నీసరి వారే లేరు నీరజాక్ష నీ
దాసుల మేలుకోర తామరసాక్ష
చక్కనైన కరుణగల జలరుహాక్ష మా
దిక్కువని నమ్మితి మిందీవరాక్ష
చక్కనయ్య నీవారము శతపత్రాక్ష మా
మ్రొక్కులందుకోవయ్య పుష్కరాక్ష
కూరిమి చూపవయ్య కుశేశయాక్ష సం
సారబాధ లణచవయ్య సారసాక్ష
నేరము లెంచకయ్య సారంగాక్ష నీ
వారమె నిశ్చయముగ వారిజాక్ష
కరిరాజు నేలినట్టి ఖరదండాక్ష సుర
విరోధి మూకనణచు బిసరుహాక్ష
నరనాథ రామచంద్ర నాళీకాక్ష శుభ
వరవృష్టి కురియవయ్య పంకజాక్ష
అద్భుతమైన భావవ్యక్తీకరణ.👌 చాలా బాగుంది
రిప్లయితొలగించండితమ్మికంటి సంబోధనలతో అంత్యప్రాసతో మనోహరంగా ఉంది.
రిప్లయితొలగించండిఅన్ని తామరలే. మరి మధ్యలొ కువలయం (కలువ) ?
మంచిపట్టే పట్టారు. కుశేశయాక్ష అందాం. ఏమంటారు?
తొలగించండిబాగుంటుంది.
తొలగించండిరామచంద్రమూర్తి రమణీయ సాక్షులై
రిప్లయితొలగించండికలువలైన తమ్మిచెలువలైన
వచ్చిచేరు వాటి భాగ్యమే భాగ్యమ్ము
తనకు భేదమేది ? మనకుగాని .
కువలయాక్షు డొకట కూశేశయాక్షుడై
రామచంద్రమూర్తి రంజన చెడె ,
అందగాడు స్వామి ఇందీవరాక్షుండు
మారి మగుడ నేమి తీరు బడునొ ?
కుశేశయము ఆన్నా పద్మమే నండీ. రంజనచెడలేదు.
తొలగించండికువలయాక్షు డన్నప్పటి సొగసు కుశేషయాక్షుడన్నప్పుడుండదు . అన్నీ తామరలే మధ్యలో కలువ ? అన్నతడు ఇందీవరం
రిప్లయితొలగించండిగమనించలేదా ?
అసలు ఎవరో ఏదో అన్నాడని సొగసైన మీ సంవిధానం మార్చుకోకండి .
ఇందీవరము అంటే నల్లకలువ అనేకాక తామరపూవు అని కూడ అర్ధం ఉంది కదా.
తొలగించండిఅర్థాలన్నింటా ప్రసిధ్ధార్థమే గ్రహించబడుతుంది .
తొలగించండిమీరన్నది నిజమే. రూఢార్ధమే మొదట ఆలోచించాలి. కాని సందర్భానుసారిగా అడపాదడపా ఇతరమైన అర్ధాలూ గ్రాహ్యములే అవుతున్నాయి. ఇక్కడ తామరపువునకు వివిధమైన పర్యాయపదాలు అవసరం అవటమూ అదికూడా ఆయాపదాలు యతిమైత్రిస్థానంలో ప్రయోగించవలసి రావటమూ ఒక ప్రత్యేకసందర్భాన్నో ఆవిష్కరిస్తున్నాయి. అందుచేత కేవలం రూఢార్ధాలకోసం మడిగట్టుకోవటం ఇబ్బందికరం. కాబట్టి కొంచెం అప్రసిధ్ధపదాలూ లేదా అప్రసిధ్ధార్ధాలూ స్వీకరించటం పెద్ద దోషం కాదని భావించవచ్చును. అసలు రూఢము కాని అర్ధంలో వాడనే కూడదంటే ఆ అర్ధాలు నిరుపయోగాలు కదా.
తొలగించండిసాకేతసార్వభౌముని
రిప్లయితొలగించండిస్వీకర్తనుజేసి వొగడు శేముషిగలుగన్
మీకృతులు తమ్మి కలువల
ఆకృతులనుదాల్చి మాలలగు రామునికున్ .
అనేక ధన్యవాదాలండీ.
తొలగించండిచక్కని భావ వ్యక్తీ కరణ..నీ విన్నపాలు అన్నీ శ్రీరామ చంద్రుడు అలకిస్తున్నాడు.. నీ మనోవాంచ్చ లన్నియు
రిప్లయితొలగించండిశీఘ్రముగా నెరవేరుతాయి..దేవుని నమ్మిన వాడు ఎన్నడూ
చెడిపోడు