17, మార్చి 2015, మంగళవారం

మాయలు చేసేది నీవైతే

మాయలు చేసేది నీవైతే కలిమాయ ఎక్కడనుండి వచ్చేనయ్యా
మాయదారి యీ గోల మాకేలా  మా తరియించుట మాటేమయ్యా

నీవేమొ మాయలో నిలువునా ముంచేవు
మావెఱ్ఱి కది కలిమాయ యనిపించేవు
భావింప శ్రీహరి బహుచతురుడ వీవు
జీవులను పావులుగ జేసి క్రీడించేవు  ॥మాయలు చేసేది॥

ఆట నీవు మొదలుపెట్టి అయ్యయ్యొ పావులమీద
వేటు వేయు గడసరి వెలసి పాపపుణ్యసమితి
మాటున నీ‌ యాట మర్మమె దాగును కాద
చేటు మాత్ర మీరీతి చెందనేల జీవసమితి  ॥మాయలు చేసేది॥

అన్ని తెలిసినవాడ ఆటలోన నీవు దూరి
మన్నించి కాయపండు మార్గమిచ్చితివి శౌరి
తిన్నగ రామచంద్ర దేవుడవై మాలో చేరి
యున్న నిన్నెఱిగి విడువకున్న చాలదియే దారి  ॥మాయలు చేసేది॥


3 కామెంట్‌లు:

  1. మాయలో మాయ చేసి మాయలో పడేయడమే మాయ.........విష్ణుమాయ

    రిప్లయితొలగించండి
  2. "జీవులను పావులుగ జేసి క్రీడించేవు"

    "జీవులను పాపులుగ జేసి క్రీడించేవు" అని కూడా అనుకోవచ్చా సార్!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.