24, మే 2021, సోమవారం

రామనామ మద్భుతం రామచరిత మద్భుతం

రామనామ మద్భుతం రామచరిత మద్భుతం  
రామసంబంధి యైన ప్రతివిషయ మద్భుతం

కమలాక్షుడు కౌసల్య కడుపునపడు టద్భుతం
కొమరారు శిశువు చేతి కోదండ మద్భుతం
సమజభూమి తాటకను సమయించు టద్భుతం
కుమతుల నణగించి ముని కోర్కెతీర్చు టద్భుతం
 
వీరు లెవ్వ రెత్తలేని వింటి నెత్తు టద్భుతం
భూరిభుజుడు వంచ నది విరుగుటయు నద్భుతం
సీరధ్వజునింట పెండ్లి ధారుణిపై నద్భుతం
తీరైన సీతారాముల కూరిమియే యద్బుతం

పినతల్లి కోరినటుల వనముల బడు టద్భుతం
తనను మాయ క్రమ్మినట్లు తడబడుటయు నద్భుతం
వనితకొరకు చేసిన రావణవధయు నద్భుతం
ఇనకులపతి వెలయుంచిన జనపాలన మద్భుతం 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.