్థ్యం ఎక్కడి దమ్మా?  బ్రహ్మాది సకలదేవతల దివ్య  శక్తులకూ‌  నువ్వే అధారం కదా.  నీ‌ అండ లేనిదే శివు డంతవాడే కదల్లేడు మెదల్లేడు. మరి వాళ్ళు ప్రజకు అభయం ఎలా ఇస్తున్నారూ? వాళ్ళు వరాలు మాత్రం ఎలా ఇస్తున్నారూ?  అంటే వాళ్ళు నిజంగానే ఆ పనులు చేస్తున్నారూ అంటే అది అంతా నీ అనుగ్రహం ప్రభావంతోనే అన్న మాట. త్రిమూర్తుల చేత సృష్టిని నిర్వహింపజేసే తల్లివి నీవే వాళ్ళందర్నీ అభయప్రదానాలూ వరప్రదానాలూ చేసేందుకు అనుమతిస్తున్నావన్న మాట.  ఈ దేవతాగణం అంతా నీ దయవల్లనే వెలుగుతున్నారూ అని శ్రీశంకరులవారు చెప్పకనే చెబుతున్నారిక్కడ.

అంటే ఈ శ్లోకంలో శ్రీదేవి చరణారవిందాలను ఆశ్రయించితే చాలు,  ఏ భయం నుండి విముక్తి కోరినా సరే, అన్ని రకాల భయాలూ, భవభయం అనే అన్నింటి కన్నా పెద్దభయంతో సహా మాయమై పోతాయీ, అన్ని రకాల ఇహలోక, పరలోక భోగాలూ‌ ఏది కోరుకున్నా వాటికి వేయింతలు గొప్పదైన మోక్షంతో సహా కలుగుతాయీ అని శ్రీశంకరులు లోకానికి ఉపదేశిస్తున్నారు.

అవునూ, ఇంతకు ముందు శ్లోకంలోనే కదా అమ్మ యొక్క పాదధూళి కణం ఎంత గొప్పదో చదువుకున్నాం.  మరి ఆ పాదధూళీ కణాన్నొకదాన్ని అపేక్షించే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి కదా?  వేరే రకంగా ఎలా చేయటం ఎలా?

ఈ శ్లోకానికి పారాయణం రోజుకు వేయిసార్లు. ఫలితం రోగనాశనం, దారిద్ర్యనాశనం, అధికారప్రాప్తి. నైవేద్యం పసుపు అన్నము (పులిహోర)