30, మార్చి 2015, సోమవారం

అది ఇది కోరరా దాదిదేవుని..

అది ఇది కోరరా దాదిదేవుని పరమ
పదము కావలెనని ప్రార్థించదగు గాని

పట్టుకున్న మాయచేత పుడమిని నిత్యము
పుట్టి చచ్చు జీవులకు బుధ్ధిలోపము చేత
పుట్టు కోర్కెలు కామభోగోపశాంతికై
పట్టుబట్టునురా పుట్టిముంచునురా ॥అది ఇది॥

తడవకు దేహము దాల్చి దానియందచందాలకు
మిడుకుచు హరిని దాని మే లేల కోరేవు
విడిది యింటికి వెల్ల వేయించు చంద మీ
నడత యిటులైన నీ నరజన్మ మెందుకురా ॥అది ఇది॥

కలిమాయ కన్యమెట్లు కనవచ్చురా మనకు
జలముల కన్యమెట్లు తెలియు చేపలు
వెలిగా ముల్లోకములకు వెలుగు దివ్యపదమే
వలచి శ్రీరామచంద్రవల్లభు నడుగుమురా ॥అది ఇది॥

28, మార్చి 2015, శనివారం

బొమ్మనురా నే బొమ్మనురాబొమ్మనురా నే బొమ్మనురా నీ బొమ్మలలో ఒక బొమ్మనురా బహు
కమ్మనైన పాటలు పాడే బొమ్మనురా నీ బొమ్మనురా


మాయదారి ఆటల వాడ మనసు నీకు సేదదీర
వాయాడించుచు నీకై పాడే చక్కని బొమ్మనురా
తీయనైన మాటలనే తేనెలూరు బొమ్మనురా
హాయిగొలుపు పాటలతో అలరించే బొమ్మనురా
బొమ్మనురా

వింతవింత రూపులు దిద్ది వేయించేవు వేషాలు
పంతగించి యాడించేవు పలుకులెన్నొ పలికించేవు
తంతు నీవు నడిపేదైనా కొంత పేరు దీనికి గలుగు
సంతసమున నిన్నే పొగడే చక్కనైన బొమ్మనురా
బొమ్మనురా

ఈ యాటపాటలు నీకు హితవైన నంతియ చాలు
వేయేల నీ ముచ్చటకే వేసాలు బాసలన్ని
మాయగాడ నీవు కూడ మాతోకలిసి యాడేవయ్య
నీయంత వాడెవడయ్య మా యయ్య రామయ్య
బొమ్మనురా27, మార్చి 2015, శుక్రవారం

ప్రతిబింబము నైతే నీకై వెతకులాడ నేలప్రతిలేని నీకు నేను ప్రతిబింబము నందువో
ప్రతిబింబము నైతే నీకై వెతకులాడ నేల


కనుగొన గగనాన నున్న కమలాప్తుని బింబమే
జనులకు ప్రతి చెఱువులోన స్పష్టమై యున్నట్లులే
యనుపమ శుభమూర్తి నీవె అందరివలె దోచి
దనివారగ వినోదించ దలచుట జేసి
ప్రతిలేని

జలముల ప్రతిబింబములను కలచు పవనచలనము
నిలువ నీక జీవులను కలచు కాలచలనము
తెలియగ నిజబింబమవు నిలకడగల వాడవు
కలుగు మలుగు నట్టి నన్ను కరుణను గమనించి
ప్రతిలేని

పరగ మూలబింబమవు భద్రాద్రిరాముడవు
పరమశాంతుడవు మునిభావితశుభ చరణుడవు
ఎఱుకలేక వీఱిడియై యీ భువి బడియున్న నాకు
మరల సత్తువనిచ్చు మాట యొకటి తెలుపగా
ప్రతిలేని26, మార్చి 2015, గురువారం

శుభముపలుకు డేమి మీరు చూచినారయా

శుభముపలుకు డేమి మీరు చూచినారయా
విభుని శ్రీపాదారవిందములను చూచిరిగా


కన్నులార హరిపాదకమలములను చూచిరిగా
వెన్నలాంటి మనసున్న వేదవేద్యుని విభుని
వెన్నుని కాళులకు మీరు వేలమార్లు మ్రొక్కిరిగా
ఆన్నన్నా పలుకుడీ యంతేనా అంతేనా  ॥శుభము॥

హరిపాదములను జూచి నప్పటి యానందము
మరలమరల వాని బొగిడి మైమరచిన చందము
హరిభక్తులార తలచి యాహా మురిసేరయా
అరమోడ్పు కన్నులతో‌ నంతేనా అంతేనా ॥శుభము॥

తెలుగునాట నూరూరా దివ్యనిజపాదముద్ర
లలదినాడు భగవాను డానాడు రాముడై
కలియుగమున వానిజాడ కానరానిదైనను
కలుషరహితులార మీరు కనుగొంటి రంతేనా ॥శుభము॥

ఎన్నెన్నో బొమ్మలు ఎంతో మంచి బొమ్మలుఎన్నెన్నో బొమ్మలు ఎంతో మంచి బొమ్మలు
వన్నె చిన్నె లెన్ని చూడ వంక లేని బొమ్మలు


నీతులు వల్లించుటలో నేర్పుగల బొమ్మలు
ప్రీతిని కల్గించుటలో ఖ్యాతిగల బొమ్మలు
చేతివాటుతనపు బొమ్మలు
ఆతతాయి పనుల బొమ్మలు
ఎన్నెన్నో

ముచ్చటల తోనే కాలం ముంచెత్తే బొమ్మలు
పెచ్చుమీరి మిడిసిపడే పెత్తనాల బొమ్మలు
వచ్చేపోయే బుధ్ధుల బొమ్మలు
ముచ్చటైన గద్దఱి బొమ్మలు
ఎన్నెన్నో

రామచంద్రు డాడుకొనే రమ్యమైన బొమ్మలు
ఏమేమో ఆటల పాటల ఇంపైన బొమ్మలు
ఎూమికి దిగివచ్చే బొమ్మలు
భూమినుండి ఎగిరే బొమ్మలు
ఎన్నెన్నో25, మార్చి 2015, బుధవారం

వేషాలు పదేపదే వేయనేల

వేషాలు పదేపదే వేయనేల
దోషాచరణులను తొలగజేయ

ఈదనేల చేపవై ఈశ జలధిని
వేదాలను రక్షించి విధి కందీయ  ॥వేషాలు॥

కొండనేల మోసితివి కూర్మాకృతిని
మెండుగ దేవతలకు మేలు చేయ  ॥వేషాలు॥

సరిసరి ఆ పంది రూపు సంగతి యేమి
ధరణిని చెఱబట్టిన దనుజుని కొఱకు  ॥వేషాలు॥

హరి అదేలనయ్య నరహరి వేషంబు
వరబలోధ్ధతుని జంపి బాలుని గావ ॥వేషాలు॥

దానమడుగ వటువువై తరలితి వేల
దానవుని తరుమ పాతాళంబునకు ॥వేషాలు॥

గొడ్దలి చేబూని నృపుల గూల్చితి వేల
చెడ్డరాజు లసురులట్లు చెలరేగుటచే ॥వేషాలు॥

మనుజుడవై నిన్ను నీవు మరచుట యేమి
దనుజుని దండింప వేరు దారి లేక ॥వేషాలు॥

దాయాదుల పోరు కూడ తమదయ యేనా
వేయేల భూమి బరువు విరచితి నటుల ॥వేషాలు॥

జన్నములు దండుగని అన్నావటగా
అన్నది నిజ మసురజాతి నణచుట కొరకు ॥వేషాలు॥

కలిపురుషుని ఆగడములు కాంచగలేవా
కలియుగమును కల్కినై కడతేర్చెదను ॥వేషాలు॥

ఏమయ్యా అంతదాక నేది రక్షణ
రామనామ మందరనూ రక్షించేను
 నా రామనామ మందరనూ రక్షించేను   ॥వేషాలు॥

24, మార్చి 2015, మంగళవారం

నేనేమి చేయుదు నయ్య


నేనేమి చేయుదు నయ్య నీ దయ రాక
జ్ఞాన మెన్నడు రాదు జానకినాథా
జ్ఞానము లేక నే సర్వేశ్వరుని నిన్ను
లో నెఱుంగక పాడులోకమె నిజమని
మానక దీని యందె మ్రగ్గుచు నుంటిని
పూని ఇప్పటి కైన బ్రోవరా వయ్య 
నేనేమి


భక్తికే గాక నీవు వశుడవు కావని
యుక్తి బోధింతురట యోగులు లోకభోగ
రక్తుడ నగు నాకు రామ నీ పాదాను
రక్తి మేలన్న బుధ్ధిరా దేమందు నయ్య
నేనేమి


మేలు చేకూర్చని మెట్టవేదాంతము
నాలో నిండుట జూచి నవ్వెదు కాని
నీ లీల చే గాదె నే నిల నుండుట
చాలు చాలును విజ్ఞాన మీయ వయ్య
నేనేమి

ఏమో అదియేమో నే నేమెఱుగుదు


ఏమో అది ఏమో నే నే మెఱుగుదు
రామా నీ మహిమ నే నే మెఱుగుదు
భూమిజ తానెఱుగును శ్రీమహాలక్ష్మి తాను
సౌమిత్రియు నెఱుగు శేషాహియే తాను
తా మెఱుగుదు రయ్య తపసిసత్తము లైన
వామదేవ వశిష్ట విశ్వామిత్రులు
ఏమోవాయుసుతు డెఱుంగును పరమశివుడు తాను
ఆ యెలుగుల రా జెఱుంగు నజుని యంశ  తాను
మాయామానుష విగ్రహ మరి యితరులకు
నీ యధ్భుతతత్త్వము దుర్జ్ఞేయ మయ్య
ఏమోపరగ రామదాస త్యాగబ్రహ్మాదులకు
కరుణతో మోక్షమొసగి కాచిన దేవ
నిరుపమానందరూప నీ వాడనుగా
సరగున నొనరించి ప్రోవ జాగేల నయ్య
ఏమో


ఊరూరా వెలసియున్న శ్రీరాముడుఊరూరా వెలసియున్న శ్రీరాముడు మాకు
కోరగనే వరములిచ్చు శ్రీరాముడు

నారదాదిమునివినుతుడు శ్రీరాముడు ఆది
నారాయణు డితడండీ శ్రీరాముడు
శ్రీరమారమణుడీ శ్రీరాముడు సూర్య
నారాయణకులభవుడు శ్రీరాముడు ॥ ఊరూరా॥

క్షీరాబ్ధిశయనుడు హరి శ్రీరాముడు లోక
కారణకారణుడు మా శ్రీరాముడు
భూరికృపాకరుడండీ శ్రీరాముడు దనుజ
వీరనిర్మథనశీలి శ్రీరాముడు ॥ఊరూరా॥

చేత శివుని విల్లెత్తిన శ్రీరాముడు మా
సీతమ్మమెప్పు గొన్న శ్రీరాముడు
చేతలవాడండి మా శ్రీరాముడు మా
సీతమ్మను పెండ్లాడిన శ్రీరాముడు ॥ఊరూరా॥
మీ రేల యెఱుగరో నారాయణునిమీ రేల యెఱుగరో నారాయణుని
శ్రీరాముడై చాల చేరువైన వాని

పాలసంద్రములోన పవ్వళించెడు వాని
లీలగా బ్రహ్మాండ మేలుచుండు వాని
ఫాలాక్షబ్రహ్మేంద్రభావితుడగు నట్టివాని
నేలపై ధర్మంబు నిలుపబుట్టిన వాని                 ॥మీరేల॥

సకలపాపాటవులను చక్కజేసెడు వాని
సకలశోకములను క్షణములో డించు వాని
సకలదోషాచరచమూమథను డగు వాని
సకలభక్తకోటిహృదయసరోజస్థు డైన వాని          ॥మీరేల॥

భక్తమందారుడనే ప్రఖ్యాతి గలవాని
వ్యక్తపరబ్రహ్మమై భద్రాద్రి నున్న వాని
శక్తికొలది సేవించి సంతసించ దగువాని
ముక్తినిచ్చు సద్గుణము ముఖ్యముగ గలవాని     ॥మీరేల॥


21, మార్చి 2015, శనివారం

తరచుగా రాముని తలచుచుండు ధన్యుడు

తరచుగా రాముని తలచుచుండు ధన్యుడు
తరచుగా రామునే మరచును సామాన్యుడు

అవని యెల్ల జనులార అవనిజ పుట్టిల్లు
అవనిజనులు సర్వులును అవనిజ కాత్మీయులు
అవనిజాపతి రాముడె అందరికీ ప్రభువు
అవనిబడ్డ జీవులగతి యాతడై యుండు గాన        ॥తరచుగా॥

అర్మిలి మన నేలుచుండు నట్టివాడు రాముడు
ధర్మసంకటములందు దారి జూపు రాముడు
కర్మబంధములనుండి కాచువాడు రాముడు
నిర్మలాత్ము లందరిని నిజముగ రక్షించుగాన           ॥తరచుగా॥

నిదురయని శ్వాసతీయ నెవడైన మరచునా
ముదిమియని రుచులవిడచి పుడమి నొక్క డుండునా
మదిలో శ్రీరాముడున్న మరపుగల్గు టుండునా
హృదయమది రామజపము వదలలేకుండు గాన     ॥తరచుగా॥

20, మార్చి 2015, శుక్రవారం

వసంతమన్మథం - ఉగాది పద్యాలూ - ఒకటోరకం సన్మానమూ.

ఈ రోజున మన్మథనామసంవత్సరాగమనం సందర్భంగా ఉగాది కవిసమ్మేళనం ఒకటి మియాపూర్‌లో జరిగింది. ఆ కవిసమ్మేళనం తాలూకు ఆహ్వానాన్ని ఇక్కడ చూడవచ్చును.

నిన్నో మొన్నో శ్రీ ములుగు అంజయ్యశతావధానిగారు నాకు ఫోన్ చేసి ఆహ్వానించారు. సరే అన్నాను.

నిజానికి నా పరిస్థితి ఉక్కిరిబిక్కిరిగా ఉంది వృతిగతమైన కార్యక్రమాలతో. అందుచేత అ కార్యక్రమానికి వెళ్ళటం సాధ్యం కాదనిపించి ఈ రోజున చింతావారికి ఫోన్ చేసి వివరించటానికి ప్రయత్నించాను. కాని,  నా యెడల వాత్సల్యం కొద్దీ,  వారు నేను రావలసిందే అని అజ్ఞాపించారు - వారికి అలాగేనని మాటయిచ్చి ఆకార్యక్రమానికి హాజరయ్యాను.

అక్కడికి వెళ్ళేదాకా ఒక్క పద్యమూ వ్రాసుకొనేందుకు సమయం లేదు. ఒక ఐదు పద్యాలను అక్కడే సభాంగణంలోనే వ్రాసుకొన్నాను.  రామేతరం రమ్యేతరం అనే ప్రవృత్తి గల నా మనస్సుకు ఇలా సందర్బోచిత పద్యరచనపై అంతగా ఆసక్తి కూడా లేదు. కాని సభలో పద్యాలు చదువుతానన్నాను కాబట్టి అక్షరాలా పెన్ను బయటకు తీసి చచ్చీచెడీ మరీ వ్రాసాను. చెత్తో పెన్నుపుచ్చుకొని వ్రాయటం మానేసి దశాబ్దాలు ఐనది కదా! ఎంతకష్టం ఎంతకష్టం.

కార్యక్రమం దిగ్విజయంగానే జరిగింది.  కవిత్వం వినిపించటానికి వచ్చినవారి సంఖ్య మాన్యమే ఇనా వినటానికి వచ్చినవారి సంఖ్య మాత్రం శూన్యం. మొత్తం మీద అందరూ ఎవరికి తోచింది వారు వినిపించగలిగారు కాబట్టి దిగ్విజయమే అనుకోక తప్పదు.

నాకేమో ఈ‌ రోజున రాత్రికూడా కొంత ముఖ్యమైన పనులున్నాయి వృత్తిగతంగా.  చదివే వారి లిష్టులో మొదటే తొంగిచూసి నాది తొమ్మిదో‌నంబరు అని తెలుసుకున్నాను.

కాని నేను కుయ్యో మొఱ్ఱో అంటున్నా చివరికి నేను ఇరవైతొమ్మిదో వాడిగా వేదిక ఎక్కానేమో. అంటే నేనే చివరినుండి మొదటి వాడినోచ్ అని సంబరపడవచ్చు నన్న మాట.

అప్పటికే రకరకాల కవిత్వాలకూ కాలక్షేపం తవికలకు ఉన్న కాస్తమందీ‌ తప్పట్లు కొట్టి అలసిపోయారు.

కొంతమంది తమతమ కవితలు వినిపించి శాలువా కప్పించుకొని చక్కాపోయారేమో‌ కూడా.

సభమధ్యలో ఒకటి రెండు ప్రత్యేక సన్మాన కార్యక్రమాలూ‌జరిగాయి . అందులో ఒకటి చింతావారి వేదపఠనంతో సహా. 

మరికొంత మంది చీకటి పడుతోందనీ తమకు అవకాశం వస్తుందో రాదో‌ అనుకొని, వేచి చూసే ఓపిక లేక వెళ్ళిపోయినట్లున్నారు.

కొందరైతే కవితలను వినీవినీ అలసిపోయి ఇంక వినే ఓపిక ఉడిగి నిస్త్రాణగా ఉండిపోవటమో, ఇంకా ఓపికుంటే వేరే వాళ్ళతో‌ కబుర్లతో కాలక్షేపం చేస్తూనో ఉండిపోయారు.

అప్పుడు పిలిచారు నా పేరు. అప్పుడు వేదిక ఎక్కాను నేను.

నిర్మొగమాటంగా చెబుతున్నాను. నాకు ఎప్పుడు వెళ్ళిపోవాలా అన్న ఆరాటమే ఎక్కువగా ఉంది.  ఎందుకంటే అఫీసువారికి నేను ఇవ్వవలసిన అప్‌డేట్లు కొన్ని అర్జంటుగా ఉన్నాయి మరి.

కాని చింతావారిని చిన్నబుచ్చటం ఇష్టం‌ లేక  అక్కడ వేచి ఉన్నా నంతే.

కించిదుదాసీనంగానే వేదిక మీదకు వెళ్ళగానే అద్యక్షులవారు 'అట్టే సమయం లేదు క్లుప్తంగా చెప్పండి' అన్నారు.

నేను కూడా ఐదు పద్యాలు కాబోలున్నాయి. ఐనా క్లుప్తంగానే ముగిస్తాను లెండి, నాకూ సమయాభావం ఎక్కువగానే ఉందని ప్రతిస్పందించాను.  ఆయన ఫరవాలేదు పంచరత్నాలూ చదవండి అన్నారు. సరే నని చదివాను.

అవి ఇవిగో:


మన్మథుడి కన్నా ముందుగా వసంతుడు వస్తాడు. ఎందుకంటే వసంతః సామంతో అని శ్రీశంకరులు సౌందర్యలహరిలో ధృవీకరించారుకదా. అందుచేత మొదట   వసంతుడూ ఆ పిమ్మట తీరిగా మన్మథుడూ రావటం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం వసంతకాలానికి స్వాగతం చెబుదాము.

వసంతాగమం
(వసంతచామరవృత్తం)
      ప్రమోదరూపమా వసంతకాలమా
      అమోఘభవ్యదివ్యరూపశోభలన్
      సమంచితంబుగా సదాసుఖావహం
      బమంగళాపహం బనంగ వెల్గుమా

వసంతం వచ్చి కొన్నాళ్ళైనా (నిజానికి వసంత సాయనమానం ప్రకారం ఎప్పుడో వచ్చింది కదా), ఇంకా మన్మథుడు రావటానికి మొగమాటం పడుతున్నట్లున్నాడు.  ఎందు కాయనకు ఇంత తటపటాయింపు?

(వసంతమాలికావృత్తం)
      ఇదిగో ఇదిగో ఇదేమిటయ్యా
      ముదముల్ గూర్చెడు మూర్తివే మహాత్మా
      సదయా యిటురా జనార్తి బాపన్
      పదముల్ మోప రవంత పంత మేలా

ఇలాగని ఆయన్ను  బ్రతిమలాడి, ఆయన సరే నని వస్తుంటే మనం స్వాగతం చెబుతున్నాం

(వసంతచామరవృత్తం)
      ఒకింత ముందుగా వచింతు మన్మథా
      ఒకింత యింపుగా ఉగాది మన్మథా
      ఒకింత మంచిగా వెలుంగు మన్మథా
      ఒకింత మేలుగా వెలుంగు మన్మథా

ఇలాగని మన తెలుగింటికి  ఆత్మీయాహ్వానం పలికి తెలుగువాడిగా ఆదరంగా తెలుగు మన్మథా అని మరీ ముద్దుచేస్తున్నాం..

హమ్మయ్య సంవత్సరాధిపతి మన్మథుడు మనింటికి విచ్చేసాడు. ఆయన రాక వలన మనందరికీ శుభాన్ని ఆకాంక్షిద్దాము.

(వసంతతిలకవృత్తం)
      సంతోషకారక మనంగ సదాసుయశం
      బెంతేని కన్పట్టి ఉగాది కెసంగు చుండున్
      చింతల్ తొలంగును సుఖంబు చివుళ్ళు వేయున్
      కొంతైన నాంధ్రుల ప్రతిష్ఠకు మంచి కల్గున్

(వసంతవృత్తం)
      తెలుగువారికే తీరుగా సౌఖ్యముల్
      కలుగు నారీతి కాలముం  బోవగన్
      తలపు లందునుం దప్పులం బోవమిన్
      నిలచుగాక మా నేతలన్ బుధ్ధులున్

స్వస్తిరస్తు.హమ్మయ్య పద్యాలు చదివేశాను కదా.
చాలా సంతోషం కలిగింది.
దానికి రెండు కారణాలు.

నాకు సభల్లో మాట్లాడే అలవాటు లేదు. అందుచేత ఒక్కముక్కలో చెప్పాలంటే 'మాట్లాడలేను'.

ఏదో‌ కంగారు కంగారుగా గడాగడా చదివేసి బయటపడిపోతానని నాకు బాగా తెలుసు. ఒకటి రెండు సార్లు జరిగిందదే కదా మరి?

కాని ఆశ్చర్యం ఏమిటంటే, ఏ‌ కంగారూ లేకుండా తాపీగా నాకు చేతనైనంత శ్రావ్యంగా నా కవిత్వాన్ని గానం చేయగలిగాను. అది నా సంతోషానికి మొదటి కారణం.

రెండవ కారణం ఏమిటంటే ఇక నేను బయటపడి వీలైనంత వేగిరం ఇంటి చేరి నా వృత్తిగత కార్యక్రమాలను మాటరాకుండా నిర్వహించుకొనేందుకు ఇంకా సమయం మించిపోలేదు.  ఇదింకా ముఖ్యమైన కారణం.

నిజానికి సభలో కూర్చున్నవారికి కూడా ఎప్పుడు ఈ‌సభ ఐపోతుందా ఇంటికి వెడదామా అని ఉందేమో.  అప్పటికే‌ ముందే చెప్పిన కారణాలవల్ల విసిగిపోయి ఉన్నారు కదా.

అందుకని ఒక్కరంటే ఒక్కరూ చప్పట్లు కొట్టలేదు.

అంతదాకా ప్రతికవితనూ ఏదో ఒక రకంగా భళాభళీ అంటున్న సభాద్యక్షులవారూ పెదవి విప్పితే ఒట్టు.

ఐనా అందరికి లాగానే నాకూ ఒక శాలువా కప్పారు. ఒట్టు. చచ్చే సిగ్గు వేసింది.  ఎందుకొచ్చిన సన్మానం ? ఎందుకొచ్చిన శాలువా? అనిపించింది. అసలు ఎవరైనా కనీసం విన్నారా ? ఈ మాత్రం‌ భాగ్యానికి నాక్కూడా సన్మానం ఏమిటీ అని?

ఐనదేమో ఐనది.  నేనూ ఇంటికి బయలు దేరాను ఆదరాబాదరా.

నాకు ఈ కార్యక్రమం నిరుత్సాహం కలిగించిందన్న మాట వాస్తవమే ఐనా నాకు అదే అమిత సంతోషం‌ కలిగించింది మరికొన్ని కారణాల వలన

ఈ‌ కార్యక్రమానికి శ్రీకంది శంకరయ్యగారు వచ్చారు. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవటం నాకు ఇదే‌ ప్రథమపర్యాయం.

అదీ కాక శంకరాభరణం మిత్రులు మరి కొందరు వచ్చి కవిత్వాలు వినిపించారు. అదీ చాలా  సంతోషం‌ కలిగించిన విషయమే. సభలో శంకరయ్యగారికి అందిన ఆత్మీయస్వాగతం అన్నింటికన్నా నాకు మిక్కిలి సంతోషం కలిగించింది.

శ్రీ శంకరయ్యగారు నా కవిత్వం చదివి దానికి వసంతమన్మథం అని దయతో నామకరణం చేసారు. ఆ మాట కూడా పద్యాలను చదివే ముందే సభకు సవినయంగా మనవిచేసి మరీ మొదలుపెట్టాను.

వేదిక దిగిరాగానే నాతో‌ చింతావారొక మాట అన్నారు. విద్వానేవ విజానాతి విద్వజ్జన వివేచనం అని.  ఈ శ్లోకం ఏమిటంటే

విద్వానేవ విజానాతి విద్వజ్జన వివేచనమ్‌
నహి వంధ్యా విజానాతి గుర్వీం‌ ప్రసవ వేదనామ్‌

అని.  నేను మాత్రం 'అరసికాయ కవిత్వనివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ' అనుకొని బయటకు వచ్చాను.

18, మార్చి 2015, బుధవారం

రామనామసుధాసరసి రాజహంసమా

రామనామసుధాసరసి రాజహంసమా
ఏమి నీ వైభవము యేమి నీ సంతోషము

సదారామచంద్రయశశ్చంద్రికాప్రకాశము
ముదావహం బగుచు నుండ మురిసిపోవుచుందువే
సదాసుఖాస్పదము రామచంద్రనామజపమును
వదలక సంతోషపారవశ్యమున తిరిగెదవే ॥రామనామ॥

నీకు రామభజనమే నిత్యము శ్రవణీయము
నీకు రామమూర్తియే నిత్యము రమణీయము
నీకు రామచరితమే నిత్యము పఠనీయము
నీకు రామదర్శనమే నిరుపమానందకరము ॥రామనామ॥

యే యూహాలోకముల నెగురదలచ వెన్నడును
యే యాశాజలధులలో నీదదలచ వెన్నడును
తీయనైన రామనామతోయమే గ్రోలుచును
హాయిగానుండు భాగ్యమబ్బిన నా మానసమా ॥రామనామ॥

17, మార్చి 2015, మంగళవారం

మాయలు చేసేది నీవైతే

మాయలు చేసేది నీవైతే కలిమాయ ఎక్కడనుండి వచ్చేనయ్యా
మాయదారి యీ గోల మాకేలా  మా తరియించుట మాటేమయ్యా

నీవేమొ మాయలో నిలువునా ముంచేవు
మావెఱ్ఱి కది కలిమాయ యనిపించేవు
భావింప శ్రీహరి బహుచతురుడ వీవు
జీవులను పావులుగ జేసి క్రీడించేవు  ॥మాయలు చేసేది॥

ఆట నీవు మొదలుపెట్టి అయ్యయ్యొ పావులమీద
వేటు వేయు గడసరి వెలసి పాపపుణ్యసమితి
మాటున నీ‌ యాట మర్మమె దాగును కాద
చేటు మాత్ర మీరీతి చెందనేల జీవసమితి  ॥మాయలు చేసేది॥

అన్ని తెలిసినవాడ ఆటలోన నీవు దూరి
మన్నించి కాయపండు మార్గమిచ్చితివి శౌరి
తిన్నగ రామచంద్ర దేవుడవై మాలో చేరి
యున్న నిన్నెఱిగి విడువకున్న చాలదియే దారి  ॥మాయలు చేసేది॥


16, మార్చి 2015, సోమవారం

కారణజన్ములు కానిది ఎవరు?

కారణజన్ములు కానిది ఎవరు కారణమన్నది కర్మము కనుక
ధారుణి కర్మఫలమ్మును గుడువ జోరున వత్తురు జీవులు కనుక

హరి సర్వేశ్వరు డాతడు తక్క మరియందరిపై ముసిరిన మాయ
గరువము బరపి ఘనముగ బుధ్ధి నరిషడ్వర్గపు చెలిమికి ద్రోయ
పరిపరి విధముల పాపాచరణబాహుళ్యము నిర్భాగ్యుల జేయ
నరకము చేరి నానాబాధలు వరసగ కుడిచి సమయము డాయ  ॥కారణ జన్ములు॥

ఏమాత్రము సద్గ్రంథపఠనము ఏమాత్రము సద్గురు సేవనము
ఏమాత్రము సత్సాంగత్యము ఏమాత్రము శ్రీహరి సేవనము
ఏమాత్రము వైరాగ్యలక్షణము ఏమాత్రము పరతత్త్వభావనము
నోమనిదే గలదే పరము పామరత్వమున చెడగ జీవనము ॥కారణ జన్ములు॥

శ్రీమంతులని మిడెకెడి వారు చీకుచింతలకు నడలెడి వారు
ధీమంతులమని నుడివెడి వారు కామందులమని గడపెడు వారు
కాముని కొలువును విడువని వారు రాముని నామము నుడువని వారు
ఏమని మోక్షము చెందెడు వారు   భూమికి రాకెక్కడికిని బోరు ॥కారణ జన్ములు॥

13, మార్చి 2015, శుక్రవారం

హేతువాదమూ - జ్యోతిషమూ.

రాజసులోచనం బ్లాగు (http://rajasulochanam.blogspot.in/)లోని ఒక టపాకు (http://rajasulochanam.blogspot.in/2015/03/blog-post_2.html)  నేను చేసిన వ్యాఖ్యకు మరింత వివరణగా ఇది వ్రాస్తున్నాను.

నేను దివంగత బి.వి.రామన్ గారి వీరాభిమాని నేమీ‌ కాను. కాని ఒకప్పుడు వారి Astrological Magazine of Inida మాసపత్రికను తరచుగానే ఆసక్తిగా చదివే వాడిని. ఇప్పుడెందుకు చదవటం లేదలా అంటే, దానికి సవాలక్ష కారణాలున్నాయి. అది వేరే సంగతి. ఆయన ఆ పత్రికకు వార్షిక సంచికను ప్రత్యేకగా చాలా ఎక్కువ పేజీలతో ఎక్కువ సరంజామాతో నూత్న ఆంగ్లసంవత్సరారంభసంచికను దాదాపు ఒక నెల రోజులు ముందే విడుదల చేసేవారు. అది ప్రత్యేకంగా కొని మరీ‌ చదివే వాడిని. ఇదంతా ఎందుకు ప్రస్తావించానంటే ఆయన ప్రతివార్షికసంచికలోనూ రాబోయే సంవత్సరకాలంలో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను గురించి అంచనాలను ప్రకటించేవారు. అలాగే ఆ సంచికలో గతసంవత్సరపు అంచనాలు ఏమేరకు ఫలించినదీ కూడా విశ్లేషించేవారు. 

ఆ సంచికలు ఎన్నడూ‌ హేతువాదులు పరిశీలించినట్లు నా దృష్టికి రాలేదు.  పరిశీలిస్తే వాటిలో నిజానిజాలను బట్టి వారికి జ్యోతిషం పట్ల అవగాహన మరికొంత నిర్దుష్టంగా రూపుదిద్దుకునేది. కాని చిత్రమేమిటంటే, జ్యోతిషం అనేదానిపైన ఏమాత్రం అధ్యయనమూ చేయకుండానే తరచుగా జ్యోతిషానికి వ్యతిరేకంగా వీరావేశంతో మీడియాలో హడావుడి చేస్తుంటారు. పుస్తకాలూ వేస్తుంటారు.

జ్యోతిషంపై హేతువాదుల పుస్తకాలు అంటే ఒక విషయం గుర్తుకు వచ్చింది. చెబుతాను. చాలా కాలం క్రిందటం అంటే గత ఎనభయ్యవ దశకంలో విజయవాడనుండి ప్రచురితమైన ఒక పుస్తకం జ్యోతిషంపైన నిప్పులు చెరిగింది. అది ఒక చిన్న పుస్తకం.

నా మస్తకం అప్పుడున్నంత పదునుగానూ‌ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి దానిలో నుండి ఒక విషయం ప్రస్తావిస్తున్నాను. ఉన్నవి పన్నెండే రాశులు. అందులో కేవలం తొమ్మిది గ్రహాలను అమర్చి చూపి రాశిచక్రం అంటారు. పన్నెండు గళ్ళల్లో తొమ్మిది గ్రహాలను కేవలం కొద్ది రకాలుగానే అమర్చగలం కదా. అంటే ఒకే రాశి చక్రం అనేక మందికి వస్తుంది....  

ఇలా సాగింది ఆ పుస్తకంలో‌ తర్కం.

మీ కిందులో తప్పు ఏమన్నా ఉందా లేదా అన్న విషయం కొంచెం సేపు ఆలోచించుకొని ఆ తరువాత క్రింద నేను ఇచ్చే తర్కం చూడండి దయచేసి!

రాశి చక్రంలో ఒక గ్రహం ఉన్న స్థానాన్ని ఒక అంకెతో సూచిద్దాం అనుకుందాం. మనం నిత్యం వాడే దశాంశ గణన విధానంలో అంకెలు పదే ఉన్నాయి. కాని మనకి మన్నెండు రాశులున్నాయి కాబట్టి ద్వాదశాంశ విధానంలో అంకెలు వాడుదాం. ఇవి సున్న నుండి పది వరకూ పది, అపైన A, B అనే మరొక రెండు అంకెలు.
అలాగే గ్రహాలు తొమ్మిది అనుకున్నాం కాబట్టి మనం ఒక తొమ్మిది అంకెల పొడుగున్న సంఖ్యగా ఒక రాశిచక్రం అమరికను సూచించవచ్చును.  గ్రహాలకు వారాల క్రమంలో రవి, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అనీ ఆపైన రాహు, కేతు అనీ తొమ్మిదింటికి ఎడమనుండి కుడికి అమరిక అనుకుందాం.

అన్నట్లు, లగ్నం అనేదొకటి కూడా రాశిచక్రంలో గుర్తించి తీరుతాం కదా. అది పదవ గ్రహం లాంటి దనుకుందాం. దానిని పదవస్థానంలో గుర్తిద్దాం.

ఒక రాశి చక్రం ఉదాహరణకి:

రవి చంద్ర మంగళ బుధ గురు శుక్ర శని రాహు కేతు లగ్నం
1 5 A 0 6 2 B 7 2 8

ఇప్పుడు గమనించండి. ప్రతిరాశిచక్రాన్నీ మనం ద్వాదశాంశ విధానంలో పదిస్థానాల సంఖ్యగా వ్రాయవచ్చునని స్పష్టం అవుతున్నది కదా.

ఒక చిన్న ప్రశ్న. 

దశాంశ విధానంలో మూడుస్థానాల సంఖ్యలు ఎన్ని ఉంటాయి?

సమాధానం, 10 x 10 x 10 = 1000 అని కదా,

ద్వాదశాంశ విధానంలో పది స్థానాల సంఖ్యలు ఎన్ని ఉంటాయి?

జవాబు. 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 =  6191,73,64,224.
అంటే, 6191 కోట్ల పై చిలుకు భిన్నమైన రాశిచక్రాలుంటాయన్న మాట.

భారతదేశ జనభా 1947లో ఇంచుమించు 30 కోట్లని గుర్తు. ప్రస్తుతం 100కోట్ల పై చిల్లర. ప్రపంచ జనాభా ప్రస్తుతం  732,47,82,000 అంటే 732 కోట్ల చిల్లర.

దీనిని బట్టి ప్రస్తుతంలో కాని గతంలో కాని ఎన్నడూ ప్రపంచజనాభా గణితం ప్రకారం సాధ్యమయ్యే రాశిచక్రాలకన్నా ఎక్కువగా లేదు.  ముందు ముందు అది 6191 కోట్లకు చేరితే మనుష్యులను మేపేంత తిండిని భూమి పండించలేదు.

ఒక్క విషయం దాపరికం లేకుండా చెప్పవలసింది ఉన్నది. బుధుడూ శుక్రుడూ రవికి సమీపంలోనే ఉండి తీరాలి. అలాగే రాహుకేతువులు ముఖాముఖీ రాశుల్లోనే ఉండి తీరాలి. కాబట్టి గణితసాధ్యమైన 6191కోట్ల కన్న కొద్దిగా తక్కువగా రాశిచక్రాలు సాధ్యం. 

అవునూ, ఇదంతా సోది ఎందుకు చెప్పానూ?  ఒక హేతువాద పుస్తకంలో ఉన్న అమాయకపు అవగాహనను ఎత్తి చూపటానికే కదా? 

ఇలాంటి తప్పుడు అవగాహనల వాళ్ళూ జనానికి శాస్త్రీయదృక్పధాన్ని పంచటం కోసం జ్యోతిషాన్ని ఎగతాళి చేస్తూ పుస్తకాలు రాస్తుంటే, జనానికి విజ్ఞానం అందుతోందా?  ఆ పేరుతో అజ్ఞానం అందుతోందా?

ఒకప్పుడు మహేంద్రలాల్ సర్కార్ అని గొప్ప వైద్యశిఖామణి ఉండేవారు. ఆయన హోమియో వైద్యాన్ని తిట్టిని తిట్టు తిట్టకుండా చెరిగి పారేస్తూ పెద్ద ఉపన్యాసం సభాధ్యక్షస్థానం నుండి ఇస్తే అంతా భళాభళీ అన్నారు. బాగుంది. కాని ఆయన స్నేహితుడు మరొక డాక్టరు గారు తప్పుపట్టారు. హోమియో వైద్యం గురించి నీకు స్వయంగా ఎంత తెలుసూ అని నిలదీసారు. సర్కారు గారు ఆలోచనలో పడిపోయారు. జర్మనీ నుండి హోమియో వైద్యం గురించిన గ్రంథాలు సేకరించి వాటిలో మునిగి తేలారు.

తరువాత ఏమయ్యింది?

సర్కారుగారు స్వయంగా హోమియో వైద్యుడిగా అవతారం ఎత్తి యావజ్జీవం హోమియోపతీకే అంకితం ఐపోయారు. బెంగాల్లో ఆయనపేరున కాలేజీ కూడా ఉందనుకుంటాను.

మరి ఈ సోది ఎందుకు చెప్పానూ?

హేతువాదులయ్యేది కాకపోయేది జ్యోతిషం అనేదాన్ని సుబ్బరంగా విమర్శించవచ్చును. నేనే బోలెడు విమర్శ రాయగలను. అది వేరే సంగతి. చెప్పొచ్చేదేమిటంటె, జ్యోతిషాన్ని చెరిగిపారేద్దామనుకునే వాళ్ళు ముందుగా బుధ్దిగా జ్యోతిషంలో మంచి పాండిత్యం సంపాదించాలి. అప్పుడు విమర్శించితే అదొక అందం.

నూటికి నూరు శాతం ఋజువు చేయటం అనేది వేరే సంగతి. ముందు వినయంగా జ్యోతిషాధ్యయనం చేస్తే చాలా విషయాలే తెలుస్తాయి. 

ఇంకా చాలా సంగతులు రాయవచ్చును ఈ‌ విషయంలో. కాని పాఠకులకు నేను చెప్పదలచినది ఇప్పటికే అర్థమై ఉంటుంది కాబట్టి ఆట్టే గ్రంథం పెంచటంపై ఆసక్తి లేదు.

ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను. నేను కూడా ఒక జ్యోతిషపండితుడి సూటి ఫలితాలకు ఆశ్చర్యపోయిన తరువాత ఈ జ్యోతిషం అంటే ఏమిటో అన్న కుతూహలంతోనే అధ్యయనం చేసాను. నాకు నచ్చినవి అనేక విషయాలున్నాయి, నచ్చనివీ ఉన్నాయి కొన్ని కొన్ని.

10, మార్చి 2015, మంగళవారం

కవి
నిశ్శబ్దంగా వస్తారంతా
నిశ్శబ్దంగా వెళ్తారంతా
కొందరు మధ్యలో గుబాళిస్తారు
కొంద రందులో మన నేస్తాలు

అందరూ లోకాన్ని చూస్తారు
కొందరే లోతుగా చూస్తారు
కొందరు మనకూ చూపిస్తారు
అందుకే వారు మన నేస్తాలు

మౌనంగా చూసేవాడు ముని
మనకు చూపించే వాడు కవి
ముని తనలో తాను జీవిస్తాడు
కవి మన కోసం జీవిస్తాడు

మనం కవిజీవుల్ని పట్టించుకోం
మనం మనసంగతే పట్టించుకోం
జనం ఇంతే అనుకుంటూనే కవి
మనం బాగుండాలని రాస్తాడు

కవి పరితాపాన్ని తెలుసుకోం
కవిని ఋషియని తెలుసుకోం
కవివిలువని మనం తెలుసుకోం
కవిని స్నేహితుడని తెలుసుకోం

కవి శరీరాన్ని కాలం‌ మింగుతుంది
కవిత్వాన్ని జననిర్లక్ష్యం మింగుతుంది
కవిని మరిస్తే ఏం జరుగుతుంది
జాతి భవితనీ కాలం మింగుతుందిపాడెద నేను హరినామము


పల్లవి.
పాడెద నేను హరినామమును వేడుక మీఱగ వేయినోళులను
ఆడుచుపాడుచు అన్ని వీధుల తిరుగాడెద హరిదయ వేడుకొనుచును


ఇది నేను సంకల్పించి వ్రాసినది కాదు.  చిత్రంగా నేటి ఉదయం వేకువఝామున ఈ‌ పల్లవిని పాడుతూ వీధుల్లో తిరుగుతున్నట్లుగా స్వప్నం కలిగింది. అందు చేత, ఆ పల్లవితో కీర్తనను పూర్తిచేసి బ్లాగులో ఉంచుతున్నాను. అదృష్టవశాత్తు ఈ పల్లవిని హిందోళంలో గానం చేసిన విధానం దాని ఆలాపనతో‌ సహా మనస్సులో సుస్థిరంగానే ఉంది. ఐతే మరొక్క మాట. ఇటువంటి విషయాలు బ్లాగులో ఉంచితే కొందరి అపనమ్మకం కారణంగా అక్షేపణలు వచ్చే అవకాశమూ  ఉంది కాబట్టి ఈ విధంగా ప్రకటించుకోవటం అంత మంచిది కాదన్న సలహా ఒకటి గతంలో ప్రకటించిన ఒక కీర్తన సందర్భంలో కొందరు విజ్ఞులనుండి అందిన సంగతి నేను మరువలేదు. కాని ఈ‌ సంగతిని లిఖితపూర్వకంగా పదిలపరచుకొనని పక్షంలో అది మరుగున పడిపోతుంది కదా?  అందుకని విషయం వెల్లడించుకొని వ్రాయటమే ఉచితం అన్న నిర్ణయానికి వచ్చి, కీర్తనతో పాటే సంగతి సందర్భాలనూ వివరిస్తున్నాను.
పాడెద నేను హరినామమును వేడుక మీఱగ వేయినోళులను
ఆడుచుపాడుచు అన్ని వీధుల తిరుగాడెద హరిని వేడుకొనుచును

ఇచ్చగించి ముల్లోకములు లచ్చిమగడు కలిగించి
ముచ్చటగ వేయికనులతో నిచ్చలు సంరక్షించు
అచ్చమైన సత్యమిది మెచ్చక తృణీకరించి
మచ్చరించు వారలకు హెచ్చరిక కలుగునటుల  ॥పాడెద నేను॥

రేయి లేదు పవలు లేదు రేపు బుధ్ధి తెలియుట లేదు
మాయలోన మునిగియున్న మనిషికొక్క మెలకువ లేదు
మాయదారి కలి నణచ మరియొండు దారియె లేదు
వాయివిడచి హరిని వేడగ వలెనని జనులకు తెలియగ ॥పాడెద నేను॥

భక్తులైన వారలకు కలి భయ మెన్నటికిని లేదు
శక్తికొలది చేసిన రామజపము వృధాయగుట లేదు
ముక్తి నిచ్చు రామ మంత్రమునకు సాటి వేరు లేదు
యుక్తి తెలిసి జనులు రామ భక్తులై తరించునటుల ॥పాడెద నేను॥


4, మార్చి 2015, బుధవారం

ఏదో ఒకరోజు రాదా, ఏదో ఒక మార్పు రాదా!ఏదో ఒకరోజు రాదా, ఏదో ఒక మార్పు రాదా!
ఏదారీ లేదనే గోదారే దిక్కనే ఈ దైన్యం తీరిపోదా!

కనువారలు వినువారలు కనబడరని కలగకు,
కనులపొరల మనుషులకు వినయశీలు రలుసులే !
కనబడని దేవతలకు వినబడులే నీఘోష!
మనజనగణ వేదనలు మలగుదినం‌ కలదులే.     ॥ఏదో ఒకరోజు॥

అసలే ఒక శప్తజాతి ఆంధ్రులన్న పేరుందని,
కసిరికసిరి నసిగినసిగి కొసరే రరకొరగ దొరలు!
రుసరుసలా? నువ్విప్పుడు రొక్కిస్తే ఇదేమని!
దసరాపులులే సుమా పసలేని నేతలు!          ॥ ఏదో ఒకరోజు॥

కలకాలం ఉంటాయా కష్టాలూ కన్నీళ్ళూ?
తెలుగువాడి ప్రభ రేపు దేశంలో వెలుగదా?
తలపొగరు నేతలకు తగినశాస్త్రి జరుగదా?
నిలువదా నీ పక్షం నిలింపుల ఔదార్యం!            ॥ఏదో‌ ఒకరోజు॥