19, ఆగస్టు 2013, సోమవారం

పాహి రామప్రబో - 202. సంక్షిప్త రామాయణ మంజరి

బ్రహ్మాదు లడుగగా వైకుంఠవాసి
చిన్మయు డంతట శ్రీరాము డనగ
దశరథపుత్రుడై ధరణి కేతెంచి
మునికులేశుని యాగమును వేగగాచి
హరమహా చాపంబు నవలీల నెత్తి
అవనిజ సీతమ్మ హస్తమ్ము బట్టి
జనకు డాజ్ఞాపించ సంతోషముగను
తమ్ముండు భార్యయు తనతోడు కాగ
నారచీరలు కట్టి నడచి కానలకు
ఖరదూషణాది రాకాసుల జంపి
వెలుగొందు చుండగా విపినంబు లందు
రావణుండను వాడు రాక్షసాధముడు
మోసాన సీతను మ్రుచ్చిలి పోవ
ఇంతిని వెదకుచు ఋష్యమూకాద్రి
వాసియై యుండిన వానరేశ్వరుడు
సుగ్రీవు చెలిమిని సొంపుగా బడసి
ఆతని మంత్రియౌ ఆంజనేయుండు
రావణలంకలో రమణి సీతమ్మ
జాడ లరసిరాగ సాగరమునకు
సేతువునే కట్టి చెచ్చెర కోతి
సైన్యమ్ముతో లంక చేరి ఢీ కొట్టి
సకలరాక్షసబలక్షయ మొనరించి
ఆహవంబున రావణాసురు ద్రుంచి
ముల్లోకములకును మోదమ్ము గూర్చి
స్వస్థానమును చేరి సర్వలోకములు
హర్షింప దివ్య సింహాసనం బెక్కి
పదియు నొకటి వేల వర్షముల్ పుడమి
వైభవంబుగ నేలి వైకుంఠమునకు
వేడుక మీరగా వెడలె శ్రీకరుడు
పరమాత్ము డాతని పాదాంబుజములు
తలచిన కలుగును తప్పక శుభము

(ఆగష్టు 2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.