10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

సరివచ్చెఁ గదవే చల్లేటి నీవలపులు - అన్నమాచార్య శృంగార సంకీర్తన




            దేసాక్షి

సరివచ్చెఁ గదవే చల్లేటి నీవలపులు
గరిమె నీరమణుఁడు గాలివంటి వాఁడు

తాలిమి గలవారికి తలఁపెల్లా నీడేరు
ఆలరి కోపకత్తెల కాయాలు సోఁకు
యేల తప్పక చూచేవు యెఱుఁగవా నీవిది
మేలిమి నీమగఁడు తుమ్మిదవంటి వాఁడు

చెంతనున్న వారికి చేతికి జిక్కు బనులు
పంతపు మగువలకుఁ‌  బట్టుఁ‌ జలము
మంతన మేమాడేవు మాఁటిమాఁటికి నాతోను
మంతుకెక్కి పతి నీడమానివంటి వాఁడు 

కూడినట్టి వారికి గుణము లెల్లా మంచివి
వేడుక వనితలకు వెలియే లోను
యీడనే శ్రీ‌వేంకటేశు నింతి నీవు గూడితివి
తోడ నితఁ‌ డెంచితే చంద్రుని వంటి వాడు


(అన్నమాచార్య శృంగార సంకీర్తనలు 8వ సంపుటం 78వ సంకీర్తన)

ఈ కీర్తనను అర్ధం చేసుకుందుకు కొంత ప్రయత్నం అవసరం. కనీసం నాకు అలా అనిపిస్తోంది. 

ముందుగా ఇందులో ఉన్న కొన్ని మాటలను మనం పరిశీలించుదాం.

సరివచ్చు:  సరిపోలటం సమానంగా ఉండటం.
వలపు:    ప్రేమ మోహము
గరిమ:    గొప్పదనం బరువు విధానం.
రమణుడు: అందగాడు భర్త.
తాలిమి:   క్షమ ధైర్యం ఓర్పు.
ఆలరి:    దుష్టుడు అవివేక దుశ్శీలుడు, దిక్కులేనివాడు, వ్యర్ధుడు.
కోపకత్తె:   కోపిష్టి యైన స్త్రీ.
కాయాలు: (కాయములు) శరీరములు.
సోఁకు:    తగులు
చలము:   వణుకు చపలత్వం.
మంతనము: ఆలోచన రహస్యం ఏకాంతం.
మంతుకెక్కు: ప్రసిధ్ధికి ఎక్కు. 
నీడమాను:  నీడ నిచ్చే చెట్టు.
వెలి:      బయట.
 
ఇదొక మంచి చమత్కార కీర్తనం. 
 
ఈ సంకీర్తనంలో చెలికత్తె అమ్మవారితో శ్రీవారి గొప్పదనం గురించి చెబుతోంది.
 
 అమ్మా మీ ఆయన అచ్చం గాలివంటి వాడమ్మా. (ఆయన వ్యాపించి ఉండని చోటే లేదు అని చెప్పటం) ఆయన మీద నువ్వు వెదజల్లుతున్న వలపులు బాగానే సరిపోయాయి.  ఇక్కడ చల్లేటి నీ వలపులు అని కదా. చల్లటం అంటే ఏదో పరిమళద్రవ్యం లాగా వెదజల్లటం అనుకోండి. నిత్య వ్యవహారంలో స్పే చేయటం అంటామే. అలాగా అన్నమాట. చెలికత్తె అంటోందీ,  నువ్వేమీ వలపుగంధాలు ఆయనమీద గుమ్మరిస్తున్నావు ఒకటే చిలకరించటం. ఒకటే చిలకరించటం. కానీ ఆయన ఏమో గొప్పదనంలో అచ్చం గాలివంటివాడు అని. అంటే అర్ధం అయిందా? గాలి ఏమి చేస్తుందండీ? పరీమళాన్ని నాలుగుదిక్కులా వ్యాపింపజేస్తుంది. వలపులు ఆవిడ అందిస్తే అది ఆయనగారు అన్నిచోట్లా పంచేస్తున్నాడమ్మా అని మేలమాడటం అన్నమాట. చెలికత్తె మాటల్లో అంతరార్ధం ఏమిటంటే వలపు రుచీ,  వలపింప నేర్పూ అవి ఆయనగారికి నీవు నీవలపుల ద్వారా తెలియజేసావు - ఆవిద్యను ఆయన నాలుగుచోట్లా తన వలపులు పంచటానికి వాడేస్తున్నాడమ్మా అని. ఇదంతా ఎలా కూపీ లాగామూ ఈపల్లవిలో విషయం ఇదీ అని అంటే దానికి మనకి దారి చూపినవి రెండు మాటలున్నా యిక్కడ చల్లేటి అని ఒకటీ గాలి అని మరొకటీను. గాలిలోనికి ఏమి చల్లుతారండీ సుగంధపరీమళ ద్రవ్యాలు కాక. అదీ సంగతి. ఈకీలకం పట్టుకున్న వెంటనే మనకి పల్లవిలో చెలికత్తె అమ్మవారితో చెప్తున్నదేమిటో అవగతం అవుతోంది అన్నమాట.

ఇప్పుడు మనం చరణాలను కూడా ఒక్కటొక్కటిగా అర్ధం  చేసుకొనే ప్రయత్నం చేద్దాం.

ముందుగా ఒకమాట. మొదటి చరణం చివరి పాదం "మేలిమి నీమగఁడు తుమ్మిదవంటి వాఁడు" అని ఉంది కదా. ఇక్కడ కొంచెం తికమక అనిపించవచ్చును. కొంచెం అవసరార్ధం ఇక్కడ పదాల స్థానాలు తారుమారయ్యాయి అంతే. ఈపాదాన్ని "నీమగఁడు మేలిమి తుమ్మిదవంటి వాఁడు" అని హాయిగా చదువుకోండి. అప్పుడు అన్వయం సులభంగా ఉంటుంది. సరేనా. సరేనయ్యా అలాగే చదువుకుంటాం కాని ఈ మేలిమి తుమ్మెద అన్న ప్రయోగం ఎందుకూ అని అంటే సరే, మనం అక్కడ నుండే మొదలు పెడదాం ఈ మొదటిచరణాన్ని పరిశీలించటం. 
 
మనుషుల్లో మెతకరకం గడుసురకం మొండిరకం అంటూ రకరకాలుగా ఉంటారు కదా. అలాగే సర్వత్రానూ అనుకోండి. అభ్యంతరం ఏమిటీ? మేలిమి తుమ్మెద అంటే తుమ్మెదల్లో మంచిరకం అన్నమాట. ఈ‌మంచిరకం ఏమిటో చూదాం. అసలు తుమ్మెద ప్రసక్తి ఏమిటో‌ చూడాలి ముందుగా. ఇది శృంగార సంకీర్తనం. ప్రసక్తిలో ఉన్నది తుమ్మెద. అందరికీ తెలిసినదే పురుషులను తుమ్మెదలతోనూ స్త్రీలను పూవులతో పోల్చటం అనే వ్యవహారం. కాబట్టి ఎక్కువ కష్టపడకుండానే శ్రీవారిని చెలికత్తె తుమ్మద అని అనటంలో సూచన గ్రహించటం‌ కష్టం ఏమీ కాకూడదు. తుమ్మెదతో పోల్చటం ద్వారా శ్రీవారు దక్షిణనాయకుడు అని అమ్మగారితో చెలికత్తె చెప్తున్నది అన్నమాట. అదేమీ కొత్త విషయం కాదు ఆవిడ కొత్తగా తెలుసుకోవలసిన విషయమూ కాదు.
చమత్కారం అంతా మేలిమి తుమ్మెద అనటంలోనే ఉంది! ఈ తుమ్మెద మేలిమి గుణం తుమ్మెద కాబట్టి ఏపూవు దగ్గర ఎలా ఉండాలో తెలిసినది. శ్రీవారు మేలిమి తుమ్మెద. అయన దక్షిణనాయకత్వాన్ని కోపగించుకోకుండా సహించిన వారికి అన్నికోరికలూ నెరవేరుతున్నాయి. అలాగని సహించం కోపం చేస్తాం అనే వారిని ఆయన విడిచే రకం కాదు. మంచి రకం తుమ్మెద కదూ. నీకిదంతా తెలిసిందే‌ కదటమ్మా. ఐనా ఎందుకమ్మా ఇదోదో కొత్తవిషయం అన్నట్లు చూస్తున్నావూ అని చెలికత్తె దెప్పుతోంది అమ్మవారిని.

ఇప్పుడు రెండవచరణాన్ని చూదాం. అందులో చివరిపాదంలో చివరిపాదంలో "మంతుకెక్కి పతి నీడమానివంటి వాఁడు" అంటోంది చెలికత్తె. సరిగా "పతి మంతుకెక్కి నీడమాని వంటి వాఁడు" అన్వయం చేసుకుందాం. నీడమాను అంటే మంచి నీడ నిచ్చే‌ చెట్టు.  అన్ని చెట్లూ గొప్ప నీడను పరచాలని ఏమీ లేదు. కొబ్బరిచెట్టో తాడిచెట్టో ఐతే అది అంతెత్తుంటుంది కదా. మరి దాని నీడ ఎంత గొప్ప విస్తీర్ణంగా ఇస్తుందీ. దాని నీడ ఏమి లాభం. ఎవడన్నా బాటసారి మర్రిచెట్టు నీడన దుప్పటీ‌ పరచుకొని హాయిగా నిద్రపోవచ్చును. ఆనీడ ఏమీ‌ దూరంగా జరిగిపోదు అతను నిద్రలేచినా సాయం సమయానికి, నీడలోనే ఉంటాడు. ఇలా జీవులకు హాయిని స్థిరంగా నీడనిచ్చే చెట్టే నీడనిచ్చే చెట్టు కాని మిగతా చెట్లకు వాటితో పోలిక ఏమీ లేదు కదా. చెలికత్తె శ్రీవారు నీడనిచ్చే మాను అంట. అందులోనూ మంతుకెక్కిన మాను అంటోంది. శ్రీవారిని ఆశ్రయించుకొన్న వారు ఏకాలంలో ఐనా చల్లగా ఉంటారని చెప్తోంది మంచి సూచనగా స్పష్టంగానే. శ్రీవారు తనను ఆశ్రయించుకొన్నవారికి ఎప్పుడూ నీడ నిచ్చే చెట్టు లాంటి వారమ్మా. ఆ శ్రితజనపోషకుడిని ఆశ్రయించుకొని నమ్ముకొని ఉన్నవారికి కోరికలు నెరవేరుతాయి. అలా కాదు ఆయన అందరికీ ఆశ్రయం ఇవ్వటం ఏమీటీ అని పంతగించుకొని మూర్ఖిస్తే అటువంటి స్త్రీలకే మనస్సులో దైన్యం కలుగుతుంది అని హెచ్చరిస్తోంది. అంటే ఆయన దక్షిణనాయకుడు కావటాన్ని హర్షించలేకపోతే నష్టపోయేది ఆయన కాదు నువ్వే అని చెప్తోంది. అమ్మా ఆయన ఎలా ఇలా చేస్తాడు అలా ఎందుకు చేస్తాడూ ఇప్పుడేం చేస్తే బాగుంటుందీ ఆయనను ఎలా దారికి తెచ్చేదీ అంటూ ఊరికే నాతో చర్చలు చేయకమ్మా, అయన జగన్నాథుడు. అందరికీ ఆశ్రయం ఇచ్చే చెట్టువంటి వాడూ అని చెప్తోంది.

చివరి చరణాన్ని "తోడ నితఁ‌ డెంచితే చంద్రుని వంటి వాడు" అని ముగించింది చెలికత్తె. ఎంచితే శ్రీవారు చంద్రునివంటి వాడట. చంద్రుడితో పోల్చటం ఎందుకూ‌ అంటే అందులో చాలా రమ్యత ఉంది కాబట్టి. చంద్రుడు ఎక్కడ నుండి కనిపిస్తాడూ‌ అంటే మన చూడ దలచుకుంటే ఒకచోట అనేముందీ ఎక్కడ నుండి చూచినా ఆకాశం మీద చంద్రుడు నవ్వుతూ‌ కనిపిస్తూనే‌ ఉంటాడు. శ్రీవారు ఎక్కడ ఉన్నారూ అని అందోళన ఏమిటీ ఆయన అన్ని చోట్లా దర్శనం ఇస్తారు. అయన్ను కలసి ఉండాలని కోరుకొనే వారిదే‌ మంచిగుణం. అటువంటి కోరిక కలవారికి లోపల అంతరంగంలోనూ బయట అన్నిచోట్లా కూడా అయనే సన్నిహితుడై ఉంటాడు. ఇదిగో చూడు ఇక్కడే ఉన్నాడు నీ వేంకటేశ్వరుడు. అయన నీ చెంతనే ఉన్నాడు చూడవమ్మా అంటోంది చెలికత్తె.

శ్రీవేంకటేశ్వరుడు మంచి చాకచక్యం కల తుమ్మెదలాగా ఆశ్రయించిన వారి కోరికలూ తీరుస్తున్నాడు తనను దూరం పెట్టాలని చూసే వారినీ వదలడు. ఇక్కడ చమత్కారంగా కొన్ని విశేషార్ధాలు తీయవచ్చును. తాలిమి గల వారలంటే తాపసులూ దేవతలూ అనీ కోపగత్తెలంటే దుష్టులూ రాక్షసులూ అనుకోవచ్చును - వారి కాయాలు సోకు అంటే వారిని పడగొడుతున్నాడని అర్ధం. అలాగే చంద్రునితో పోల్చినప్పుడు ఒక విశేషం. చంద్రుడు వెన్నెలరూపంలో ఓషధులకు అమృతం అందిస్తాడు కాబట్టి అమృతాంశువు అంటారు. శ్రీవేంకటేశ్వరుడు అమృతప్రాయమైన తన కరుణను జీవులందరికీ సమంగా అందిస్తున్నాడు. వేడుకతో తెలుసుకొన్న వారికి అంతరంగంలోనూ బయటా కూడా అయనే నిత్యం దర్శనం ఇస్తూ ఉంటాడు.

మనోహరమైన సంకీర్తనం.