30, ఆగస్టు 2013, శుక్రవారం

సనాతనధర్మం ఉన్న పరిస్థితి, పురాణేతిహాసాలలోని ఘట్టాల వక్రీకరణ గురించి

(ఇది ఈరోజున నేను చూసిన పురాణేతిహాసాలలోని ఘట్టాల వక్రీకరణ - దానిపై మనం చేపట్టాల్సిన చర్యలు? అనే టపాకు నా స్పందన)

 సనాతనధర్మాన్ని అనుసరిస్తున్న మనం, కొంత సంకుచితంగానే అనుకోండి, హిందువులం అని ఒక మతంగా పేరు పెట్టుకుని చెప్పుకుంటున్నాం. ఇతర మతాల్లాగా, ఈ‌ సనాతనధర్మం భావవ్యక్తీకరణ స్వేఛ్ఛను నియంత్రించదు. అందుచేత అప్పుడప్పుడూ ఈ సనాతనధర్మం యొక్క మూలస్వరూపాన్నే అర్థంచేసుకోకుండా, అధిక్షేపించే వ్యక్తులు పుట్టుకుని వస్తూ ఉంటారు. అలాంటి వ్యవస్థలూ తల ఎత్తుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు ప్రబలి నప్పుడు శ్రీకృష్ణులవంటి అవతారపురుషులూ, శ్రీశంకరుల వంటి సద్గురువులూ వచ్చి దిశానిర్దేశం చేస్తారు. దాని అర్థం, సనాతనధర్మాన్ని అవలంబించిన వారు అటువంటి వారి రాకకోసం ప్రతీక్షిస్తూ నిష్క్రియాపరులుగా ఊరుకోవాలీ అని కాదు. సామరస్యపూర్వకంగా సనాతనధర్మాన్ని నష్టపరచే శక్తులను సన్మార్గంలోనికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాలి. కలిప్రభావం చేత ప్రస్తుతం అధర్మశక్తులది పైచేయిగానే ఉందన్నది ఒప్పుకు తీరవలసిన నిజం.

బాధగురువుల సంఖ్యా, వారి అనుచరగణం సంఖ్యా, ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోందన్నది వాస్తవం. అటువంటి వారు అజ్ఞానంతోనూ, మిడిమిడిజ్ఞానంతోనూ సద్గ్రంథాలకు దుర్వ్యాఖ్యానాలు చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఎవరైనా ఈ రోజుల్లో కాస్త ప్రచారం చేసుకోగల ట్రిక్కులు చేతనైన వాడైతే, సద్గురువూ జగద్గురువూ అని జనం చేత నీరాజనాలు పట్టించుకుంటున్నాడు. అయన బోధనలో, ఆయనశిష్యుల చేత వ్రాయించుకున్న పుస్తకాలో ఆర్షవాంగ్మయాన్ని తప్పుడు పధ్ధతుల్లో వ్యాఖ్యానించటం ఆశ్చర్యపోవలసిన విషయమేమీ‌ కాదు.  ఇలాంటి వారికి ఎంత అనుచరగణం ఉంటుందీ అంటే, ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పటికే చాలా ఇళ్ళల్లోంచి ఆర్షవాంగ్మయమూ, తత్సంప్రదాయానికి చెందిన అన్ని రకాల చిహ్నాలూ మాయం అవుతున్నాయి, ఈ‌ క్రొత్తగురువుల / అవతారపురుషుల / దేవుళ్ళ పుస్తకాలకూ చిహ్నాలకూ చోటు కల్పించటం కోసం. నాకు తెలిసిన ఒక కుటుంబం వారు ఇలాంటి ఒక కొత్త గురుసాంప్రదాయానికి జై అనటమే కాదు, వారింట్లో పెద్దలనుండి వచ్చిన శ్రీరామపంచాయతనాన్ని హుస్సేన్ సాగర్‌లో పారేసారు! దాదాపు ఇప్పటికే, రామ నామం కూడా కొత్త కొత్త దేవుళ్ళ నామధేయాలను ముందో వెనుకో తగిలించుకోకుందా నిలబడ లేని స్థితి కలుగుతోంది.

మీరు ఆవేదన చెంది ప్రతిఘటిస్తే ఏం జరుగుతుంది? మీకున్న వాక్స్వాతంత్ర్యం వారికీ ఉంది. వారి వెనుక నిలబడే వారి సంఖ్య మీ వెనుకాముందూ ఉన్న వారికన్నా అత్యధికంగా ఉండి, మీ వాదం చెల్లకుండా పోతుంది. ఒక అనుమానం రావచ్చును, అలా ఎందుకు జరుగుతుందీ, ఇలా కొత్త కొత్త పుంతలు తొక్కుతున్న వాళ్ళ కన్నా కూడా, సాంప్రదాయికమైన పంథాలో పోయే వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉంటుంది కదా అని.

 మన వాళ్ళలో చాలా మందికి అకర్మణ్యత్వం మీద చాలా గురి. మనకెందుకూ, అనవసరమైన గొడవల్లో తలదూర్చటం, మనకేమీ ఇబ్బంది లేదు కదా అని ఊరుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మరి కొంత మందైతే మనకేం తెలుసూ ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని చూస్తూ ఉంటారు. కొత్త కొత్త దారుల్లో కాలు మోపినవాళ్ళు మాత్రం చక్కగా తమని తాము సంరక్షించుకుందుకే చూస్తారు కానీ‌ అలా ఊరుకోరు.  వాళ్ళకు తోడుగా ఇతర మతాలవాళ్ళూ, హేతువాదులూ ప్రజాహక్కులవాళ్ళూ అంటూ అనేక మంది అనేక కోణాల్లో విరుచుకు పడతారు.  అవసరమైతే సాక్షత్తూ ప్రభుత్వాలూ రంగంలోకి దిగుతాయి మిమ్మల్ని కట్టడి చేయటానికి. అసలు ఈ‌ దేశంలో హిందూ అన్న పదాన్ని రాజకీయ వర్గాలు ఒక టెర్రరిష్టు పరిభాషలోని పదంలాగా చిత్రీకరిస్తున్నారు. క్రమంగా కొంత కాలానికి రామా అన్న మాట కూడా అభ్యంతరకరం ఐన పదం ఐపోయినా ఆశ్చర్యం లేదు.

సనాతనవాదుల మాట చెల్లక పోయేందుకు మరొక కారణం కూదా ఉంది. ఈ కొత్త కొత్త గురుపీఠాలూ, దైవాలదివ్యక్షేత్రాలూ భక్తబృందాలు ఇచ్చే అఖండ సిరిసంపదలతో తులతూగుతూ ఉంటాయి. సమాజంలో బడాబాబులూ, రాజకీయనాయకులూ ఇంకా అనేక రకాల లబ్ధప్రతిష్టులూ వారికి భక్తులుగా శిష్యులుగా ఉంటారు. అభ్యంతరం చెప్పే సనాతన వాది వెనుక ఎవరూ నిలబడతారనే నమ్మకం లేదు కాని, వ్యతిరేకంగా ఎందరో నిలబడతారని సులువుగా తెలుసుకోవచ్చును. భక్తపరమాణువులకు పవిత్రజీవనం గురించీ, కామినీకాంచనాల వల్ల ప్రమాదాల గురించీ దివ్యసందేశాలు ఇచ్చే ఈ‌ మహానుభావులు, దివ్యవ్యక్తులు కాబట్టి వారు మాత్రం ఈ ఉపదేశాలకు ఆవల వెలుగొందుతూ‌ ఉంటారు. 'శూలి భక్తాళి దుశ్శీలముల్ గన్న, మేలుగా గైకొనుమీ‌ బసవన్న' అన్నట్లుగా వీళ్ళ అభ్యంతరకరమైన విలాసాలు కల్లోలం కలిగించినా, ఆ భక్తశిఖామణులు వాటిని స్వామివార్ల లీలలుగానే గ్రహించి ఆనందించి తరించి ప్రచారం చేస్తారు. అందుచేత స్వామివార్లు సనాతన సంప్రదాయానికి తప్పుడు వ్యాఖ్యలు చేసినా, కొత్తకొత్త విషయాలు పౌరాణిక వాంగ్మయానికి జతచేసి దుర్వాఖ్యానాలు చేసినా అవన్నీ వారు చెప్పిన కొత్త కొత్త ప్రామాణిక విషయాలు ఐపోతాయన్న మాట. సామాన్య సంప్రదాయవాది కాదని నెగ్గే పరిస్థితి లేదు.

ఇతర మతాలలో ఇలాంటి పరిస్థితి ఎందుకు లేదూ అంటే ఆయా మతాలు సాంప్రదాయిక భావనాస్రవంతికి భిన్నంగా బయటి వాళ్ళైనా, లోపలి వాళ్ళైనా సరే, ఒక్కముక్క అన్నా సహించవు కనుక. తరచుగా ఏ మతం ఐనా మైనారిటీగా ఉండే దేశంలో దాని యొక్క సాంప్రదాయిక భావజాలం మరియు ఆచారాల పట్ల హెచ్చుగా ఆరాధనా భావం ఉంటుంది తన్మతస్థుల్లో.  ఇందులో ఆశ్చర్య పోవలసింది ఏమీ లేదు.

కాబట్టి ఈ‌ దేశంలో సినీనాటకరంగాల్లో (ఇంకా తెలుగు నాటకరంగం అనేది ఎక్కడుంది లెండి), శ్రీకృష్ణుణ్ణి ఒక టక్కరి పాత్రగానో, కపటిగానో చవకబారుగా చూపిస్తే  లేదా వినాయకుణ్ణి ఒక హాస్య పాత్రగా చూపిస్తే, నారదుణ్ణి ఒక వెకిలిపాత్రగా చూపిస్తే నూటికి తొంభైతొమ్మిది మంది హిందువులం అని చెప్పుకునే వాళ్ళు హాయిగా నవ్వుకుంటూ చూస్తారు. ఒక్కరికీ మనస్సు చివుక్కు మనదు. మరి ఈ సినీనాటకరంగాల వాళ్ళకి ఏసుక్రీస్తునో, మేరీమాతనో, గురుగోబింద్ సింగ్‌నో, సాయిబాబానో, మహమ్మద్ ప్రవక్తనో అలా ఈషణ్మాత్రంగా నైనా స్థాయి దిగజార్చి చిత్రీకరించే దమ్ము ఉంటుందా? నిజానికి అనుకోకుండా ఐనా అదికొద్దిగా నైనా జరిగితే, ఆ మతానుయాయుల మనోభావాలు దెబ్బతింటే, ఏం జరుగుతుందో తెలుసు కదా? ఆ మతాలవాళ్ళు తమ నిరసనను బ్రహ్మాండంగా తెలియజేస్తారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపే ప్రభుత్వాలూ, న్యాయస్థానాలూ కళ్ళెర్ర జేస్తాయి. అందుచేత ఈ సినీనాటకరంగాల వాళ్ళు హిందూ దేవుళ్ళను ఋషులనూ సినిమాలు ఆడించటానికి పనికి వచ్చే‌ పాత్రలుగానే చూస్తూ ఎలా పడితే అలా ఈడుస్తున్నారు. కాని ఇతరమతాల మహాత్ముల విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు.

 ఒకప్పుడు గణేష్ బొమ్మను బీడీ కట్టలమీద ముద్రించటాన్ని అడ్డుకోమని న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఏం జరిగింది? లోదుస్తుల్లోనూ చెప్పులమీదా, కమోడ్ సీట్లమీదా హిందూ దైవాల బొమ్మలు ముద్రించకుండా ఇవే‌ ప్రభుత్వాలూ ఇవే న్యాయస్థానాలు అడ్డుకున్నాయా?  హిందూమతం మెజారిటీ మతం ఇక్కడ. కాబట్టి వాళ్ళకి, ఏ అభద్రతా లేదు. అందుచేత వాళ్ళు కలిసికట్టుగా ఉండరు.  కాబట్టి ఈ‌ మతం వాళ్ళు ఓటు బాంక్ కాదు. అందుచేత ఎవ్వరూ‌ పట్టించుకోరు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఏమీ సహాయం చెయ్యదు. అసలు ఒకవేళ వివేకానందుడు ఈ‌ కాలం మనిషి ఐతే, హిందూఉగ్రవాది అన్న ముద్రతో కటకటాల వెనుక ఉండేవాడు.  ఏదో అమెరికా వాడు వీసా ఇవ్వటం దేవుడెరుగు.

అందుచేత వేదవ్యాసులవారి భాగవతంలో ఫలాని ఘట్టం ఇలా లేదూ, ఫలాని పాత్ర ఇలా లేదూ, వీళ్ళెవరో ఎలా మారుస్తారూ అని, హిందువులని చెప్పుకునే వాళ్ళు కోర్టు తలుపులు తట్టరు.  ఎవరైనా రాముడిని గురించి హీనంగా మాట్లాడితే బ్లాస్ఫెమీ అంటూ ఎవరూ కేసులు వేయరు. అలా మాట్లాడినవారు మేథావులుగా వెంటనే చెలామణీలోకి వచ్చేస్తారు కూడా తరచుగా.

ఈ విషయంలో మొన్ననే ఒక వ్యక్తి చేసిన వాదం (బ్లాగుల్లో కాదు) ఏమిటంటే, పూర్వం వ్యాసుడో, వాల్మీకో చెప్పినదే సంపూర్ణం అని ప్రమాణం అనుకోమంటే ఎలా?  మా ఫలాని గురువుగారు సాక్షాత్తూ అప్పట్లో శ్రీరామవతారం ఎత్తిన, తరువాత శ్రీకృష్ణావతారమూ ఎత్తిన దేవుడే -- ఆమాట ఆయనే చెప్పారు, మేం నమ్ముతున్నాం -- కాబట్టి కొత్త కొత్త విషయాలు పూర్వ ఋషులు చెప్పకపోతే ఈయన ఎందుకు చెప్పకూడదూ? మాకు ఇవీ‌ ప్రమాణమే.  ఆమాటకు వస్తే వ్యాసవాల్మీకాదుల రచనల్లో మా దేవుడి మాటలకు విరుధ్ధంగా లేని మాటలే మేం ప్రమాణం అనుకుంటాం అని. ఇప్పుడు, ఈ వాదానికి ప్రతివాదం ఏమిటీ? ఎవరైన వాదించి ఒప్పించటానికి ప్రయత్నించటం వలన ఉపయోగం ఉంటుందా?

సనాతనధర్మం పట్ల నిష్ఠ ఉన్న వాళ్ళు బాధపడటం తప్ప ఏమీ చేయగల పరిస్థితి లేదు ప్రస్తుతం. మీరు బయటి వాళ్ళకు నచ్చచెప్పలేరన్న సంగతి పక్కన బెట్టండి. చివరికి ఇంట్లో వాళ్ళముందు కూడా, సనాతనధర్మం గాడిదగుడ్డూ అంటూ‌ మాట్లాడి, లోకువ కావటం ఇబ్బందులు తెచ్చుకోవటం ఎందుకూ అనుకునే పరిస్థితి. కాదంటారా?

ఇదీ సనాతనధర్మం ఉన్న పరిస్థితి.

29, ఆగస్టు 2013, గురువారం

ఆధ్యాత్మికవేత్తలూ - వైద్యసలహాలూ.

ఈ‌ రోజున  హరిసేవ బ్లాగులో  డయాబెటిస్ - ఒక ప్రాణశక్తి సంక్షోభం :సద్గురు  అని ఒక టపా వచ్చింది.  దానిమీద కామెంటు పెట్టటం మొదలు పెట్టితే, నా వ్యాఖ్య పెద్దదిగా అవుతుందన్న సందేహం కలిగింది.  అందుచేత, ఒక కామెంటుగా అక్కడ ఉంచటం బాగుండదని అనిపించింది. అందుకే ఒక టపా రూపంలో నా అభిప్రాయాలు ఇక్కడ వ్రాస్తున్నాను.

ఈ ఆధ్యాత్మిక వేత్తలు అనబడే వాళ్ళు వారివారి ఆధ్యాత్మిక సందేశాలని అందించటానికి మాత్రమే పరిమితంగా మాట్లాడితే బాగుంటుంది. తెలిసీ తెలియకుండా ప్రతివిషయంలోనూ వ్యాఖ్యానించటం చాలా తప్పు.

తెలిసీ తెలియని విషయాల్లో ఈ‌ ఆధ్యాత్మిక వేత్తలు తలకాయ దూరుస్తూ ఉండటానికి కారణం ఏమిటో?


ఈ  అధ్యాత్మిక వేత్తలకి చాలా అనుసరణ (following) ఉంటుంది.  ఆ కారణంగా వాళ్ళు తరచూ ధైర్యంగా అన్ని విషయాల మీదా మాట్లాడతారు.  ఒక వేళ తమ మాటలు వివాదం రేకెత్తించినా ఇబ్బంది లేదు. సినిమాకి negative talk  కూడా మంచి publicity అవుతుందన్న మాట ఒకటి మనకు తెలుసు.  అలాగే, తమ వ్యాఖ్యానాలతో వివాదాలు వస్తే ఈ ఆథ్యాత్మిక వేత్తలకీ గురువులకీ ప్రచారం పండుతుందన్న మాట.  ఏ వివాదం లేదనుకోండి. తప్పో ఒప్పో జనం వింటున్నారు కాబట్టి ఈ వేత్తలు దర్జాగా తమతమ బోధల్ని విస్తరించుకుంటూ పోతారు,  తమకు ఏ‌ మాత్రమూ సరైన అవగాహన లేని రంగాల్లోకి కూడా.

ఇప్పుడు, ఈ సద్గురుగారి ప్రవచనం చూద్దాం.


మీరు మధుమేహ(డయాబెటిస్) వ్యాధిగ్రస్తులైతే చక్కెరతో మీకు సమస్య కాదు, మీ ప్యాంక్రియాస్(క్లోమ గ్రంథి) సరిగా పనిచేయడం లేదు, అంతే! 

చూడండి, ఈ‌ మాటల్లో కొత్తదనం ఏముంది?  క్లోమగ్రంథి సరిగా పనిచేయక పోవటంతో మధుమేహం వస్తుందని నేటి వైద్యశాస్త్రానికి తెలియదని ఈ సద్గురుగారి అభిప్రాయమా?  అదే చెప్తారు చూడండి.

అల్లోపతి (ఇంగ్లీష్) వైద్యంలో ప్యాంక్రియాస్‌ను ఎలా ఉత్తేజపరచాలో వారికి తెలియదు.

అల్లోపతీ అని పిలిచే ఆధునిక వైద్యంలో క్లోమగ్రంథిని ఉత్తేజపరచటం మీద తగిన శ్రధ్ధ పెడతారు.  ఇంకా ఈ విషయంలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు.

అల్లోపతి పైపై లక్షణాలనే చికిత్స చేస్తుంది. వైద్యులు మీ వ్యాధి లక్షణాలకే చికిత్స చేస్తారు.

అ మాట పూర్తిగా నిజంకాదు.  అసలు ఈ‌ ఆరోపణను చేసింది హోమియో వైద్యవిధానాన్ని కనిపెట్టిన హానిమన్ అనే వైద్యుడు.  అదీ రెండున్నర శతాబ్దాలకు పూర్వం. ఆయన గురించీ ఆ వైద్యం గురించీ హోమియో పతీ టపా లో చదవండి. అప్పటి సంగతి ఏమో కాని ఆ తర్వాత ఆధునిక వైద్యం చాలా చాలా అభివృధ్ధి సాధించింది.

యోగాలో మధుమేహ వ్యాధిని చాలా మౌలికమైన సంక్షోభంగా గుర్తిస్తాము. దానిని తేలికగా తీసుకోము. అసలు శరీర వ్యవస్థే దెబ్బతింటోందని, అందుకే వ్యాధి వస్తోందని గుర్తిస్తాము.

ఆనందమే. కాని శరీరవ్యవస్థ దెబ్బతినటం వల్ల మధుమేహం రావటం లేదు.  అది వచ్చాక శరీరంలోని వ్యవస్థలు దెబ్బతింటున్నాయి.  అది రావటానికి కారణం మాత్రం క్లోమగ్రంథి సరిగా పనిచేయకపోవటం.  మొత్తం వ్యవస్థ పని చేయక పోవటం కాదు.

డయాబెటిస్‌ను ఒక వ్యాధిగా కాక, అది శరీరంలోని ప్రాణశక్తి వ్యవస్థ దెబ్బతినడం మూలంగా వచ్చిందని గ్రహించి, దానిని సరిచేయడం వల్ల అది నయమౌతుంది. అందువల్ల మనుషులు తమ శక్తి వ్యవస్థను బాలెన్స్ చేయడానికి కొంత యోగ సాధన చేయడానికి ముందుకు వస్తే అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

అసలు ఈ‌ వాక్యాలు ఏం చెబుతున్నాయో గమనించారా?  ప్రాణశక్తి అనే వ్యవస్థ ముందు దెబ్బతింది.  కాబట్టి మధుమేహం వచ్చింది.  యోగాతో ఈ‌ ప్రాణశక్తిని బాలెన్సు చేయవచ్చును. అందుచేత, యోగసాధన చేసి మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయట పడండి.  ఇదీ‌ చివరకు సద్గరుగారి సలహా.

ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక వేత్తగారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలీ అంటే,

- తమకు మధుమేహం గురించి ఆధునిక వైద్యం పేరుతో‌జరుగుతున్నది వట్టి దగా అని తెలుసు కోవాలి.

- మధుమేహానికి ఆధునిక వైద్యం చేస్తున్న డాక్టరు దగ్గరకు వెళ్ళ కూడదు.

- మధుమేహానికి అంటూ ఆధునిక వైద్యం ఇచ్చిన మందులు వాడ కూడదు. అవి అదుపు చేయగలవేమో కాని వ్యాధిని నయం చేయవు.

- యోగా సాధన మంచిది మధుమేహానికి.  అలాగే అన్ని దీర్ఘవ్యాధులకీ, అదే పరమ వైద్యం.  చివరికి కాన్సరు కైనా సరే.

- మంచి యోగా గురువుని ఆశ్రయించాలి.

- శ్రధ్ధగా యోగా సాధన చేయాలి.


 తగ్గిందా మధుమేహం?  చూసారా మరి గురువుగారు చెప్పినట్లే జరిగింది కదా?
 ఏమిటీ? మీ మధుమేహం తగ్గలేదా? మీ ప్రారబ్ధకర్మ చాలా గట్టిది.  అంతా మీ కర్మ.

ఇదండీ చివరికి తేలింది.

చాలా కాలం క్రిందట నా స్నేహితుడు ఒకతను, గోధుమగడ్డితో సంపూర్ణారోగ్యం అని చదివి,  తెగ మేసాడండీ‌ ఆ గడ్డిని.  ఫలితంగా జబ్బుపడి డాక్టర్ల చుట్టూ తిరిగాడు కొన్నాళ్ళ పాటు.

అలాగే శ్రీమంతెన రాజుగారు ఆరోగ్యం కోసం సలహాలు ఇస్తూంటారు.  టీవీల్లోనూ వస్తారు. చాల పుస్తకాలూ ఉన్నాయి ఆయనవి.  చివరికి ఆయనే, తాను ప్రచారం చేస్తున్న జీవనశైలి వల్లనే తీవ్రంగా జబ్బు పడ్డాడని చదివాను.  ఈ మధ్య  బాబా రాందేవ్ అని ఒకాహన తెగ హడావుడి చేస్తున్నాడు.  ఆయన ఒక క్వేక్ అన్నారో డాక్టరుగారు మొన్ననే.

ఈ‌ మధ్య అనేకానేక ఆయుర్వేదం మందులూ వస్తున్నాయి మధుమేహానికి సరైన వైద్యం ఇదే నంటూ.  ఒక్క విషయం గ్రహించండి.  మూలికలూ భస్మాలూ వాటితో తయారయ్యే ఈ ఆయుర్వేదం మందులు ఎలా పని చేసేదీ పరిశోధనల్లో ఎక్కడా ఋజువు లుండవు. చాలా మంది చేసేది, కేవలం‌ ప్రచారం నమ్మి వాడటమే!  కాని ఈ‌ ఆయుర్వేదం మందులూ, అల్లోపతీ డాక్టరుగారు ఇచ్చే‌ మందులూ‌ కలేసి వాడటం అంత క్షేమకరం కాదు.  ముఖ్యంగా మీ అల్లోపతీ డాక్టరుగారికి చెప్పకుండా ఆస్సలు వాడకూడదు.  ఈ మూలికల్లోని రసాయనాలకూ,  మీ డాక్టరుగారు ఇచ్చే మందుల్లోని రసాయనాలకూ మధ్య ఎలాంటి రాసాయనిక చర్యలు మీ పొట్టలో జరుగుతాయో ఎవరికీ ఏమీ తెలియదు.  మీదు మిక్కిలి అయిపోతే ఆందోళన పడటం కన్నా, ముందే మేల్కోండి.  జాగ్రత్త పడండి!

ప్రతిదానికీ ఈ మధ్య యోగా అని టైటిల్ ఒకటి తగిలించటం ఫ్యాషన్ అయిపోయింది.  అధ్యాత్మిక విద్యలో చెప్పే యోగానికి ఈ నియోయోగాలకీ ఏ సంబంధమూ లేదు.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే,  మీ ఆరోగ్యంతో మీరు ప్రయోగాలు చెయ్యకండి.  అవి తరచుగా వికటిస్తాయి.  వైద్య పరమైన పరిజ్ఞానమూ, అధికారమూ లేని వాళ్ళు చెప్పే వైద్యపరమైన సలహాలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలెయ్యండి.   అలాంటి సలహాలు ఇచ్చే మహనుభావులకి వీలైనంత వరకూ, చాలా దూరంగా ఉండండి.

కామెంట్లలో లింకులు ఇవ్వటం ఎలాగో తెలుసుకోండి.

ఈ ప్రశ్నకు సమాధానం నేను తెలుగుభావాలు బ్లాగులో ఒక వ్యాఖ్యలో రాయటానికి సరిగా కుదరక ఇబ్బంది పడ్డాను!

అదీ గాక, ఈ‌ సూచన సోదర బ్లాగర్లు అనేక మందికి ఉపయోగిస్తుందని అనిపిస్తోంది.

కాబట్టి ఒక బుల్లి టపాగా వేస్తున్నాను నా బ్లాగులో

ఉదాహరణకు మనం,  తెలుగుభావాలు సైట్ లింక్‌ను మన వ్యాఖ్యలో చూపించాలీ అనుకుంటే, ఇలా టైప్ చేయాలి

<a href="http://telugubhaavaalu.wordpress.com/"> తెలుగుభావాలు </a>

ఇలా టైప్ చేస్తే మన వ్యాఖ్యలో  తెలుగుభావాలు  అని కనిపిస్తుంది అన్నమాట.

28, ఆగస్టు 2013, బుధవారం

పాహి రామప్రభో - 220.. 228 ఉత్సాహరామాయణం (అరణ్యకాండ)

ప్రేమ మీర లక్ష్మణుండు వివిధగతుల గొల్వగా
రామచంద్రమూర్తి విడిసె రమ్యసుగుణధామయౌ
భూమిజాత తోడ విపినభూమి పర్ణశాలలో
నా మనోజ్ఞపంచవటి ననంతసుఖవిలాసుడై    220

అంత చుప్పనాక యనగ నచటి కేగు దెంచి దు
శ్చింత తోడ దనుజ యోర్తు జేరి రాము డొల్లమిం
పంతగించి గీడు సేయ వచ్చు టెఱిగి లక్ష్మణుం
డింతి ముక్కుచెవులు కోసె నేగె నదియు భీతయై    221

ఖరుడు దూషణుండు నాగ కలరు దాని కన్న లా
సురవిరోధు లంత డాసి సొదను జొచ్చు పుర్వు ల
ట్లరిది వీరు వలన కూలి రరయ పదియు నాల్గు వే
వురగు సైన్య సమితి తోడ పోర రామశరములన్    222

అన్న రావణా నృశంసు డైన రాము డనెడు వా
డన్ని విధము లెన్న నీకు నంకపీఠి నుండగా
నెన్నదగిన నాతి తోడ నెసగ దాని గొంచు రా
జన్న నన్ను దఱిగి వాడు జంపె నచట నందరన్    223

నీ చెలియలి పగను వేగ నీవు దీర్చు మంచు నా
నీచురాలు చుప్పనాక నిప్పుబెట్ట వాడు మా
రీచు డన్న వాని మాయ లేడి చేసి పంపి తా
వేచి సీత నపహరించి వేగ లంక కేగినన్     224

రామపత్ని నకట దుష్టరాక్షసుండు గొంచు బో
నామె మొఱ్ఱ లాలకించి యడ్డు రా జటాయువుం
దామసించి నరికి వేయ ధరను గూలి వివరముల్
రాము డెఱుగ బల్కి పక్షిరాజు చేరె స్వర్గమున్      225

లలన జాడ లరయ రామలక్ష్మణులు వనంబునన్
కలయ దిరుగు చుండి యొకట కాంచి రొక్క రక్కసున్
పొలియ ద్రొక్క వాడు శాపముక్తు డగుచు దివిజుడై
తెలియు డయ్య శబరి మీకు తెఱవు జూపు పొండనన్  226

పోయి వారు కలసి నారు పుణ్యమూర్తి శబరి నా
బోయవనిత సత్కరించి పొంగి రామచంద్ర నీ
జాయ జాడ లరయ నీకు చక్కగా సహాయముం
చేయగల సమర్థుడైన స్నేహ శీలి గలడయా    227

లావు గలడు చాల ధర్మలక్ష్య బుధ్ది గలడు సు
గ్రీవు డనెడు సూర్యసుతుడు కీశరాజు వాడికన్
మీ వలన శుభంబు నొందు మీకు మేలు చేసెడిన్
పోవు డతడు ఋష్యమూక భూధరమున గలడనెన్   228

26, ఆగస్టు 2013, సోమవారం

శ్యామలీయం భాగవతంలో ప్రథమస్కంధం సంపూర్ణం అయింది

ఈ క్రింద మంజరీ ద్విపదపద్యం రూపంలో మహాభాగవతం ప్రథమస్కంధం యొక్క విషయసూచిక ఇవ్వబడింది.  

ఇందులో ప్రతి లైనూ ఒక లింకు. మీరు క్లిక్ చేసి టపాను  శ్యామలీయం భాగవతం బ్లాగులో  చదువుకోవచ్చును. 

భాగవతం ప్రధమస్కంధం కథా మంజరి 

ఘనుడు పోతన్న భాగవతంబు నుడివె
అడిగిరి సూతుని హరికథల్ మునులు 
వ్యాసుని చింతను వచియించె నతడు 
వ్యాసుని వద్దకు వచ్చె నారదుడు 
భాగవతము వ్రాయ బనిచె నారదుడు
పలికెను తన పూర్వ భవము దేవర్షి 
వ్యాసు డంతట భాగవతమును జేసె 
ద్రోణపుత్రుడు చేసె దుష్టకార్యంబు 
గురుపుత్రు డెంతయు కోపన శీలి 
ద్రోవది సౌజన్యరూప దీపశిఖ 
హరిపాదముల వ్రాలె నభిమన్యు పడతి 
హరిని వైరాగ్యంబు నడిగెను కుంతి 
పాండవాగ్రజు చింత బాపె భీష్ముండు 
దివి కేగె భీష్ముండు దేవసన్నిభుడు
అవనికి ధర్మజు నభిషిక్తు జేసి
వాసుదేవుడు వచ్చె ద్వారకా పురికి
వేలాది సతులకు వేడుక జేసె  
అంధక్షితీశ్వరుం డడవుల కేగె 
బంధుమోహంబును వదలె ధర్మజుడు 
కరిపురంబును చేరె ఘనుడు విదురుడు  
కాలగతిని గాంచి కలగె ధర్మజుడు 
వైకుంఠమున కేగె వాసుదేవుండు
కలియుగం బను కష్టకాలంబు వచ్చె
పార్థుని పౌత్రుండు పాలకుండయ్యె 
ధర్మమార్గంబున ధర నేల జొచ్చె
హరివియోగంబున కవని శోకించె 
ధర్మావనుల కలి తన్ని హింసించె
వాని పరీక్షిత్తు పట్టి శిక్షించె 
హరికీర్తి నుడివి నా డంత సూతుండు 
కాలంబుచే రాజు కదిలె వేటలకు 
రాజును మునికుమారకుడు శపించె
భూమీశునకు వార్త ముని యెఱిగించె 
ప్రాయోపవేశంబు ప్రకటించె రాజు 
శుకయోగి వచ్చె రాజోత్తము జూడ
మోక్షమార్గము వేడె భూమీశు డతని 

 
ఇతర వివరణలు


పాహి రామప్రభో - 212.. 219 ఉత్సాహరామాయణం (అయోధ్యాకాండ)

అయోధ్యాకాండ.

రామచంద్రమూర్తికిం ధరాధిపత్యమీయగా
నా మహాత్ముడైన తండ్రి కభిమతంబు గలిగి శ్రీ
రామునిం‌ బ్రసన్నముఖుని రాజసభకు బిల్చి రే
పే ముహూర్తమోయి రాజు వింక పైన నీవనన్       212


సన్నుతాంగి కైక యెఱిగి చాల నొచ్చి భూవిభున్
మున్ను నాకు వరములిచ్చి భూమినాథ మరచితే
పన్నుగాను నాదు సుతుని ప్రభువుగా నొనర్చి రా
మన్న పదియు నాలుగేడు లడవినుండ బంచుమా      213అనిన రాజు నేల గూలె నంత రామచంద్రు డా
మనుజవిభుని సత్యవ్రతుని మాట నెంచి కానకుం
జనెను ఛాయవోలె సీత స్వామి వెంట నడువగా
అనుజుడైన లక్షణుండు నన్న తోడు నీడగాన్      214


వారు గంగ డాసి నంత వచ్చి గుహుడు భక్తితో
శ్రీరమణుని పాదరజము చిన్న మెత్తు సోకినన్
నారి యగునొ పడవయంచు నగుచు రామ పాదముల్
వారిధార గడిగి యవలి వంక మువురి జేర్చగా      215


ఓజ మీర నగ్నులనగ నొప్పి మువ్వురా భర
ద్వాజమునిని గాంచి మ్రొక్కి తపసి కుటిని వారలా
రోజు గడపి వేడ్కమై పురోగమించి చేరిరా
పూజితమునికూటమనగ పొలుచు  చిత్రకూటమున్      216


అనుజు డైన భరతు డంత నాత్రపడిచు వచ్చి శ్రీ
యినకులేశు పాదసీమ నిమిడి రాఘవేంద్ర నీ
జనుట కోర్వలేక తండ్రి జనెను స్వర్గసీమకుం
మనుజనాథపదవి గొనుము మహితమూర్తి నీవనన్    217


మనుజనాథు తండ్రి పనుపు మానరాదు నాకు నీ
వనఘ యేలవయ్య నేను వచ్చు దాక రాజ్య మీ
వనగ నొల్ల కతడు రామ పాదుకలను పీఠిపై
నునిచి యేల నన్నగారి నొడబరచెను భక్తుడై    218

అడవి లోన నొక విరాధు డన్న రాక్షసుండు పై
బడి ధరాతనూజ నొడిసి పట్టి మింటి కేగ గా
వడి వధించి వాని తపసి వ్రాత మడుగ వారికిన్
జడుపు నుడుప రాక్షసాళి జంప దలచె రాముడున్  219

25, ఆగస్టు 2013, ఆదివారం

ప్రస్తుత తెలుగునేల రాజకీయ క్షేత్రంలో చిరంజీవి పాత్ర.

ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా! అని ఒక తత్త్వగీతం చెబుతోంది.  చాలా మంది వినే ఉంటారు.


హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే నూటికి ఎనబైమంది  శాంతిస్తారని చిరంజీవిగారు చెప్పినట్లుగా వినిపించే కథనానికి పెద్ద విలువ ఉందని అనుకోవటం లేదు.  ఈ‌ ప్రతిపాదనకు సహజంగానే తెలగాణాప్రాంత ప్రజలూ, నాయకులూ ఒప్పుగోరు.  సీమాంధ్రవాళ్ళు ఒప్పుకుంటారని చిరంజీవి అభిప్రాయం అయితే అది కూడా అనుమానమే.  అదీ కాక, సీమాంధ్రవాళ్ళు మాత్రం ఒప్పేసుకుంటే చాలా?  అప్పుడు గొడవ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ అవుతుంది కాని మరేం ఒరిగేది లేదు.

లోగడ, ఈ చిరంజీవి గారే, హైదరాబాదును శాశ్వత రాజధాని చెయ్యాలీ రెండు ప్రాంతాలకీ అని ఒక ఉధ్ఘాటించి చూసారు.  అదొక తలతిక్క ఆలోచన.  సీమాంధ్రవాళ్ళకు అది ఇష్టం ఉంటుందా? సీమాంధ్రరాష్ట్ర బడ్జెట్ నుంచి తెలంగాణా వాళ్ళకు ఎప్పుడు సొంతం ఐపోతుందో తెలియని హైద్రాబాదుకు నిధులు నిరంతరం ధారపోయటానికి వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? ఎల్లకాలమూ సీమాంద్రతో రాజధానిగా తమ ముఖ్యనగరాన్ని పంచుకుందుకు తెలంగాణా వాళ్ళు మాత్రం ఎందుకు ఒప్పుకోవాలీ?  అందుచేత ఈ‌ తింగరి ప్రతిపాదన అటకెక్కింది. అలా అని మరీ భరోసా యేమీ లేదు.  ఈ‌ కాంగ్రెసు వాళ్ళు ఎప్పుడు ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసేసుకుంటారో సాక్షాత్తూ ఆ నిర్ణయాలు తీసుకునే అధిపతులకే తెలియదు కాక తెలీదు.  కాబట్టి, తస్మాత్ జాగ్రత!

ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడిన, చిరంజీవికి కొద్దో గొప్పో సీట్లు కట్టబెట్టటం అనేది ప్రజలు అయనకు చేసిన మేలో, కీడో అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి మరి.  కాసిని సీట్లతో ధోబీ కా కుత్తా పరిస్థితిలో పడిపోయిన సదరు చిరంజీవి చిరుజీవిగా మనలేక, ప్రజల్ని ఏమనలేక, తనకు బుధ్ధిలేక, ఇంక గతిలేక, కాంగీమురికికాసారం లోకి దూకేశాడు.

రేప్పొద్దున్న భారత దేశపు కుమారచక్రవర్తిగారి పట్టాభిషేకానికి స్వంత బలగం  తాలూకు, బలం దర్పం ఎంత మాత్రం చాలకుండా పోతోందని గ్రహించుకున్న ఈ దేశపు - 'అసలుసిసలు' - ప్రధానమంత్రిణీదేవిగారు, అందిన ప్రతిచోటినుండి కిరాయిబలగాల్ని పోగేసుకోక తప్పదన్న స్థితప్రజ్ఞురాలై, చిరంజీవి లాంటి రకరకాల చిరుజీవుల్ని పోగేసుకుంటున్నారు.   అందుచేతనే, మిణుకుమిణుకు దీపంలాటి చిరంజీవిగారికి కాంగీకాలుష్యగంగాప్రవేశమహోత్సవం జరిపించటమూ, వారికో  కేంద్ర మంత్రి దసరావేషమూ వేసి వినోదం రక్తి కట్టించారు.

తెలుగునేలను ముక్కలు చేయకపోతే, సీమాంధ్ర, తెలంగాణా లనే రెండు ప్రాంతాల్లోనూ ఎవరూ కాంగీబంగీని నమ్మి ఓట్లూ సీట్లూ కట్టబెట్టరని నిశ్ఛయం ఐపోయింది.  


కాబట్టి, రెండు ముక్కలు చేస్తే, ఆ తెలంగాణాలో ఏదో ఇచ్చామన్న కృతజ్ఞతతో ఐనా కాసిని సీట్లు రాల్తాయి.  పైగా మహానేత  కె.సి.ఆర్ ఎప్పుడొ హామీ ఇచ్చారామె.  మనలో మనమాట, ఆ హామీని లోపాయకారీగా నిర్థారించుకోకుండా అడుగేసే అప్రయోజక పార్టీ కాదేమో  కాంగీ.  ఒకవేళా ఆ పార్టీ నిర్ణయాల్లో ఉన్న గందరగోళం చూస్తుంటే అలా హామీని నిర్థారించుకోక పోయినా ఆశ్చర్యం‌ ఎంత మాత్రం లేదు.

సీమాంధ్రలో అడ్రసు గల్లంతైనా ఆ సీట్లలో చాలా భాగం ప్రస్తుతం జనమూ రాజకీయులూ కూడా ముక్త కంఠంతో పిల్లకాంగ్రెసు అని పిలుచుకుంటున్న పార్టీ ఎగరేసుకు పోయేలా ఉంది.  కానీ ఆట్టే భయం అక్కర లేదు.  అది పిల్ల కాంగ్రెసు అన్న బిరుదుకు రేపైనా న్యాయం చేస్తుంది.  అదీ గాంగీయుల ప్రగాఢనమ్మకం.  అది వాళ్ళు చదువుకున్న స్వంత పార్టీ చరిత్ర కుండ బద్దలు కొట్టి చెబుతున్న నిజం.  అందు చేత, ఈ వేళ, సీమాంధ్రప్రజలు జెల్లకొట్టి పంపినా, ఆనక జగన్మోహనం గారిని సముదాయించుకుని అక్కడా మేమే అని తీరిగ్గా పళ్ళికిలించుకో వచ్చును.  ఎవరూ ఏమీ అనుకోరు.  రాజకీయాల్లో ఉఛ్ఛనీచాలేమీటీ, శత్రువులూ మిత్రులూ‌ ఏమిటీ అని ఘనతవహించిన అత్తగారే ఒకప్పుడు అప్పటి కుండ బద్దలు కొట్టి మరీ చెప్పిన విషయం సోనియమ్మగారికి తెలియదా ఏమిటి.  పైగా ఆంధ్రులు ఆరంభశూరులూ అన్న బిరుదుకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు, ఇకముందు చేయరనీ నమ్మొచ్చును. 

అందుచేత తెలుగుగడ్డను పగులగొట్టటమే అన్ని విధాలా ఉభయ తారకంగా ఉంటుందన్న భావనే కాంగీ దొంగాటకు  మూల సూత్రం. 

ఇకపోతే చిరుగారు, నిజంగా ఒక చిరుచేప.  ఆయన డాంబిక ప్రవర్తన, చేసే అమాయకపు ప్రకటనలూ నమ్మే పిచ్చిమాలోకాలు తెలుగుగడ్డ మీద ఎవరైనా ఉన్నారని అనుకో నక్కర లేదు. 

ఆయనకు ఒక బంగారం లాంటి అవకాశం వచ్చి జారిపోయింది.  సీమాంధ్రలో ఉద్యమం (తెలంగాణావాళ్ళు ఆ మాట ఒప్పుకోరనుకోండి, అది వేరే విషయం) రగులుకున్నాక అయినా ఆయన ఆ దిక్కుమాలిన బఫూన్ వేషం వదిలేసి వచ్చి జనంలో పడి నాయకత్వం అందుకుంటే,  తిరిగి పునర్వైభవం కోసం ప్రయత్నించే అదృష్టం పట్టేదేమో.  కాని తలుపుతట్టిన అదృష్టాన్ని ఆయన గమనించ లేక పోయాడా, లేక కాంగీ ఓడనుండి దూకటానికి ధైర్యం చేయలేకపోయాడా లేక వేరే ఇబ్బందులు ఏమన్నా ఆయన కాళ్ళూ‌ చేతులూ కట్టేసాయా అన్నది అప్రస్తుతం.  ప్రజలదృష్టిలో ఆయన వట్టి తటపటాయింపుల పిరికి మనిషిగా మిగిలి పోయాడు. అదీ‌ మనం ముఖ్యంగా గమనించ వలసింది.

ఆయన పాత్రచేత చెప్పించబడే చిలకపలుకులకూ ఆయనకున్న విలువకన్నా ఎక్కువ విలువ లేదు. అది చిరంజీవిగారికీ బాగానే తెలుసు అనుకోవచ్చును.

23, ఆగస్టు 2013, శుక్రవారం

శ్రీరామచంద్రులవారికి మానసిక పూజ చేసే విధానం

పూజాకారణం
కం. శ్రీరాముని కడు ప్రేముడి
నారాధించుటకు మించి యానందము సం
సారుల కుండునె మోక్ష
ద్వారము రామార్చనంబు భక్తజనులకున్

 
తాత్పర్యం: 
ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి, శ్రీరామచంద్ర ప్రభువుల వారిని మిక్కిలి ప్రేమతో పూజించుకో గలగటానికి మించిన భాగ్యం ఉంటుందా? రాములవారిని పూజ అంటే సాక్షాత్తూ మోక్షద్వారమే! అందుకే ఆయన్ని మనసారా పూజిద్దాం.

సంకల్పము
కం.
మనసార నిన్ను గొల్చెద 
తని వోవగ నిపుడు జనకతనయానాథా
వినతాసుతఘనవాహన
మునిజననుత రామచంద్రమూర్తీ భక్తిన్


తాత్పర్యము: ఓ రామచంద్రమూర్తీ,  జానకీపతీ, వినతాదేవి కుమారుడు గరుత్మంతుణ్ణి ఆదరంగా వాహనం చేసుకున్న వాడా (అనగా నీవే శ్రీమహావిష్ణువూ అని సంబోధిస్తున్నామన్న మాట), జ్ఞానులైన మునులచేత స్తుతించబడేవాడా,  భక్తితో, ఇప్పుడు నిన్ను నా మనస్సులో తనివితీరేటట్లుగా అర్చిస్తున్నాను.

గణపతి ప్రార్థన
కం. పరమకృపామతి గణపతి
పరమేశ్వరుడైన రామభద్రుని పూజన్
జరిపించుము విఘ్నంబులు
దరి జేరగ నీక నీకు దండములయ్యా


తాత్పర్యం: ఓ ఎంతో దయగల వాడా గణపతీ, ఇప్పుడు నేను పరమేశ్వరుడైన శ్రీరామచంద్రుల వారికి మానసిక పూజ చేద్దామని సంకల్పం చేసుకున్నాను.  నీకు అనేక నమస్కారాలు చేసుకుంటున్నాను.  ఈ పూజా కార్యక్రమానికి ఏ ఆటంకాలూ రాకుండా చక్కగా జరిపించు.
 

ధ్యానము
కం.  ధ్యానింతును నా మదిలో
మౌనీంద్రార్చితుని సర్వమంగళమూర్తిన్
జ్ఞానానందమయుండగు
భూనాధుని రామచంద్రమూర్తిని కూర్మిన్


తాత్పర్యం:  రామచంద్రమూర్తి జ్ఞానానంద మయుడు.  సార్వభౌముడు. సర్వమంగళమైన స్వరూపం కలవాడు. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని నా హృదయంలోఎంతో ప్రేమపూర్వకంగా ధ్యానం చేస్తున్నాను.

ఆవాహనం
కం. భూవర జనకసుతావర
దేవర శ్రీరామచంద్ర దేవసుపూజ్యా
నీవే దిక్కని  నమ్మితి
రావయ్యా పూజలంద
రఘురామయ్యా

తాత్పర్యం:  ఓ శ్రీరామచంద్రమహారాజా, భూమిపుత్రిక ఐన సీతాదేవికి ప్రాణనాధుడా, దేవతలచేత చక్కగా పూజ లందుకునే‌వాడా, స్వామీ, నీవే నాకు దిక్కు అని నమ్మి ఉన్నాను.  ఓ‌ రఘురామా రావయ్యా.  వచ్చి నా పూజలు స్వీకరించు.

ఆసనం
కం. మనుజేశ రామ నాదగు
మనమును దయచేసి దివ్యమణిమయ సింహా
సనముగ గైకొన వయ్యా
జనకసుతా సహితముగను సంతోషముగన్


తాత్పర్యం:  ప్రభూ మీకు నా మనస్సు అనేదే మంచి మణిమయ సింహాసనంగా అర్పించుకుంటున్నాను. శ్రీరామచంద్రా, సీతమ్మతల్లితో‌ కలిసి, మీరు సుఖంగా సంతోషంగా ఈ ఆసనం అలంకరించండి.

పాద్యం
కం. ఏ కాళ్ళ గంగ పుట్టిన

దా కాళ్ళను కడుగ నెలమి నడిగెద తండ్రీ
నా కీ భాగ్యము నిమ్మా
శ్రీకర కరుణాలవాల సీతారామా


తాత్పర్యం: తండ్రీ సీతారామచంద్ర ప్రభూ. ఏ కాళ్ళనుండి గంగ జన్మించిందో,  అ దివ్య పాదాలను ప్రేమతో కడిగే భాగ్యం ప్రసాదించండి. మీరు ఎంతో దయగల వారు.  మీరు సాక్షాత్తూ మోక్షాన్ని ప్రసాదించేవారు.  అలా అనుగ్రహించి నన్ను ధన్యుడిని చేయండి.  (శ్రీమహావిష్ణువే శ్రీరాములవారు. శ్రీమహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు ఆయన పాదం‌ బ్రహ్మలోకాన్ని సమీపించగానే ఆశ్చర్యానందాలతో బ్రహ్మదేవుడు తన తండ్రి పాదాలను, తన కమండలంలోని జలంతో కడిగి ధన్యుడయ్యాడు. ఆ జలమే గంగ అనే పేర దివ్యనది అయింది.)


అర్ఘ్యం
కం.మానసకలశ స్థితమగు

నానందామృతము నిత్తు నర్ఘ్యంబుగ వి
జ్ఞానసుగంధముతో రా
మా నా సద్భక్తిశ్రధ్ధ
లనెడు విరులతో
 
తాత్పర్యం: ఓ‌ శ్రీరామచంద్రప్రభూ నా మనస్సనే ఉత్తమమైన కలశంలో ఆనందామృతం అనే మంచి జలం తీసుకుని వచ్చాను.  ఈ‌ జలం, మీ దయ వలన, చక్కగా మీ యందు నాకు కలిగిన విజ్ఞానం అనే దివ్య సుగంధంతో పరిమళిస్తున్నది. స్వామీ మీకు యీ‌ జలాలను నా భక్తీ, శ్రధ్ధా అనే మనోహరమైన పుష్పాలతో‌ పాటు  అర్ఘ్యంగా సమర్పించుకుంటున్నాను.

ఆచమనం
కం. రాకేందు వదన రామా
నీకన్న విశుధ్ధు లెవరు నిక్కంబరయం
గైకొను మాచమనీయము
శ్రీకర నా భక్తికలశశీతాంబువులన్


తాత్పర్యం: ఓ రామచంద్రా, పూర్ణచంద్రుని వంటి ముఖంతో ప్రసన్నంగా ఉండే చల్లని స్వామీ. నీకన్నా నిజానికి పరిశుధ్ధు లెవ్వరయ్యా? ఐనా ఆచారం ప్రకారం నీకు ఆచమనీయం సమర్పించు కుంటున్నాను.  స్వామీ, స్వీకరించండి. ఇవి నా భక్తికలశం అనే పాత్రలో నిండి ఉన్న ఉత్తమ జలాలు. (అంటే నా భక్తియే ఆ కలశంలో ఉదకరూపంగా ఉంది అని భావం) ఈ‌ జలం‌ చక్కగా నిర్మలంగా చల్లగా మీకు చాలా హితకరంగా ఉంటుంది.  దయచేసి మీరు ఈ జలాలు స్వీకరించి ఆచమించండి.

పంచామృతస్నానం

ఆ.వె. భక్తి కొలది నీకు పంచామృతములుగా
శ్రవణ మనన దాస్య సఖ్య సేవ
నంబు లమర జేసి స్నానార్థ మిచ్చితి
కొనుము రామచంద్ర కోమలాంగ


తాత్పర్యం: శ్రీరామచంద్రా, పంచామృతలైన పాలూ, పెరుగూ, నేయీ, తేనే, ఫలరసాలను  శ్రవణమూ, మననమూ, దాస్యమూ, సఖ్యమూ, సేవనమూ అనే నా భక్తి విశేషాలు సమకూర్చుతున్నాయి స్వామీ. చక్కగా ఈ పంచామృతాలతో స్నానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

శుధ్ధోదకస్నానం
క. జనకసుతావర  రఘునం
దన  హరి సద్భక్తిజల ముదారంబగు నా
మనసే మంచి తటాకము
తనివారగ జలకమాడ దయచేయగదే


తాత్పర్యం: ఓ రఘునందనా, సీతాపతీ, మీరు శుధ్ధోదకాలతో స్నానం చేయటానికి నా యొక్క సద్భక్తి అనే ఎంతో స్వాదువైన జలంతో చక్కగా పూర్తిగా నిండి ఉన్న నా మనస్సనే తటాకం తమ కోసం ఎదురుచూస్తూ‌ సిధ్ధంగా ఉంది.  మీకు తృప్తి కలిగే టట్లుగా హాయిగా జలకాలాడి ఆనందించండి.

వస్త్రం
కం. ఈ‌ నామనమును బుధ్ధియు
ప్రాణేశ్వర  నీకు మంచి వస్త్రంబులుగా
నే నిదె యిచ్చెద గొనుమా
జ్ఞానానందామృతాబ్ధి జానకిరామా


తాత్పర్యం:  ఓ నా ప్రాణాలకు అధినాయకుడవైన శ్రీరామచంద్రప్రభూ, ఓ జ్ఞానానందం అనే సముద్రం వంటిజానకీ రామా, నీకు ఇదే వస్త్రద్వయం సమర్పించుకుంటున్నాను.  ఈ నా మనస్సూ, బుధ్ధీ అనేవే నీకు నేను సమర్పించుకోగల అత్యత్తమమైన వస్త్రాలు. దయతో వీటిని స్వీకరించండి.

యజ్ఞోపవీతం
కం. ఇది నా నవనాడులతో
ముదమున సమకూర్చి బ్రహ్మముడి యనగా నా
హృదయం బమరించిన యది
సదమల ముపవీత మయ్య జానకిరమణా


తాత్పర్యం: ఓ‌ జానకీపతీ, శ్రీరామచంద్రా, నా హృదయమే బ్రహ్మముడిగా,  నా నవనాడులే‌ ఉపవీతపు పోగులుగా నీకు యజ్ఞోపవీతం‌ సమర్పించుకుంటున్నాను.  నీ‌యందలి భక్తి కారణంగా పునీతమైన నా హృదయమూ నవనాడులతో యేర్పడిన ఇది మిక్కిలి నిర్మలమైన శ్రేష్ఠమైన యజ్ఞోపవీతం.  దీనిని మీరు స్వీకరించవలసినది.

గంధం
కం. దీనికి మించిన గంధము
కానంబడ దుర్వి మీద కావున దయతో
ఈ నా భక్తి సుగంధము
చే నందుము రామచంద్ర సీతారమణా


తాత్పర్యం:  భగవంతుడి సృస్టిలో ఉన్న ఈ‌ భూప్రపంచంలో ఉన్నాం‌ మనం.  ఇక్కడ ఉన్న అన్ని పరిమళభరితమైన వస్తువుల్లోనూ ఉత్తమోత్తమమైనది భగవద్భక్తి అనే‌ సుగంధం.   సుగంధం అనే వస్తువు యొక్క లక్షణం మనోహరమైన పరిమళంతో మనస్సుకి ప్రీతికలిగించటం కదా.  భగవంతుడికి భక్తుడివ్వగలిగిన అత్యంత ప్రీతికరమైన వస్తువు భక్తి.  అందుచేత మనం‌ స్వామితో,  ఓ‌ స్వామీ సీతారమణా, ఈ నా భక్తి అనేదే‌ భూప్రపంచంలో నేను నీకు ఇవ్వగలిగిన అత్యంత సుగంధపూరితమైన మైసేవ. దీనిని దయతో స్వీకరించండి అని ప్రార్థిస్తున్నా మన్నమాట.

అక్షతలు
తే. అక్షతంబన బరగు  బ్రహ్మంబ వీవె
అక్షతము లౌచు నన్ని దేహముల యందు

అహము మమతయు నా కబ్బు నవియె ప్రీతి
అక్షతల జేసి పూజింతు నయ్య రామ

 
తాత్పర్యం:  ఓ‌ శ్రీరామచంద్రా, సృష్టిలో ప్రతీదీ‌ క్షతమే - అంటే - ఏదో ఒక విధంగా కాలం చేత కొట్టబడిందే.  ఆలా కొట్టబడని అక్షతమైన తత్వము సాక్షాత్తూ బ్రహ్మము వైన నీవే.  ఐతే నా వద్ద రెండు అక్షతలు ఉన్నాయి.   ఒకటి అహంకారం, మరొకటి మమకారం - ఈ‌ రెండూ‌ జీవుడనైన నన్ను జన్మజన్మల్లోనూ వదలకుండా వెంట బడుతున్నాయి.  ఈ‌ రెండింటినీ‌ మాత్రం‌ కాలం ఏమీ‌ బాధిస్తున్నట్లు తోచదు.  ఈ రెండు అక్షతలనూ సంతోషంగా నీకు పూజార్థం సమర్పించుకుంటున్నాను.  వీటిని నీవే చక్కగా వినియోగించు.  (నా అహంకార మమకారాలను సరియైన దారిలో నడపమని రాములవారిని వేడుకుంటున్నానని అర్థం)

ఆభరణం 

కం. విలువగు రత్నము లైదన
గలవు సుమా నాదు ప్రాణఘనరత్నము లో
కుల దైవమ నీ పాదం
బుల కడ నుంచెదను రామ భూవర ప్రీతిన్


తాత్పర్యం:  ఓ‌ శ్రీరామచంద్రప్రభూ, నీ వంటి వానికి మిక్కిలి అమూల్యమైనవే సమర్పించాలి కాని అలాంటివీ‌ ఇలాంటివీ ఇవ్వవచ్చునా.  నీవు రాజువు, రాజులు రత్నప్రియులు కదా.  నా దగ్గర అత్యంత విలువైన ఐదు రత్నాలున్నాయి.  అవి నా ప్రాణాలన్న పేరుతో‌ పిలువబడుతూ ఉంటాయి.  నాకు సంబంధించినంత వరకూ  ఈ‌ ప్రపంచంలో,  ఇంత కంటే విలువైన రత్నాలే లేవు మరి.  ఎంతో సంతోషంగా ఈ ఐదింటినీ‌ కూడా కులదైవం అయిన నీ‌ పాదాల వద్ద ఉంచుతున్నాను. స్వీ‌కరించి అనుగ్రహించ వలసింది.

పుష్పం
కం. పంచేంద్రియ సంపుటియే
పంచదళంబులుగ భక్తి పరిమళముగ నా
మంచి హృదయ సుమము సమ
ర్పించెద  దయచేసి స్వీకరించవె రామా


తాత్పర్యం:  శ్రీరామచంద్రప్రభూ, నేను నీకు నా హ్యదయాన్నే దివ్యపుష్పంగా సమర్పించుకుంటున్నాను. దీనికి చక్కగా నా పంచేద్రియములనే ప్రశస్తమైన రేకులూ,  భక్తి అనే‌ పేరుగల ఎంతో మనోహరమైన పరిమళమూ ఉన్నాయి. ఇంతకంటే మంచి పుష్పం లేదూ, ఇది చాలా ఉత్తమోత్తమమైన పుష్పం అని నీకు వినయంగా సమర్పించుకుంటున్నాను.

ధూపం
కం. పంచప్రాణంబులతో
నంచితమగు ధూపమిచ్చు టత్యుచితమౌ
నంచు తలంచితి నిచ్చితి
నించుక దయచూపి యేలవే రఘురామా


తాత్పర్యం:  నీకు ఎటువంటి ధూపం ఇచ్చేదీ? నా పంచప్రాణవాయువులూ నీ‌భక్తిపరీమళంతో నిండిపోయి ఉన్నాయి. అందుచేత వాటితోటే నీకు ధూపం సమర్పించటం అత్యంత ఉచితంగా ఉంటుందని భావిస్తున్నాను. అందుచేత నా భక్తిపరీమళపూరితమైన ఈ‌ ధూప సుగంధాన్ని ఆఘ్రాణించి నా మీద అనుగ్రహం చూపవలసింది.

దీపం
కం. త్రైలోక్యదీపనుడ వే
యేలాగున తగిన దీప మేర్పడ చూపం
జాలుదు రామా చూపెద
నా లో పలి జ్ఞాన జ్యోతి  నళినదళాక్షా


తాత్పర్యం:  ఓ‌ కలువ కన్నుల దేవరా శ్రీరామచంద్రా,  నీవే మూడులోకాలకూ వెలుగైన వాడివి.  నీకు ఏమని నేను దీపం చూప గలను స్వామీ? నా దగ్గర ఒక ప్రశస్తమైన జ్యోతి ఉంది.  దానిని జ్ఞానజ్యోతి అంటారు.  నాకు తెలిసి అంతకంటే గొప్ప వెలుగు లేదు. దానినే నీకు దీపదర్శనం కోసం అర్పిస్తున్నాను.

నైవేద్యం
కం. నాదని యేమున్నది నీ
పాదంబుల చెంతనుంచ భక్తుడ నీ వెం
తో దయనిచ్చిన దీని ని
వేదించెద జీవితమును వేదవిహారా


తాత్పర్యం:  ఓ శ్రీరామచంద్రప్రభూ!  నాదని ప్రత్యేకంగా యేమీ‌ లేదు కదా.  అంతా నీవు ప్రసాదించినదే.  అందు చేత, ఇదిగో ఇది నేను నీ‌ పాదాల వద్ద నివేదించు కుంటున్నాను అని చెప్పి ఇవ్వగలిగింది ఏదీ‌ కనబడటం లేదు.  అందు చేత, నీ విచ్చినదే అయినా నా జీవితాన్నే నీకు నివేదించుకుంటున్నాను.  నేకు నేను ఇవ్వగలది అంత కంటే శ్రేష్ఠమైనది మరేమీ లేదు కదా.  దయచేసి స్వీకరించండి.

తాంబూలం
క. ఆకులుగా త్రిగుణంబులు
పోకలుగా మనసు బుధ్ధి పోడుములున్ చూ
ర్ణాకృతి నహ మొప్పంగను
మీకున్ తాంబూల మిత్తు మేలుగ రామా


తాత్పర్యం:  ఓ‌ రామచంద్రప్రభూ. మీకు మేలైన తాంబూలం సమర్పించటానికి అనుమతి నివ్వండి.  నా త్రిగుణాలే తములపాకులుగా, నా మనస్సు, బుధ్ధి అనేవే పోక చెక్కలుగా, నేను అన్న భావననే చూర్ణం చేసి అదే సున్నంగా మీకు తాంబూలం సిథ్థం చేసాను.  దయచేసి నేనివ్వ గలిగింతలో ప్రశస్తమైన యీ‌ తాంబూలాన్ని గ్రహించి అనుగ్రహించండి.

నీరాజనం
క. వెలుగుల కెల్లను వెలుగై
వెలుగొందెడి దివ్యమూర్తి విజ్ఞానవిభా
విలసనములు కర్పూరపు
వెలుగులుగా హారతి గొన వేడుదు రామా


తాత్పర్యం:  ఓ శ్రీరామచంద్రప్రభూ నువ్వు వెలుగులకే వెలుగైన వాడివి.  అటువంటి నీకా నేను వేరొక వెలుగును హారతిగా ఇచ్చే సాహసం చేసేది.  కాని రామా, ఉపచారం సమర్పించుకోవటం అనేది సముదాచారం‌ కాబట్టి, నీ కోసం ఒక దివ్యమైన హారతిగా విజ్ఞానప్రభలు అనే వెలుగులనే‌ దివ్య కర్పూర నీరాజనం‌ వెలుగుగా సమర్పించు కుంటున్నాను.  స్వీకరించి నన్ను అనుగ్రహించ వలసిందిగా వేడుకుంటున్నాను.

మంత్రపుష్పం 

సర్వేశ కల్పించి సకలలోకముల
నిర్వహింతువు నీవు నిరుపమ లీల
కర్మసాక్షులు నీకు కన్నులై యుండ
చల్లగా చూచెద వెల్ల లోకముల
పరమాత్ముడవు నిన్ను భావించువారి
సంరక్షణము నీవు సలిపెద వెపుడు
సర్వాత్మనా నిన్ను చక్కగా నమ్మి
ఉర్విపై నీవార మున్నాము తండ్రి
ధర్మం బధర్మంబు తప్పొప్పు లనుచు
మాకేమి తెలియును మము గన్న తండ్రి
నీ పాదముల చెంత నిలుచుట తప్ప
అన్య మెఱుగని వార మయ్య రక్షించు
నీ‌ రక్షణము కోరి నిలచి యున్నాము
నీ నామమును నమ్మి నిలచి యున్నాము
నీ దివ్యచరితంబు నిగమమై యుండు
నీదు ప్రభావంబు నిత్యమై యుండు
నీ యందు మా బుధ్ధి నిలబడు నట్లు
నీ‌వు మన్నింపవే నిగమైక వేద్య
నీ దయామృతవృష్టి నిష్పాపు లగుచు
నీ ధామమును చేర నీవయ్య మమ్ము
వేరొండు వరముల వేడబోమయ్య
చిత్తగించుము దేవ శ్రీరామచంద్ర

క. ఈ మనవియె మంత్రముగా
నా మానసపుష్ప మిదియె నా స్వామీ శ్రీ
రామా నీ కర్పించెద
భూమిసుతారమణ నన్ను బ్రోవుము తండ్రీ.


తాత్పర్యం:   స్వామీ, శ్రీరామచంద్రా,  నీవు విష్ణువువు. సకలలోకాలనూ కలిగించి నీ‌ అద్భుతమైన లీలతో రక్షిస్తున్నావు.  కర్మసాక్షులైన సూర్యచంద్రులు సాక్షాత్తూ నీ‌ కళ్ళే.  నువ్వు లోకాలన్నిటినీ చల్లగా చూస్తున్నావు. నీ భక్తులను రక్షిస్తుంటావు.  మాకు ధర్మాలూ‌ అధర్మాలూ తప్పులూ‌ ఒప్పులూ ఏమి తెలుసు, నిన్నే‌ నమ్ము కున్నాము.  నీ‌ పాదాల దగ్గర నిలబడి ఉన్నాం.  నిన్నే‌ నమ్మి ఈ‌ భూమి మీద జీవిస్తున్నాం.  నీ‌ నామాన్ని నమ్ముకున్నాం - నీ‌ రక్షణ కోరుతున్నాం.  నీ చరిత్ర వేదం.   నీ‌ ప్రభావం నిత్యం. మా బుధ్ధి నీ మీద నిలచి ఉండేటట్లు అనుగ్రహించు.  నీ‌ దయ చేత పాపాలన్నీ‌ పోయి చివర నీ‌ పరమపదానికి మేము చేరుగునే‌వరం ఇవ్వు. ఇంకేమీ అక్కర లేదు. దేవా శ్రీరామచంద్రా ఈ మనవిని చిత్తగించు.

నాకు మంత్రాలు రావు.  నా మనవినే మంత్రం అనుకో‌ తండ్రీ,  నా మనస్సే మంచి పుస్పం అనుకో.  ఈ‌ మంత్ర పుష్పం స్వీకరించి నన్ను అనుగ్రహించు.

నమస్కారం
కం. ఈ కొలది పూజ గైకొని
నాకు ప్రసన్నుండవగుము నా తండ్రీ‌ రా
మా కరుణామృత సాగర
నీకు నమస్కారశతము నీరజనయనా


తాత్పర్యం:  ఓ‌ శ్రీరామచంద్రప్రభూ, కరుణామృత సముద్రుడా. ఏదో‌ నాశక్తి కొలదీ‌, భక్తికొలదీ చేసీ యీ కొంచెపు పూజను దయచేసి స్వీకరించవలసినది. నాకు ప్రసన్నుడవు కావలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఓ కలువకన్నుల దేవరా, నీకు మనసా వంద నమస్కారాలు చేస్తున్నాను.

ప్రదక్షిణం
క.  నీ చుట్టు నేను తిరుగుట
నా చిత్తము గోరు టదియె నా భాగ్యము నే
డీ చిన్న పూజగైకొని
ప్రోచిన నది చాలు రామభూవర నాకున్


తాత్పర్యం:  ఓ‌శ్రీరామచంద్ర భూనాథా,  నా మనస్సు ఎప్పుడూ నీ చుట్టే తిరుగుతూ‌ ఉంటుంది.  అది నా భాగ్యం అనుకుంటున్నాను.  నా ఈ‌ చిన్న పూజను స్వీకరించి నన్ను సంరక్షించు. అది నాకు చాలు.  నాకు మరేమీ‌ కోరిక లేదు.

క్షమాప్రార్థన.
క. మనసున భక్తిశ్రధ్ధలు
తనరారగ పూజ సేయ దలచితి నైనన్
పనవుదు తప్పులు దొరలుట
గని మానవుడను గద దయగనుమా రామా


తాత్పర్యం: ఓ‌ శ్రీరామచంద్రా,  మనస్సునిండా భక్తీ శ్రధ్దా నిండి ఉండగా నీకు పూజ చేసుకుందామని తలిచాను. అయినా తప్పులు దొర్లటం వలన చాలా విచారం కలుగుతోంది. మానవుణ్ణి కదా. నన్ను దయతలచు.  క్షమించి, ఈ పూజను స్వీకరించి కృతార్థుడిని చేయవలసింది.

అర్పణం
క. మానసికంబుగ చేసిన
ఈ నా చిరుపూజ నీకు హృదయంగమమే
యౌనని తలచెద రామా
దీని మహాఫలము గొనుము దీవన లిమ్మా

తాత్పర్యం:  ఓ శ్రీరామచంద్రప్రభూ! ఈ విధంగా నా మనస్సులోనే నీకు నేను చేసుకున్న చిరుపూజ నీ మనస్సుకు ఆనందం కలిగిస్తుందనే తలుస్తున్నాను. ఇలా నిన్ను పూజించుకోవటం మహాపుణ్యఫలాన్ని ఇస్తుందని నాకు తెలుసు.  ఆ ఫలాన్ని కూడా నీకే అర్పించుకుంటున్నాను.  దయచేసి అదికూడా స్వీకరించి అనుగ్రహించు.  నన్ను దీవించవయ్యా. అది చాలు నాకు.

22, ఆగస్టు 2013, గురువారం

విదుషీమణి శ్రీమతి మాలతీచందూర్‌గారి అస్తమయం!

(వికీ పీడియా నుండి)


చాలా దశాబ్దాలుగా తెలుగుపాఠకులకు ఆప్తురాలైన విదుషీమణి శ్రీమతి మాలతీచందూర్‌గారు. 

ప్రస్తుతతరం తెలుగుపాఠకలోకానికి ఆవిడ గురించి ఎంత తెలుసో నాకు తెలియదు.

ఆవిడ 47 సంవత్సరాలపాటు ప్రమదావనం అనే శీర్షికను ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో నడిపించారు.  ఇదొక రికార్డు అనుకుంటాను.  ఆ శీర్షికలో ఆవిడ పాఠకుల ప్రశ్నలకు జవాబులు చెప్పేవారు.

ఆవిడ చెప్పే‌ జవాబులు చాలా ఆసక్తికరంగా ఉండేవి.  ఒక రకంగా చూస్తే ఆవిడ తరచుగా పాఠకుడు లేదా పాఠకురాలు అడిగిన ప్రశ్నను ఒక సాకుగా తీసుకుని తమ వైదుష్యాన్ని ప్రదర్శించేవారని పిస్తుంది.  ప్రశ్నకు సమాధానంగా ఆవిడ మరీ తరచుగా జాతీయ అంతర్జాతీయ విషయాలను ప్రస్తావించేవారు. 

ఆవిడ జవాబుల్లో చదివించే గుణం అనేది చాలా గొప్పగా ఉండేది.  లేకపోతే ఆవిడ వైదుష్యాన్ని భరిస్తూ తెలుగుపాఠకలోకం ఆవిడ ప్రమదావనం పేజీలో "జవాబులు" శీర్షికని దాదాపు అర్థశతాబ్దం పాటు చదివారంటే, ఎలాంటి రచన కైనా మొట్టమొదట ఉండవలసిన మహాగుణం చదివించ గలగటం అని అందరూ, ముఖ్యంగా రచనలు చేసే వాళ్ళు గ్రహించాలి.

నా మటుకు నేను అప్పట్లో,  ప్రతివారం ఆంధ్రప్రభ వారపత్రిక రాగానే మొట్టమొదట ప్రమదావనం శీర్షికే చదివే‌వాడిని.  ఆవిడ జవాబులశైలీ, విజ్ఞానం రెండూ చాలా అబ్బురపాటు కలిగించేవి.

ఆవిడ చెప్పున జవాబుల్లో కొన్ని నాకు ఇప్పటికీ గుర్తే.

ఒక అమ్మాయి వేసిన ప్రశ్న.  "ఇంటర్ పాసయ్యాను.  ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ అనిపిస్తోంది.  ఏం చెయ్యాలో తోచటం లేదు"

దీనికి ఆవిడ చెప్పిన చమత్కారం నిండిన జవాబు, "ఏమిటీ, ఇంటర్ చదివి కూడా నువ్వు ఖాళీగా కూర్చున్నావా? ఈ‌ రోజుల్లో అక్షరాలు వచ్చిన ప్రతీ ఆడపిల్లా వరసపెట్టి నవలలు రాస్తోందని తెలీదా?" అని.

మరొక పాఠకుడు అడిగిన ప్రశ్నకు (ప్రశ్న గుర్తులేదు క్షమించాలి), ఆవిడ ఇచ్చిన జవాబు "ఇప్పడు కుర్రాళ్ళందరికీ‌ టెర్రీకాటనూ పెర్రీమేసనూ" అని.

ఇలా చమత్కారం మిళాయించి రాయటంతో ఆవిడ జవాబులు ఎంత సీరియస్‌గా ఉండేవో తరచుగా, అంత చమత్కారంతోనూ ఉండేవి.

ఒక పాఠకురాలు, "ఈ‌మధ్య కొందరు స్త్రీలు తమపేర్ల చివర భర్తల పేర్లు, ఇంటి పేర్లు చేరుస్తునారు కదా, అది సరైనదేనా" అని  అడిగితే ఆవిడ "ఒరవడి పెట్టిన వాళ్ళల్లో నేనూ‌ ఉన్నాను కదా? నన్ను అడుగుతారేం!" అన్నారు చమత్కారంగా.

కొన్నికొన్ని జవాబులు పౌరాణిక విషయాలపై కూడా చెప్పారు ఆవిడ.  ఒక ప్రశ్నకు జవాబుగా "శ్రీకృష్ణుడు పదహారువేలమంది రాజకన్యలనీ విడిపించింది నరకాసురుడి బారి నుండి కాదు, జరాసంధుడి వద్ద నుండి" అన్నారు.

అలాగే మరొకసారి, "శ్రీకృష్ణుడు ఒక వ్యూహం‌ ప్రకారమే కౌరవపాండవ పక్షాల్లో ఉభయపక్షాలకీ చెందిన వాళ్ళందర్నీ పైకి పంపాడు.  ఆయన తన చెల్లెలి మనవడు పరీక్షిత్తుకు రాజ్యం‌ కట్ట బెట్టాలనే ఇలా చేసాడు" అన్నారు.

చారిత్రకమైన విషయాల మీదా ఆవిడ కామెంట్లు చేసారు.  "శ్రీకృష్ణదేవరాయలు యుధ్ధాల్లో బంధించిన వేలాది మంది సైనికుల చేత వెట్టి చాకిరీ చేయించి ఆనకట్టలు కట్టించాడు కావేరికి.  ఇలా ఆయనలో క్రూరత్వం అనే కోణం కూడా ఉంది." అన్నారు. 

"భారత సర్కారుకు, అప్పట్లో చైనాలో భారత రాయబారిగా ఉన్న సర్దార్ పణిక్కర్ అనేక హెచ్చరికలు పంపాడు - చైనా మన మీదకు దాడి చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది అని.  కాని చౌ-ఎన్-లై మీద ఉన్న విశ్వాసంతో నెహ్రూగారు పట్టించుకోలేదు ఆ హెచ్చరికల్ని" అని కూడా ఒక ప్రశ్నకు ఆవిడ సమాధానంలో చెప్పారు.

కొన్ని కొన్ని జవాబులు మనకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చును.  కాని ఆవిడ చెప్పేతీరు, విషయం చెప్పాలీ జనానికి అన్న తపన, ఆవిడ విజ్ఞానం అబ్బురపరుస్తాయి.

ఆవిడ తన తొలి రేడియో ప్రసంగం అనుభవం గురించి వ్రాసిన వ్యాసం ఇంకా గుర్తుంది. టాల్ స్టాయ్ 'అనా కెరినినా' గురించి మొట్టమొదటి ప్రసంగం చేసారట.  కొత్త కావటంతో గడబిడ పడిపోయి మైక్ డెడ్ ఎండ్‌లో మాట్లాడటం మొదలు పెట్టి రేడియో‌ స్టాఫ్ ఇంజనీర్లని కూడా కంగారు పెట్టానని ఆవిడ చెప్పారు దాంట్లో.  ఆ ప్రసంగం కోసం ఎలా కష్టపడి తయారయిందీ చదివితే ఆశ్చర్యం వేస్తుంది

శ్రీమతి మాలతీచందూర్‌ను నేను మద్రాస్‌లో ఒకసారి కలిసాను. అది 1980ల్లో.  ఆఫీసు పని మీద వెళ్ళి నప్పుడు టెలిఫోన్ డైరెక్టరీలో ఆవిడ నెంబరూ, అడ్రసు వెదకి ఫోన్ చేసి వెళ్ళాను.

అప్పట్లో ఆవిడ కొత్తగా పాతకెరటాలు అనే పేరుతో పుస్తకపరిచయం శీర్షిక మొదలు పెట్టారు.   Moon stone అనే పుస్తకం అలభ్యంగా ఉందని ఆవిడ వ్రాయటం నేను చదివాను అప్పటికే.  అది నా వద్ద ఉంది.  గొప్ప నవల.  అది నా దగ్గర ఇప్పుడూ భద్రంగా ఉంది.  ఆ నవల ఆవిడకి ఇవ్వటం కోసం‌ తెచ్చానని ఫోన్ చేస్తే ఆవిడ సంతోషపడి రమ్మన్నారు.

వెళ్ళి ఆ పుస్తకం ఇస్తే చాలా సంబరపడ్డారు.  అవిడ నన్ను శ్రీచందూర్‌గారికి పరిచయం చేసారు. ముగ్గురం కూర్చొని కాస్సేపు మాట్లాడుకున్నాం.  తనకు పాఠకుల ఆదరణే ఊపిరి అని ఆవిడ నాతో అన్నారు. నా వ్యక్తిగత విషయాలలో కూడా కొన్నింటి మీద ఆవిడ సలహా అడిగి తీసుకున్నాను. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని బాగా చదివించాలి అని ఆమె మరొక మాట అన్నారు.

ఆవిడకు పుస్తకం ఇచ్చి వచ్చాను.  తరువాత కొన్నాళ్ళకి ఆవిడ నాకు ఆఫీస్ నంబరుకు ఫోన్ చేసి నా పుస్తకం‌ తిరిగి తీసుకు పోవచ్చని చెప్పారు.  నేను మళ్ళా మద్రాసు వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పాను.  కాని వెళ్ళటం వీలుపడక మద్రాసులో ఉన్న ఒక మిత్రుడు విశ్వనాథన్‌కి వివరాలు చెప్పి అ పుస్తకం తీసుకోమనీ, హైదరాబాదు ఆఫీసు పని మీద వచ్చినప్పుడు నాకు ఇమ్మనీ చెప్పాను.

కాని మాలతీచందూర్‌గారు ఆ పుస్తకాన్ని మా మిత్రుడు విశ్వనాథన్ చేతికి ఇవ్వటానికి నిరాకరించారు.  అతడు నాకు ఫోన్ చేసి చెప్పాడు.  "అది చాలా అరుదైన పుస్తకం బాబూ, నోటి మాట మీద నీ చేతికి  ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వ లేను" అని తెగేసి చెప్పారట. నేను మా మిత్రుడికి ఉత్తరం వ్రాసి ఇస్తే అప్పుడు ఇచ్చారు.

శ్రీమతి మాలతీ చందూరుగారు తెలుగు సాహిత్యానికి ఆణిముత్యాలవంటి నవలలూ అందించారు.  మసాలా సామాగ్రి దట్టించిన పుస్తకాలు కాకపోబట్టి చాలా మందికి అవి తెలియక పోవచ్చు.  ఉదాహరణకి ఆవిడ సద్యోగం గొప్ప నవల. దొరికితే తప్పక చదవండి. 

శ్రీరామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పురస్కారం కోసం ఆవిణ్ణి మద్రాసు నుండి పిలిపించారు.  అప్పుడు హైదరాబాదు వచ్చిన ఆవిణ్ణి దొంగలు హోటల్ గదిలో బంధించి పోయారు!

ఇంత గొప్ప తెలుగు విదుషీమణికి మన తెలుగుప్రభుత్వాలు ఏమంతగా అవార్డులూ రివార్డులూ‌ ఇచ్చినట్లు కనబడదు.  మన ప్రభుత్వాలు రజని (శ్రీబాలాంత్రపు రజనీకాంతారావు) గారికే కనీసం పద్మశ్రీ కూడా ఇప్పించ లేద నుకుంటాను.  ఆయన క్రికెట్ ఆడి ఓ రెండు మూడు సెంచరీలు చేసినా,  బాడ్మిండన్ ఆడి ఓ రెండు టోర్నీలు  గెలిచినా, ఓ డజను సినిమాలు చేసినా ఆ పద్మా అవార్డులు గట్రా వచ్చే వేమో!  శ్రీమతి మాలతీ చందూరు గారిని మన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని వాపోయి ప్రయోజనం లేదు.

అనన్యసామాన్యమైన సాహిత్య కృషితో పాఠకలోకం అభిమానం సంపాదించుకున్న శ్రీమతి మాలతీ చందూర్ అస్తమించటం ఒక తీరని లోటు.

అన్నట్లు సరిగమలు  బ్లాగువారు మాలతీ చందూర్-ఓ విజ్ఞాన సర్వసం అని ఒక మంచి వ్యాసం ప్రచురించారు.  అందులో మాలతీ చందూర్‌గారితో ఇంటర్వ్యూకి సంబంధించిన లింక్ ఇచ్చారు తప్పకుండా వినండి: http://telugu.tharangamedia.com/specail-show-with-malathi-chandur/


అలాగే ఇష్టపది బ్లాగులో ప్రజాశక్తి పత్రికలో వచ్చిన వ్యాసం ప్రచురించారు.  ఎన్నో విశేషాలతో ఈ వ్యాసమూ చాలా బాగుంది. తప్పకుండా చదవండి.

తెలుగు అమ్మాయిలకు వంట నేర్పిన మంచి తల్లిగా మాలతమ్మ గారి పాత్ర గురించిన మంచి వ్యాసం మనసులో మాట బ్లాగులో వచ్చిన మిస్ యూ మాలతీ :(  ఒకటి. అది కూడా చాలా బాగుంది.

జంపాలచౌదరిగారు కూడా స్ఫూర్తిదాయని, జ్ఞానదాయని, సలహాదాయని, సన్నిహిత సఖి – మాలతీచందూర్ అని మంచి వ్యాసం ప్రకటించారు. తప్పక చదవండి.

అలాగే వేదిక బ్లాగులో కూడా మాలతీ చందూర్ – మద్రాసు – ఒక స్మృతి  అనే మంచి వ్యాసం వచ్చింది చదవండి.