భవిష్యదర్శిని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భవిష్యదర్శిని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, అక్టోబర్ 2022, శనివారం

భవిష్యదర్శిని. ప్రపంచ రాష్ట్ర సమితి

 తేదీ 2029 మార్చి 26.


ఈరోజున ప్రపంచం అంతా గొప్ప హడావుడిగా ఉంది.

ఈరోజు ఉదయమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది.

భారత ప్రధాని మరియు భారాస సిధ్ధాంత కర్త కల్వకుంట్ల చంద్రశేఖర‌ రావు గారి ఆలోచన ప్రకారం భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా మార్చటం జరిగింది.

ఈమేరకు భారాస సర్వసభ్యసమావేశంలో నిర్ణయించారు.

హైదరాబాద్ నగరంలోని ప్రధానమంత్రి నివాసం ప్రగతి భవన్లో బ్లహ్మాండమైన భారాస సర్వసభ్యసమావేశం జరిగింది.

సభాద్యక్షులు చంద్రశేఖర రావు గారు అద్భుతమైన ప్రారంభోపన్యాసం చేసారు. ప్రపంచపరిస్థితులు ఏమీ బాగోలేవు. అస్తమానం ఏవేవో దేశాలు గిల్లికజ్జాలతో ప్రపంచశాంతిని భంగపరుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. 

ఇలా ఐతే ప్రపంచం త్వరలోనే నాశనం అవుతుంది. అమెరికా చైనా రష్యా లాంటి పెద్దదేశాలూ బుధ్ధిలేకుండా ప్రవర్తించటం ఏమిటని ఆ దేశాలను చంద్రశేఖర రావు గారు నిలదీశారు.

యుధ్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఆచరణలో సంపూర్ణంగా విఫలం ఐనదని అది ఇంక కాలంచేసిందని నేనే ప్రకటిస్తున్నాను అన్నారు

బాగా ఆలోచించి తాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాననీ దాని ప్రకారం భారాసను అంతర్జాతీయ పార్టీగా మార్చటం యావత్తు ప్రపంచానికీ అతిముఖ్యమైన అవసరం ఆనీ అన్నారు.

భారాస ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎందరో ఏవేవే అన్నారనీ తుదకు భారాస ద్వారానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మధ్యన, అలాగే చాలా రాష్ట్రాల మధ్య వివాదాలూ సానుకూలంగా పరిష్కరించబడ్డాయనీ అదేవిధంగా ప్రరాస ద్వారా దేశాల మధ్య వివాదాలు కూడా బ్రహ్మాండంగా పరిష్కారం చేసెయ్యవచ్చును అనీ ఆసత్తా తమ సొత్తు ఆనీ అన్నారు.

క్రమంగా అన్ని ముఖ్యదేశాలలోనూ మన పార్టీని అధికారంలో నిలబెట్టటం ద్వారా యుధ్ధాలను నివారించి ప్రపంచంలో శాంతినీ సుస్థిరతనూ నెలకొల్పవచ్చు అనీ చంద్రశేఖర రావు గారు వక్కాణించారు.

అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భారాస పార్టీని ప్రపంచ రాజ్య సమితిగా మార్చుతూ సభవారు తీర్మానం చేయాలని ఆదేశపూర్వకంగా సూచించారు.

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు తీర్మానాన్ని ప్రతిపాదించారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత గారు ఆ తీర్మానాన్ని బలపరిచారు.

మహారాష్ట్ర గవర్నర్ సంతోష్ రావు గారూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హరీష్ రావు గారూ కూడా ఆ తీర్మానాన్ని బలపరచారు.

అనంతరం సభాద్యక్షులు ప్రధానమంత్రి శ్రీ కల్వకుర్తి చంద్రశేఖర రావు గారు భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ తీర్మానాన్ని సభవారు ఏకగ్రీవంగా ఆమోదించారని ప్రకటించారు. దాని కొత్త పేరు ప్రపంచ రాజ్య సమితి అని వెల్లడించారు.

త్వరలోనే జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థి నిలబడబోతున్నాడని ప్రకటించారు. అమెరికా దేశంలో భారతీయులు ఎంతో సంఖ్యాబలం కలిగి ఉన్నారనీ, వారిలో తెలుగు వారు అందునా మన తెలంగాణా వారు అత్యధికులు అనీ అన్నారు. వారంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తే మన పార్టీ వాడు అమెరికా అద్యక్షుడు కావటం తథ్యం. దానిని ఆపే మొనగాడు పుట్టలేదు - పుట్టబోడు అనీ కరతాళధ్వానాల మధ్యన సగర్వంగా అన్నారు. 

ఈవార్త వెలువడిన వెంటనే అమెరికాలో భారతీయుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా నుండీ మరికొన్ని దేశాల నుండీ కూడా తమ దేశాల్లోనూ ప్రరాస తప్పకుండా అధికారం చేపట్టాలని కోరుతూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి.

తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చును. మాది ఫ్రీ కంట్రీ అని అమెరికా అద్యక్షులు వ్యాఖ్యానించారు.

రష్యా ఈవిషయంలో స్పందించటానికి ఆసక్తి చూపలేదు. చైనా మాత్రం ఇదంతా ఒక తమాషా అని కొట్టిపారేసింది. ఆస్ట్రేలియా స్పందన ఇంకా తెలియరాలేదు. వారూ స్వాగతిస్తున్నారనే వినబడుతోంది.

ఐక్యరాజ్య సమితి కాలంచేసింది అనటాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తప్పు పట్టారు.

ఐతే ఐక్యరాజ్య రాజ్యసమితిలో భారత ప్రతినిధి భారతప్రధాని వ్యాఖ్యలను సమర్ధించారు. ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే సమయం ఆసన్నం అయినదనీ చంద్రశేఖర రావు తప్ప నేడు ప్రపంచశాంతి సుస్థిరతలను నెలకొల్పగల మహానాయకుడు ఎవరూ ముల్లోకాల్లోనూ లేరని భారతప్రతినిధి ఉద్ఘాటించారు.

ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా అంతా ఈ సమాచారాన్ని గురించిన చర్చలతో హోరెత్తిపోతోంది.

ప్రపంచాన్ని ఏలబోయేది మనమే అంటూ హైదరాబాద్ నగరంలో వేలాది పెద్దపెద్ద కటౌట్లు వెలిసాయి. ప్రధానరహదారులూ గల్లీలు అని తేడా లేకుండా విశేషంగా ర్యాలీలు సందడి చేస్తున్నాయి.

దునియాకీ నేతా కేసీఆర్ అన్న నినాదంతో తెలంగాణాయే కాదు దేశం అంతా దద్దరిల్లుతోంది. ఈనినాదం ప్రపంచాన్ని చుట్టేస్తోందని వార్తలు జోరందుకున్నాయి.