28, ఫిబ్రవరి 2023, మంగళవారం

లలనలార వేగ

లలనలార వేగ హారతుల నెత్తరే భాను

కులపతికి బంగరుగాజుల చేతులతో


తాటకను గూల్చిన మన దశరథాత్మజునకు

వాటముగా శివునివిల్లు వంచిన హరికి

ధాటిగా పరశురాముని దండించిన రామునకు

సూటిబాణముల నొప్పు మేటి విలుకానికి 


ముని యాగము కాచినట్టి మన రాజు కొడుకునకు

మునిపత్నిశాపంబును బాపిన హరికి

మునిపుంగవులును గూడ మోహించిన రామునకు

ననవిలుతుని కన్న చాల నయనోత్సవునకు


కడుగడు సత్కీర్తి గొన్న కౌసల్య కొడుకునకు

నిడుదబాహువుల నొప్పెడు నేతకు హరికి

పుడమిబిడ్డ తోడ నిదే పురిజేరిన రామునకు

పుడమి నెల్లవారు పొగడు పురుషపుంగవునకు 


26, ఫిబ్రవరి 2023, ఆదివారం

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరే

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనరే చిత్తశుధ్ధిగా మీరు
శ్రీరామనామము చేసెడు వారికి చింతలన్నవే లేవు

శ్రీరామనామము కంటె తీయనిది సృష్టియందొక్కటి లేదు
శ్రీరామనామము కంటె పావనము సృష్టియందొక్కటి లేదు

శ్రీరామనామము చేయని దినమే చెడ్డదినమనుచు నెఱిగి
శ్రీరామనామము శ్రధ్ధగ నెప్పుడు చేయుచుండవలె మీరు

శ్రీరామనామము మీకిచ్చుచుండగ సిరులుసంపదలు సుఖము
శ్రీరామనామము చేయుట యందే చెలగుచుండ వలె మీరు 

శ్రీరామనామము చేయుచు గడపిన జీవితమే జీవితము
శ్రీరామనామము గొప్పదనము గూర్చి చెప్పగ నెవ్వరి తరము

శ్రీరామనామము తీర్చని కోరిక క్షితిపైన నేదియు లేదు
శ్రీరామనామము భవతారకంబని చెప్పుచు నుండును శివుడు


25, ఫిబ్రవరి 2023, శనివారం

నిన్నే నమ్మితి నని

 నిన్నే నమ్మితి నని నీవెఱిగియు నన్ను పరీక్షించేవో

ఎన్నటి కైనను పరీక్ష ముగిసే దన్నది యున్నదటయ్యా


కోటి తనువులను నను జొప్పించిన గొప్ప దేవుడా నన్నా

కోటి జన్మముల కోటిబాధలకు గురిచేసితి వటులైనన్

సూటిగ నీపదపద్మంబులనే సొంపుగ నెన్నితి గాని

యోటువడితినా వేరొక దేవుని యొకనాడైనను తలచి


బహులోకంబుల సృజియించిన నిను బాగుగ నెన్నుచు మదిలో

నహరహమును నీపదపద్మంబుల నారాధించుచు రామా

యిహపరముల నాయునికి కారణము నెన్నుదు నీకృప యనుచున్

మహదైశ్వర్యం బది నీచెంతకు నను మరిచేర్చుట యెపుడో 


దారిచూపితివి మున్నే నీవే తారక రాముడ వగుచు

తారకరామా నీనామమునే తలచువాడనగు నాకు

దారికడ్డమా యీపరీక్ష లివి దాటుదు నంతియె గాని

చేరుట తథ్యమయా నీసాన్నిధ్యము సర్వేశ్వర నిజము


22, ఫిబ్రవరి 2023, బుధవారం

నామనోరథము నీయరా

నామనోరథము నీయరా

రామా మనోహర నేడే


సొమ్ములకగు గాక సుఖజీవ

నమ్మునకగు గాక నారామా

యిమ్మహి నేనెవ్వరి నేమియు

నిమ్మని యడుగనని యెఱిగి


నీనామము గాక నిత్యము

నానా నామములు నారామా

యేనాడును పలుక బోనని

లోనెఱుంగుదువు గాన


నేకోరిన ముక్తి నిజముగ

నాకిడెదవు గాక నారామా

నీకడ నుండిపోదు గాక

నాకిక పుట్టువే లేక


21, ఫిబ్రవరి 2023, మంగళవారం

మనసా పలుకవే మరిమరి పలుకవే

మనసా పలుకవే మరిమరి పలుకవే

రామ రామ రామ రామ రామ యని పలుకవే
రాము డొకడె సర్వజగద్రక్షకుడని పలుకవే

కామితార్ధఫలదుడు మా రాముడని పలుకవే
రామచంద్రుడే పరబ్రహ్మమనుచు పలుకవే

రామనామమొకటె నాకు ప్రాణమనుచు పలుకవే
రామపాదసీమ నారాజ్యమనుచు పలుకవే

రామనామమాహాత్మ్యము ప్రకటించి పలుకవే
రాముడె నాలోకమనుచు ప్రస్ఫుటముగ పలుకవే

రాముడే పరదైవతమని రమ్యముగ పలుకవే
రామున కన్యమును తలప రాదనుచును పలుకవే

రామదాసవృత్తి నాకు సేమమనుచు పలుకవే
రామస్వామి కరుణ నాకు బ్రతుకనుచును పలుకవే


20, ఫిబ్రవరి 2023, సోమవారం

రామ రామ భవతారక నీదయ

రామ రామ భవతారక నీదయ రానీయవయా నేడే
కామితవరదా రానీయవయా ఘనమగు నీదయ నేడే

అరిషడ్వర్గోరగకూటమి నన్నాక్రమించినది రామా
పరమాత్మా యీయురగంబులను పారద్రోలవే రామా

పంచమలంబుల ప్రభావమున నేపతితుడనైతిని రామా
కొంచెమైన నీతలపులేని మూర్ఖుండనైతినో రామా

తాపత్రయమను కుమ్మునబడి నేతహతహలాడుచు రామా
పాపాత్ముడనై చెడిపోతినిరా పరమదయాళో రామా

కుపధవర్తనుల సహవాసముచే కూడనిపనులను రామా
విపరీతముగా చేసితినని నను వెలివేయకుమా రామా

నేర్చిన చదువులు నినుసేవించుట నేర్పనివాయెను రామా
పేర్చిన కృప మన్నించి కావుమని వేడెదనయ్యా రామా

ఇక నీనామస్మరణము మదిలో నెన్నడు మరువను రామా
వికచసరోరుహనేత్ర నీవు నను విడువకుండుమా రామా18, ఫిబ్రవరి 2023, శనివారం

నిన్ను పొగడ కెటులుందురా

 నిన్ను పొగడ కెటులుందురా నిముషమైన గాని

నిన్ను తలప కుండలేని నేనటరా పంతగించి


కనులు విడివడక ముందే కమలాక్ష నీనామము

పనవుట మొదలిడెడు నేను పంతగించేనా

కనులుతెఱచి నేనిక యీ కల్లజగము నీక్షింపగ

మనసురాక విచారించుచును పంతగించేనా


మరల శయ్య చేరుదాక మానకుండ నీనామము

నిరంతరము జపముచేయు నేను పంతగించేనా

అరరే యీ నిదరలోన హరినామ స్మరణంబే

కరవగునని వగచు నేను  కడు పంతగించేనా


రామచంద్ర రాదురా విరామము నీనామమును

ప్రేమతో స్మరించ నాకు విడుము శంకలు

ఓమనోహరా సమస్త భూమండల మందు నా

కేమి కావలయును నీ నామము దక్క


16, ఫిబ్రవరి 2023, గురువారం

స్వల్పంబు లందు దృష్టి

స్వల్పంబు లందు దృష్టి సారించకుడు అ

నల్పమగు మోక్షమునకై ఆలోచించుడు


ధనముల నడిగెదరా యది తగదు మీకు ముక్తి

ధనమునే యడిగదరా తగునదియే మీకు


కాంతకై వేడెదరా కానిపనియె మీకు ముక్తి

కాంతకై వేడెదరా కానిండది మేలే


రాజ్యంబుల నడుగగా రాదు మీకు మోక్ష

రాజ్యంబు నడిగెదరా ప్రార్ధించగ దగును


తక్కిన వేల్పుల గొలువ దగదు మీకు మోక్ష 

మొక్కటి కోరిక యైతే మ్రొక్కుడు రామునకు


ఇంకా నేల దాఁచేవు యీ సుద్దులు - అన్నమయ్య శృంగారసంకీర్తనం     దేసాళం

ఇంకా నేల దాఁచేవు యీ సుద్దులు
కంకణాలు గట్టిన నీకళ్యాణపు సుద్దులు

ముంగిటికి వచ్చె నివె మోహపు నీ సుద్దులు
అంగడిలోనికి నెక్కె నా సుద్దులు
కొంగుబంగారము లాయె కోరికె నీ సుద్దులు
యెంగిలి మోవికి సోఁకె నీ సుద్దులు

పొంచులకు లోనాయ పొరుగుల నీ సుద్దులు
యెంచితే నెన్నైనాఁ గల నీ సుద్దులు
కంచపు పొత్తు గలసె కడలేని నీ సుద్దులు
దించరాని మోపులాయె దినదినసుద్దులు

ఇసుకపాఁతర లాయె నిదివో నీ సుద్దులు
ముసిముసి నవ్వులాయె ముందే సుద్దులు
యెసగి శ్రీవేంకటేశ ఇంంతలో నన్నేలితివి
కొసరితే నిగిరించీ కూరిమి నీ సుద్దులు

ఇదొక అందమైన శృంగారసంకీర్తనం. ఇరవైతొమ్మిదవ సంపుటంలోని 189వ సంకీర్తనం.

ఈకీర్తనలో మాటిమాటికీ సుద్దులు అన్న మాట వస్తూ ఉంటుంది. సుద్దులు అంటే మంచిమాటలు అని అర్ధం. ఈ సుద్దులు వారివీ వీరివీ‌ కాదు శ్రీవేంకటేశ్వరుల వారివి. అయన అమ్మవారితో సెలవిచ్చిన అందమైన మాటలు. అసలిక్కడ సుద్దులు అంటే అందమైన మాటలు అని తీసుకుంటేనే‌ పసందుగా ఉంటుంది.

అందమైన మాటలు మరి అవి యెటువంటి వనుకుంటున్నారూ? అవి కళ్యాణపు సుద్దులు. అంటే స్వామివారు తమ వివాహ సమయంలో అమ్మవారితో మొదలుపెట్టిన అందమైన పలుకులు. అవి ఇంతలో అందలో వెన్నెతగ్గే రకం‌ మాటలా అని? లోకంలో ఆలుమగలు పెండ్లి ఐన కొత్తలో పరస్పరం ఎంతో అందంగా పొందికగా సరసంగా మాట్లాడుకుంటారు. రానురానూ కొత్త మురిపెం తీరి ఆమాటల్లో కొంత అందచందాలు తగ్గుతాయి. అవి క్రమంగా వెన్నెవాడి మెల్లగా కొంతమందిలో దెప్పుళ్ళకూ దెబ్బలాటలకూ దారితీసేంత అధ్వాన్నంగా మారుతూ ఉంటాయి. ఆ కొంత కాలం అన్నది ఎంతకాలమూ అంటే పదహారురోజుల పండుగ వెళ్ళకుండానే పోట్లాటలకు నిలయమైన కాపురాలూ‌ ఉంటాయి, ఇద్దరూ ఎనభైవపడిలో పడ్డా పరస్పరం ఎంతో ముచ్చటగా సంభాషించుకొనే ఉత్తమదంపతుల కాపురాలూ ఉంటాయి. అంతా సృష్టివైచిత్రి.

కాని సృష్టికే మూలమైన ఆదిదంపతుల కళ్యాణపు మాటల అందచందాలు అలాగే ఉంటాయి ఎన్నటికీ. వాటితీరుతెన్నులను అన్నమయ్య గారు ఈసంకీర్తనలో వర్ణిస్తున్నారు.

మరొకరకంగా కూడా ఈకళ్యాణపుసుధ్దులు అన్న ప్రయోగాన్ని అర్ధం చేసుకోవచ్చును. కళ్యాణప్రదమైన సుధ్ధులు అని. కళ్యాణం అంటే శుభం అని అర్ధం కదా. అంటే శ్రీవారి సుద్దులన్నీ శుభప్రదమైనవి అని చెప్పటం. ఎటువంటి శుభాలో ఈ సంకీర్తన వివరిస్తూ ఉంది. ఐతే ఇక్కడొక చిక్కు వస్తోంది. ఆకళ్యాణపుసుధ్ధులు సామాన్యమైనవి కావూ కంకణాలు కట్టినవీ అంటున్నారే, దానికి అన్వయం ఎట్లా చేయటమూ అని ప్రశ్న ఒకటి ఉంది కదా. దానికి సమాధానం ఏమిటీ అన్నది చెప్పుకోవాలి. రెండువిధాలుగా సమాధానం చెప్పవచ్చును మనం. ఒకడు ఈపని చేస్తానూ ఇలాగే చేస్తానూ అని కంకణం కట్టుకొని కూర్చున్నాడు అని అనటం లోకంలో ఒక వ్యవహారం ఉంది. దాని అర్ధం పట్టుబట్టుకొని ఉండటం అని. నామాటలు శుభాన్నే‌ కలిగించాలీ అని స్వామివారు కంకణం కట్టుకొని ఉన్నారని సమాధానం చెప్పి సమన్వయం చేయవచ్చును. మరి కీర్తనలో కట్టుకొన్న అని కాక కట్టిన అని ఉంది కదా అని శంక చేయవచ్చును. దానికేం ఆచార్యుల వారు గీత సౌలభ్యం కోసం అలా వ్రాసారని అనుకోవచ్చును లెండి. ఇబ్బంది లేదు. మరొక పక్షం ఏమిటంటే,  మొదట మనం అనుకున్నట్లే స్వామి వారు కళ్యాణంతో మొదలైన సుద్దులు అని చెప్పుకోవటం.

ఆస్వామి వారి సుద్దుల గురించి సంకీర్తనం ఎలా వివరిస్తోందో చూదాం.

ఈ సంకీర్తనంలో చివరి చరణంలో ఉన్న నన్నేలితివి అన్న ప్రయోగాన్ని బట్టి ఈ మాటలన్నీ అమ్మవారు అయ్యవారిని ఉద్దేశించి పలుకుతున్నట్లుగా భావన చేయాలి మనం.

ఒకరోజున అయ్యవారు కొంచెం ముభావం నటించారు. అయ్యవారికీ అమ్మవారికి మధ్యన ఏమైనా ప్రణయకలహం‌ నడిచిందా ఈసంఘటనకు ముందుగాను లేదా అయ్యవారు మరేదైనా కారణం వలన అలసి ఉండి సరసోక్తులను పలుకకుండా ఉన్నారా అమ్మవారి వద్దకు వచ్చి కూడా కొద్దిసేపు అన్నది విచార్యం. ఐతే అమ్మవారు అయ్యవారిని హుషారు చేయటానికి ప్రసంగం మొదలు పెట్టింది.

ఎందుకయ్యా దాస్తున్నావూ అందమైన నీ మాటలన్నీ నాదగ్గర ఈవేళ, ఎంతో శుభకరమైన నీ మాటలను దాచటం దేనికీ, అని నిలదీస్తున్నట్లుగా అడుగుతోంది.

ఓ వేంకటరాయడా నీ మోహపూరితమైన సుద్దులు నా ముంగిట్లోకి వచ్చాయి. అలా ముంగిట్లోనే మొదలైన ఆ సుద్దులు అంగడికెక్కాయి కదా! అలా ఎవరైనా ముంగిట్లోనే సరసాలు మొదలుపెడతారటయ్యా నీమోహమూ నీవూను కాకపోతే. దానితో బజార్న పడ్దాం. ఊళ్ళో అందరూ మన విడ్డూరం గురించే చెప్పుకోవటమూ నవ్వుకోవటమూ కదా! నీ సరసవచానాలు నాకు కొంగుబంగారాలు ఐనాయి. కోరిన కోరికలన్నీ శుభప్రదంగా తీరుస్తూ ఉన్నాయిలే. అసరసవచనాలు ఎప్పుడూ నామూతిని ఎంగిలి చేసి వదలటమే కదా అని అమ్మవారు ముసిముసి నవ్వులు చిందిస్తూ అంటున్నది. ఇలా స్వామితో ముచ్చటించటం అంతా అయనలో నేడు కనిపిస్తున్న ముభావాన్ని వదిలించటానికే.

మరలా అమ్మవారు ఇలా అంటోంది. నీ ముచ్చట్లు ఎంత గుట్టుగా ఉంటాయో తెలిసిందే అందరికీ. అందుకే ఈమహానుభావుడి నేటి వ్యవహారం ఏమిటో అని అందరూ పొంచి దొంగతనంగా మననిచూడటమే నిత్యమూ. నీకైతే పట్టింపే‌ లేదు కదా! ఇలా అందరి చెవులా పడేలా నువ్వాడే సరసాల గురించి చెప్పేదేముంది. ఇన్నా అన్నా? ఎంచబోతే లెక్కేలేనన్ని కదా!

నీ‌అంతులేని సరసవచనాలు భోజనాల దగ్గరైనా ఆకాసేపైనా ఆగేది ఉందా అంటే, ఏమి చెప్పేది. ఆధరవులపైన వంకలు పెట్టి కూడా చిత్రమైన సరసవాక్యాలు చెప్తావు కదా. (అన్నమయ్య గారు వేరొక సందర్భంలో కంచపురతులు అన్న చిత్రమైన ప్రయోగం కూడా చేసారు) కంచాల దగ్గర నీ సరసాలు అంతూ పొంతూ లేనివి కదా. అవి మోపులుమోపులుగా పేరుకొని ఉన్నాయి. అవి నాతలకెక్కి దించరాని మాధుర్యాన్ని అందిస్తూ ఉన్నయి నిత్యమూ.

అబ్బే మోపులుమోపు లేమిలే నీసరసాలు అంత చిన్న ఉపమానం సరిపోతు. అవి ఇసకపాతరలే అనుకో. ఎంత తవ్వుకొన్నా తరగకుండా ఉండేవి కదా. అలా అనటమే‌ బాగుంటుంది.

అమ్మవారు ఇలా ఆ శ్రీవేంకటేశ్వరుని సరసవచనాలను గురించి తన భావన ఎలా ఉందో చెప్తూ ఉండే సరికి అయ్యవారికి అనందం కలిగింది. ముభావంగా ఉన్న మోము విచ్చుకుంది.

అంతలోనే ఆయన ముసిముసి నవ్వుల విరజిమ్ముతూ అమ్మను తిలకించటం మొదలుపెట్టాడు ఇంకా ఏమంటుందా అని.

ఓ వేంకటేశా ముందుగా ముసిముసి నవ్వులు పూసాయి నీమోముపై. అమ్మయ్య నన్ను కరుణించావు. సంతోషం. ఇదిగో మళ్ళా విజృంభిస్తున్నావు ఉత్సాహంతో.  బాగుంది బాగుంది ఇలా ఉండాలి అంటోంది అలమేలు మంగమ్మ.


15, ఫిబ్రవరి 2023, బుధవారం

రామా యన నట్టి బ్రతుకు రాణించేనా

రామా యన నట్టి బ్రతుకు రాణించేనా
రాముడు కరుణించని బ్రతుకు పండేనా

మబ్బులే లేక వాన మహిని కలిగేనా
జబ్బులేని వాని కౌషధము లొప్పానా
కొబ్బరిచెట్టెక్కి గండుకోయిల కూసేనా
ఇబ్బందులు లేని బ్రతుకు లిలను కలిగేనా

సువాసనయె లేని విరుల సుదతి మెచ్చేనా
నివేదనయె లేని పూజ నేల నుండేనా
ప్రవాహమే లేని నది వసుధ నుండేనా
వివాదము లుండు చోట విబుధు లుండేరా

ఆరగించకుండ రుచి యసలు తెలిసేనా
మారడగని వారి విందు మంచిదయ్యేనా
నారాయణ యనక ఆనంద మబ్బేనా
శ్రీరామా యనక మోక్షసిధ్ధి కలిగేనా

చెప్పనలవి కాదు వీని చిత్రములు

చెప్పనలవి కాదు వీని చిత్రములు జనులార
గొప్పలు కావండి రామగోవిందు డింతే

ఊళ్ళుతిన్న రాకాసి నొక్కబాణము వేసి
భళ్ళున నేలమీద పడగొట్టెను
త్రుళ్ళుచు వచ్చిన దుర్మార్గుని చయ్యన
వెళ్ళి సముద్రమున పడ విసరివైచెను

మూడుఘడియలలోన ముష్కరుల ఖరాదుల
జాడలణచె పదునాల్గు సహస్రంబుల
ఆడెను బంతులాట లారావణు తలలతో
వేడుకతో దివిజులు వీక్షించుచుండ

వినయముతో నెవ్వరు తనను శరణుజొచ్చిన
ఘనముగా శుభములే‌ కట్టబెట్టెను
తననామమె మీకు భవతారక మంత్రంబని
అనుమతించి భక్తుల నాదరించెను


14, ఫిబ్రవరి 2023, మంగళవారం

కాంతపై మిక్కిలి - అన్నమాచార్య శృంగారసంకీర్తనం


        గౌళ
కాంతపై మిక్కిలి బత్తిగలిగిన చెలులాల
పొంత నీపె వేడుకలు పొసగగ జేయరే

వనములో కోవిలల వట్టి రట్టు సేయనేల
పెనగి తుమ్మెదల కోపించనేల
పనివడి చందురునిపై నేరమెంచనేల
వినయాన విభునికే విన్నపము సేయరే

గూటిలోని చిలకల కొసరి జంకించనేల
నీటున జల్లగాలిని నిందించనేల
పాటించి వసంతునితో పంతాలు దూయనేల
మాటలాడి విభుని నెమ్మదిని రప్పించరే

పంచనున్న పావురాల బదరి తిట్టగనేల
పంచసాయకుని నొడబరచనేల
ఎంచగ శ్రీవేంకటేశు డిదె వచ్చి యింతి గూడె
మంచివాయె బనులెల్లా మనవులు చెప్పరే

ఇది 29వ సంపుటి లోని కీర్తన.

 


 

ఈ సంకీర్తనలోని కొన్ని పదాలకు ముందుగా అర్ధాలు చూదాం. చాలావరకు పదాలన్నీ తెలిసినవే అందరికీ.

కాంత అంటే స్త్రీ. బత్తి అంటే భక్తికి వికృతి రూపం. అలాగే కోవిల అనేది కోయిలకు మరో రూపం. నీటున అంటే ఇక్కడ అందంగా తెలివిగా అని. వదరు అంటే ఎక్కువగా మాట్లాడటం. పంచసాయకుడు అంటే మన్మథుడు. ఒడబరచటం అంటే ఒప్పించటం. ఈ సాహిత్యంలో ఈపె అన్నమాట తరచు వస్తూ ఉంటుంది - ఈపె అంటే ఈమె అని అర్ధం. వనము అంటే ఏదో అడవి అనుకొనేరు. క్రీడోద్యానం అన్నమాట - అందులో ఛప్పన్న వృక్షాలూ అనేకరకాల పుష్పజాతులూ ఉంటాయి. రట్టుచేయటం అంటే తిట్టటం నిందించటం అని అర్ధం.

ఈ కీర్తన అలమేలుమంగమ్మను గూర్చి ఒక చెలికత్తె మిగిలిన చెలికత్తెలను హెచ్చరిస్తూ చెప్పినట్లుగా ఉన్నది.

ఇప్పుడు ఈ సంకీర్తనాన్ని అర్ధం చేసుకుందాం.

అది వసంతఋతువు. అయ్యవారూ అమ్మవారూ ఒక సమయం చేసుకున్నారు. అంటే ఈరోజు సాయంకాలం చంద్రోదయం వేళకు ఉద్యానవనంలో కాసేపు కులాసాగా కూర్చుందాం అని అనుకున్నారు. 

సమయానికి అమ్మ అలమేలుమంగ చక్కగా ముస్తాబై ఎంతో ఆసక్తితో అనందంగా క్రీడోద్యానవనానికి వచ్చి అయ్యవారికోసం ఎదురుచూస్తూ ఉన్నది.

క్రీడోద్యానం అన్నాక అక్కడ అనేక ఫలవృక్షాలూ పూలమొక్కలూ పూపొదలూ గట్రా ఉన్నాయి.

ఫలవృక్షాలన్నా మావిడిచెట్లు లేకుండా ఉంటాయా ఏమిటి చెప్పండి? మామిడి చెట్లూ వసంతఋతువూ అన్న తరువాత అక్కడ కోయిలలు గుంపులుగుంపులుగా కొమ్మకొమ్మనా హడావుడి చేస్తూ ఉండవా మరి!

పెత్తనాలు చేసివచ్చిన చిలకలు ఎన్నో ఎన్నెన్నో గూళ్ళకు తిరిగి వచ్చి హడావుడిగా అరుస్తున్నాయి. వాటితో పాటే పావురాలూను.

ఒక ప్రక్క సాయంకాలం ముదిరిపోతోందన్న తొందరలో తుమ్మెదలు గోలగోలగా పువ్వుల దగ్గర ఝుంకారాలతో హోరెత్తిస్తున్నాయి.

చల్లటి సాయంకాలం వేళ పిల్లగాలి మెల్లగా వీస్తున్నది హాయిగొలుపుతూ.

కొంతసేపు అలమేలు మంగకు ఈవినోదం అంతా మంచి కాలక్షేపంగానే ఉన్నది.

అయ్యో సాయం సంధ్య దాటి చంద్రోదయ వేళ అవుతోందే, శ్రీవారేమిటీ పత్తాలేరు అని ఆమెకు విరహం హెచ్చి పోతూ ఉంటే ఈవినోదాలే వెగటయ్యాయి! కొంచెంసేపు హాయి నిచ్చినవే ఇప్పుడామె మనస్సును నొప్పిస్తున్నాయి.

శృంగారం రెండు రకాలూ‌ అని చెప్తారు. ఒకటి సమాగమశృంగారం రెండవది వియోగశృంగారం. 

ప్రియసమాగమంలో ఏవేవి ఐతే ఆహ్లాదకరమూ శృంగారోద్దీపకమూ అని పేరుపడ్డవి ఉంటాయే అవి వియోగావస్థలో దుర్భరంగా ఉంటాయి.

వివిధరకాలుగా విరహావస్థలను వర్ణించి చెప్పటం అంటే కవులకు భలే యిష్టం. కావ్యసంప్రదాయంలో అన్ని కావ్యాలలోనూ ఇదొక ప్రథానమైన అవకాశంగా దొరకబుచ్చుకొని మన కవులు రెచ్చిపోతారు.

మన్మథుడు అని ఒకడున్నాడు. వాడు భలే‌ తుంటరి. రకరకాలుగా ప్రేయసీప్రియులకు ఆకర్షణ కలిగించటం వాడి పని. ఆ మహాకార్యక్రమంలో వాడికి తోడ్పాటుగా పెద్దవ్యవహారమే ఉంది.

ఆది శంకరులు సౌందర్యలహరీ స్తోత్రంలో ఈవిషయకంగా ఒక శ్లోకం చెప్పారు. బాగుంటుంది చిత్తగించండి. 

ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః 
వసన్త స్సామన్తో మలయమరు దాయోధన రథః! 
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్ 
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే!!

ఈ అందమైన శ్లోకంలో ఏమని ఉందంటే శంకరులు లలితాపరాభట్టారికా అమ్మవారితో అంటున్నారు. ఈ‌మన్మథుణ్ణి చూడమ్మా. వీడి ధనుస్సు చూస్తే పూవులతో కూర్చినది. అంటే సుతిమెత్తనిది. ఆవింటికి అల్లెత్రాడు అంటావా తుమ్మెదల బారు అట! వాడిచేతులో ఉన్న బాణాలు చూస్తే ఐదంటే ఐదే నట. వాడికి సహాయంగా నిలబడేది ఎవడయ్యా అంటే వసంతుడట సంబడం - వాడు ఉండేదెన్నాళ్ళని కూడా? వాడి రథమట మలయమారుత మట. అదేమో ఎప్పుడే దిక్కుగా పోతుందో దానికే తెలియదు. ఇంకా ఈ పటాటోపం అంతా వెంటవేసుకొని తిరిగే వీడికైతే అస్సలు శరీరమే లేదు. అబ్బే, అబ్బే. ఎందుకు పనికి వస్తాడమ్మా! కాని తమాషా ఏమిటంటే తల్లీ, నీ అనుగ్రహం పొంది నీ కడగంటి చూపు సంపాదించి ఈప్రపంచాన్నంతా జయించి గడగడలాడిస్తున్నాడు. అని.

గమనించండి. అమ్మావారు లలితాపరాభట్టారికను ఉపాసించే ఋషుల్లో మన్మథుడు ఒకడని సంప్రదాయవాక్యం.

ఇప్పుడు అర్ధమైనది కదా, ఈ వసంతమూ, ఈపువ్వులూ, తుమ్మెదలూ వగైరా అంతా మన్మథుడి పార్టీ అని.

అలాగే ఈమన్మథుడికి చిలుకతత్తడిరౌతు అన్న బిరుదం కూడా ఉంది. అంటే మరేమీ లేదు ఆయన వాహనం చిలుక అని. చిలుక గుర్రాన్ని స్వారీ చేసే రౌతు అని. ఇప్పుడు చిలుకలూ మన్మథుడి పార్టీయే అని తెలిసింది కదా.

ఇకపోతే చంద్రుడనే వాడూ మన్మథుడి పార్టీ అనే చెప్పాలి. విరహావస్థలో ప్రేమసీప్రియులకి చల్లని వెన్నెల వేడిగా అనిపిస్తుందని కవిసమయం. చంద్రుడికి శృంగారవర్ణనకూ సాహిత్యంలో బోలెడంత గ్రంథం ఉంది. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈసందర్భం చూసుకొని చంద్రుణ్ణి తిట్టించని కవిలేడు. ఒకాయన ఐతే అంటాడూ నీకు జాలి దయా ఎక్కడివయ్యా చంద్రుడా నువ్వు తురకల జండా ఎక్కి కూర్చుంటావు కదా అని!

అందాకా ఎందుకు చందమామను చూపకుండా సినిమావాళ్ళు మాత్రం వదులుతారా చెప్పండి.సినిమాల్లో చందమామ మీద ఉన్నన్ని పాటలు మరే ఇతర వస్తువుమీదా లేవు కదా! మనలో మనమాట సినిమాచంద్రుడికి చచ్చినా చిన్నమచ్చ కూడా ఉండదు.

సరే ఇప్పుడు అమ్మవారు ఎదురుచూస్తూ విరహంలో ఉంటే సాయంత్రం దాటి చంద్రోదయమూ ఐనది. ఆవిడ విరహాన్ని రెచ్చగొడుతున్న వాతావరణాన్ని గమనిస్తూ, ఆవిడ వేదన చూడలేక చెలికత్తెలు మన్మథుణ్ణీ వాడి పరివారాన్నీ కట్టగట్టి తిడుతున్నారు! అదీ సందర్భం.

ఈమహానుభావుడు శ్రీవేంకటేశ్వరుడేమో ఎంతకూ రాడాయె.  

ఆచెలికత్తెలలో ఒకామె ఇతరులతో అంటున్నదీ,  అలమేలుమంగమ్మపై మిక్కిలి భక్తిప్రపత్తులున్న ఓ చెలులారా,

మీరు మన క్రీడోద్యానంలోని కోయిలలను పట్టుకొని ఎందుకు తిడుతూ అల్లరి చేస్తున్నారు? పూవులకోసం పోటీలు పడి ఝుంకారాలు చేస్తున్న తుమ్మెదలను చూసి ఎందుకు కోప్పడుతున్నారు? పనిగట్టుకొని చంద్రుణ్ణి చూసి ఎందుకు నేరాలెంచుతున్నారు? ఎందుకర్రా యీ‌ మాటలన్నీను? తిన్నగా మీరేమన్నా చెప్పుకోదలచుకుంటే వెళ్ళి శ్రీవారికే విన్నవించుకో రాదా? ఎందుకీ పనులు అమ్మకు ఉత్సాహం కలిగించేలా మాట్లాడండర్రా.

ఆ చిలకలను చూడండి, వాటి మానాన  అవి ఉంటే వాటిని బెదిరిస్తూ మాటలెందుకూ మాట్లాడటం? ఆ చల్లని పిల్లగాలిని పట్టుకొని నిందించటం ఏమిటి మరీ అందంగా ఉంది. అదేం చేసిందీ? ఆ వసంతుడితో నువ్వెంతపోరా అంటూ ఆ పంతాలు పలకటం ఏమిటీ? ఈ‌డాబుసరి హడావుడులు అన్నీ ఎందుకమ్మా? శ్రీవారి దగ్గరకే వెళ్ళి మీ నేర్పేదో చూపి నెమ్మదిగా సామవాక్యాలు పలికి రప్పించరాదా?  అందాకా మిగిలిన వాళ్ళు అమ్మకు ధైర్యోత్సాహాలు కలిగేలా మాట్లాడరాదా?

అ అరుగుల మీద వాలుతున్న పావురాలను చూసి నోటికి వచ్చినట్లు తిడితే ఏమెస్తుందీ మీకు? ఆ మన్మథుణ్ణి బ్రతిమాలి ఒప్పించాలని ప్రయత్నాలేమిటీ?
 
ఉండండి ఉండండి. ఇదిగో శ్రీవారు విచ్చేస్తున్నారు. అల్లదే చూడండి.

ఇదిగో ఆయన రానే వచ్చారు అమ్మవారి దగ్గర ఉన్నారు.

రండి. వీరికి వేడుకగా ఏమేమి ఉపచారాలు చేయాలో ఆసంగతి చూదాం పదండి. చేసినపనులు చాలు కాని వాళ్ళకి ఏం కావాలో చూదాం. పోయి మనవి చేసుకుందాం రండి.

ఇలా చెలికత్తె ఒకామె మిగిలిన చెలికత్తెలతో అన్నమాటలు ఈసంకీర్తన.

ఆరేళ్ళ సీత యెత్తె నాచాపము

ఆరేళ్ళ సీత యెత్తె నాచాపము ఈ
శ్రీరాము డెత్తినట్టి శివచాపము

ఆటగాను సీత యెత్తె నాచాపము రాముని
మేటి భుజశాలిగ నేడు చాటినట్టి చాపము
నేటిదనుక జనకునింట నిక్కినట్టి చాపము
వాటముగ రామునకు వశమైన చాపము

అలవోకగ సీత యెత్తె నాచాపము రాముం
డలవోకగ నెత్తినట్టి హరదేవుని చాపము
పెళపెళమని విరిగినదా బేసికంటి చాపము
కలకలము రేపినట్టి ఘనమైన చాపము

ఇరువురకును జేజిక్కిన హరుని దివ్యచాపము
మరియెవరికి వశముకాని మహిమాన్విత చాపము
ఇరువురను కలిపినదా పరమశివుని చాపము
పరమకల్యాణకరమై వరలినట్టి చాపము


ఎవ్వరే మందురయ్య యినకులతిలక

ఎవ్వరే మందురయ్య యినకులతిలక నీ
కవ్వల నివ్వల భక్తు లందరు గనుక
 
ఒకని గొట్టి బూడిదచేసి యొకని యదధి ద్రోయుటేమి
ఒకని కొక శిక్షవేసి యింకొకని నేల విడచినావు
అకట పక్షపాత మేమి యనరులే నిన్నెవ్వరును
వికచసరోరుహనేత్ర వీరాధివీర
 
మాయాతీతుడవయ్యు మాయదారి లేడి వెంట
పోయినావు లచ్చుమయ్య మొత్తుకొన్న వినకుండ 
న్యాయమేనా శ్రీరామ యనరులే‌ నిన్నెవ్వరును
వేయేలా లీలందురు విశ్వవందిత

సీత నెత్తుకపోయిన చెడ్డవాడు రావణుడు
చేతజిక్కి దీనుడైన చిదుమకుండ విడచుటేల
ఆతనిపై దయజూపు టవసరమా యనరు లేరా
నీతిశాలివందురులే నీరేజనేత్ర


13, ఫిబ్రవరి 2023, సోమవారం

రామనామము చేయరే రామనామము

రామనామము చేయరే రామనామము - ఆ
స్వామినామము చేసిన మాకేమిలాభము
 
కోరిన సంపదల నిచ్చును కోదండధరుని నామము నో
రారగా పలుకాడితే మీకాపదలను కాయును 
 
సకలభయముల నుండి మిమ్ము చక్కగా రక్షించును కో
రకెనె మీకు సర్వశుభముల లక్షణముగా నిచ్చును
 
కోటిజన్మల పాపరాశిని గొబ్బున దహియించును ఆ
రాటములనే తీర్చి తాపత్రయము నణచి వేయును

ఘోరసంసారార్ణవంబున గొప్పనౌకగ నుండును ఇక
మీరు మరల పుట్టవలసిన కారణంబే యుండదు
 
ఈశ్వరాదులు చేయునట్టిది యెంతో గొప్ప నామము అది
శాశ్వతంబగు పదమునిచ్చు చక్కనైన నామము

చేయుదుము శ్రీరామనామము చిత్తశుధ్ధిన నెప్పుడు మా
కాయువును సంపదలు మోక్షము నందజేసెడు నామము
 

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ - అన్నమాచార్య శృంగారసంకీర్తనం.         సామంతం

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ
అక్కర దీరిచి పతి నలమేలుమంగ           
             
కన్నులనె నవ్వునవ్వి కాంతునిఁ దప్పక చూచి
మిన్నక మాటాడీ నలమేలుమంగ
సన్నలనె యాస రేఁచి జంకెన బొమ్మలు వంచి
అన్నువతోఁ గొసరీని యలమేలుమంగ              

సారెకుఁ జెక్కులు నొక్కి సరుసనె కూచుండి
మేరలు మీరీ నలమేలుమంగ
గారవించి విభునికిఁ గప్పురవిడెమిచ్చి
యారతు లెత్తీ నదె యలమేలుమంగ            

ఇచ్చకాలు సేసి సేసి యిక్కువ లంటియంటి
మెచ్చీ నతని నలమేలుమంగ
చెచ్చెర కౌఁగిటఁ గూడి శ్రీ వేంకటేశ్వరుని
అచ్చముగా నురమెక్కీ నలమేలుమంగ        

ఇది అన్నమాచార్యుల వారి శృంగారసంకీర్తనం. తితిదే వారు ప్రచురించిన ఏడవ సంపుటం లోని 21వ సంకీర్తనం.

 


ఈ కీర్తన లోని కొన్ని పదాలను ముందుగా పరిశీలిద్దాం.

మిక్కిలి:  చాలా.
అక్కర:   అవసరం.
మిన్నక:   ఊరుకోకుండా, అప్రయత్నంగా, చల్లగా.
సన్నలు:   సంజ్ఞలు.
జంకెన:   బెదరింపు.
బొమ్మలు:  కనుబొమలు
అన్నువ:   స్వల్పము.
సారెకు:   మాటిమాటికి.
చెక్కులు:  చెంపలు.
మేరలు మీరు: హద్దులు దాటు.
విడెము:   తాంబూలము.
ఇచ్చకాలు:  సరసాలు
ఇక్కువలు:  కళాస్థానాలు.
చెచ్చెర:    వెంటవెంటనే.
ఉరము:   వక్షస్థలము.

అలమేలు మంగ అమ్మవారు చాలా నేర్పుగల పడతి సుమా అని అన్నమాచార్యుల వారు ఈకీర్తనలో ప్రతిపాదిస్తున్నారు. ఎందుకలా అంటాం కదా అని వివరణలను ఇస్తున్నారు.

ఆమె కన్నులతో నవ్వుతున్నదట! అంటే సంతోషభావం ఆవిడ కళ్ళల్లోనే కనిపిస్తున్నది. అటువంటి సంతోషం వెలిబుచ్చే‌కళ్ళతో ఆమె భర్త ఐన శ్రీవేంకటేశ్వరుని పదేపదే చూస్తూ చల్లగా ప్రియమైన మాటలు చెబుతున్నదట. అంటే ఓరకళ్ళతో చూసీచూడనట్లే చూస్తూ అందంగా ఆయనతో సంభాషణ చేస్తున్నది అని పిండితార్ధం. అంతే కాదు తన వివిధమైన సంజ్ఞలతో ఆయనకు ఆశలు రేకెత్తిస్తూ సరసవాక్యాలు మాట్లాడుతూ ఉన్నది. అలాగని ఆయన కొంచెం చొరవచూపించినంత మాత్రాన ఏమి చేస్తోందండీ? ఆవిడ కనుబొమలు మన్మథుడి విండ్లలాగా ఉన్నాయి కదా వాటిని కొంచెంగా ముడివేసి వంచి చూస్తూ బెదిరిస్తున్నట్లుగా అభినయం చేస్తూ ఉంది. ఇలా అలమేలుమంగమ్మ ఆయనతో కొసరికొసరి సరసాలాడుతూ ఉన్నది.

కనుబొమలు మన్మథుడి విండ్లలాగా ఉండటం గురించి సౌందర్యలహరీ స్తోత్రంలో శంకరులు ఇలా అంటారు.

భువౌ భుగ్నే కించిద్భువన భయభంగవ్యసనిని  
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్‌ 
ధను ర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః  
ప్రకోష్టే ముష్టాచ స్థగయతి నిగూఢాంతర ముమే.  
 
ఇది సౌందర్యలహరిలో 47వ శ్లోకం.

ఈ శ్లోకం భావం ఏమిటంటే, అమ్మా నీ కనుబొమలు తుమ్మెదల బారులాగా నల్లగా అందంగా ఉన్నాయి. అవి కొంచెం వంగి ఉన్నాయి. మన్మథుడి విల్లులా అనిపిస్తుందమ్మా వాటి తీరు. రెండు బొమలూ కలిపి ఒక విల్లు. కాని మధ్యలో కొంత భాగం కనబడటం లేదు. కాబట్టి రెండుగా కనిపించటం అంతే. ఆఁ అక్కడ మన్మథుడు తనచేతితో పట్టుకొన్నాడు కదా వింటిని. అందుకే కొంచెం అక్కడ మరుగు అయ్యింది. అంతే నమ్మా" అని.

ఈవిధంగా కనుబొమలను మన్మథుడి వింటితో పోల్చటం అనే‌ శృంగారసంప్రదాయం ఒకటుంది కదా. అలా ఆ మన్మథుడి వింటి వంటి కనుబొమలను అలమేలుమంగ మాటిమాటికీ కొద్దిగా కదుపుతూ ఉంటే అమన్మథచాపాన్ని ఎక్కుపెట్టటం విన్యాసంలా ఉంది.

కాని తాను మాత్రం తిన్నగా ఎదుటనే కూర్చుంటుందా ఇలా మాట్లాడుతూ? ఊఁ హూఁ. కూర్చోదు. ఆయన ప్రక్కనే వచ్చి కూర్చుంటుంది తాకుతూ. తానే హద్దు మీరి ఆయన బుగ్గలు నొక్కుతూ వినోదిస్తూ ఉంటుంది.

కొద్ది సేపటికి ఆవినోదం చాలించి ఆయనకు ప్రేమతో కర్పూరతాంబూలం అందిస్తుంది. ఆయనకు తన దృష్టే తగులుతుందని భయపడినట్లుగా హారతి ఇచ్చి దిష్టితీస్తుంది!

ఇలా ఆయనతో సరసాలు ఆడీఅడీ సంతోషిస్తుంది. అయనకు వివిధోపచారాలు చేస్తుంది.

అయన కళాస్థానాలు అంటి సంతోషిస్తుంది. కళాస్థానాలు పదహారు. అవి శృంగారశాస్త్రానికి సంబంధించినవి. 1. తల, 2. ఎదురురొమ్ము, 3. చేతులు, 4. కుచములు, 5. తొడలు, 6. నాభి, 7. నుదురు, 8. కడుపు, 9. పిఱుదులు, 10. వీపు, 11. చంకలు, 12. మర్మస్థానము, 13. మోకాళ్ళు, 14. పిక్కలు, 15. పాదములు, 16. బొటన వ్రేళ్ళు అనేవి.

ఈపదహారు కళాస్థానాలు మళ్ళా చంద్రకళలతో ముడిపడి ఉంటాయి. ఏరోజున ఏతిథి అవుతున్నదో దానికి సంబంధించిన కళాస్థానం మిక్కిలిగా శృంగారోద్దీపనశక్తిని కలిగి ఉంటుందని శాస్త్రం. ఇవి సంచరించే క్రమం శుక్లపక్షంలో ఒకరీతిగానూ కృష్ణపక్షంలో వేరొక రీతిగానూ ఉంటుంది. మరలా ఇవి పురుషులకూ స్త్రీలకు భిన్నవిధానాల్లో సంచరిస్తాయి.  కాబట్టి ఈసంగతి చక్కగా తెలిసిన వారు తగిన కళాస్థానాన్ని స్పృశించటం ద్వారా శృంగారభావోద్దీపనం చేయగలరు.

ఈకళల వ్యవహారం గురించి ఒక ఐతిహ్యం ఉంది. మండనమిశ్రులను వాదంలో‌ కాలడి ఆదిశంకరులు జయించారు. ఓడిన మండనమిశ్రుడు సన్యాసం స్వీకరించాలి. కాని ఆయన భార్య  ఉభయభారతి ఒక అడ్డుపుల్ల వేసింది. 

"శంకరా, భార్య భర్తలో అర్ధభాగం కదా. నువ్వు మండనులు అనే ఒక అర్ధభాగాన్ని జయించావు సంతోషం. ఇంకా నువ్వు ఈఉభయభారతి అనే అర్ధభాగాన్నీ జయిస్తే తప్ప నీవిజయం పరిపూర్ణం కాదు సుమా. అహా, నీకు తెలియదని కాదు. ముందుముందు ఎవరూ ఈమాట లేవనెత్తి నీవిజయం అసమగ్రం అనకుండా ఉండేందుకే గుర్తుచేస్తున్నాను" అన్నది. 

శంకరులు "సరే నమ్మా, నీకు ఇచ్చవచ్చిన శాస్త్రంలో ప్రశ్న వేసి వాదం ప్రారంభించు" అన్నారు.

"శంకరా, కళాస్థానాలు ఎన్ని? అవి యేవేవి? స్త్రీకి ఏఏ దినాల్లో అవి ఎలా సంచరిస్తాయి" అని ప్రశ్నవేసింది ఉభయభారతి.

శంకరుడు నిర్ఘాంతపోయాడు. పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లైంది. సమాధానం చెప్పగలడు. కాని చెప్పకూడదు. సన్యాసివి నీకు ఎలా తెలుసు అనగలదు. అంతే కాదు స్వానుభవం లేకుండా శాస్త్రం వల్లెవేయటం అని ఎత్తిపొడవగలదు.

"అమ్మా ఉభయభారతీ. నీవు సాక్షాత్తూ సరస్వతీదేవివి! ఒక సన్యాసిని శృంగారశాస్త్రంలో పరీక్షిస్తున్నావా అమ్మా! తప్పు అనకూడదు. నేను కాశ్మీరం వెళ్ళి నీ సర్వజ్ఞపీఠాధిరోహణం చేయాలని ఆశించేవాడిని. నీకు తెలుసు. అన్ని శాస్త్రాలూ తెలిసి ఉండాలి నాకు. ఈశాస్త్రం తెలిసినా దాని గురించి మాట్లాడే అధికారం లేదు ప్రస్తుతం. నువ్వు గడువు ఇస్తే మరలా వచ్చి నీప్రశ్నకు జవాబులు చెప్తానమ్మా" అన్నాడు.

ఉభయభారతి నవ్వి "అలాగే‌ శంకరా, నాకు తొందరేమీ లేదు. జవాబును మళ్ళీ వచ్చి చెబుదువు గానిలే" అని అంగీకరించింది.

ఆపిమ్మట శంకరులు పరకాయప్రవేశం చేసి ఒక రాజు శరీరంలో కొన్నాళ్ళు ఉండి తిరిగివచ్చి ఉభయభారతిని వాదానికి పిలిచారు. ఆవిడ అన్నదీ "శంకరా, అంతా తెలుసును నాకు. నీవిజయం పరిపూర్ణం అయ్యింది. ఇంక మండనులకు సంతోషంగా సన్యాసానికి అనుమతి నిస్తున్నాను" అన్నది. 

అప్పుడు మండనులకు సన్యాసార్హత వచ్చింది. భార్య అనుమతి లేనిదే భర్త సన్యాసం స్వీకరించరాదు. ఆ మండనమిశ్రులు సురేశ్వరాచార్యులు అయ్యారు.

అమ్మవారికి తెలియని శాస్త్రం ఏముటుంది. ఆవిడ శ్రీవారి కళాస్థానాల్ని పదేపదే తాకుతూ ఆయనకు భావోద్దీపనం చేస్తూ వినోదిస్తున్నది.

ఇలా చేసి శ్రీవేంకటేశ్వరుడి కౌగిట చేరి ఆనందిస్తున్నది.

ఈకీర్తనను అచ్చముగా ఉరమెక్కే నలమేలుమంగ అని చెప్పి ముగించారు. అమ్మవారు శ్రీవేంకటేశ్వరులతో లీలావినోదం చేసి ఆయన అక్కర తీర్చి ఆనందంతో వక్షస్థలంలో చేరి ఉన్నది అని అర్ధం. ఈ అక్కర తీర్చటం అన్న ప్రతిపాదనను మనం పల్లవిలో చూడవచ్చును. కొంచెం ఈముగింపుకు శృంగారశాస్త్రపరమైన వేరే అన్వయం కూడా చెప్పవచ్చును కొందరు. కాని అది అంత అవసరం కాదనుకుంటాను.

పల్లవిలో అక్కర దీరిచి పతిని అనటంలో ఒక సొగసుంది గమనించండి. అక్కర పతిది. అది తీర్చటంలో అలమేలు మంగ మిక్కిలి నేర్పరి అట అలమేలమంగ. ఇంతకూ ఈశృంగారాభినయం అంతా శ్రీవేంకటేశ్వరుడి అక్కర అట. ఆయన గారు సంకల్పించబట్టి ఇంత గ్రంథం మిక్కిలి నేర్పుతో అమ్మవారు నడిపిందట. ఇదేదో పూజ చేసి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నట్లుంది! ఆవిడ ఇలా శ్రీనివాసుడి ఇఛ్చమేరకు నేర్పుగా శృంగారం అభినయించి మరలా అచ్చముగా శ్రీవారి ఉరమెక్కి వ్యూహలక్ష్మీ స్వరూపంతో విరాజిల్లుతోంది.

మనోహరమైన కీర్తన.

12, ఫిబ్రవరి 2023, ఆదివారం

ఇచ్చకము లాడరే యింతులాల - అన్నమాచార్య శృంగారసంకీర్తన 

        శ్రీరాగం
ఇచ్చకము లాడరే యింతులాల
పచ్చిజవ్వన మింతలో పదను దీసీనా

ఏఁటికి విభుఁడు రాడొ యింట నట్టే వుండనీ
మాటలైనా నాడి రారె మగువలాల
తాఁట తూఁటలూ నేల తావచ్చినట్టే వత్తము
పాటించిన నావలపు పండి పొల్లవొయ్యీనా

సొగసి యెంతపరాకో జూజాలట్టే ఆడీని
మొగమైనాఁ జూచి రారె ముదితలాల
యెకసక్కే లిఁకనేల యేకమౌద మీతనితో
నగఁగానే సరసాలు నాని విరిసీనా

కాయమెంత యలసెనో‌ కడు దప్పిదేరనీ
చేయెత్తి మొక్కెయిన రారె చెలియలాల
యీయెడ శ్రీవేంకటేశు డేతెంచి తా నన్నుఁ గూడె
కోయరాని కోరికలు కొలఁది నుండీనా

(అన్నమాచార్య శృంగారసంకీర్తనలు 7వ సంపుటంలో 20వ కీర్తన)
 

ఈ కీర్తన కూడా కొంచెం క్లిష్టమైనది లాగానే ఉంది.  ముందుగా దీనిలో ఉన్న కొన్ని పదాల అర్ధాలు తెలుసుకుందాం:

జవ్వనము:  యౌవనము
పదను దీయు:  వాడి తగ్గు.
తాఁట తూఁట: సగంసగం అరకొర
పాటించు: ప్రకటించు
పొల్లవోవు:  వ్యర్ధం అగు.
సొగయు:  పరవశించు
జూజాలు:  జూదాలి
దప్ప: శ్రమ.
ఇంతి: మగువ: ముదిత: చెలియ:  స్త్రీ (ఇక్కడ చెలికత్తెలను ఉద్దేశించి)

పల్లవిలో అమ్మవారి పలుకు "ఇచ్చకము లాడరే యింతులాలా , పచ్చిజవ్వన మింతలో పదను దీసీనా!" అని ఉంది. అమ్మ చెలికత్తెలను ఉద్దేశించి చెబుతున్న మాటలు. వాళ్ళని శ్రీవేంకటేశ్వరుడి వద్దకు పంపుతోంది. ఆయన గారు దక్షిణనాయకుడు కదా. ఇప్పటి వరకూ జాడలేడు. సంగతి సందర్భాలు తెలుసుకొని రండర్రా అని చెలికత్తెలను ఆదేశిస్తోంది ఆమె. మీరు వెళ్ళి ఆయనగారితో ఇచ్చకాలు (మనస్సుకు నచ్చే‌ మాటలు) చెప్పి తీసుకురండి. నాదింకా పచ్చిజవ్వనమేను (లేతవయస్సేను) ఇంతలోనూ పసతగ్గింది అనుకుంటున్నాడేమో కాస్త నాపట్ల మీరు అయ్యవారికి ఆసక్తి కలిగేలా సానుకూలవచనాలు(అదే‌లెండి ఇచ్చకాలు) చెప్పి తీసుకొని రండి అని వారికి చెబుతోంది.

ఇక చరణాలను పరిశీలిద్దాం. 

మొదటిచరణంలో అమ్మవారి పలుకుతున్నది ఏమిటంటే, అయన గారు ఎందుకని రావటం లేదో మరి. పోనీలెండి కావలిస్తే అలాగే ఇంట్లోనే ఉండమనండి. మీరు పోయి కనీసం మాటలాడి రండి (ఏమో మీ‌మాటలతో ఆయన మనస్సు కరిగి రావచ్చును కదా అని) ఇలా చెప్పి అంతలోనే కొంచెం నిరాశగా అంటోంది. ఐనా సగం సగం ప్రయత్నాలు ఎందుకు లెండి. ఆయన వచ్చినప్పుడే వస్తాడు. ఇలా ఆయనపట్ల నా ప్రేమ అంతా వికసించి వ్యర్ధం కావలసిందేనా! 

రెండవచరణంలో అమ్మవారి మాటలు. ఆయనకు ఎంతపరాకో అలాగే ఎక్కడికో పోయి జూదాలాడుతూ కూర్చుంటాడు పరవశించి (ఇక్కడ బావాజీ గురించి అమ్మవారి ఎత్తిపొడుస్తున్నారు!). ఇక నేను ఆసమయంలో గుర్తుకు రానే రాను కదా! మీరు వెళ్ళి ఒకసారి అయన గారి ముఖం చూచి రండి. మిమ్మల్ని చూసిన తరువాత ఐనా అయనకు నేను గుర్తుకు వస్తానేమో చూదాం. అని అంటున్నారు అమ్మవారు. మళ్ళీ అంతలోనే ఆయన్ను ఆక్షేపించటం ఉచితం‌కాదని అనిపించి ఇలా అంటోంది. ఐనా ఆయనతో మనకు ఎకసెక్కాలెందుకు లెండి. ఆయన ఇష్టం. భక్తుల దగ్గర అయనకు ఒళ్ళు తెలియదు కదా. దానికేం. మనం కూడా అయన ధోరణిలో కలిసి ఉండటమే మంచిది. అయన ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు కదా. ఇంక సరసోక్తులు మొదలౌతాయి కదా అంటోంది అమ్మవారు.

ఇక మూడవచరణంలో మాటలు. ఒక వేళ ఆయన అలసిపోయి విశ్రయించి యున్నాడేమో చూడండి. అయన బడలిక తీరనీయండి కాని అటువంటప్పుడు ఆయన్ను పలుకరించి శ్రమపెట్టకండి. ఐనా ఊరికే దూరం నుండి నమస్కారం చేసిరండి.

ఇలా అమ్మవారు చెలికత్తెలకు ఉపదేశం చేస్తూనే ఉండగా శ్రీవారు వేంచేసారు.
 
ఇంకేమర్రా. అయ్యవారిదే వచ్చి నాప్రక్కనే ఉన్నారు కదా. మరేం కావాలి! ఇంక పొందరాని కోరికలు అంటూ‌ ఏముంటాయి. అని అమ్మవారు చెలికత్తెలతో సంతోషంగా అంటోంది. 
 
మొత్తం మీద ఈకీర్తనకు అన్వయం అంత సుభగంగా కుదరటం లేదు అనే చెప్పుకోవాలి. మొదటి చరణంలో "తావచ్చినట్టే వత్తము" (తాను వచ్చినట్లే వద్దాం) అన్నది ఎలా అన్వయించాలి? వద్దాము అని చెప్పటం సరిగా అన్వయం కావటం లేదు. రెండవచరణంలోని "యేకమౌద మీతనితో" అన్నది మరింత గడ్డు సమస్య. ఏకం అవుదాం అని చెలికత్తెలను తనతో సమానం చేసుకోవటం ఏమిటీ? బోధపడటం లేదు. అలాగే అక్కడ సరసాలు నాని విరియటం కూడా సుగమంగా లేదు. చివరి చరణంలో "కోయరాని కోరికలు" అంటే కోరరాని కోరికలు అనుకోవాలి. మరొక దారి?

కొన్ని చిక్కులున్నా మొత్తం మీద కీర్తన భావం బాగుంది.


11, ఫిబ్రవరి 2023, శనివారం

సరిసరి హరి

సరిసరి హరి నీసరి యెవరయ్యా

కరుణను వరవిక్రమమునను


పరమామ్నాయము లెఱుగ మానవులు

కరమశక్తు లని కరుణతో నీవు

నరులారా నానామములను గొని

స్మరియించినదే చాలంటివయా


హరినామము లత్యధికం బనుచో

మరి రామా యనుమని శివు డనును

సురవిరోధులకు గరువము హెచ్చిన

హరిని వేడుడను పరమేశ్వరుడు


తరచుగ ధర్మము తప్పి రాక్షసులు 

సురనరపీడనపరులై నపుడు

పరిపరివిధముల ప్రభవించుచు ము

ష్కరులు గుంపులను చక్కజేసెదవు 


చిక్కని కీర్తనలు

చిక్కని కీర్తనలు చాలా చక్కని కీర్తనలు

మక్కువతో పాడే వారికి మంచి కీర్తనలు


అన్ని కీర్తనలు హరి పేరులతో నలరుచు నుండేవే

అన్ని కీర్తనలు హరి సత్కీర్తికి హారతు లెత్తేవే

అన్ని కీర్తనలు హరి గాథలనే యాలాపించేవే

అన్ని కీర్తనలు హరి లీలామృత మందించేవేలే


సారెకు రామా రామా యనుచు చక్కగ పాడేవే

తారకనామపు గొప్పదనంబును ధాటిగ చాటేవే

నోరారా సద్భక్తులు పాడగ ధారుణి వెలసినవే

శ్రీరఘురామున కంకితమగుచు చెలగుచు నుండేవే


పాడండీ మనభాగ్యమనగ ప్రభవించిన కీర్తనలను

పాడండీ శ్రీరామకృపాభాగ్యమిచ్చు కీర్తనలను

పాడండీ భవచక్రమునే పగులగొట్టు కీర్తనలను

పాడండీ హరిభక్తులార పరవశించి దినదినమును 


నీ కొఱకు పాడినది నీలమేఘశ్యామ

నీ కొఱకు పాడినది నీలమేఘశ్యామ
నా కొఱకు వినినదే‌ నాకు పదివేలు

ఏమెఱుగు నాగుణము లితడని నవ్వక
ఏమెరుగు నాతత్త్వ మితడని నవ్వక
ఏమెఱుగు నావిభవ మితడని నవ్వక
రామయ్య వినుటయే నీమంచితనము

తెలియగ నీగుణము నిల నెవ్వరికి వశము
తెలియుగ నీతత్త్వము దేవతలును నేరరు
కొలువ నీవిభవమును నలువకును వశమే
జలజాక్ష ననువినగ వలచితి వదిచాలును

నీకునై పాడుటది నాకు సంతోషమని
నీ కెఱుక యని నేను లోకేశ యెఱుగుదును
సాకేతనాథ భవచక్రప్రవర్తకా
నీకొరకు దినదినము నేనుపాడుదు నయ్య
10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

సరివచ్చెఁ గదవే చల్లేటి నీవలపులు - అన్నమాచార్య శృంగార సంకీర్తన
            దేసాక్షి

సరివచ్చెఁ గదవే చల్లేటి నీవలపులు
గరిమె నీరమణుఁడు గాలివంటి వాఁడు

తాలిమి గలవారికి తలఁపెల్లా నీడేరు
ఆలరి కోపకత్తెల కాయాలు సోఁకు
యేల తప్పక చూచేవు యెఱుఁగవా నీవిది
మేలిమి నీమగఁడు తుమ్మిదవంటి వాఁడు

చెంతనున్న వారికి చేతికి జిక్కు బనులు
పంతపు మగువలకుఁ‌  బట్టుఁ‌ జలము
మంతన మేమాడేవు మాఁటిమాఁటికి నాతోను
మంతుకెక్కి పతి నీడమానివంటి వాఁడు 

కూడినట్టి వారికి గుణము లెల్లా మంచివి
వేడుక వనితలకు వెలియే లోను
యీడనే శ్రీ‌వేంకటేశు నింతి నీవు గూడితివి
తోడ నితఁ‌ డెంచితే చంద్రుని వంటి వాడు


(అన్నమాచార్య శృంగార సంకీర్తనలు 8వ సంపుటం 78వ సంకీర్తన)

ఈ కీర్తనను అర్ధం చేసుకుందుకు కొంత ప్రయత్నం అవసరం. కనీసం నాకు అలా అనిపిస్తోంది. 

ముందుగా ఇందులో ఉన్న కొన్ని మాటలను మనం పరిశీలించుదాం.

సరివచ్చు:  సరిపోలటం సమానంగా ఉండటం.
వలపు:    ప్రేమ మోహము
గరిమ:    గొప్పదనం బరువు విధానం.
రమణుడు: అందగాడు భర్త.
తాలిమి:   క్షమ ధైర్యం ఓర్పు.
ఆలరి:    దుష్టుడు అవివేక దుశ్శీలుడు, దిక్కులేనివాడు, వ్యర్ధుడు.
కోపకత్తె:   కోపిష్టి యైన స్త్రీ.
కాయాలు: (కాయములు) శరీరములు.
సోఁకు:    తగులు
చలము:   వణుకు చపలత్వం.
మంతనము: ఆలోచన రహస్యం ఏకాంతం.
మంతుకెక్కు: ప్రసిధ్ధికి ఎక్కు. 
నీడమాను:  నీడ నిచ్చే చెట్టు.
వెలి:      బయట.
 
ఇదొక మంచి చమత్కార కీర్తనం. 
 
ఈ సంకీర్తనంలో చెలికత్తె అమ్మవారితో శ్రీవారి గొప్పదనం గురించి చెబుతోంది.
 
 అమ్మా మీ ఆయన అచ్చం గాలివంటి వాడమ్మా. (ఆయన వ్యాపించి ఉండని చోటే లేదు అని చెప్పటం) ఆయన మీద నువ్వు వెదజల్లుతున్న వలపులు బాగానే సరిపోయాయి.  ఇక్కడ చల్లేటి నీ వలపులు అని కదా. చల్లటం అంటే ఏదో పరిమళద్రవ్యం లాగా వెదజల్లటం అనుకోండి. నిత్య వ్యవహారంలో స్పే చేయటం అంటామే. అలాగా అన్నమాట. చెలికత్తె అంటోందీ,  నువ్వేమీ వలపుగంధాలు ఆయనమీద గుమ్మరిస్తున్నావు ఒకటే చిలకరించటం. ఒకటే చిలకరించటం. కానీ ఆయన ఏమో గొప్పదనంలో అచ్చం గాలివంటివాడు అని. అంటే అర్ధం అయిందా? గాలి ఏమి చేస్తుందండీ? పరీమళాన్ని నాలుగుదిక్కులా వ్యాపింపజేస్తుంది. వలపులు ఆవిడ అందిస్తే అది ఆయనగారు అన్నిచోట్లా పంచేస్తున్నాడమ్మా అని మేలమాడటం అన్నమాట. చెలికత్తె మాటల్లో అంతరార్ధం ఏమిటంటే వలపు రుచీ,  వలపింప నేర్పూ అవి ఆయనగారికి నీవు నీవలపుల ద్వారా తెలియజేసావు - ఆవిద్యను ఆయన నాలుగుచోట్లా తన వలపులు పంచటానికి వాడేస్తున్నాడమ్మా అని. ఇదంతా ఎలా కూపీ లాగామూ ఈపల్లవిలో విషయం ఇదీ అని అంటే దానికి మనకి దారి చూపినవి రెండు మాటలున్నా యిక్కడ చల్లేటి అని ఒకటీ గాలి అని మరొకటీను. గాలిలోనికి ఏమి చల్లుతారండీ సుగంధపరీమళ ద్రవ్యాలు కాక. అదీ సంగతి. ఈకీలకం పట్టుకున్న వెంటనే మనకి పల్లవిలో చెలికత్తె అమ్మవారితో చెప్తున్నదేమిటో అవగతం అవుతోంది అన్నమాట.

ఇప్పుడు మనం చరణాలను కూడా ఒక్కటొక్కటిగా అర్ధం  చేసుకొనే ప్రయత్నం చేద్దాం.

ముందుగా ఒకమాట. మొదటి చరణం చివరి పాదం "మేలిమి నీమగఁడు తుమ్మిదవంటి వాఁడు" అని ఉంది కదా. ఇక్కడ కొంచెం తికమక అనిపించవచ్చును. కొంచెం అవసరార్ధం ఇక్కడ పదాల స్థానాలు తారుమారయ్యాయి అంతే. ఈపాదాన్ని "నీమగఁడు మేలిమి తుమ్మిదవంటి వాఁడు" అని హాయిగా చదువుకోండి. అప్పుడు అన్వయం సులభంగా ఉంటుంది. సరేనా. సరేనయ్యా అలాగే చదువుకుంటాం కాని ఈ మేలిమి తుమ్మెద అన్న ప్రయోగం ఎందుకూ అని అంటే సరే, మనం అక్కడ నుండే మొదలు పెడదాం ఈ మొదటిచరణాన్ని పరిశీలించటం. 
 
మనుషుల్లో మెతకరకం గడుసురకం మొండిరకం అంటూ రకరకాలుగా ఉంటారు కదా. అలాగే సర్వత్రానూ అనుకోండి. అభ్యంతరం ఏమిటీ? మేలిమి తుమ్మెద అంటే తుమ్మెదల్లో మంచిరకం అన్నమాట. ఈ‌మంచిరకం ఏమిటో చూదాం. అసలు తుమ్మెద ప్రసక్తి ఏమిటో‌ చూడాలి ముందుగా. ఇది శృంగార సంకీర్తనం. ప్రసక్తిలో ఉన్నది తుమ్మెద. అందరికీ తెలిసినదే పురుషులను తుమ్మెదలతోనూ స్త్రీలను పూవులతో పోల్చటం అనే వ్యవహారం. కాబట్టి ఎక్కువ కష్టపడకుండానే శ్రీవారిని చెలికత్తె తుమ్మద అని అనటంలో సూచన గ్రహించటం‌ కష్టం ఏమీ కాకూడదు. తుమ్మెదతో పోల్చటం ద్వారా శ్రీవారు దక్షిణనాయకుడు అని అమ్మగారితో చెలికత్తె చెప్తున్నది అన్నమాట. అదేమీ కొత్త విషయం కాదు ఆవిడ కొత్తగా తెలుసుకోవలసిన విషయమూ కాదు.
చమత్కారం అంతా మేలిమి తుమ్మెద అనటంలోనే ఉంది! ఈ తుమ్మెద మేలిమి గుణం తుమ్మెద కాబట్టి ఏపూవు దగ్గర ఎలా ఉండాలో తెలిసినది. శ్రీవారు మేలిమి తుమ్మెద. అయన దక్షిణనాయకత్వాన్ని కోపగించుకోకుండా సహించిన వారికి అన్నికోరికలూ నెరవేరుతున్నాయి. అలాగని సహించం కోపం చేస్తాం అనే వారిని ఆయన విడిచే రకం కాదు. మంచి రకం తుమ్మెద కదూ. నీకిదంతా తెలిసిందే‌ కదటమ్మా. ఐనా ఎందుకమ్మా ఇదోదో కొత్తవిషయం అన్నట్లు చూస్తున్నావూ అని చెలికత్తె దెప్పుతోంది అమ్మవారిని.

ఇప్పుడు రెండవచరణాన్ని చూదాం. అందులో చివరిపాదంలో చివరిపాదంలో "మంతుకెక్కి పతి నీడమానివంటి వాఁడు" అంటోంది చెలికత్తె. సరిగా "పతి మంతుకెక్కి నీడమాని వంటి వాఁడు" అన్వయం చేసుకుందాం. నీడమాను అంటే మంచి నీడ నిచ్చే‌ చెట్టు.  అన్ని చెట్లూ గొప్ప నీడను పరచాలని ఏమీ లేదు. కొబ్బరిచెట్టో తాడిచెట్టో ఐతే అది అంతెత్తుంటుంది కదా. మరి దాని నీడ ఎంత గొప్ప విస్తీర్ణంగా ఇస్తుందీ. దాని నీడ ఏమి లాభం. ఎవడన్నా బాటసారి మర్రిచెట్టు నీడన దుప్పటీ‌ పరచుకొని హాయిగా నిద్రపోవచ్చును. ఆనీడ ఏమీ‌ దూరంగా జరిగిపోదు అతను నిద్రలేచినా సాయం సమయానికి, నీడలోనే ఉంటాడు. ఇలా జీవులకు హాయిని స్థిరంగా నీడనిచ్చే చెట్టే నీడనిచ్చే చెట్టు కాని మిగతా చెట్లకు వాటితో పోలిక ఏమీ లేదు కదా. చెలికత్తె శ్రీవారు నీడనిచ్చే మాను అంట. అందులోనూ మంతుకెక్కిన మాను అంటోంది. శ్రీవారిని ఆశ్రయించుకొన్న వారు ఏకాలంలో ఐనా చల్లగా ఉంటారని చెప్తోంది మంచి సూచనగా స్పష్టంగానే. శ్రీవారు తనను ఆశ్రయించుకొన్నవారికి ఎప్పుడూ నీడ నిచ్చే చెట్టు లాంటి వారమ్మా. ఆ శ్రితజనపోషకుడిని ఆశ్రయించుకొని నమ్ముకొని ఉన్నవారికి కోరికలు నెరవేరుతాయి. అలా కాదు ఆయన అందరికీ ఆశ్రయం ఇవ్వటం ఏమీటీ అని పంతగించుకొని మూర్ఖిస్తే అటువంటి స్త్రీలకే మనస్సులో దైన్యం కలుగుతుంది అని హెచ్చరిస్తోంది. అంటే ఆయన దక్షిణనాయకుడు కావటాన్ని హర్షించలేకపోతే నష్టపోయేది ఆయన కాదు నువ్వే అని చెప్తోంది. అమ్మా ఆయన ఎలా ఇలా చేస్తాడు అలా ఎందుకు చేస్తాడూ ఇప్పుడేం చేస్తే బాగుంటుందీ ఆయనను ఎలా దారికి తెచ్చేదీ అంటూ ఊరికే నాతో చర్చలు చేయకమ్మా, అయన జగన్నాథుడు. అందరికీ ఆశ్రయం ఇచ్చే చెట్టువంటి వాడూ అని చెప్తోంది.

చివరి చరణాన్ని "తోడ నితఁ‌ డెంచితే చంద్రుని వంటి వాడు" అని ముగించింది చెలికత్తె. ఎంచితే శ్రీవారు చంద్రునివంటి వాడట. చంద్రుడితో పోల్చటం ఎందుకూ‌ అంటే అందులో చాలా రమ్యత ఉంది కాబట్టి. చంద్రుడు ఎక్కడ నుండి కనిపిస్తాడూ‌ అంటే మన చూడ దలచుకుంటే ఒకచోట అనేముందీ ఎక్కడ నుండి చూచినా ఆకాశం మీద చంద్రుడు నవ్వుతూ‌ కనిపిస్తూనే‌ ఉంటాడు. శ్రీవారు ఎక్కడ ఉన్నారూ అని అందోళన ఏమిటీ ఆయన అన్ని చోట్లా దర్శనం ఇస్తారు. అయన్ను కలసి ఉండాలని కోరుకొనే వారిదే‌ మంచిగుణం. అటువంటి కోరిక కలవారికి లోపల అంతరంగంలోనూ బయట అన్నిచోట్లా కూడా అయనే సన్నిహితుడై ఉంటాడు. ఇదిగో చూడు ఇక్కడే ఉన్నాడు నీ వేంకటేశ్వరుడు. అయన నీ చెంతనే ఉన్నాడు చూడవమ్మా అంటోంది చెలికత్తె.

శ్రీవేంకటేశ్వరుడు మంచి చాకచక్యం కల తుమ్మెదలాగా ఆశ్రయించిన వారి కోరికలూ తీరుస్తున్నాడు తనను దూరం పెట్టాలని చూసే వారినీ వదలడు. ఇక్కడ చమత్కారంగా కొన్ని విశేషార్ధాలు తీయవచ్చును. తాలిమి గల వారలంటే తాపసులూ దేవతలూ అనీ కోపగత్తెలంటే దుష్టులూ రాక్షసులూ అనుకోవచ్చును - వారి కాయాలు సోకు అంటే వారిని పడగొడుతున్నాడని అర్ధం. అలాగే చంద్రునితో పోల్చినప్పుడు ఒక విశేషం. చంద్రుడు వెన్నెలరూపంలో ఓషధులకు అమృతం అందిస్తాడు కాబట్టి అమృతాంశువు అంటారు. శ్రీవేంకటేశ్వరుడు అమృతప్రాయమైన తన కరుణను జీవులందరికీ సమంగా అందిస్తున్నాడు. వేడుకతో తెలుసుకొన్న వారికి అంతరంగంలోనూ బయటా కూడా అయనే నిత్యం దర్శనం ఇస్తూ ఉంటాడు.

మనోహరమైన సంకీర్తనం.

8, ఫిబ్రవరి 2023, బుధవారం

విన్నపాలు వేరెవరికి వినిపింతు నయ్య

విన్నపాలు వేరెవరికి వినిపింతునయ్య
నన్ను చూసి దొంగచెముడు నటియించకు
 
కనులు రెండు మూసి దీర్ఘాలోచనాముద్రను
కనుపట్టు నటనము నే కనిపెట్టితిలే
నను పరీక్షించుటకై వినని యట్లుండినచో
వెనుదిరిగెదనో లేదో యని చూచుటకే

వారితోడ వీరితోడ భలే‌ మంతనాలన్నియు
ఊరక నను నిలబెట్టగ యుక్తులేనులే
సారెకు నాయత్నములను చక్కగ నీవడ్డినచో
నేరీతిగ చేయుదునని నీవరయుటకే

సందుచూచుకొని నేను చక్కగాను విన్నవించ
నందగాడ రామచంద్ర యది విననట్లే
యుందువుగా లేని చెముడొక్కటి నీకున్నట్లే
ఇందాక మునుల నుతుల నెట్లు వింటివో
 

వెఱవకువయ్య నిన్ను వేసరించను - అన్నమయ్య శృంగారసంకీర్తన

 
 
     రీతిగౌళ
వెఱవకువయ్య నిన్ను వేసరించను
కఱకులాడఁగ నేను గబ్బిదాననా

మోము చూడఁగా నీకు మొక్కితి నింతే కాని
కామించి యేపనులకు గాదు సుమ్మీ
చేముంచి యాపె నీ చేయి పట్టు కుండఁగాను
వేమరు నే‌ నాసపడ వెఱ్ఱిదాననా

గక్కనఁ జేయి వేయఁగ కై దండ యిచ్చితిఁ‌ గాని
లెక్క సేయ నంత పనిలేదు సుమ్మీ
మక్కళించి మక్కళించి మాట లాపె యాడఁగాను
యిక్కడ నీసేవ సేయ నెడ్డదాననా

బడలి రాఁగా నీకు పాదము లొత్తితిఁ గాని
యెడసినందుకు బంత మీయఁ జుమ్మీ
అడరి శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి
 కొడిమె లింకా నెంచ గొల్లదాననా

 
ఇది అన్నమాచార్య సంకీర్తనల్లో పన్నెండవ సంపుటంలోని సంకీర్తన.

ఇక్కడ అమ్మవారు నాయిక. చిన్నపాటి ప్రణయకలహం ఇక్కడ సందర్బం. అమ్మవారు శ్రీవేంకటేశ్వరుని దెప్పటం ఈసంకీర్తనలో వర్ణించబడింది. శ్రీవారు దక్షిణనాయకుడు. అయన ఇద్దరుభార్యల ముద్దుల మగడని మనకు తెలిసిందే‌ కదా. సవతుల కయ్యాలు జగత్ప్రసిధ్ధం. గంగాగౌరీ సంవాదం అని ఏకంగా ఒక పెద్దపాటే ఉంది గంటసేపు పాడవచ్చును. సవతులు తమలోతాము గొడవపడటంతో పాటుగా మగడినీ ఒకదులుపు దులుపుతూ ఉంటారు. 

ఇది అటువంటి ఒక పాట. అమ్మవారు వెంకన్నను దులుపుతూ పాడినది.

ఓ వేంకటేశ్వరుడా ఏమీ వెఱవకు (అంటే భయపడకు). నిన్నేమీ నేను వేసరించనులే (వేసరించటం అంటే శ్రమపెట్టటం). నేనైమైనా గబ్బిదాన్నా (కొంటెదాన్నా అని భావం) నీమీద కొపగించుకొని కఱకుమాటలు (కఱుకు మాట అంటే కఠినమైన మాట అని అందరికీ తెలిసిందే) పలకటానికి? ఇదీ పల్లవి.

నువ్వు నాముఖం కేసి చూసావని మరియాదకు నీకు మొక్కానంతే. అంతే కాని నీవల్ల నాకేదో కావాలని ఆశించి మాత్రం కాదులే! చేముంచి (అంటే సాహసించి - నేనిక్కడే ఉన్నానన్న జంకూ గొంకూ‌లేకుండానే) ఆమె నీచేయి పట్టుకొని ఉండగానే నీమీద ఇంకా వేయిరకాల ఆశలు పెట్టుకోవటానికి నేనేమైనా వెఱ్ఱిదాన్నా? 

నువ్వు ఇలా చొరవగా గ్రక్కన (వెంటనే - నన్ను చూసి వెంటనే) మీద చేయి వేసావు. నేను చిరాకుపడి తప్పుకుంటే తూలిపోయేవాడివి. అలా చేస్తే నీవు తూలిపోతావని పోనీలే అని నాచేయి నీకు ఆసరా ఇచ్చానంతే. ఆమాత్రానేనికే ఏదో నేను ఉప్పొంగి పోయానని లెక్కలు వేసుకోకు సుమా!

ఆమే నీతో‌ నాయెదురుగానే ఇలా నిన్ను ఉబ్బెస్తూ గోముగా మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఇక్కడే ఉండి నీకు సేవలు చేయటానికి నేనేమైనా మంచీచెడ్డా తెలియని ఎడ్డిదాన్నా?

ఇంతవరకూ అమ్మవారు వేంకటేశ్వరుడి మీద కోపం అభినయించింది. అయన చేష్టలతో ఏదో అనునయించాడని ఆమె కరిగి చివరిపాదంలో ఇలా అంటోంది.

నువ్వు (తిరిగితిరిగి) బడలికతో వచ్చావని నీపాదాలు నొప్పులు పుడుతున్నాయని జాలిపడి ఆ పాదాలని ఒత్తానా లేదా? నన్ను ఎడబాసి ఎక్కడెక్కడో తిరిగినావనని పంతం పట్టుకొని కూర్చోలేదు కదా?  నువ్వు కూడా ఎంతో ఉత్సాహంగా నన్ను చేరదీసుకున్నావు.  ఇప్పుడు ఇంకా నీ కొడిమెలు (తప్పులు దోషాలు పాపాలు ఇలా) ఎంచటానికి నేనేమన్నా ముద్దరాలైన గొల్లపిల్లనా? ఇక్కడ సారస్యం ఏమిటంటే గోపకన్నెలు శ్రీకృష్ణస్వామి యెడల కడు స్వతంత్రులు - ఆయనతో నిత్యం కలిసి తిరుగుతూ ఉండే వారు - అయన కాని తమను విడచి కొంచెం ఏమారినట్లు తోచినా నిర్మొగమాటంగా అయనతో దెబ్బలాటకు దిగేవారు కూడా. వారికి అలాచేస్తే స్వామికి కోపం వచ్చి దూరం అవుతాడన్న ఊహ ఉండేది కాదు. చిన్నపిల్లలు. తాను ప్రౌఢ. స్వామికి అలా అసందర్భపు మాటలు పలికి కోపం తెప్పించటానికి తానేమీ పద్దతి తెలీని గొల్లపిల్లను కాను అంటోంది.


కొందరు రాముని పాదాబ్జంబుల కొలుచుచు

కొందరు రాముని పాదాబ్జంబుల కొలుచుచు హాయిగ నుందురు
 
కొందరు హాయిని ధనము లిచ్చునని కూడబెట్టుకొను చుందురు
కొందరు హాయిని సుదతుల కౌగిళు లందున వెదకుచు నుందురు
కొందరు హాయిని యధికారంబుల యందున వెదకుచు నుందురు
కొందరు హాయిని యాటల పాటల యందున పొందుచు నుందురు
కొందరు హాయిని తినితిరుగుటలో పొందుచు కనబడు చుందురు
కొందరు హాయిని అపమార్గంబుల పొందగ భ్రమయుచు నుందురు
కొందరు హాయిని మేడలమిద్దెల యందు చూచుచు నుందురు
కొందరు హాయిని కీర్తిప్రతిష్ఠల పొందుటలో కనుచుందురు
కొందరు హాయిని కపటమార్గముల పొందగ తలచుచు నుందురు
కొందరు హాయిని మంత్రతంత్రముల కొనగల మనుకొను చుందురు
కొందరు హాయిని కొలిచిపోయగల గురువుల వెదకుచు నుందురు
కొందరు హాయిని దుర్మతములలో కూడను వెదకుచు నుందురు

ఆటగాడ శ్రీరామా నరహరి


ఆటగాడ శ్రీరామా నరహరి అయ్యా నీకొక దండం

నీ సంకల్ప మమోఘము కావున నేనెవడను కాదనగ
నా సుఖమెంచుచు తప్పులు పట్టుట నాయవివేకమె యగును

భువనము లన్నియు చేసి చక్కగను పోషణ చేసెడు స్వామి
ఎవరు చెప్పగల రయ్యా యీశ్వర యిది తప్పది యొప్పనుచు

సురనరకిన్నరపన్నగవిద్యాధరగంధర్వాసురులు
హరి నీజేసిన యాటబొమ్మలే ఆటలాడునది నీవు

నీవాడించెడు విధాన నాడుచు నినుమెప్పించుట గాక
దేవా యన్యవిధంబున నాడుట భావించగనే రాదు

దారితప్పితే ఆటను నీవే తప్పక సరిజేయుదువు
దారితప్పిన పావు రావణుని దండించిన శ్రీరామ

చక్కగనాడెడు పావులు పండును మిక్కిలి సంతోషముగ
ఇక్కడ ఈపావైనను రామా చక్కగ నాడుట గనుము


అది చాలదు - ఇది చాలదు

అది చాలదు - ఇది చాలదు - అని నసిగితినా
అది యిమ్మని - ఇది యిమ్మని - అడిగితినా

సదయ నీ యిచ్చయే చక్కగా నాదంటిని
హృదయపూర్వకముగ నటు లంటినిగా
అది గాక నీసన్నిధి యందే నిలిచి యుంటిని
ముదమారగ నన్నేలు మోహనాంగ రామా

వదలను నీనామమును నిదురలో నైన గాని
పెదవులు తదితరములను వెగటనును గాన
చెదరదు నీపైన నీ జీవునకు గల ప్రేముడి
కుదిరిన నీతో నిలుపుకొనరాదా రామా

నీవెట్టుల చేసినను నేను కాదనను నిజము
నీవెయ్యది యిచ్చినను నేను వద్దనను
నీవు నన్నెఱిగినటుల నేను నన్నెఱుగ లేను
నీవే ఆలోచించి నియమించుము రామా


7, ఫిబ్రవరి 2023, మంగళవారం

శ్రీరాముడు నీవాడా

శ్రీరాముడు నీవాడా చెప్పేదేమీ వాడు 
కోరిన విచ్చేను నీకు కొదవ యేమీ 

బహు జన్మల బంధమా బ్రహ్మానందం వాడు 
బహువరముల నిచ్చేనా పరమానందం 
బహుసుముఖుడా నీకు బ్రహ్మానందం వాడు
విహరించునా నీతో మహదానందం

తనను నీవు పొగడితే విని నవ్వేనా వాడు
తనను గూర్చి పాడితే విని మెచ్చేనా
తనవద్దకు రమ్మనుచు తరచడిగేనా వాడు
తన సన్నిధి నుండిపొమ్మని యడిగేనా

వాడే నీవాడైతే భాగ్యమే భాగ్యము
వాడు నిన్ను పిలిచితేను భాగ్యమే భాగ్యము
వాడు సన్నిధి నిచ్చెనా భాగ్యమే భాగ్యము
వాడే నీవన్నదైన భాగ్యమే భాగ్యము


శ్రీరామ సీతారామ

శ్రీరామ సీతారామ శృంగారరామ హరి 
కారుణ్యధామ రామ కళ్యాణరామ 

సురగణానందకర సూర్యకులాలంకార 
వరమునీంద్రయాగసంవర్ధనకర ధీర 

విదళితహరచాప ముదితజనకభూప 
విదితసీతాసతీసహితసుస్వరూప 

ఘోరవిపినసంచార క్రూరదనుజసంహార 
నారాయణ రావణవిధ్వంసనవిహార 

శ్రీమదయోధ్యాపురీశ రామ సకలజగదదధీశ 
కామారిప్రముఖవినుతఘనయశోవిశేష 

సురగణైకపరితోషణ సకలభక్తజనపోషణ 
పరమయోగిహృదయసదననిత్యవిహరణ 

అంతరింద్రియాన్నీ ఆశ్రయించెను నిన్ను

అంతరింద్రియాన్నీ ఆశ్రయించెను నిన్ను
సుంత వీక్షించి దయజూడ వేల
 
నామనం బిది నిన్నే నమ్ముకొని యున్నదని
నీ‌మనసున తలచవో నీరజాక్షా
దాని నమ్మకంబునకు దగిన మన్నన చేయ
బూను తలపు నీకేల పుట్టదు రామా
 
ఇదే నా బుధ్ధి నిన్నే యెంచి చింతించుటను
విదితము గాదన్నట్లు వేదవేద్యుడా
మదినెంచి మన్నించుట మంచిదనుచు తోచదొకో
సదయుడ వగు శ్రీరామచంద్రమూర్తీ
 
నాయహం బెన్నడో నయమొప్ప జేరిన దిదె
నీయడుగుదమ్ముల నిశ్చయమ్ముగా
శ్రేయమెంచి వచ్చెనని జేరదీయ వేలనయా
న్యాయమా రామచంద్ర నారాయణా
 
చిత్త మిదే వేడుకతో చేరియున్న దాయె నిను 
చిత్తగించ వేల దాని శ్రీరాముడా
ఇత్తరి యాదరించు టెంతో యుచితమన్నది
బొత్తిగా తోచదొకో పురుషోత్తముడా
 

భక్తులార యిది మీరు బాగుగా నెఱుగుడు

భక్తులార యిది మీరు  బాగుగా నెఱుగుడు
శక్తి కొలది రామనామ జపము చేయుడు

పగలేమి రేలేమి శ్వాసింపగ జీవులకు
జగమున నిదియెంతో సహజము కాదా
పగలేమి రేలేమి భగవధ్యానంబునకు
తగనిదియు సహజము సద్భక్తుల యెడను

రుచియేమి శుచియేమి లోకంబున జీవులకు
విచారింప నాకటికి భీతులైనప్పుడు
శుచియేమి సమయమేమి చూడగ సద్భక్తులు
విచారింప రామ యని ప్రీతిమై పలుకను
 
విప్రునకు శూద్రునకు వెన్నెల యెండ లట్లు
క్షిప్రప్రసాదుడైన శ్రీరామునకు నా
యప్రమేయునకు జీవు లందరును సమమే
సుప్రసన్నుడై యుండు చూడ భక్తులకు
 

భయమేలా నాకు నీవు

భయమేలా నాకు నీవు పవలు రేలు హితుడవై
జయము శుభము నిచ్చుచుండ సర్వవిధముల
 
ధనములా అవి నీవు తప్పక నాకీయగలవు
ధనము లీయ దగుననుచు తలచినప్పుడు
ధనములలో గొప్పదైన ధనము నీకృపాధనమె
అనవరతము నాకున్నది యని యెఱుగుదును

విద్యలా అవి నాలో వెలయించ గలవు నీవు
విద్యలు నినుతెలియ నాకు విహితమైనచో
విద్యలలో మేటి రామవిద్య నాకిచ్చి యన
వద్య నిన్ను పొగడగా పంచినావు

ఏమేమో ఆశించి యెపుడు నిన్ను పొగడలేదు
ఏమేమి దొరకు మాను నెట్టు లైనను
రామచంద్ర నీదయచే నేమి కష్టమును రాదు 
నీమహిమ వలన నాకు నిండు సుఖము


ఇహమైనా పరమైనా యిచ్చేవా డతడే

ఇహమైనా పరమైనా యిచ్చేవా డతడే
బహుమతులను శిక్షలను ప్రకటించే దతడే

తనవారని పెఱవారని తలపని వాడతడే
తనవారే యందరని తలచే వాడతడే
మనరాతలు సరిచేసే మనదేవు‌ డతడే
మనసారా పిలిచితే మనవా డయ్యేను

పిలవండీ రాముడని వెంటనే‌ పలికేను
పిలవండీ కృష్ణుడని వెంటనే పలికేను
పిలవండీ శివుడనుచు వెంటనే పలికేను
పిలవండి యిష్టమైన పేరుతో పలికేను

వేదవిదులు వెన్నుడని పిలువ వచ్చును
వేదాంతులు బ్రహ్మమని పిలువ వచ్చును
లేదు దైవ మని ఎవరు వాదించినా
కాదని ఆదేవుడేల వాదించును


6, ఫిబ్రవరి 2023, సోమవారం

వట్టివిచారము లేల వలవని చింత లేల - తాళ్ళపాక చినతిరుమలయ్య సంకీర్తనం  చి.అ. 5.రే. 1 పా. గుండక్రియ
వట్టివిచారము లేల వలవని చింత లేల
దిట్టతనాన రక్షించ దేవుఁ డుండగాను

తానె బుధ్ధెరిఁగితే తప్పు లేల వచ్చీని
మానక యేలిక లెస్స మన్నించుఁ గాక
మేనిలోఁ బాపము లేక మించిన భయ మేటికి
ఆనుకొని రక్షించ శ్రీహరి యుండఁగాను

చేరి తానె కొలిచితే జీత మేల తప్పీని
ధారకుఁడై దొరయే చేపట్టుఁ గాక
మారుముద్ర గాని మంచిమాడకు వట్టము లేల
తారుకాణగా హరి తానె రక్షించుఁ గాక

చనవె కలిగితేను సలి గేల తప్పీని
తన చెప్పినట్లు రాజు తాఁ జేసుఁ‌ గాక
పనివడి రాచవారి పసులకు బందె యేది
నను శ్రీవెంకట నాథుఁడు రక్షించఁగా


(సంపుటం 10 -  కీర్తన 25)ఇది శ్రీతిరువెంగళనాథ దేవునికి తాళ్ళపాక అన్నమాచార్యుల కొమారుఁడు పెదతిరుమలాచార్యులు, పెదతిరుమలాచార్యుల కొమారుఁడు చినతిరుమలాచార్యుడు విన్నపం చేసిన ఆధ్యాత్మసంకీర్తన.


ఈరోజుల్లో జనసామాన్యం తాళ్ళపాక కవుల సంకీర్తన లన్నీ అన్నమయ్య సాహిత్యంగా వాడుక చేస్తున్నారు! 

అందమైన ఈకీర్తన భావం చూదాం.

పల్లవిలో అనవసరంగా ఎందుకు విచారపడుతూ ఉండటం తనకి? ఎందుకు అనవసరంగా మనస్సులో దిగులు పడుతూ ఉండటం తాను స్వల్పవిషయాలకు?. నన్ను రక్షించటానికి స్థిరమైన సంకల్పంతో దేవుడు లేడా? అని ప్రశ్న వేస్తున్నారు.

అలా ఎందుకు తాను ప్రశ్న చేసారన్నది కూడా చాలా చక్కగా సమర్ధింపులతో వివరిస్తున్నారు చూడండి.

తనకే తగినంత మంచి బుధ్ది కుశలత ఉంటే తప్పులెందుకు దొర్లుతాయి? తన యజమాని తప్పకుండా తనని చక్కగా మన్ననగా చూస్తాడు కాని? అలాగే మనం ఈశరీరంతో ఏతప్పూ చేయకపోతే పాపం ఉండదు కదా, పాపమే లేనప్పుడు భయం మాత్రం ఎందుకు ఉంటుంది? మనని అంటిపెట్టుకొని ఉండి రక్షించటానికి అప్పుడు మనకు శ్రీహరి ఉంటాడు కదా అంటున్నారు.  శరీరంలో తప్పులేకపోవటం అంటే మనోవాక్కాయకర్మలా శుధ్దంగా ఉండటం. అలా ఉంటే పాపమూ ఉండదు ఇంక భయమూ ఉండదు. మనకు రక్షణ కూడా ఉంటుంది హరి ద్వారా.  అంటే ఇక్కడ తానుత్రికరణ శుధ్ధి కలవాడను కాబట్టి పాపం అంటని వాడననీ తనకు ఏభయమూ లేదనీ హరి తనని రక్షించటానికి ఉన్నాడనీ అంటున్నారు. అందుచేత తనకి ఏవిచారమూ ఏచింతా లేదట.

మనం సరిగా పనిచేస్తే జీతం ఎందుకు తగ్గుతుంది? పని చేయ నప్పుడే కదా యజమాని జీతం విరుగగోసుకొని మరీ ఇచ్చేది! ధారకుడు అంటే తిండిపెట్టేవాడు.  మనం సరిగ్గా చెప్పినపనులు చేస్తూ ఉంటే మన యజమానే మన మంచిచెడ్డలు చూసి తిండికీ గుడ్డకూ లోపం రాకుండా యేలుకుంటాడు. లేదా పస్తులే. చెల్లని నాణానికి మారకంగా ఏదీ కొనుగోలు చేయలేం కాని మంచినాణానికి దుకాణంలో తిండి దొరుకుతుంది కదా! అంటే ఇక్కడ, తాను సరిగా ప్రభువు (శ్రీవేంకటేశ్వరుడు) చెప్పిన పనులు చక్కగా చేసే వాడినే కాని డాబుకొట్టే చెల్లని నాణెం వంటి వాడను కాననీ, ఆ ప్రభువే తనని రక్షించుతూ తిండితిప్పలకు లోపం రాకుండా చూసుకుంటూ ఉంటాడనీ అంటున్నారు. అందుచేత తనకి ఏవిచారమూ ఏచింతా లేదట.

తనకు మంచి చనువే  ఉంటే రాజుగారి దగ్గర ఆశ్రయానికి లోపం ఎందుకు వస్తుంది? తాను చెప్పినట్లుగా రాజే తప్పకుండా చేస్తాడు మైత్రిని పాటించి. అంతే కదా. ఊళ్ళో వాళ్ళ పశువులు దారితప్పి ఇతరుల చేలలో పొరపాటున మేస్తే వాటిని బందెల దొడ్లో పెడతారు అధికారులు. కాని ఆ పశువులు కాని రాచవాళ్ళవి ఐనప్పుడు అంత సాహసం చేస్తారా అదే అధికారులు? అంత సాహసమా వాళ్ళకి? అంటే ఇక్కడ తాను ప్రభువైన శ్రీవేంకటేశ్వరుడి సొత్తును అనీ తనకు కల ఈగుర్తింపు ఆధారంగా తనని ఎవ్వరూ ఏమీ చేయలేరనీ అంటున్నారు! అధికారులు సామాన్యులను సాధించదలచుకుంటే అది సులువే కావచ్చు కాని రాజాశ్రయం కలవారిని సాధించాలంటే వశమా! రాజే తన మాట విని అడిగింది చేస్తాడు కదా, అటువంటప్పుడు తన జోలికి అధికారులు రాలేరు కదా అని అంటున్నారు.

ఈ కీర్తనలో కొన్ని విశేషాలు చూదాం. మారుముద్ర అన్న మాటను బట్టి దొంగనాణాల బెడద అప్పట్లో కూడా ఉండేది అన్నమాట విశదం అవుతోంది. అధికారులు సామాన్యులను వేధిస్తూ రాజాశ్రయం కలవారి పట్ల భయభక్తులతో ఉండటం అనే లోకరీతి విదితం అవుతోంది. బుధ్ధి ఉన్నవాళ్ళు తప్పులు చేయరనీ పాపమే భయహేతువు అనీ నిష్కర్ష చేయటమూ ఇందులో చూస్తున్నాం.


పలుకవేమి యినకులతిలక

పలుకవేమి యినకులతిలక రామ నిన్ను
పలుకరించ వచ్చితిని పరంధామ

పరుగుపరుగున నేను పలుకరించ వస్తేను
చిరునగవులు చిందవేమి శ్రీరాముడా నన్ను
మరియాదగ చూడవేమి మారాముడా యింత
కరుణలేక యుందువేమి కమలాక్షుడా

అడుగుటకు రాలేదు ని న్నడ్డమైన కోరికలు
దడుచుకొనకు మాతండ్రీ దశరథాత్మజా
వడివడి నిను జూడవస్తి పరమాప్తుడా నేను
కడుగడు ప్రేముడి తోడ కమలాక్షుడా

కరుణానిధి వన్న బిరుదు కాపాడుకోవయ్యా
పరుడ గాను నీభక్తుడ పరమాత్ముడా నిన్ను
తరచు పొగడుచుండు వాడ దశరథాత్మజా నీదు
చిరునవ్వే నాకు చాలు శ్రీరాముడా

రామనామమే సుఖసాగరము

రామనామమే సుఖసాగరము రాముడె పరదైవతము 
 
శ్రీరఘురాముని రూపమె కనులకు ప్రీతికరంబుగ నుండు
శ్రీరఘురాముని నామమె నిత్యము జిహ్వకు రుచికర మగును
శ్రీరఘురాముని పాటలె నిత్యము చెవులకు విందగు మాకు
శ్రీరఘురాముని తత్త్వమె బుధ్ధిని చింతన చేసెద మెపుడు
శ్రీరఘురాముని భక్తులె మాకు క్షితిపై బంధువు లెపుడు
శ్రీరఘురాముని పొగడెడి వారే ధారుణి మిత్రులు మాకు 
శ్రీరఘురాముని నమ్మిన వారే తీరుగ మాకును హితులు
శ్రీరఘురాముని సేవకజనులే ఆరయ మాకు గురువులు
శ్రీరఘురాముని గుణగానమునే చేయుచు మురిసెద మెపుడు
శ్రీరఘురాముని పాదంబులనే సేవింతుము మే మెపుడు
శ్రీరఘురాముని దివ్యమహిమలే చెప్పుచు తిరిగెద మెపుడు
శ్రీరఘురాముని తోడిదె లోకము జీవనమును మాకెపుడు

రామా యనండీ జనులారా

రామా యనండీ జనులారా శ్రీరామా యనండీ జనులారా

నోరారా నిత్యము శ్రీరామనామము మీరేల నుడువరు జనులారా
మీరేల నుడువరు శ్రీరామనామము మీకిచ్చు మోక్షము జనులారా
శ్రీరామనామము మధురాతిమధురము నోరార పలుకుడు జనులారా
నోరార పలుకుడు మధురనామమను మీరందరును నిక జనులారా
శ్రీరామచంద్రుని మనసార నమ్మిన క్షేమమ్ము కలుగును జనులారా
ధారాళమగు హరి కారుణ్యమును గొని దాటండి భవమును జనులారా
శ్రీరామచంద్రుని చింతించు వారికి చేటెన్న డుండదు జనులారా
నారాయణా యను భక్తాళి కెన్నడు నాశమ్ము కలుగదు జనులారా
శ్రీరామచంద్రుని విష్ణుస్వరూపుని చింతించ వలయును జనులారా
ఘోరసంసారము దాటించు రాముని కోరి చింతించుడు జనులారా
శ్రీరామచంద్రుని చిత్తశుధ్ధి వెలయ చేరి సేవించుడు జనులారా
చేరి శ్రీరాముని సేవించ మోక్షము సిధ్ధించు తప్పక జనులారా
కారుణ్యధాముడు శ్రీరామచంద్రుని కన్న దైవ మెవరు జనులారా
శ్రీరామనామమె శ్రీరామనామమె తారకనామము జనులారా


5, ఫిబ్రవరి 2023, ఆదివారం

రాముడా లోకాభిరాముడా దండాలు

రాముడా లోకాభిరాముడా దండాలు
నీమహిమకు నీకు వేల దండాలు

కలువరేకుల కన్నులున్న కులపావనుడా నిన్ను
వలచిరట మునులుగూడ పరమసుందరా
నలుదెసలను నీసొగసుల వెలుగులే నిండి లోక
ముల లోన నీపేరు మారుమ్రోగుచున్నది

బలే పొడుగుచేతులున్న విలుకాడవురా నీదు
బలమునకు సాగరుడే తలవంచెనురా
ములుకులతో లోకకంటకులను గూల్చినావురా
నిలిచిపోవు నీపేరు కలకాలము ధరను

కొలుచుకొనువారి కెల్ల కొంగున బంగారమా
పులుగుకైన నీదయచే మోక్షమబ్బురా నీవు
తలచుకున్న ప్రకృతియును తలవంచునురా
తలచెదనీ నామమునే దాటెద నే భవమునే

రామ రామ అట్టివాని కేమి చెప్పగలము

రామ రామ అట్టివాని కేమి చెప్పగలము రామా నీవే దారి చూపవలెను

భోగములపై విరక్తి పుట్టిన దంటేను - త్యాగబుధ్ధి తనలోన కలుగదేలనో
ముక్తిమీద తనకు బుధ్ధిపుట్టిన దంటేను - మొదట నీకు భక్తుడు కాడేలనో
తన హితుడవు నీవే నని తలచితి నంటేను - తప్పక నిన్నంటి మసలడేలనో
గురుడవు నీవే నను కొంటి నంటేను - మరి నీపాదంబులే‌ పట్టడేలనో
తల్లివైన తండ్రివైన నీవే నంటేను - తప్పక నిను సేవించగ తలచడేలనో
దేవుడవు నీవే నని తెలిసితి నంటేను - దేవతలను భావించుట మానడేలనో
శ్రీరామ నీపైన చిత్త మున్న దంటేను - కోరి నీ సన్నిధినే చేరడేలనో
తారకనామమే తనకు ప్రియమైతేను - తన జిహ్వను దానినే నిలుపడేలనో

నమోన్నమో నారాయణా

నమోన్నమో నారాయణా నిను నమ్మితి మయ్యా నారాయణా

శ్యామసుందర నారాయణా జయ జగన్నాథ హరి నారాయణా
కామజనక హరి నారాయణా జయ కమలానాథా నారాయణా
రామరూప హరి నారాయణా జయ రావణ సంహర నారాయణా
కామితవరదా నారాయణా జయ కరుణాసాగర నారాయణా

త్యక్తరాగ హరి నారాయణా జయ ధర్మస్వరూపా నారాయణా
ముక్తసంగ హరి నారాయణా జయ మునిజనసేవిత నారాయణా
భక్తపోష హరి నారాయణా జయ పరమానందా నారాయణా
ముక్తిప్రదాయక నారాయణా జయ మోహన రూపా నారాయణా

పాపవిదారణ నారాయణా జయ పరమపావనా నారాయణా
శాపవిమోచన నారాయణా జయ శర్వాదివినుత నారాయణా
తాపత్రయహర నారాయణా జయ తామరసేక్షణ నారాయణా
ఆపద్భాంధవ నారాయణా మము కాపాడవయా నారాయణా


నారాయణ నిను చూడ వచ్చితిమి

 

నారాయణ నిను చూడ వచ్చితిమి - నాతో పని కలదా
నారాయణ నిను శరణు జొచ్చితిమి - ఔరా భయ మేమి
నారాయణ ఆ రావణాసురుడు - నా భటు డగు జయుడే
నారాయణ సురవిరోధి దుష్టుడు - నా కది యెఱుకేను

నారాయణ మము పీడించునయా - నా కది యెఱుకేను
నారాయణ మా కవధ్యుడాతడు - నలువ వరము వలన
నారాయణ వా డింద్రుని పట్టెను - నా కది యెఱుకేను
నారాయణ బహు కాముకు డాతడు - నా కది యెఱుకేను

నారాయణ వాడెట్టుల జచ్చును - నరుని వలన నిజము
నారాయణ నరరూపము గొనుమా - మీ రడిగిన యటులే
నారాయణ రావణుని జంపుమా - మీ రడిగిన యటులే
నారాయణ త్వరపడుమా - యిదిగో శ్రీరాముడ నగుచుంటి

నారాయణ అటులైన బ్రతికితిమి - నమ్ముడు నా మాట
నారాయణ ని న్ననుసరించెదము - ధారుణి కపు లగుడు
నారాయణ శ్రీరామరూపమున - చీరెద రావణుని
నారాయణ శ్రీరామనామము - తారక మగు భువిని


పాహి యంటే‌ కాపాడే పరమపురుషా

పాహి యంటే‌ కాపాడే పరమపురుషా మేము
దేహి యంటే ముక్తి నిచ్చే దేవదేవా

భోగభాగ్యముల నిచ్చు పురుషోత్తమా హరి
యోగుల హృత్పద్మంబుల నుండెడు దేవా
నాగపర్యంకశయన నారాయణా భవ
రోగశమనభిషగ్వర లోకశరణ్యా

రావణాదిదైత్యనిధన రామచంద్రా హరి
భావనాతీతనిజప్రభావ దేవా
దైవరాయ నారాయణ ధర్మాధ్యక్షా నిను
భావించెడు జీవులము పతితపావనా

కరుణారసపరిపూర్ణ కమలనయనా హరి
పరమేశ కమలాసన వందిత దేవా
నిరుపమాన నిరవద్య నీరేజాక్షా నిను
మరలమరల నుతుంతుము మాదేవుడా

 

భాగ్యమన్న నాదేలే భాగ్యము

భాగ్యమన్న నాదేలే భాగ్యము పరమానంద శ్రీరామా
భాగ్యవంతునిగ చేసిన నిన్ను వదలను వదలను శ్రీరామా

నిన్నే మదిలో తలచుట భాగ్యము నీతత్త్వము చింతించుట భాగ్యము
నీనామంబుల పలుకుట భాగ్యము నీరూపంబును చూచుట భాగ్యము
నీచరితముల నెఱుగుట భాగ్యము నీలీలలు వర్ణించుట భాగ్యము
నీపై బుధ్ధిని నిలుపుట భాగ్యము నిను చిత్తములో నిలుపుట భాగ్యము

నీగుణగానము చేయుట భాగ్యము నీమాహాత్మ్యము చాటుట భాగ్యము
నీకన్యంబును తలపమి భాగ్యము నిను సర్వముగా నెంచుట భాగ్యము
నీభక్తులతో కలియుట భాగ్యము నీభక్తుడనై నిలచుట భాగ్యము
నీసన్నిధిలో నిలుచుట భాగ్యము నీకై పాటలు పాడుట భాగ్యము

నీకై పెదవులు కదిలెడు భాగ్యము నీవిచ్చితి వది నాసౌభాగ్యము
నిన్నే చింతన చేసెడు భాగ్యము నీవిచ్చితి వది నాసౌభాగ్యము
నిన్నే గని యుప్పొంగెడు భాగ్యము నీవిచ్చితి వది నాసౌభాగ్యము
నీచరణంబుల చేరెడు భాగ్యము నీవిచ్చితి వది నాసౌభాగ్యము

 

4, ఫిబ్రవరి 2023, శనివారం

శ్రీరామా యనగానే

శ్రీరామా యనగానే చిక్కులు వీడవా

శ్రీరామా యనగానే చింతలు తీరవా


ఏజన్నలో నెవరి నేడిపించినావో

ఈజన్నలో చిక్కులిన్నిన్ని కావా

ఏజన్మపాపమో ఈజన్మలో వ్యాధి

యై జంకించుచున్న దనియేనా చింత


రాతికి ప్రాణమిచ్చు రామచంద్రు డాతడు

కోతికి వరమిచ్చు గొప్ప దేవు డాతడు

ప్రీతితో పలికితే భీతి నణచేనులే

రాతమార్చి వైళమ రక్షించులే నిన్ను


రక్షించె సుగ్రీవు రామచంద్రు డానాడు

రక్షించె విభీషణు రామచంద్రు డానాడు

రక్షించునులే నిన్ను రామచంద్రు డీనాడు

రక్షకుడు దీనులకు రామచంద్రు డొక్కడే 


హరినే ఆశ్రయించరా

హరినే ఆశ్రయించరా మరల మోసపోదురా


ఎన్ని బహుదైవంబుల నెన్నెన్నో కోరి చెడుచు

ఎన్నడును రామా యనక ఎన్నోజన్మ లెత్తియును


రామా యంటే చాలు  మోక్షరాజ్యమే తన స్వంతమని

మీమనసుల నేడెఱిగియు మేలెంచి యిప్పటికైన


ఎన్న జన్మలెత్తినారో ఎంత మోసపోయినారో

ఇన్నాళ్ళకు తెలిసివచ్చి యిప్పటికిని మీరందరు


3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

అందరును నావారే యనుకొందును

అందరును నావారే యనుకొందును గో
విందుడా నీవెఱుగని విషయమే‌ మున్నది

ప్రతిదినమును నన్ను జూచి పలుకరించుచుండు వారు
సతతవినయ సంపన్నులు చాలదుర్వినీతులును
చతురులై దూరముగ జరిగి పలుకకుండు వారు
అతిశయముగ మెచ్చువారు నాగ్రహించి తిట్టువారు

నాకు గల రామభక్తి నటనమని నమ్మువారు
నాకు గల రామభక్తి నమ్మదగిన దనువారును
లోకజనుల నెవ్వరెట్లు లోలోపల నెంచినను
నాకెందుకు రామచంద్ర నీకు సమానమైనచో

నిన్ను దిట్టువారలను నీవు వైరభక్తు లనిన
నన్ను దిట్టువారలను నేను పరీక్షకులందును
నిన్నెఱిగిన వారెందరు నన్నెఱిగిన వారెందరు
వెన్నుడా భూమిజనుల విధ మిట్టులని యెఱిగి


పాడినందు కైనా

పాడినందు కైనా కూలి పడవేయ వయ్యా అంత
వేడినందు కైనా ముక్తి భిక్ష వేయ వయ్యా

ఎన్నెన్ని జన్మల నుండి ఎంతెంత సేవలు చేసి
నిన్ను మెప్పించి కూలి నీకడ దాచి
ఎన్నగ నీజన్మమెత్తి ఎన్ని పాటలనో పాడి
పన్నుగను నీకృపకు పాత్రుడ గానో

పాటలన్నీ నీదివ్యప్రభావమే చాటునట్టి
మాటలతో నిండెనేని మరి యవియైన
ఓటుపడ నీయక నాపాటలకు దగు రీతిని
దాటవేయ కుండగను దయచూపుమ

రామనామాంకితమై రాణించెడు పాటలకు
స్వామి యెంత వెలగట్టు నేమి కూలిని
ప్రేమతో నొసంగునో వేడుకతో చూడవలయు
భూమిజనులందరును రామా నేడు


1, ఫిబ్రవరి 2023, బుధవారం

ఇంతచిన్న మాటకే ఎందుకు కినుక

ఇంతచిన్న మాటకే ఎందుకు కినుక ర
వ్వంత యైన నీకీర్తికి పడదే మరక

ఒక శరమున సుబాహుని హుతవహుని కిచ్చి యిం
కొక శరమున మారీచుని యొయ్యన కొట్ట
వకటా తప్పాయె నని అనుకొందును నాలీల
నొకటియు నీవెఱుగ వని యురక నగక

పరమసూక్ష్మబుధ్ధివయ్యు సురవైరి లేడియై
యరుదెంచిన గురుతించ వైతి వంటే
హరిలీలావిలాసమున అది చమత్కార మనుచు
నెఱుగ లేని నావెఱ్ఱిని జూచి నగక

సీత కొఱకు రణముచేసి చిదిమి రావణాసురుని
సీత కగ్నిపరీక్షను చేసి నావే
నీతీరుకు బ్రహ్మాదులు నివ్వెరపోయి రంటే
నాతత్త్వ మెఱుగ రని నగక రామ


దశరథరాముని కొలవండీ

దశరథరాముని కొలవండీ మీరు తప్పక మోక్షము పొందండీ

దశకంఠుని దునుమాడిన రాముడు ధర్మస్వరూపుడు తెలియండీ
దిశలన్నిటను రాముని కీర్తియె తేజరిల్లుటను చూడండీ

దుష్టులదునిమి శిష్టుల కాచు విశిష్టదైవ మితడే నండీ
కష్టము లన్నీ క్షణమున తీర్చే ఘనుడు రాముడని తెలియండీ

పితామహుడును పురుహూతుడును వేడెడు వెన్నుడు వీడండీ
అతిసులభముగా నామజపముచే నాతని కరుణను పొందండీ

సకలైశ్వర్యము లిచ్చెడి రాముని సాటిదైవమే లేడండీ
ఒకక్షణమైనను విడువక నాతని నొప్పుగ మీరు కొలవండీ


హరికథకు పద్మశ్రీ

ఈ రోజున భండారు శ్రీనివాస రావు గారు హరికథకు దక్కిన పద్మశ్రీ అని ఒక టపా వేసారు. అది చదివిన తరువాత వ్రాస్తున్న నా వ్యాసం ఇది.

హరికథలు వినటం నాచిన్నతనంలో ఒక మంచి అభిరుచిగా ఉండేది. ఇప్పుడు విందామన్నా సరిగా కథ చెప్పే వారు ఉన్నారో లేదో తెలియదు. దూరదర్శన్ ఛానెళ్ళ వారు ప్రసారం చేస్తున్న హరికథలు అప్పుడప్పుడు వింటున్నా అవేవీ నన్ను అకట్టుకోవటం లేదు. నా చిన్నతనంలో మానాన్నగారు హరికథలను బాగా యిష్టపడటం వలన వారి నుండి ఆ అభిరుచి నాకబ్బింది. రేడియోలో వచ్చే‌ హరికథలను తప్పకుండా ఇద్దరమూ విని ఆనందించే వాళ్ళము.

అప్పట్లో ఆకాశవాణి వారు హరికథలనూ విరివిగా ప్రసారం చేసేవారు. నాటకాలనూ విరివిగా ప్రసారం చేసేవారు. తరచూ రేడియో‌నాటక సప్తాహాల్లాంటివి కూడా వచ్చేవి. అలాగే సంగీతకచ్చేరీలూ తరచుగ వచ్చేవి. మానాన్నగారూ నేనూ అవన్నీ వినేవాళ్ళం శ్రధ్ధగా. ఏడాది కొకసారి ఉగాది సందర్భంగా పండుగనాటి ఉదయం ఆకాశవాణి వారి కవిసమ్మేళనం ఉండేది. ఇద్దరం తప్పకుండా ఉత్సాహంగా వినేవాళ్ళం. మానాన్నగారు పద్యాలంటే ఎంతో ఇష్టపడే వారు. చాలా శ్రావ్యంగా పద్యాలను గానం చేసే వారు కూడా. ఆయనకు ముఖ్యంగా వడ్డాది సుబ్బారాయ కవి గారి భక్తచింతామణీ శతకం లోని పద్యాలంటే ప్రాణప్రదంగా ఉండేది. తరచూ వాటిని గొంతెత్తి మహాశ్రావ్యంగా పాడేవారు. ఉగాది కవిసమ్మేళనంలో విశ్వనాథ వంటి ఉద్దండుల కవిత్వాలను విని ఆనందించే వాళ్ళం. రాను రానూ పద్యాలను త్రోసిరాజని ఆకవిసమ్మేళనంలో వచనకవిత్వాలకు పెద్దపీట వేయటం మొదలయ్యింది. ఆధోరణి మానాన్నగారికి నిరుత్సాహం కలిగించేది. ఒకసారి ఐతే అందరూ వచనకవితలే చదివారు. ఒక్కరూ శ్రావ్యంగా ఒక్కపద్యమూ చదవకపోవటమూ - ఆవచనకవిత్వం ఏమిటో ప్రతిలైనూ రెండేసి సార్లు చదవటం ఏమిటో - ఆయనకు అస్సలు నచ్చలేదు. ఇంక మనం ఈకవిసమ్మేళనం వినక్కర్లేదు అనేసారు! అలాగే నాటకం ఐనా హరికథ ఐనా కూడా అది నచ్చితే దాని గురించి కొంచెం నాతో చర్చించే వారు.

అప్పట్లో మేము కొత్తపేట (తూ-గో-జి) గ్రామంలో ఉండే వాళ్ళం. ఆఊళ్ళొ వినాయకచవితి, శరన్నవరత్రాలూ చక్కగా జరిపేవారు. చవితికి ఊరినిండా వెలిసిన పెద్దపెద్దపందిళ్ళలోనూ నవరాత్రాలకు రాజరాజేశ్వరీ అమ్మవారి గుడిలోనూ హరికథాకాలక్షేపాలు తప్పనిసరిగా ఉండేవి.

కొత్తపేటను ఆనుకొని పలివెల పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ శివుడు కొప్పులింగేశ్వరస్వామి వారు. ప్రాచీనాలయం. కాకతీయుల నాటి శాసనాలు అప్పటికి ఇంకా కొన్ని గుడి స్థంభాలపైన ఉండేవి. వాటికి నకళ్ళు తీసి మనవాళ్ళు భద్రపరచారో లేదో తెలియదు. అవి ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో ఆధునికీకరణలో కొట్టుకుపోయాయో తెలియదు. ఆగుళ్ళో కూడా మహాశివరాత్రి గొప్పగా జరిగేది. ఇద్దరమూ తప్పక ప్రతి మహాశివరాత్రికీ పలివెల వెళ్ళే వారం. ప్రసక్తి వచ్చింది కాబట్టి మరొక మాట. మందపల్లి పుణ్యక్షేత్రం కూడా కొత్తపేటను ఆనుకొనే ఉంటుంది.

శివరాత్రి సందర్భంగానే కాక ఇతర సందర్భాల్లో కూడా పలివెల వెళ్తూ ఉండే వారం. అటువంటిదే ఒక సందర్భం పలివెల శివాలయంలో జరిగిన ఒక హరికథా కాలక్షేపం. కథకులు ఎవరో ఇప్పుడు గుర్తులేదు. మార్కండేయ చరిత్రం చెప్పారు. హరికథా గానం అంతా సంస్కృతంలో జరిగింది. రాత్రి తొందరగా భోజనాలు ముగించుకొని మానాన్నగారూ, ఆయనతో మరికొందరు ఉపాధ్యాయులూ, వారి వెంట నేనూ ఆ హరికథకు వెళ్ళాం. తిరిగి వచ్చేసరికి తెల్లవారుజాము ఐనది.చాలా గొప్పగా చెప్పారు హరికథను.

నాచిన్నతనంలో కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథను కూడా విన్నాను. స్థలం కొత్తపేట. సందర్భం ఎన్జీవో భవనం ప్రారంభోత్సవం ఆవిష్కర్త జిల్లా కలక్టర్ గారు. సభలో వినోద కార్యక్రమం శాస్త్రిగారి హరికథ. కథాంశం విరాటపర్వం.  అసలు ఆభవనం పైన ఎన్.జీ.వో భవనం అని ఉండవలసి ఉంటే ఎందుకో అందరూ ఆశ్చర్యపోయేలా ఎవరో కాని ఎన్.జి.జి.వో భవనం అని చెక్కించారు. మానాన్నగారూ మరికొంత మందీ అది చూసి బాధపడ్డారు.

హరికథను సచ్చిదానంద శాస్త్రి గారు ఎంతో అసహ్యంగా చెప్పారు ఆనాడు. స్టేజి మీదే వెకిలి రికార్డింగు డాన్స్ చేసారు. అసలు కథను మాత్రం నామమాత్రంగా చెప్పారు. అప్పట్లో నర్తనశాల సినిమా వచ్చి బాగా అడింది. అందులో పాటలు జగత్ప్రసిధ్ధం అయ్యాయి. జననీశివకామినీ అన్న భక్తి గీతం ఎంత గొప్పగా ఉందీ అంటే అందరికీ అది కంఠస్థం ఐపోయింది. శాఖాచంక్రమణంగా ఒక మాట చెప్పాలిక్కడ. మాశ్రీమతి అక్కగారు ఒకరు నిత్యం పూజలో ఈ జననీశివకామినీ అన్న పాటను పాడుతూ ఉంటారు! సరే శాస్త్రి గారు ఈపాటనూ పాడారు. జనరంజకత్వం కొసం అన్నట్లుగా ఆ నర్తనశాల లోనిదే ఐన దరికి రాబోకు రాబోకు రాజా అన్న పాటను పాడారు - అదీ పరమ వెకిలి చేష్ఠలతో.

ఆయన తన హరికథలో తప్పకుండా ఓం హరా శంకరా అన్నపాట పాడతారు. ఆనాడూ పాడారు. పాడిన తరువాత ఈ నాపాటను మెచ్చుకొని జమున గారు నాకు పదివేలు చదివించారు అని అన్నారు. అంతకు పూర్వమూ ఆతరువాత కూడా సచ్చిదానంద శాస్త్రి గారి హరికథను విన్నాను నేను. ఆయన తప్పని సరిగా ఓం హరా శంకరా అన్నపాట పాడారు అన్ని కథల్లోనూ సందర్భం చూసుకొని.

ఆరోజు ఆయన చెప్పిన నానాకంగాళీ హరికథ సభలో ఉన్న ఎవ్వరికీ అస్సలు నచ్చలేదు. అస్సలు హుందాగా లేదని చాలా బాధపడిన వాళ్ళెందరో.

ఐతే ఇలాంటి హరికథలతో జనాకర్షణ బాగానే చేసి సచ్చిదానంద శాస్త్రిగారు బాగానే సంపాదన చేసారని చాలామంది చెప్పగా విన్నాను.

కొత్తపేటలో మేము గర్ల్స్ హైస్కూలు ఎదురుగా ఉన్న తాడిగడప వారి ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళం. సందుకు ఈపెడగా మాయిల్లు ఉంటే ఆపెడగా కరణంగారు సరస్వతుల వారి ఇల్లు ఉండేది. ఒక సారి శరన్నవరాత్రుల సందర్భంగా ఒక భాగవతార్ గారు వచ్చి సరస్వతుల వారి ఇంట్లో మకాం చేసారు బంధుత్వాన్ని పురస్కరించుకొని. ఆయన కథ కూడా చాలా బాగా చెప్పారు ఆరాత్రి. అప్పట్లో నవరాత్రులకు తొమ్మిది రోజులూ గుళ్ళో హరికథాకాలక్షేపం ఉండేది కదా, ఈయనది ఆరవరోజున జరిగింది అని ఇప్పటికీ‌ గుర్తే.

నేను ఉద్యోగార్ధం హైదరాబాదుకు రావటం జరిగింది. (తెరాస/భారాస వారు అప్పట్లో ఆరోపించినట్లుగా తెలంగాణాను దోపిడీ చేసేద్దాం అని రాలేదు లెండి). అక్షరాలా పొట్ట చేత్తో పట్టుకొని వచ్చాను. అప్పటికి మేము రంపచోడవరంలో ఉన్నాం. మొదటిసారి హైదరాబాదు నుండి ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక ట్రాన్సిష్టర్ రేడియో పట్టుకొని వెళ్ళాను మానాన్నగారి కోసం. అది ఎప్పుడూ ఆయన చేతుల్లోనే ఉండేదని మా అమ్మగారు అంటూ ఉండే వారు. ఎప్పుడన్నా ఒక్క మంచి రేడియో ప్రోగ్రాం మిస్ కాకుండా అది ఆయనకు కూడా ఉండి ఆనందాన్ని ఇచ్చేదట.

హైదరాబాదు వచ్చేసాక కూడా, రేడియో లోనూ ప్రత్యేకం గానూ నేను చాలానే గొప్ప హరికథా గానాలను విన్నాను. కొత్తపేట వదిలిన తరువాత కూడా హరికథలపై ఆసక్తి అలాగే ఉండేది. మానాన్నగారి నిర్యాణం అనంతరం కూడా ఇంకా కొన్నాళ్ళు రేడియో ప్రభ నడిచింది. అన్నాళ్ళూ‌ అంటే టీవీ వచ్చి రేడియోను మూలకు నెట్టేసే దాకా నేను రేడియోలో హరికథలను వినే వాడిని. నాటకాలనూ వినే వాడిని. కచ్చేరీలనూ వినేవాడిని.

ఇంతకీ సచ్చిదానంద శాస్త్రిగారికి పద్మశ్రీ అంటే అది అయన కథకు మెచ్చి ఇచ్చినది అనుకోవాలా? ఆయన జనాకర్షణ కల కళాకారుడు కాబట్టి ఇచ్చారని అనుకోవాలా? లేదా అయనకు ఏమన్నా మంచి పలుకుబడి కూడా ఉంది కాబట్టి వచ్చిందా? నాకు తెలియదు. ఈపద్మశ్రీ బిరుదులకు ఆట్టే విలువ ఇవ్వనక్కరలేదని నా అభిప్రాయం. 

ఈమధ్య నేను ఈపద్మ అవార్డుల గురించి చేసిన ఒక వ్యాఖ్యలో ఈఅభిప్రాయాన్నే వ్యక్తపరిచాను నెమలికన్ను బ్లాగులో .

అన్నట్లు హరికథకూ నాకు ఒక బాదరాయణ సంబంధం కూడా ఏర్పడింది! నా మామగారు స్వర్గీయ పోణంగి శరభరాజు గారు స్వయంగా హరికథా భాగవతార్. ఆయన హరికథా పితామహ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారికి నేరుగా శిష్యులు.