13, మే 2021, గురువారం

పరమభక్తవత్సల

పరమభక్తవత్సలబిరుదాంకితా నీకు

కరుణ లేకపోయె నంతే కాదటయ్యా


విన్నపము లన్నీవిని విననట్టులుంటివి

నన్ను వెఱ్ఱివాని జేసి నవ్వుకొంటివి

నిన్ను నమ్ముకొన్నవారి కెన్నెన్నొ జేస్తివట

నన్ను కావకుండుటేమి న్యాయమయ్యా


కరిరాజు గొప్పవాడు కాబోలు నంతేనా

తరుణిపాంచాలి సోదరి యనియేనా

మరి విభీషణు డంటే తరుణాన హితుడాయే

చిరుభక్తుడని నన్ను చిన్నబుత్తువా


తెలిసిన వాడగాను దేవదేవ యేమి

తలచి నాఅర్జీలు దశరథాత్మజా

విలువలేనివని చించివేసితి వతడికి

కలిగించి నావొ మంచి గతిని వానికి


12, మే 2021, బుధవారం

జ్ఞాపకంగా మారిపోయిన నా తమ్ముడు రామం.

 


ఈ పాడు కోవిడ్ మా తమ్ముడు తాడిగడప సత్యశ్రీరామచంద్రమూర్తిని పొట్టన బెట్టుకుంది.

కొద్ది రోజులు ఆ రక్కసితో పోరాడి అలసి చివరకు నిన్న కాకినాడలో ఉదయం 5:53సమయంలో పరమపదం చేరుకున్నాడు.

స్వయంకృషితో పైకి వచ్చిన వాడు మాతమ్ముడు. 1975లో, మానాన్న గారి మృతి అనంతరం నా అభ్యర్ధనపత్రం మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు గారు తక్షణం స్పందించి ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారు మాతమ్ముడికి. వాడు చిన్నవాడు. అప్పుడప్పుడే డిగ్రీ పూర్తిచేసి ఉన్నవాడు. నేనా హైదరాబాదులో ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం మాత్రం ఐనది అప్పటికి.

ఆతరువాత అతడి ఎదుగుదల అంతా అతడి స్వయంకృషి ఫలితమే. చివరకు మంచి హోదాలోనే జిల్లాపరిషత్ సర్వీసు నుండి పదవీవిరమణ చేసాడు. ఆ తరువాత కూడా వారు మాతమ్ముణ్ణి వదలలేదు. కొత్తగా వచ్చే బేచ్ అఫీసర్లకు అడ్మిస్ట్రేటివ్ ప్రొసీజర్ల గురించి ట్రయినింగు క్లాసులు కండక్ట్ చేయమని పిలిచే వారు. అలా ఎందరికో కోచింగ్ ఇచ్చాడు. ఇక పెంక్షనర్ల కోసం అవిశ్రాంతంగా సహాయం అందిస్తూనే ఉండే వాడు. సామాజిక కార్యక్రమాల్లోనూ‌చురుగ్గా ఉండేవాడు. ఇలా కాకినాడలో అందరికీ తలలోనాలుకలా ఉండే మాతమ్ముణ్ణీ కరోనా బలితీసుకుంది.

ఉద్యోగరీత్యా నేను హైదరాబాదుకు రావటం వలన మానాన్నగారి నిర్యాణానంతరం మా అమ్మగారూ మిగిలిన సోదరసోదరీమణులూ అందరూ కూడా హైదరాబాదుకు వచ్చేసారు నాదగ్గరకు. కాని జిల్లాపరిషత్ సర్వీసు కావటం వలన మా తమ్ముడు మాత్రం తూర్పుగోదావరిలోనే ఉండిపోవలసి వచ్చింది.  అతడొక్కడూ‌ కాకినాడలో, మిగిలిన అందరమూ హైదరాబాదులో అన్నమాట. ఐనా అస్తమానూ మాకోసం హైదరాబాదు పరుగెత్తుకొని వస్తూ ఉండేవాడు.

మేమంటే సహజమైన అభిమానం అనేకాదు. అతను మిక్కిలి స్నేహశీలి. ఎందరినో ఆదరంగా చూసేవాడు. ఎందరికో చదువు విషయంలో సహాయం చేసేవాడు. ఎప్పుడు చూసినా ఏబంధుత్వమూ లేని ఎవరో పిల్లలు ఒకరిద్దరు ఆతని ఇంట్లో స్వంతమనుష్యుల్లాగా తిరుగుతూనే ఉండేవారు. 

ఇంకా ఎంతో చెప్పవలసింది ఉంది ఆతని గురించి. విడిగా వ్రాస్తాను వీలు చూసుకొని.

ఈ సర్వజనప్రియిడి మృతి విషయం మరునాడు అంటే‌ నేటి స్థానిక పత్రికలలో కూడా వచ్చింది.


అతడి ఫోటోలు, కొన్ని కొన్ని ఆడియో వీడియో రికార్డులు చివరకు మాకు అతడి జ్ఞాపికలుగా మిగిలాయి.


రామకీర్తనలను అచ్చులో చూడాలని రామానికి ప్రగాఢమైన కోరిక. మన తెలుగు వాళ్ళు పుస్తకాలు చదువుతారా అదీ కొని మరీను. అందులోను కీర్తనలూ గట్రా అంటే ఎవరికి ఆసక్తి ఉంటుందిరా పోనివ్వు అని అంత సుముఖంగా ఉండే వాడిని కాను. ఐనా అదే విషయం ఏదో ఒక సందర్భం చూసుకొని ప్రస్తావిస్తూనే ఉండే వాడు. 

ఈ 9వ తారీఖు సాయంత్రం ఐదున్నర మా రామానికి నేను పంపిన చివరి వాట్సాప్ సందేశం.

మధ్యాహ్నం డా. సందీప్ గారితో మాట్లాడాను. ఇంకా కొన్నిరోజుల పాటు ఆక్సిజన్ అవసరం అన్నారు. ముఖ్యంగా ఆహారం సరిగా తీసుకోవాలని నొక్కి చెప్పారు. సహించకపోయినా ధారకం లేకపోతే చిక్కుకదా. పుష్టిగా తినవలసిందే. త్వరలోనే నయం అవుతుంది. పైనెలలో నీచేతులమీద  రామకీర్తనలు  పుస్తకం విడుదల చేయాలి నువ్వు. ఏమీ దిగులు పడకుండా ఆహారం-మందులు-విశ్రాంతితో తొందరగా ఇంటికి వచ్చేయి.
-అన్నయ్య.

ఇలా ఉత్సాహపరుస్తూ ఉంటే ఐనా మానసికంగా ధైర్యం తెచ్చుకొని మాకు దక్కుతాడన్న ఆశతోనే రామకీర్తనలూ పుస్తకమూ అంటూ ఆశపెట్టాను. చిన్నపిల్లవాడికి మందుతాగితే మిఠాయి ఇస్తానని చెప్పినట్లు! ఐనా మా దురదృష్టం. వాణ్ణి దక్కించుకోలేక పోయాం.


నాయనా రామం, నీగురించి ఇలా వ్రాసుకోవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదురా తండ్రీ!

9, మే 2021, ఆదివారం

నావాడే యంటినిరా

నావాడే యంటినిరా నీవాడే యనుకోరా

కావరా రామచంద్ర కరుణజూపరా


బాధలు కన్నీళ్ళు నీవు బాగుగా నెఱుగుదువు

బాధంటే తెలియని బండవు కావు 

వేధించెడు ప్రారబ్ధము సాధించు ఘడియలో

సాధుపోషక నీవు జాలిచూపరా


బంధుప్రేమ యెట్టిదో బాగుగా నెఱుగుదువు

బంధాలే తెలియని బండవు కావు

బాంధవుడవు సుజనులకు బహుప్రసిధ్ధిగ దీన

బాంధవుడవు జాలివహియించరా


నీవా రందరిని నేను నావా రనుకొందునురా

నావా రందరును కూడ నీవారేరా

భావనాతీతమహాప్రభావా నీదయలే

భావింతుము నీదయ వర్షించవయా


నిన్నేనమ్మి యున్నారా

నిన్నేనమ్మి యున్నారా  శ్రీరామచంద్ర

నన్నేమఱక యున్నావా


నన్నేమఱక యున్నావా నాతండ్రీ రామచంద్ర

తిన్నగ నేకోరునది తెలిసి రక్షించేవా

చిన్నచిన్న తప్పులెన్నో చేసియుంటి నేమొ కాని

ఎన్నడు నీయందు భక్తి వన్నె తరుగ లేదుగా


దాటరాని గండములను దాటించిన కన్నతండ్రి

మాటలలో నేను నీదు మహిమ వర్ణించలేను

సాటి లేని నీకరుణను చక్కగ కొనసాగనిమ్ము

వాటముగా మేలుచేయువాడవు నీవేనని


పాహి సుజనహితకర పరమపురుష శ్రీకర

పాహి భక్తజనావన భవరుజావినాశన

పాహి నిగమసంచార పరమమంగళాకార

పాహి పట్టాభిరామ పాహి వైదేహిరామ


కావించ కన్యాయము

 కావించ కన్యాయము కంజదళాక్షా నేను

నీవాడనే కదా నీరజాక్షా


పరమకళ్యాణగుణాభరణ రాఘవా  భక్త

పరిపాలనాధృఢవ్రతప్రసిధ్ధా

నిరుపమాన మనుచు మునులు నీదయ గూర్చి

నిరంతరము పొగడునది నిజమే కాదా


నేను నిన్ను నమ్మితినని నీవెఱుగుదువు

దానికి పలు ఋజువులు తప్పకకలవు

నేనును నీకరుణామృతమాను టెఱుగుదు

పూని పాడితప్పకుము పురుషోత్తమ


సురరక్షక గజరక్షక సురుచిరలీలా

పరిరక్షిత పాండవపక్ష కేశవ

పరమభక్తజనరక్షక పాహి శ్రీరామ శుభ

వరదా నీవెపుడు నా వాడవే కదా


సకలార్తిశమనచణము

 సకలార్తిశమనచణము శ్యామసుందరరూపము

ప్రకటించెడు గాక రక్ష రామదయా రూపము


మునుల మోహపరచినట్టి యినకులేశురూపము

మనసులోన ధ్యానింతును మరువకేనెపుడు

జనకజావదనసరోజాప్తరవిబింబుమును

తనివితీర ధ్యానించెద ననయమేను


హరచాపఖండనమనోహరవీరరూపము

పరశురామగర్వభంగకరశుభరూపము

సురవరోధికంఠలుంఠన ఫరమవీరరూపము

తరచు ధ్యానింతు రఘువరుని రూపము


శివుని మనసులోనల్చి చిందులు త్రొక్కురూపము

భవపంకవిశోషణఘనభానునిరూపము

త్రివిధతాపములనణంచు దేవదేవుని రూపము

వివిధగతులసుజనులకు వేడ్కగొల్పు రూపము


8, మే 2021, శనివారం

శంక లేమీ వద్దురా సరగున బ్రోవరా

శంక లేమీ వద్దురా సరగున బ్రోవరా
వంకలెన్న వద్దురా భక్తులమే లేరా

నీనామ మధురిమ నిరతమును చక్కగా
మానోట చవులూరు మాట నిజమేరా
యేనాడు నీకన్య మెన్ననే యెన్నమని
పూని వచించెదమిది పొల్లు కాదురా

జ్ఞానులము కామనుట సత్యమే‌ కాని య
జ్ఞానులమును కామనుట సత్యమేనురా
మానక నీనామము మననము చేయుదుమని
జానకీవర ప్రతిన సలుపగలమురా

అలసించ వలదిక యమితదయాశాలి
జాలిబూన మాపై సమయమ్మిదేరా
కాలాత్మక రామా కాకుత్స్థ కులతిలక
మేలు దలచరా మమ్మేలుకోరా

 

రక్షించవలెను నీవే రామచంద్రా

రక్షించవలెను నీవే రామచంద్రా వేరు
రక్షకు లెవరున్నారు రామచంద్రా

పక్షీంద్ర ఘనవాహ పద్మనాభ నీవు సుర
పక్షపాతివై భువికి వచ్చినావురా
రక్షించగ సురవరుల రక్షించగ రమణులను
రక్షించగ దీనులను రాముడైతివి

రక్షించితివి నాడు రవిసుతుని వేడ్కతో
రక్షించితివి నాడు రావణానుజుని
రక్షించితివి సతివి లంకలో చెఱనుండగ
రక్షించుచున్నావు రామా సుజనుల

రక్షించరా నేడు రామచంద్రుడా నీ
రక్షవేడితిని సుప్రసన్నుండవై
అక్షీణకృపానిధి అంబుజాక్ష లోక
రక్షకులకె రక్షకుడవు రామదేవుడా

 

వెన్నవంటి మనసు నీకున్నది రామా

వెన్నవంటి మనసు నీకున్నది రామా నీ
కన్న దయాశాలి లేడు కాకుత్స్థ రామా

నిన్నే నమ్ముకుంటినిరా నిరుపమగుణధామ ఆ
పన్నశరణ్యాకృతి నాపాలిదైవమా
చిన్నమెత్తు ఆశలేని చీకటిదినమైనా నీ
చిన్నినగవు వెన్నెలతో శ్రీకరమగురా

భక్తకోటి నేలు వాడ పరమేశ్వరుడా నేడే
యుక్తిచేసి ప్రోవనైన శక్తుడ వీవే
రక్తిమీఱ దినదినమును రామచంద్రుడా బహు
భక్తితో నిన్నుపొగడు వాడను కానా

కరిరాజు నంబరీషుని కాచినవాడవు నీవే
సురవిరోధి పట్టిని సొంపుగ నేలి
సురవిరోధి సోదరుని కరుణించితివే నీ
వరభక్తుని సోదరుని కరుణించవా


6, మే 2021, గురువారం

రాముని స్మరించవే మనసా రాముని స్మరించవే

రాముని స్మరించవే మనసా రాముని స్మరించవే
ఏమని యితరుల నెన్ని చెడెదవే రాముని స్మరించవే

రాతిని నాతిని చేసిన రాముని నమ్మక యితరుల నమ్మెదవా
కోతిని బ్రహ్మను చేసిన రాముని కొలువక యితరుల కొలిచెదవా
ధాతయె పొగడిన రాముని పొగడక తలకొని యితరుల పొగడెదవా
నీతివిశాలుని రాముని పొగడక నీచమానవుల పొగడెదవా

ప్రేమగ బంటుల నేలెడి రాముని విడచి యితరుల కొలిచెదవా
భీమపరాక్రము రాముని విడచి వీఱిడి నరులను కొలిచెదవా
కామవిరోధి పొగడెడు రాముని కాదని యితరుల పొగడెదవా
స్వామిని పురుషోత్తముని రాముని వదలి పామరుల పొగడెదవా

ఎన్ని జన్మముల నెందర గొలిచిన నిందే తిరుగుచు నుందువుగా
ఎన్ని రాఘవుని తిన్నగ గొలువక నెన్నడు మోక్షము లేదు కదా
అన్ని యాశలను అన్ని మోహముల అన్ని బంధముల విడనాడి
వెన్నుడు శ్రీమన్నారాయణుడగు వీరరాఘవుని వేడగదే

 

4, మే 2021, మంగళవారం

జయజయ జగదీశా

 జయజయ జగదీశా జానకీపతే

దయామయా దశరథాత్మజా నమస్తే


లీలాకృత బ్రహ్మాండజాల దేవ నమస్తే

నీలమేఘసుశ్యామ నిరుపమాన నమస్తే

వాలివధోచితధర్మవర్తన హరి నమస్తే

పౌలస్త్యకదళీవన ఖేలనగజ నమస్తే


భవపంకవిశోషణ భాస్కర హరి నమస్తే

భవాటవీదహనదావానల హరి నమస్తే

భవమదాంధసింధురబంధనచణ నమస్తే

భవభీతసముధ్ధరణపండిత హరి నహస్తే


వరభక్త హృదయదివ్యపద్మస్దిత నమస్తే

నిరుపమానసుగుణానీక యుక్త నమస్తే

కరుణావరుణాలయ పరమసుఖద నమస్తే

పరమహంససంసేవితచరణ హరి నమస్తే


3, మే 2021, సోమవారం

నీవే కద ఈపడవకు నావికుడవు

నీవే కద ఈపడవకు నావికుడవు దేవుడా
నీవే కద సకలజగన్నియామకుడవు

ఎన్నెన్ని తుఫానుల నెదురుకొన్న దీపడవ
ఎన్నెన్ని భూఖండము లెన్నిమార్లు చుట్టినదో
ఎన్నెన్ని కుదుపులోర్చి ఇంతదాక నిలచినదో
ఇన్నాళ్ళును రిచ్ఛపడుచు నిదే చూచుచుంటి

పదే పదే నాకు ఓ పడవనడపు విధానము
నిదానముగ నేర్పజూచి నీవు విసిగి కొనవు
వదలక నాపడవ మీద ప్రయాణించుచుందువే
యిది అసలు నీప్రయాణ మేమో యనిపించును

నా పడవను నడపు చున్న నాథుడ వైతేను
నీ‌ పేరే మనుచు నడుగ నేనెంతటి వాడను
నీ పేరు రాముడనుచు నీవే చెప్పికొంటివి
ఈపడవను నాతో‌ రమియించు వాడ వీవే


గంగాధరనుత శ్రీరామా

 గంగాధరనుత శ్రీరామా జగ

న్మంగళరూప శ్రీరామ 


గరుడవాహ హరి శ్రీరామా బహు

కరుణానిలయా శ్రీరామా

సురగణతోషక శ్రీరామా శుభ

వరదాయక హరి శ్రీరామా


ఇనకులతిలకా శ్రీరామా హరి

మునిమఖరక్షక శ్రీరామా

జనకసుతావర శ్రీరామా హరి

వనమాలాధర శ్రీరామా


ధృతకోదండ శ్రీరామా విని

హతలంకేశ్వర శ్రీరామా

స్థితికారక హరి శ్రీరామా కా

మిత సద్గతికర శ్రీరామా1, మే 2021, శనివారం

మ్రొక్కినచో మనరాముడు

 మ్రొక్కినిచో దేవతలు ముదమున సిరులిత్తురు

మ్రొక్కినచో మనరాముడు మోక్షమిచ్చును


మ్రొక్కరే కౌసల్య ముద్దులాడు బాలునకు

మ్రొక్కరే దశరథుని పున్నెముల ప్రోవునకు

మ్రొక్కరే రఘుకులాంభోరాశి చంద్రునకు

మ్రొక్కరే  సీతారామునకు చక్కగ


మ్రొక్కరే జనకునింటి ముద్దుల అల్లునకు

మ్రొక్కరే అందాల భూమిజారమణునకు

మ్రొక్కరే సకలజగన్మోహనాకారునకు

మ్రొక్కరే సాకేతభూపతికి చక్కగ


మ్రొక్కరే త్రైలోక్యపోషణాదక్షునకు

మ్రొక్కరే ముక్కంటి పొగడునట్టి వానికి

మ్రొక్కరే నిక్కమైన మోక్షదాయకునకు

మ్రొక్కరే మన రామమూర్తికి చక్కగ