22, ఆగస్టు 2013, గురువారం

పాహి రామప్రభో - 208..211. ఉత్సాహ రామాయణం

మౌని గాథిసుతుడు గొప్పమఖము చేయ నెంచి భూ
జాని కడకు వచ్చి రామచంద్రు నడిగె రక్షగా
కానలకును తపసి వెంట ఘనుడు లక్ష్మణుండు తో
డైన దివ్యమూర్తి రాము డంత నడచె వేడుకన్   208


దనుజ నమిత క్రూరయైన తాటకన్ వధించి యా
ముని సవనము జెరుప వచ్చు ముష్కరులను చెండి మా
నిని యహల్య శాపమూడ్చి నీరజాక్షు డంత నా
జనకు నింటి స్వయంవరపు సభకు నేగె మౌనితోన్  209


భూమి దున్ను చున్న జనక భూమి నాథు ముంగటన్
భూమి నుండి యుద్భవించి పుత్రియైన సీత ను
ద్దామ విక్రముండు రుద్రు ధనువు నెక్కుపెట్టి శ్రీ
రాము డంత పెండ్లియాడె రమ్యగుణవిశాలుడై  210


హరుని విల్లు విరుగు టెరిగి యాగ్రహించి వేగమే
పరశురాము డేగు దెంచి పట్టి యెక్కు పెట్టు మీ
హరిశరాసనం బనంగ నంత దానితోడ శ్రీ
హరిమహాంశ నతడి నుండి యాహరించె రాముడున్   211



.................... ఉత్సాహరామాయణం ఇంకా ఉంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.