22, సెప్టెంబర్ 2014, సోమవారం

ఒక ఊరి కథ - 5

మా యూ రొక సంపన్నమైన యగ్రహారము. ఊరు చిన్నదే కావచ్చును కాని పేరూరి వలె నిదియును వేదపండితులకు నిలయముగా నుండెడిదని చెప్పుకొనెడు వారు. చెప్పుకొనెడు వారనుట యెందు కనగా నేటి సంగతి వేఱుగ నుండుట వలన. 

మా యూరి పేరు శివాపురమును గాదు శివపురమును గాదు.  నిజమైన పే రనగా నది శివరామపురము. ఒకప్పుడు శివరామశాస్త్రియను వేదపండితున కెవరో మహారాజుగారు బహూకరించిన యగ్రహారము. దాని పూర్వనామ మేదో తెలియదు కాని నాటగోలె శివరామపురమైనది. ఆ పేరు వచ్చి యొక రెండువంద లేండ్లు కావచ్చు నేమో నాకు తెలియదు.

 మొదట మా యూరి పేరు శివరామపురముగా నుండగా తొలుతగా దాని నుండి రాము డెగిరిపోయినాడు.  అదెట్లు జరిగెనో తెలియదు. చివరకు వట్టి శివపురమైనది.  కొన్నాళ్ళ కెవడో మహానుభావుడు శివపురమన్న పేరు దురర్థప్రదాయకమని సిధ్ధాంతముజేసెను.

శివపుర మనగా శివుని యొక్క పురమని షష్ఠీవిభక్తిని జెప్పి దానియర్థము శ్మశానమని నిశ్చయముగా నుండును గావున పిల్లపాపలతో పాడిపంటలతో దులదూగు నూరి కట్టి నామధేయ మనుచితమని ప్రకటించి పాండిత్యప్రకర్షను జూపినాడు.  అదేమయ్యా శివుడు కేవలము శ్మశానములోనే యుండెడివా డనవచ్చునా శివమనగా నేమీ? శివప్రదత్వాత్ అను వ్యుత్పత్తిని బట్టి శివశబ్దము గావున శివుడు సర్వమంగళములకును గారకుడు. అట్లగుటచేత శివపురమని యేల ననరా దని యెవ రైనను వానిని నిలదీసిరో లేదో తెలియదు.  అదియును గాక సర్వం వశీకృతం యస్మాత్తస్మాత్ శివ ఇతి స్మృతః అని శివపురాణము నందున్నది తెలియని వాడాయెనే! మఱియు నా మహాపండితుడు గ్రామనామమును శివాపురముగ జేసినాడు. శివా యనగా శివుని యర్థాంగలక్ష్మియైన ప్రార్వతీ‌దేవి. ఆవిడ శుభప్రదాయని గావున నా విధముగా మార్చినాడట.  యేమి వెఱ్ఱి? నమశ్శివాయైచ నమశ్శివాయ యని స్తుతించబడిన యర్థనారీశ్వరతత్త్వమును గ్రహించలేక పోయినాడు.  ఒకప్పటి వేదపండితుల యగ్రహారము నందు దాని యొక్క పేరునే తప్పుబట్టు మహానుభావు లుదయించుట కేవలము కాలప్రభావము. పోనిండు పూర్వనామధేయమైన శివరామపురమని పిలచుటయే మంచిదని యేల సిధ్ధాంతము చేయలేదు. శివరాముడన్నది గూడ నర్థరహితమని భావించె నేమో తెలియదు.  కొందఱకి శివు డిష్టదైవము. వారికి విష్ణునామములు పనికిరావు. ఘంటాకర్ణుని వంటి వారన్నమాట. వారి కర్మము వారిది. మన కేమి.

పై కెగబ్రాగవలె నన్న బహుప్రయాసా సాధ్యమగు కార్య మగును కాని దిగజారుట కేమి కష్టపడవలయును? శివపురమో శివాపురమో యేదైన నేమి మగనిపేరో భార్యపేరో యేదైనను గ్రామము దైవనామాంకితమే యగుచు నున్నది కదా యనుకొను వారి నెత్తిన పిడుగుబడు కాలమును వచ్చినది. ఇప్పు డీ గ్రామనామమును మరల మార్తురట, కానిండు. నీ‌కథ చెప్పవయ్యా యనగా వీ డేల తన గ్రామమును గూర్చి ప్రస్తావించుచున్నా డని మీ కనిపించ వచ్చును. దానికి పెద్దకారణమే యున్నది. ఆ శివరామశాస్త్రిగారు మా పూర్వీకులై యుండగా నీ సంగతిని ప్రస్తావించక పోవుట యెట్లు? 

తన తమ్ము డొక బీదవాడుగా నుండగా నాయనను సమాదరించి శాస్త్రిగారే తన గ్రామమందు భూగృహాదివసతుల నేర్పరిచినారు. నేను శాస్త్రిగారి తమ్ముని నుండి యారవతరము వాడను.   అగ్రహారము నేర్పరచిన మహానుభావుడు శాస్త్రి గారీ‌ గ్రామముననే యేబది యేండ్లు కాపురముండిరి. శాస్త్రిగారి కుమారునకు వేఱొక సంస్థాన మందున పెద్ద యుద్యోగము గలిగి యాయన వలస బోయెను. శాస్త్రిగారి మనుమ డీయూర నున్న తమ భూము లన్నింటిని విక్రయించగా వాటిని కొందరు షాహుకార్లును తదితరులును మరికొందరు ధనవంతులైన బ్రాహ్మణులును విలుచుకొనిరి. వారి కుటుంబమును గూర్చి మా కటు పిమ్మట సమాచారమే లేదు. శాస్త్రిగారి కుటుంబ మిక్కడ నుండగా బ్రాహ్మణేతరులెవ్వరు గాని యగ్రహారీకులు గాలేదు. వారి మనుమని కాలము వచ్చుసరికి కొందరు వైశ్యులును మరి కొంద రన్యవర్ణముల వారు నీ‌ గ్రామమున నిండ్లును భూవసతియును గలిగి యుండు పరిస్థితి యేర్పడినది.  ఇం దెవ్వరి తప్పొప్పులును లేవు.  అంతయును కాలము చేతనే యగుచుండును.

ఈ‌యూరి శివారు గ్రామము నేడు కొంచె మించుమించుగా శివపురమంత యున్నది గాని నిజమున కదియే ప్రథాన గ్రామముగ దానిలో నొక భాగముగా మా యగ్రహారము లేచినది.  తొలినాళ్ళలో నగ్రహార మంతయును బ్రాహ్మణీకము. ఇతర వర్ణముల వారీ శివారు గ్రామస్థులుగా నుండిరి. 

కొన్ని దశాబ్దముల క్రిందట మన శివారు గ్రామము నానుకొని యున్న  కుగ్రామము మీదుగా దొరతనము వారు విశాలమైన పెద్ద రహదారిని నిర్మించిరి. శివారు గ్రామము నకు సిరియెత్తు కొనినట్లైనది.  అందరును చూచు చుండగనే శివారుగ్రామము చిన్న పట్టణ మాయెను. అప్పటికే మాగ్రామమున వేదాధ్యయనములు తగ్గి పిల్లల నింగ్లీషు చదువుల కొఱకై కొంత దూరమున నున్న పట్టణమునకు పంపుట ప్రారంభమైనది.  కొంద రా పట్టణమునకే వలసబోయిరి.  మా నాయనగారు వలస పోలేదు కాని మా కింగ్లీషు చదువులు చెప్పించిరి.  కొంత వేదాధ్యయనము కూడ చేసితిమి.  మే మనగ మా యన్నయును నేను నన్నమాట.

మా యన్న మిక్కిలి స్ఫురద్రూపి. చాల కుశాగ్రబుధ్ధి.  వానిని కాలేజి చదువులకు బంపుమని మా నాయనగారి నచ్చటి పాఠశాలవారు మిక్కిలి యొత్తిడి చేసిరి. మీ స్నేహితుడైన మా పెద్దాయన కూడ యొత్తిడి చేసెను. అయన రెండవకుమారునకును మా యన్నకును ప్రాణస్నేహము. ఇరువురకును మా యూరి షాహుకారుగారి పెద్దకొడుకు చాల స్నేహితుడు. మువ్వురును కలసిమెలసి యొకరిభుజములపై నొకరు చేతులు వేసికొనుచు నుల్లాసముగా నూరిలో తిరుగుచుండగా పరమనేత్రపర్వముగా నుండెడి దని జనులు చెప్పుకొను వారు.  ఈ మువ్వురిలో‌ మా యన్నయే నాయకుడు.  మువ్వురును కలిసియే కాలేజి చదువులకు బోయిరి. దగ్గరలో నున్న యూరికే బస్సు వచ్చును గనుక సెలవుదినములలో నింటికి వచ్చుచుండువారు. వారు వచ్చినప్పుడెల్ల గొప్ప సందడిగా నుండెది దట యూరంతయును. 

పెద్దచదువులు చెప్పించు నంతటి స్తోమత మాకెక్కడిది. షాహుకారే మీ కొడుకు నా కొడుకు కాదా యని యొప్పించి సొమ్ము సర్ధుబాటు చేసెను.  మా నాయనగారికి స్వాభిమానము కదా. వలదన్నను కొంత పొలమును తనఖా పెట్టి గాని సొమ్ములు స్వీకరించినాడు కాదు. అప్పటికే నా అప్పగార్ల పెండ్లిండ్లకు కొంతపొలము  విక్రయించినాము. మిలినది తనఖా పెట్టుటకు మా యన్నకు సమ్మతమైనది కాదు. కాని నామమాత్రపు తనఖాయే కద యని చివర కంగీకరించినాడు. అప్పటికి నాకు పదేండ్లేమో.

మాయన్నకును నాకును షష్టాష్టకము.  చుక్కెదు రందురే యట్లన్నమాట. నన్ను తరచుగ కోపము చేయుచుండువాడు.  నేను నా తల్లిని చంపి పుట్టితి ననగా నది నా దోషమే యని కోపించిన నేనేమి చేయుదును.  మా నాయనగారు మందలించినను వినువాడు కాదు. ఒకసారి వంట చేయుచుండగా పరధ్యానముగ నుండుటవలన మా నాయనగారి  చేయి కాలినది.  మాయన్న నన్ను చావబాది నాడు!  చిత్రమేమనగా కాలేజి చదువు మొద లైనప్పటి నుండియును మా యన్న మారినాడు. సెలవులకు వచ్చినప్పుడు నన్ను మిక్కిలి ముద్దుచేయు చుండువాడు.  నాతో సహపాఠము చేయుట, నాకు చదువులో సహాయపడుట చేయువాడు. మా నాయన గారికి మిక్కిలి యానందముగ నుండెడిది. 

చదువులు ముగిసి ముగ్గురు స్నేహితులును వేర్వేరు యూళ్ళలో మంచి యుద్యోగములు గడించు కొనినారు. వా రుద్యోగములు చేయుట తండ్రు లెవరికిని హితము గాకున్నను పట్టుబట్టి పోయు యుద్యోగములలో చేరిరి. వారికి గల పరస్పరప్రేమానురాగములు కావచ్చును వారి కూరిపై గల ప్రేముడి కావచ్చును వారు తరచుగ వచ్చిపోవుచునే యుండెడి వారు.  మాకును సంతోషముగనే యుండెడిది.  కాని మా నాయనగారి యారోగ్యము చెడుట వలన మా యన్న మా కాపురమును తానుండు పట్టణమునకు మార్చినాడు. వైద్యమునకు లోపము లేనందున నాయనకు స్వాస్థ్యము చేకూరినది కాని మేము తిరిగి మా యగ్రహారమునకు మరలలేదు. మరల జబ్బు తిరుగబెట్టిన నిబ్బంది యని మా యన్న వారించెను.  నాకు చదువుకొనుటకు గూడ మంచిదియే కద యని నాయనగా రంగీకరించిరి. అదియును గాక వారి కచ్చట వేదపాఠములు చెప్పుట విరివియాయెను. మా యన్న తాను మాత్రము తరచుగా నగ్రహారమునకు పోవుట మానలేదు.  ఒకసారి మువ్వురమును గలసి యగ్రహారమునకు పోతిమి.  మా షాహుకారి గారి యమ్మాయి పెండ్లి. ఏకైకపుత్రిక గావున షావుకారుగారు దానిని మిగుల నట్టహాసముగా చేసేను. మీ మిత్రుడు పెద్దాయనగారు మన యూరిలో నొక సూర్యునివలె వెలుగుచుండిరి.  రాజకీయములలోని వచ్చి రాణించుట మొదలైనది కదా.  వారికి పేరు వచ్చుట జూచి యూరివారి యానందమునకు పట్టపగ్గములు లేవు.

షాహుకారుగారింట పెండ్లికి బోయిన్నప్పుడు మాయన్న మా పొలము తనఖా విడిపించుకొను విషయను లేవదీయగా మా షాహుకారుగారు పెద్దపెట్టున నవ్వి యేమయ్యా నీవద్ద డబ్బు పుచ్చుకొన వలెనా, నీకు పెండ్లి సంబంధములు వచ్చుచున్నవట కదా, నీ పెండ్లికి నేనా పత్రమును బహుమానముగా జదివింతును పొమ్మనెను. మరల తానే  మరొక మాట చెప్పెను. నాయనా డబ్బు బహుచెడ్డది కావున మనుషుల బుద్దులు మార్చుచున్నది. ఈ‌ పెండ్లిహడావుడి ముగిసిన వెంటనే మీ స్నేహితుని చేతికిచ్చి నేనే స్వయముగా తనఖా పత్రమును నీకు బంపెదను.  నీవు కాదన రాదు. లేకున్న రేపు నా బుధ్ది మారునో మా యింట మరి యెవరి బుధ్ధులు మారునో తెలియదు కద.  నా మాట వినవలె ననెను.  పెద్దవారి మాట కెదురు చెప్పుట నాటి కింకను సంప్రదాయము కాలేదు కాబట్టి మా యన్న చేయునది లేక యూరకొనెను.

కాలమొకే విధముగా నున్నచో దాని గొప్ప యేమున్నది?

(సశేషం)

2 కామెంట్‌లు:

  1. నాటి రోజులలో పల్లెలలో పరిస్థితులెలా ఉండేవో బాగా వివరించారు, కాలం ఒకలా నడిస్తే గొప్పేముందీ, అనుకోని మలుపు తిప్పుతుంది దానికోసం ఎదురు చూస్తున్నా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు శర్మగారు, ఈ‌ కథను నేను చెప్పుచున్నానన్నది కొంత వఱకే నిజము. కథాగమనమే నా చేతిని బట్టి లాగికొని పోవుచున్నది. కథ యొక్క సమాహారముపై నాకు స్పష్టమైన యవగాహన యున్నది కావున దాని స్థూలస్వరూపము తలచినట్లే యుండును. కాని కథలోని యనేకాంశములు పాత్రల చేతుల లోనే యున్నట్లున్నది. అవియే నా చేత వివిదముగా వ్రాయించుచున్నవనగా నాకు వాటిమీద పెత్తనము తక్కువగనే యున్నదని చెప్పవలయును. వ్రాయుటకే నాకు మిక్కిలి యుత్కంఠగా నున్నది.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.