24, నవంబర్ 2013, ఆదివారం

అదే పనిగ రామరసాయనము గ్రోలరే





అదే పనిగ రామరసాయనము గ్రోలరే ప్ర

హ్లదనారదాదుల వలె యాడి పాడరే



పామరులను ఋషుల జేయు రామమంత్రము సీ

తామహాసాధ్వి మదిని దలచు మంత్రము

కామక్రోధసర్పములను కట్టు మంత్రము మీ

కామిత మగు మోక్ష మిచ్చి కాచు మంత్రము

రామనామరసాయనము తాము గ్రోలరే

రామమంత్రజపము చేసి రాణకెక్కరే



సదాముదావహము రామచంద్ర ధ్యానము సం

పదలు విరుగకాయు పాదు రామధ్యానము

సదాసదాశివుడు ప్రీతి సలుపు రామధ్యానము ఆ

పదల నుండి కాచు నట్టి భవ్యధ్యానము

రామనామరసాయనము తాముగ్రోలరే

రామధ్యానరక్తు లగుచు రాణకెక్కరే



విమలవేదాంతవేద్య రామతత్త్వము చి

త్తమున ప్రకాశింప జేయు విమలౌషధము

కుమతుల కిది దొరుక దండి కోరి సుజనులు ని

త్యమును గ్రోలు చుండు నట్టి యమృతౌషధము

రామనామరసాయనము తాము గ్రోలరే

రామతత్త్వ మెఱిగి మీరు రాణకెక్కరే




(ఈ కీర్తన సృజన పత్రిక నవంవరు 2013 సంచికలో ప్రచురించబడింది)


23, నవంబర్ 2013, శనివారం

భద్రాచలం విషయంలో సీమాంధ్రులకు విజ్ఞప్తి.

నేడు మాన్య కవిపుంగవులు శ్రీ గుండు మధుసూదనులవారు మావి మావి యనంగనె మీవి యగునె "నోరు మూయుఁడు! మాటలు మీఱఁ బోక, పరువు దక్కించుకొనుఁడయ్య పలుకుఁ దక్కి" యని నిందాపూర్వకముగా బహుతీవ్రస్వరముతో కవిత్వము వ్రాయుట జరిగినది.  వారి భావన వారిది.  వారిట్టి ధోరణిలో వ్రాయుట క్రొత్తగాదు.  దానికి సీమాంద్రులు నొచ్చుకొన బనిలేదు.  నొచ్చుకొని ప్రయోజనమును లేదు.  సాటి తెలుగువారి  మనోభావముల నవమానపరచుటలో గుండువారికి వినోదము కలుగవచ్చును.  కాని గాయపడిన సీమాంధ్రులకు కొన్ని స్వాంతన వచనములను చెప్పబూనుట తప్పని సరియని భావించి కొంత వ్రాయవలసి వచ్చుచున్నది.  ఈ వ్యాసములో ఏ పక్షము వారిని గాని యధిక్షేపించు కార్యక్రమము లేవియును లేవు.  ఎవరైన భుజములు తడవుకొనట తటస్థించినచో దానికి నేను చేయగలుగునది కూడ లేదు.

అయ్యా అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుండైన శ్రీహరిచే నమరించబడిన  సమస్త ప్రపంచంబు నందు గల యశేషశ్రేష్ఠ ప్రాంతవస్తుజనాదికంబును కేవలము తెలంగాణమువారి యాజ్ఞకును హక్కుభుక్తంబులకును లోనుగా వలసినవియే గాని తదన్యంబులు గానేరవు.  తెలంగాణమువారు తమకు నిరుపయోగంబని భావించి విసర్జించి యన్యులకు కృపతో నాజ్ఞ శాయించి యనుగ్రహించినట్టి ప్రాంతవస్తువిశేషంబులు మాత్రము తెలంగాణేతరప్రాంతీయులకు వినయపురస్సరంబుగా స్వీకరణయోగ్యంబులై యున్నవి.  ఈ విషయంబునందు తెలంగాణేతర ప్రాంతవాసులు నిరుపయోగమైన వాదనలకు దిగరాదని విజ్ఞప్తి.

నేడు కాలము తమ కనుకూలంబుగా వర్తించు చున్న దని తెలంగాణము వారలు మిక్కిలి సంతోషముతో నున్న పరిస్థితిలో నితరులు వృధావాదంబులతో తెలంగాణాప్రజలకుగాని తెలంగాణాప్రాంతనాయకులకు గాని క్రోధవిచారంబులను కల్పించు వాక్క్రియావ్యవసాయంబులకు పాల్పడరాదు.  అట్లుపాల్పడియును కార్యంబు లేదు గావున తెలంగాణేతరులు ప్రాప్తకాలజ్ఞులై పరమేశ్వరానుగ్రహంబునకు వేచి యుండవలసినదిగా తెలియగలరని ఆశించుచున్నాను.

మన విచిత్రప్రజాస్వామ్యనామకకాంగ్రేసుపాలనావ్యవస్థావిశేషవిజ్ఞతాకారణముగా కాంగ్రేసువారి స్వప్రయోజనమే దేశప్రయోజనము గాన, వారు దొరతనములోనుండి శాయించిన శాయించుచున్న మరియును శాయించగల సమస్తమైన శాసనంబులచేత బధ్ధులైన దేశప్రజలకు పరమేశ్వరానుగ్రహంబు దప్ప విమోక్షణావకాశము గలుగు నుపాయంబు మృగ్యంబు.  ప్రస్తుత మా కాంగ్రేసుదొరతనము వారలీ  ఆంధ్రప్రదేశంబు నుండి తెలంగాణమును విడదీసి ప్రత్యేక మగు రాష్ట్రంబుగా నేర్పరచుట యందే తమకు విశేషంబగు ప్రయోజనంబు సంఘటిల్లు నని భావించి తదనుగుణంబులగు చర్యలయందు  నిమగ్నులై యున్నారు కావున తత్తద్విషయంబులను గూర్చి ప్రశ్నించుట దుస్సాహసముగా భావించబడు చున్నది.

ఇట్టి తరుణమందు న్యాయాన్యాయంబులను గురించి గాని ధర్మాధర్మంబులను గురించి గాని యుభయప్రాంతంబులందు వసించు చున్న ప్రజలకు కాలక్రమంబున వాటిల్ల గల కష్టనష్టంబులను గురించి గాని విశాలదేశప్రయోజనంబులకు భవిష్యమందు సూచితమగు చున్న ప్రమాదంబులను గురించి గాని కాంగ్రేసువారితో గాని ఆనందడోలికలలో దేలియాడు చున్న  తెలంగాణము వారికి గాని వివరించి విన్నవించి వాదించి యుపయోగము లేదు.  కాంగ్రేసు దొరతనము వారికి  ఆసన్నవిపదోల్లంఘనాప్రయోజనకారియును సార్ధకనామధేయుడైన రాహులుని పట్టాభిషేకమునకు తోడ్పడునదియును నై యున్న కార్యమే ముఖ్యము గాని కించిద్విషయంబులైన దేశప్రయోజనాదులు కావు. తెలంగాణామువారికి వారి మనోభీష్టము నెఱవేరి తెలంగాణము ప్రత్యేకరాష్ట్రముగా నావిర్భవించుటే ముఖ్యము గాని దానివలన నితరులకు గలగు వెతలతో గాని దేశప్రయోజనము వంటి  యల్పవిషయముతో గాని యిసుమంతైననను పని లేదు.  పని యుండవలయు నని భావించుట అమాయకత్వము. అనగా రాజకీయముల తీరు దెన్నులను గ్రహించ లేక పోవుట.  దీనిని కాంగ్రేసు దొరతనము వారు దుస్సాహసుముగా పరిగణించి శిక్షింతురు మరియును తెలంగాణమువారు దుష్టత్వముగా పరిగణించి  క్రోధపరవశులై యీసడించి దూషించి శపించి పట్టి పల్లార్చగలరు. కావున తస్మాత్ జాగ్రత జాగ్రత యని తెలియ జేయడమైనది.

ఇది యంతయును యావద్దేశవాసులైన తెలుగువారును బాగుగా గ్రహించి కాంగ్రేసు దొరతనము వారితో గాని తెలంగాణము వారితో గాని యీషణ్మాత్రంబును విబేధించక వారి కోరికమేరకు వర్తించుట కాలోచితమైన కార్యము. ఈ తెలుగుగడ్డను నేటి దనుక నెందరో పరాయివారు పాలించలేదా మరియును ఖండఖండములుగా విభజించి పాలించలేదా యని యూరడిల్ల వలసినది. ఈ విషయములో కాంగ్రేసుదొరతనము వారి యొద్ద పెద్దపాలేర్లుగా పనిచేయుచు హస్తినాపురవాస్తవ్యులై చెలంగుచున్న మన కేంద్రమంత్రులు మిగుల బుధ్ధిమంతులై యున్నట్లు తోచుచున్నదన్న నతిశయోక్తి యించుకయును లేదు కదా. వారు సేవాధర్మపరాయణులై తెలుగు జాతిలో కొందరు ప్రాప్తకాలజ్ఞులు నేటికిని కలరని చాటుట మిక్కిలి ముదావహము మరియు తెలుగుజాతి యని యొకటి నిజముగా నున్నచో దానికి నిశ్చయముగ గర్వకారణము.

కాల మన్నది  యొకే తీరుగా నుండదని మనకు తెలియని విషయము కాదు.  చక్రనేమిక్రమముగా  నుండును గదా దాని విధానము.  నీచైర్గచ్ఛత్యుపరి చ దశా చక్రనేమి క్రమేణ యనియును సుఖం దుఃఖం భ్రమత్యేవ చక్రనేమి క్రమేణ చ  యనియును గదా వినబడు చున్నది.  నే డొకరికి మంచి రోజు వచ్చిన రేపు మరొకరికి రావచ్చును.  ఇంత సామాన్యమైన దానికి  కాలబలగర్వితులు కన్నుమిన్ను గానక సాటివారిని  విషముఖులని నిందించుచుటయును నోళులు మూసుకొమ్మని దూషించుటయును కేవలము పిల్ల చేష్టలు. కాని కాలవంచితులీ మాటలు పడక తీరదు కదా.  పోనిం డిట్లు పడ్డ వారందరును చెడ్డవారు కాదనెడు సామెతను గురుతు చేసుకొని వారు దురపిల్లుట మాని యూరడిల్లక తీరదు.  ఏ పాలనమునుండి ఏ ప్రాంత మెప్పుడు జారిపోవునో మరల నే పాలనములోని కే ప్రాంతము వచ్చి కలయు చుండునో యన్న విషయమును గూర్చి వ్యగ్రత నిరర్థకము.  అంతయు కాలము చేతులో నున్న వ్యవహారము.  మానావమానములు కాలము చేతనే కలుగుచున్నవి కాని వ్యక్తుల ప్రయోజకత్వగరిమావిన్యాస మందు శూన్యమని బలి చక్రవర్తి యింద్రునకు చేసిన బోధను స్ఫురణకు దెచ్చుకొన వలయిను సుమా.

నేడు తెలంగాణావారి దృష్టిలో భద్రాద్రీశుడు తెలంగాణపు నవాబుల యేలుబడి కొకప్పుడు లోనై యుండిన కారణము చేత పునర్దాస్యయోగ్యుడై నాడు. శాంతం‌ పాపమ్‌.  తెలంగాణమువారి దృష్టిలో నిది భద్రాద్రిరామచంద్రునకు విడుదల ప్రసాదించి రక్షించుట కావచ్చును కదా.  కానిండు దానికేమి.  కట్టబెట్టువారు కలిగినచో కాశీక్షేత్రంబును తెలంగాణావారిదే కావచ్చును.  శక్తి కలిగినచో కాలబలము గలవార లితరుల యూళ్ళలో నెండయు వెన్నెలయును గూడ కాయరాదని శాసింతురే కదా.  వృధా విచారము మాని యోచించవలయును.  రామాలయమను నొక కట్టడము తెలంగాణములోనికి వచ్చినంత మాత్రము చేత శ్రీరాముడు తెలంగాణవారి కట్టుబానిస కాబోడు కదా యని చక్కగా గ్రహించి తెలంగాణాప్రాంతవాసులు కాని వారును నిర్విచారముగా నుండ వచ్చును.  విజ్ఞులైన వారు కాలగమనంబుచే గలుగు వింతలకు చింతించక జరుగుచున్నది  నిర్వికారులై సాక్షిమాత్రులై గమనించు చుందురు. మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః అని గీతాకారుడు చెప్పినట్లుగా నుండుటయే తెలుగువారికి కర్తవ్యము.  ముఖ్యముగా సీమాంధ్రప్రాంతవాసులైన తెలుగువారికి కాలము ప్రసాదించిన కర్తవ్యము.  శుభం భూయాత్.

19, నవంబర్ 2013, మంగళవారం

అవునా? - 21



నా యిళ్ళు పడదోసి నవ్వుచుందువే
నీ యింటికి రమ్మని నిలదీయుదువే
నీ యింటికి దారేదో నీవు తెలుపక
మాయగాడ నేను వచ్చు మాట యున్నదా



18, నవంబర్ 2013, సోమవారం

వంకాయ ప్రశస్తి.

కొత్త వెబ్ పత్రిక   సృజన  ఆవిర్భవించింది.  దానికి సుస్వాగతం.

అందులో లాస్యగారు గుత్తి వంకాయ కూర చేయటం గురించి వ్రాసారు  ఘమఘమలు  అని.
వంట గురించి నేనేం‌ వ్రాయగలను గాని, వంకాయ గురించైతే కొంచెం వ్రాయాలని అనుకుంటున్నాను.

ప్రసిధ్ధ రచయిత్రి, విదుషీమణి స్వర్గీయ  శ్రీమతి మాలతీచందూర్‌గారు బోలెడు మంచి సాహిత్యంతో పాటు, వంటలు-పిండి వంటలు అన్న పుస్తకం కూడా వ్రాసారు.  అదే ఎక్కువగా అమ్ముడు పోయింది అనుకుంటాను, ఆవిడ పుస్తకాల్లో.  అందులో వంకాయను గురించి మాలతమ్మగారు,  ఈ వంకాయను ఒక రోజున వండినట్లు తిరిగి మరొక రోజున వండుకోకుండా నెలకు ముఫై రకాలుగానూ చేసుకోవటానికి వీలున్న కూర అన్నారు.

అంత గొప్ప కూర కాబట్టే దానిమీద ఒక చాటు పద్యం వెలసి బహుప్రచారం‌ పొందింది కూడా.

కం. వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే

అని.

ఈ వంకాయమీద ఎవరూ ఒక దండకం వ్రాసినట్లు కనబడదు.  కాఫీమీద ఒక ప్రచారంలో ఉన్న దండకం ఉంది కాని.

ఐనా వంకాయ పాటలపల్లకీ ఎక్కింది.  బసవరాజు అప్పారావుగారి  ఒక పాటలో

గుత్తి వంకాయ కూరోయి బావా!
కోరీ వండినానోయి బావా!

అని వస్తుంది.  ఈ‌ పాటని స్వర్గీయ బందా కనకలింగేశ్వరరావు గా అద్భుతంగా గానం చేసే వారట. శ్రీబందావారి గురించి   ఇక్కడ చదవండి.

ఆ పాట యొక్క పూర్తి పాఠం  ఇక్కడ  చూడండి.

తెలుగుసామెతల్లోకి కూడా వంకాయ చోటూ చేసుకుంది.  కొన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ అని ఒక సామెత మరి.  వంకాయ దొంగిలించిన వాడు టెంకాయకు రాడా అని మరొక సామెత. ఇంకా మరేమన్నా వంకాయ సామెతలున్నాయేమో చూడాలి.

తెలుగువారిలో వంకాయల అన్న ఇంటిపేరు  గలవా రున్నారు.  వారిలో వంకాయల సత్యనారాయణ గారని ఒకరు సినిమా నటులు. వారి గురించి ఇక్కడ  చూడండి.

రాజమండ్రిలో వంకాయలవారి వీధి కూడా ఉంది.  ఒక సారి ఏదో బస్సులో వెళుతూ చూసాను!

ఇంత గొప్ప వంకాయలో పోషక విలువలు ఎన్నున్నాయో  ఇక్కడ    చూడండి. నిజానిజాలు నాకూ‌తెలియవు.  పోషకవిలువల మాట అటుంచి, వంకాయ రుచి మరి దేనికి వస్తుంది చెప్పండి?

వంకాయలో రుచీ,పోషకాల మాటలకేం గాని వంకాయ మంచి  ఔషధగుణాలు కలది అన్నది ఋజువైన సత్యం.  ఆసక్తి ఉంటే ఆ వివరాలు  ఇక్కడ చదవండి.

ఏమిటో నండీ వంకాయగురించి తెగ  వివరించేస్తున్నాను.  అతి ఐపోతున్నట్లుంది. ఇంక సెలవు.

అవునా? - 20



ఎన్నెన్నో‌ ఈ సృష్టినిండా ద్వంద్వాలు
అన్నీ సత్యశుధ్ధి యెరుగని అబధ్దాలు
అన్నన్నా ఈ నువ్వూ - నేనూ అన్నది
అన్నిటిలో మొదటి దైన పెద్ద అబధ్ధం



17, నవంబర్ 2013, ఆదివారం

అవునా? - 19



ఇక్కడకు వచ్చిన నేను ఏమి సాధించానో‌ తెలియదు
ఇక్కడకు నే నింకేదైనా సాధించాలని వచ్చానా చెప్పు
ఇక్కడ నువ్వు చెప్పింది చేస్తూపోతే చాలనుకున్నాను
అక్కడికీ ప్రతిపని లోనూ నీ సహాయం తీసుకుంటూనే



16, నవంబర్ 2013, శనివారం

అవునా? - 18



వేల తోలు తిత్తులలో విడిసి అలసినాను
వేల యేండ్లు నీ కోసం వెదకి అలసినాను
నేల నింగి అణువణువున అరసి యలసినాను
మేలగు నిక దొంగాటలు చాలించుట సఖుడ



14, నవంబర్ 2013, గురువారం

అవునా? - 17



ఈ‌ కళ్ళతో ఎంతో గాలించాను
లోకా లన్నింటినీ మరి నీ కోసం
నాకు తెలియలేదే యిన్నాళ్ళూ
నీ కాపురం నా గుండెలోనే నని



13, నవంబర్ 2013, బుధవారం

అవునా? - 16



వెల లేని వెన్నెల ఈ విరబూసిన వెన్నెల
 వెలుగు సూర్యుడిదే కాని కీర్తి చంద్రుడిది
తలపులోన కులుకు భావతటిల్లతవు నీవే
పలుకు నీదే కాని ఆ పేరు తోలు తిత్తిది



12, నవంబర్ 2013, మంగళవారం

అవునా? - 15



 ఆలోచించితే అవగాహనకు వచ్చేవాడివి కావు నీవు
అనంతానంతవాంగ్మయసాగరానికీ అవల ఉన్నావు
అయినా నీ మీద నా కెందుకో ఈ అంతులేని ప్రేమ
బహుశః అది నా హృదయప్రతిస్పందన నీ ప్రేమకు



11, నవంబర్ 2013, సోమవారం

అవునా? - 14



తూలి నేలకు జారిన ఆకు గాలికి చిక్కుతుంది
గాలిలో తిరిగే ఆకుకు ఒక గమ్యం ఏమిటి
 తేలిగ్గా నీ లీలకు మనిషి ప్రకృతికి చిక్కుతాడు
కాలప్రభంజనంలో మనిషికి ఒక గమ్యం ఏమిటి



10, నవంబర్ 2013, ఆదివారం

అవునా? - 13




కొన్ని కొన్నింటిని కొందరే ఇవ్వగలరు
వెన్నెలను పంచటం వేరే వాళ్ళ తరమా
ఎన్నిజన్మలైనా వేచి ఉండవలసిందేగా
మన్నించి నువ్వు మోక్షమిచ్చేదాకా




9, నవంబర్ 2013, శనివారం

అవునా? - 12




ప్రతిరోజూ కలలొస్తాయి
ప్రతికలలో నువ్వొస్తావు
ప్రతిరోజూ రాత్రికోసం
బ్రతకట మొక సంతోషం



8, నవంబర్ 2013, శుక్రవారం

అవునా? - 11




సురసిధ్ధోరగగంధర్వాప్సర
నిరంతరసంకీర్తనారావాలు
త్వరగా రమ్మని పిలిచే యీ
నరుడిఘోష నిను విననిస్తాయా




7, నవంబర్ 2013, గురువారం

రాస్ట్రవిభజన ఆపేందుకే రాయల తెలంగాణా అంటున్నారా?

రాస్ట్రవిభజన ఆపేందుకే రాయల తెలంగాణా అంటున్నారా?

ఇదేమంత ఆశ్చర్యపోవలసిన సంగతి కాదు.

దిగ్విజయసింగ్‌గారు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటిస్తూనే ముక్తాయింపుగా, ఇంక కాంగ్రెసులో తెరాస విలీనం అవుతుంది అని ఆశాభావం‌ ప్రకటించి, తెలంగాణా సెంటిమెంటును గౌరవించటం కన్నా ప్రత్యేకరాష్ట్ర ప్రకటన నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలే ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని స్పష్టంగానే ప్రకటించారు.

ఐతే, కాంగీపార్టీలో దూరితే సముద్రంలో దూరిన నదిలాగా చిరునామా కూడా మిగలకుందా పోతామని కచరా గారికి బాగా తెలుసు.  అందుకే ఇన్నాళ్ళూ కాంగీని ఆశపెట్టి, తీరా సమయం రాగానే ఓడ దాటాక బోడి మల్లన్న అన్న సామెత చందంగా, తెరాస విడిగానే ఉంటుందని ఆయనగారు ఢంకా బజాయిస్తున్నారు.

అదీ కాక, తెరాసకు కావలసినది ఉద్యమం కొనసాగటం కాని అది ముగియటం కాదన్న వాదనా బలంగానే వినిపిస్తూ ఉంటుంది తరచుగా.  అందుకే రాష్ట్రం సాకారం కాకుండా ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే ప్రకటనలతో ఆయన కదనకుతూహలరాగం పాడుతున్నారు.  దీని వల్ల రెండు ప్రయోజనాలున్నాయి తెరాసకు.  ఒకటి, రాష్ట్రం ఏర్పడితే, ఇంకా తమకు కొన్ని ముఖ్యమైన డిమాండ్లు అసంపూర్తిగానే ఉన్నాయనై యాగీ చేసి ఎన్నికలలో హవా తగ్గకుండా చూసుకోవటం.  రెండవది, కాంగీవారు రాహ్ట్రం ఎన్నికలలోగా ఇవ్వకుంటే, వారిని దుమ్మెత్తిపోసి రాష్ట్రాన్ని సాధిస్తాం అంటూ గర్జించి తమ హవాకు ఎదురు లేకుందా చూసుకోవటం.  ఏదైనా తెరాసకు మంచిదే నని కచరాగారి ఆలోచన కావచ్చును.

ఇక కాంగీ ఆలోచనా ధోరణి చూద్దాం.  కచరాగారు, తెరాసను కాంగ్రెసులో విలీనం చేయకుండా విడిగా ఉండి సీట్లన్నీ తన్నుకు పోవాలని చూస్తున్నారు.  అలా అవన్నీ ఆయన పట్టుకు పోవటం కాంగీవారికి సమ్మతం కానే కాదు.  కెసీఅర్‌గారి దూకుడు వల్లనే ఇబ్బందులు వచ్చాయని యాగీ చేసి తామే రాష్ట్రసాధకుల మని చెప్పి ప్రజలను నమ్మించాలని వారి ఆలోచన.  ఇది ఫలించే అవకాశాలూ దండిగానే ఉన్నాయి.  కాబట్టి కెసీఅర్ బూచిని చూపి, ఏవోవో ఇతర కారణాలు చూపీ రాష్ట్రవిభజన విషయంలో కొంత తాత్సారం చేస్తే కచరాగారికి బదులు కాంగీయే లాభపడితే, ఆనక కెసీఅర్‌గారి బ్లాక్‌మెయిల్ అవకాశానికి తప్పకుండా గండి పడుతుంది.  విశ్వసనీయత పోయింది కాంగీలో కచరాగారి మీద.  అందుకే అది, ఆయన ప్రమేయం లేకుండా గెలిచే అవకాశాలు అన్వేషిస్తున్నట్లుంది.  రాష్ట్రవిభజన కాకుండా ఎన్నికలు వచ్చిపడితే ప్రజలు ఇచ్చే దారిలో ఉన్న కాంగీకా,  తెచ్చేహడావుడి చేస్తున్న తెరాసాకా - దేనికి ఓటు వేయాలీ అని తేల్చుకోవాలి మరి.  ఇది కాంగీకి లాభిస్తుం దనుకుంటే కేసీఅర్‌గారు దిగిరాక తప్పదు.  అలాగే, రాష్ట్రవిభజన కష్టం అవుతుందీ, అది ఎలాగూ జరగదూ అన్న భ్రమలు సీమాంధ్రకు కలిగించటమూ పిల్లకాంగ్రెసుకు హెచ్చుగా లాభిస్తుంది - అంటే అంతిమంగా కాంగీకే లాభం అన్నమాట.

అందుచేత ఈ రాజకీయ డ్రామాను అర్థం చేసుకుంటే ఎవరికీ తికమక ఏమీ‌ ఉండదు.
అంతా పక్కాగా ప్లాను ప్రకారమే జరుగుతోందనేది స్పష్టం.

ఎవరు లాభపడతారూ ఎవరు నష్టపోతారూ అన్న ప్రశ్నలు పక్కన పెట్టండి.
రాజకీయ అనిశ్చితి వల్ల ప్రజలు మాత్రం భారీగా నష్టపోతారు.

అవునా? - 10




ఆకాశానికి ఆవల ఉన్నా
అవ్యక్తానికి ఆవల ఉన్నా
నీ కై వేచిన నిజభక్తుడనే
నా కోసం రావచ్చునుగా




6, నవంబర్ 2013, బుధవారం

అవునా? - 9




నీ వేగులే ఈ సూర్యచంద్రులు
నీ వేగులే ఈ పంచభూతాలు
కావాలా ఇంత కాపలా నామీద
నీ వాడిని నేను నా వాడివి నీవు




5, నవంబర్ 2013, మంగళవారం

అవునా? - 8




నువ్వు గొప్పవాడివనీ నమ్ముతున్నాను
నువ్వు మాయగాడివనీ నమ్ముతున్నాను
నువ్వు మంచివాడివనీ నమ్ముతున్నాను
నన్ను కూడ కాస్త నమ్మమంటున్నాను




4, నవంబర్ 2013, సోమవారం

అవునా? - 7




ఆ వసంతం ఒక్కటీ సరిపోయేది కాదా
ఈ‌ వేసవినీ చలికాలాన్నీ ఇవ్వటం దేనికి
నీవూ నేనూ ఉంటే సరిపోయేది సృష్టిలో
ఈ వెర్రిమొర్రి సరంజామా ఇక్కడ దేనికి




3, నవంబర్ 2013, ఆదివారం

అవునా? - 6




నీకు తెలియకుండా ఏమి జరుగుతోంది
నాకు తెలిసి ఇక్కడ ఏమి జరుగుతోంది
జరిగేదంతా జరిపించేది నీవే ఐనా
జరుగున్న ప్రతిదానికీ కర్తను నేనా




2, నవంబర్ 2013, శనివారం

అవునా ? - 5




నీవో అనంతకాలప్రవాహానివి
నేనా మహాప్రవాహపు కెరటాన్ని
నీ వెలా ఉండగలవు నన్ను విడిచి
నే నెలా ఉండగలను నిన్ను విడిచి




1, నవంబర్ 2013, శుక్రవారం

ఏమి నీతిమంతుడ వయ్య


  

ఏమి నీతిమంతుడ వయ్య యిటు నను విడిచేవు
తామసంపు బుధ్ధుల మధ్య దయమాలి నీవు



అడిగిన వారి కెల్ల నప్పు డభయ మిచ్చినావు  
పుడమి నిండె నీదు కీర్తి పున్నమిశశి వెలుగై
నడుమ నేమి వచ్చె నయ్య  నాకిట్లు చేయగ
బడలి యున్నావో రామభధ్ర నీవు నేడు  
॥ఏమి॥


అప్పుడెప్పుడో రేగి యసురుల జంపినావు
గొప్పగా నీ యవని మీద కొలువు దీరి నావు
ఇప్పు డసురు లగుచు నరు లెగురుచున్న జుచి
చప్పున దండించ రావు జానకీశ నేడు
॥ఏమి॥


నిన్ను నమ్ముకొన్న వారి వెన్నంటి యుండక
యెన్నడు లే నట్టి రీతి నింత కరుణమాని
యున్నా వే మయ్య  వేచి యున్నాను నీవే
చిన్నచూపు చూచిన నేమి చెప్పవచ్చు రామ
॥ఏమి॥

అవునా? - 4




ఇక్కడకు నన్ను పంపావు
ఒక్కమాట చెప్పావుకావు
అక్కడ నువ్వు కూర్చున్నావు
ఒక్కమాట వినిపించుకోవు