16, మార్చి 2015, సోమవారం

కారణజన్ములు కానిది ఎవరు?

కారణజన్ములు కానిది ఎవరు కారణమన్నది కర్మము కనుక
ధారుణి కర్మఫలమ్మును గుడువ జోరున వత్తురు జీవులు కనుక

హరి సర్వేశ్వరు డాతడు తక్క మరియందరిపై ముసిరిన మాయ
గరువము బరపి ఘనముగ బుధ్ధి నరిషడ్వర్గపు చెలిమికి ద్రోయ
పరిపరి విధముల పాపాచరణబాహుళ్యము నిర్భాగ్యుల జేయ
నరకము చేరి నానాబాధలు వరసగ కుడిచి సమయము డాయ  ॥కారణ జన్ములు॥

ఏమాత్రము సద్గ్రంథపఠనము ఏమాత్రము సద్గురు సేవనము
ఏమాత్రము సత్సాంగత్యము ఏమాత్రము శ్రీహరి సేవనము
ఏమాత్రము వైరాగ్యలక్షణము ఏమాత్రము పరతత్త్వభావనము
నోమనిదే గలదే పరము పామరత్వమున చెడగ జీవనము ॥కారణ జన్ములు॥

శ్రీమంతులని మిడెకెడి వారు చీకుచింతలకు నడలెడి వారు
ధీమంతులమని నుడివెడి వారు కామందులమని గడపెడు వారు
కాముని కొలువును విడువని వారు రాముని నామము నుడువని వారు
ఏమని మోక్షము చెందెడు వారు   భూమికి రాకెక్కడికిని బోరు ॥కారణ జన్ములు॥

3 కామెంట్‌లు:

  1. శ్రీమంతులని మిడెకెడి వారు చీకుచింతలకు నడలెడి వారు
    ధీమంతులమని నుడివెడి వారు కామందులమని గడపెడు వారు
    కాముని కొలువును విడువని వారు రాముని నామము నుడువని వారు
    ఏమని మోక్షము చెందెడు వారు భూమికి రాకెక్కడికిని బోరు ॥కారణ జన్ములు॥

    సత్యం చెప్పేరు.

    రిప్లయితొలగించండి


  2. కారణ జన్ములు కానిది ఎవరు ? - పెరటి తోట కాలీఫ్లవర్ మసాలా కూర .

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనం తినటం కోసమే కూరలు పుట్టాయనుకునే అమాయకులూ
      కూరలు తినటం కోసమే మనం పుట్టామనుకునే అజ్ఞానపరులూ
      దండిగా ఉన్న లోకంలో నవ్వులు పండించే జిలేబీలూ ఉండరా మరి?

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.