24, నవంబర్ 2013, ఆదివారం

అదే పనిగ రామరసాయనము గ్రోలరే





అదే పనిగ రామరసాయనము గ్రోలరే ప్ర

హ్లదనారదాదుల వలె యాడి పాడరే



పామరులను ఋషుల జేయు రామమంత్రము సీ

తామహాసాధ్వి మదిని దలచు మంత్రము

కామక్రోధసర్పములను కట్టు మంత్రము మీ

కామిత మగు మోక్ష మిచ్చి కాచు మంత్రము

రామనామరసాయనము తాము గ్రోలరే

రామమంత్రజపము చేసి రాణకెక్కరే



సదాముదావహము రామచంద్ర ధ్యానము సం

పదలు విరుగకాయు పాదు రామధ్యానము

సదాసదాశివుడు ప్రీతి సలుపు రామధ్యానము ఆ

పదల నుండి కాచు నట్టి భవ్యధ్యానము

రామనామరసాయనము తాముగ్రోలరే

రామధ్యానరక్తు లగుచు రాణకెక్కరే



విమలవేదాంతవేద్య రామతత్త్వము చి

త్తమున ప్రకాశింప జేయు విమలౌషధము

కుమతుల కిది దొరుక దండి కోరి సుజనులు ని

త్యమును గ్రోలు చుండు నట్టి యమృతౌషధము

రామనామరసాయనము తాము గ్రోలరే

రామతత్త్వ మెఱిగి మీరు రాణకెక్కరే




(ఈ కీర్తన సృజన పత్రిక నవంవరు 2013 సంచికలో ప్రచురించబడింది)


2 కామెంట్‌లు:


  1. రామ నామ రసమును గురించి త్యాగరాజ స్వామీ అనంగ విని ఉన్నాము - ఇదేమి రసాయనము శ్యామలీయం స్వామి వారూ ! అంతా కాల మహిమ !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబీగారూ, దయచేసి చూడండి:

    రామరసాయన తుమ్హారే పాసా
    సాదర తుమ రఘుపతికే దాసా
    ............................. (హనుమాన్ చాలీసా)

    రామరసాయన రుచియను సవియుత
    రామ సేవెయలి ఇరువను నిరత
    ................................ (హనుమాన్ చాలీసా (కన్నడం))

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.