శ్రీరాగం
ఇచ్చకము లాడరే యింతులాల
పచ్చిజవ్వన మింతలో పదను దీసీనా
ఏఁటికి విభుఁడు రాడొ యింట నట్టే వుండనీ
మాటలైనా నాడి రారె మగువలాల
తాఁట తూఁటలూ నేల తావచ్చినట్టే వత్తము
పాటించిన నావలపు పండి పొల్లవొయ్యీనా
సొగసి యెంతపరాకో జూజాలట్టే ఆడీని
మొగమైనాఁ జూచి రారె ముదితలాల
యెకసక్కే లిఁకనేల యేకమౌద మీతనితో
నగఁగానే సరసాలు నాని విరిసీనా
కాయమెంత యలసెనో కడు దప్పిదేరనీ
చేయెత్తి మొక్కెయిన రారె చెలియలాల
యీయెడ శ్రీవేంకటేశు డేతెంచి తా నన్నుఁ గూడె
కోయరాని కోరికలు కొలఁది నుండీనా
(అన్నమాచార్య శృంగారసంకీర్తనలు 7వ సంపుటంలో 20వ కీర్తన)
ఈ కీర్తన కూడా కొంచెం క్లిష్టమైనది లాగానే ఉంది. ముందుగా దీనిలో ఉన్న కొన్ని పదాల అర్ధాలు తెలుసుకుందాం:
జవ్వనము: యౌవనము
పదను దీయు: వాడి తగ్గు.
తాఁట తూఁట: సగంసగం అరకొర
తాఁట తూఁట: సగంసగం అరకొర
పాటించు: ప్రకటించు
పొల్లవోవు: వ్యర్ధం అగు.
సొగయు: పరవశించు
జూజాలు: జూదాలి
జూజాలు: జూదాలి
దప్ప: శ్రమ.
ఇంతి: మగువ: ముదిత: చెలియ: స్త్రీ (ఇక్కడ చెలికత్తెలను ఉద్దేశించి)
పల్లవిలో అమ్మవారి పలుకు "ఇచ్చకము లాడరే యింతులాలా , పచ్చిజవ్వన మింతలో పదను దీసీనా!" అని ఉంది. అమ్మ చెలికత్తెలను ఉద్దేశించి చెబుతున్న మాటలు. వాళ్ళని శ్రీవేంకటేశ్వరుడి వద్దకు పంపుతోంది. ఆయన గారు దక్షిణనాయకుడు కదా. ఇప్పటి వరకూ జాడలేడు. సంగతి సందర్భాలు తెలుసుకొని రండర్రా అని చెలికత్తెలను ఆదేశిస్తోంది ఆమె. మీరు వెళ్ళి ఆయనగారితో ఇచ్చకాలు (మనస్సుకు నచ్చే మాటలు) చెప్పి తీసుకురండి. నాదింకా పచ్చిజవ్వనమేను (లేతవయస్సేను) ఇంతలోనూ పసతగ్గింది అనుకుంటున్నాడేమో కాస్త నాపట్ల మీరు అయ్యవారికి ఆసక్తి కలిగేలా సానుకూలవచనాలు(అదేలెండి ఇచ్చకాలు) చెప్పి తీసుకొని రండి అని వారికి చెబుతోంది.
ఇక చరణాలను పరిశీలిద్దాం.
మొదటిచరణంలో అమ్మవారి పలుకుతున్నది ఏమిటంటే, అయన గారు ఎందుకని రావటం లేదో మరి. పోనీలెండి కావలిస్తే అలాగే ఇంట్లోనే ఉండమనండి. మీరు పోయి కనీసం మాటలాడి రండి (ఏమో మీమాటలతో ఆయన మనస్సు కరిగి రావచ్చును కదా అని) ఇలా చెప్పి అంతలోనే కొంచెం నిరాశగా అంటోంది. ఐనా సగం సగం ప్రయత్నాలు ఎందుకు లెండి. ఆయన వచ్చినప్పుడే వస్తాడు. ఇలా ఆయనపట్ల నా ప్రేమ అంతా వికసించి వ్యర్ధం కావలసిందేనా!
రెండవచరణంలో అమ్మవారి మాటలు. ఆయనకు ఎంతపరాకో అలాగే ఎక్కడికో పోయి జూదాలాడుతూ కూర్చుంటాడు పరవశించి (ఇక్కడ బావాజీ గురించి అమ్మవారి ఎత్తిపొడుస్తున్నారు!). ఇక నేను ఆసమయంలో గుర్తుకు రానే రాను కదా! మీరు వెళ్ళి ఒకసారి అయన గారి ముఖం చూచి రండి. మిమ్మల్ని చూసిన తరువాత ఐనా అయనకు నేను గుర్తుకు వస్తానేమో చూదాం. అని అంటున్నారు అమ్మవారు. మళ్ళీ అంతలోనే ఆయన్ను ఆక్షేపించటం ఉచితంకాదని అనిపించి ఇలా అంటోంది. ఐనా ఆయనతో మనకు ఎకసెక్కాలెందుకు లెండి. ఆయన ఇష్టం. భక్తుల దగ్గర అయనకు ఒళ్ళు తెలియదు కదా. దానికేం. మనం కూడా అయన ధోరణిలో కలిసి ఉండటమే మంచిది. అయన ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు కదా. ఇంక సరసోక్తులు మొదలౌతాయి కదా అంటోంది అమ్మవారు.
ఇక మూడవచరణంలో మాటలు. ఒక వేళ ఆయన అలసిపోయి విశ్రయించి యున్నాడేమో చూడండి. అయన బడలిక తీరనీయండి కాని అటువంటప్పుడు ఆయన్ను పలుకరించి శ్రమపెట్టకండి. ఐనా ఊరికే దూరం నుండి నమస్కారం చేసిరండి.
ఇలా అమ్మవారు చెలికత్తెలకు ఉపదేశం చేస్తూనే ఉండగా శ్రీవారు వేంచేసారు.
ఇంకేమర్రా. అయ్యవారిదే వచ్చి నాప్రక్కనే ఉన్నారు కదా. మరేం కావాలి! ఇంక పొందరాని కోరికలు అంటూ ఏముంటాయి. అని అమ్మవారు చెలికత్తెలతో సంతోషంగా అంటోంది.
మొత్తం మీద ఈకీర్తనకు అన్వయం అంత సుభగంగా కుదరటం లేదు అనే చెప్పుకోవాలి. మొదటి చరణంలో "తావచ్చినట్టే వత్తము" (తాను వచ్చినట్లే వద్దాం) అన్నది ఎలా అన్వయించాలి? వద్దాము అని చెప్పటం సరిగా అన్వయం కావటం లేదు. రెండవచరణంలోని "యేకమౌద మీతనితో" అన్నది మరింత గడ్డు సమస్య. ఏకం అవుదాం అని చెలికత్తెలను తనతో సమానం చేసుకోవటం ఏమిటీ? బోధపడటం లేదు. అలాగే అక్కడ సరసాలు నాని విరియటం కూడా సుగమంగా లేదు. చివరి చరణంలో "కోయరాని కోరికలు" అంటే కోరరాని కోరికలు అనుకోవాలి. మరొక దారి?
కొన్ని చిక్కులున్నా మొత్తం మీద కీర్తన భావం బాగుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.