23, నవంబర్ 2013, శనివారం

భద్రాచలం విషయంలో సీమాంధ్రులకు విజ్ఞప్తి.

నేడు మాన్య కవిపుంగవులు శ్రీ గుండు మధుసూదనులవారు మావి మావి యనంగనె మీవి యగునె "నోరు మూయుఁడు! మాటలు మీఱఁ బోక, పరువు దక్కించుకొనుఁడయ్య పలుకుఁ దక్కి" యని నిందాపూర్వకముగా బహుతీవ్రస్వరముతో కవిత్వము వ్రాయుట జరిగినది.  వారి భావన వారిది.  వారిట్టి ధోరణిలో వ్రాయుట క్రొత్తగాదు.  దానికి సీమాంద్రులు నొచ్చుకొన బనిలేదు.  నొచ్చుకొని ప్రయోజనమును లేదు.  సాటి తెలుగువారి  మనోభావముల నవమానపరచుటలో గుండువారికి వినోదము కలుగవచ్చును.  కాని గాయపడిన సీమాంధ్రులకు కొన్ని స్వాంతన వచనములను చెప్పబూనుట తప్పని సరియని భావించి కొంత వ్రాయవలసి వచ్చుచున్నది.  ఈ వ్యాసములో ఏ పక్షము వారిని గాని యధిక్షేపించు కార్యక్రమము లేవియును లేవు.  ఎవరైన భుజములు తడవుకొనట తటస్థించినచో దానికి నేను చేయగలుగునది కూడ లేదు.

అయ్యా అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుండైన శ్రీహరిచే నమరించబడిన  సమస్త ప్రపంచంబు నందు గల యశేషశ్రేష్ఠ ప్రాంతవస్తుజనాదికంబును కేవలము తెలంగాణమువారి యాజ్ఞకును హక్కుభుక్తంబులకును లోనుగా వలసినవియే గాని తదన్యంబులు గానేరవు.  తెలంగాణమువారు తమకు నిరుపయోగంబని భావించి విసర్జించి యన్యులకు కృపతో నాజ్ఞ శాయించి యనుగ్రహించినట్టి ప్రాంతవస్తువిశేషంబులు మాత్రము తెలంగాణేతరప్రాంతీయులకు వినయపురస్సరంబుగా స్వీకరణయోగ్యంబులై యున్నవి.  ఈ విషయంబునందు తెలంగాణేతర ప్రాంతవాసులు నిరుపయోగమైన వాదనలకు దిగరాదని విజ్ఞప్తి.

నేడు కాలము తమ కనుకూలంబుగా వర్తించు చున్న దని తెలంగాణము వారలు మిక్కిలి సంతోషముతో నున్న పరిస్థితిలో నితరులు వృధావాదంబులతో తెలంగాణాప్రజలకుగాని తెలంగాణాప్రాంతనాయకులకు గాని క్రోధవిచారంబులను కల్పించు వాక్క్రియావ్యవసాయంబులకు పాల్పడరాదు.  అట్లుపాల్పడియును కార్యంబు లేదు గావున తెలంగాణేతరులు ప్రాప్తకాలజ్ఞులై పరమేశ్వరానుగ్రహంబునకు వేచి యుండవలసినదిగా తెలియగలరని ఆశించుచున్నాను.

మన విచిత్రప్రజాస్వామ్యనామకకాంగ్రేసుపాలనావ్యవస్థావిశేషవిజ్ఞతాకారణముగా కాంగ్రేసువారి స్వప్రయోజనమే దేశప్రయోజనము గాన, వారు దొరతనములోనుండి శాయించిన శాయించుచున్న మరియును శాయించగల సమస్తమైన శాసనంబులచేత బధ్ధులైన దేశప్రజలకు పరమేశ్వరానుగ్రహంబు దప్ప విమోక్షణావకాశము గలుగు నుపాయంబు మృగ్యంబు.  ప్రస్తుత మా కాంగ్రేసుదొరతనము వారలీ  ఆంధ్రప్రదేశంబు నుండి తెలంగాణమును విడదీసి ప్రత్యేక మగు రాష్ట్రంబుగా నేర్పరచుట యందే తమకు విశేషంబగు ప్రయోజనంబు సంఘటిల్లు నని భావించి తదనుగుణంబులగు చర్యలయందు  నిమగ్నులై యున్నారు కావున తత్తద్విషయంబులను గూర్చి ప్రశ్నించుట దుస్సాహసముగా భావించబడు చున్నది.

ఇట్టి తరుణమందు న్యాయాన్యాయంబులను గురించి గాని ధర్మాధర్మంబులను గురించి గాని యుభయప్రాంతంబులందు వసించు చున్న ప్రజలకు కాలక్రమంబున వాటిల్ల గల కష్టనష్టంబులను గురించి గాని విశాలదేశప్రయోజనంబులకు భవిష్యమందు సూచితమగు చున్న ప్రమాదంబులను గురించి గాని కాంగ్రేసువారితో గాని ఆనందడోలికలలో దేలియాడు చున్న  తెలంగాణము వారికి గాని వివరించి విన్నవించి వాదించి యుపయోగము లేదు.  కాంగ్రేసు దొరతనము వారికి  ఆసన్నవిపదోల్లంఘనాప్రయోజనకారియును సార్ధకనామధేయుడైన రాహులుని పట్టాభిషేకమునకు తోడ్పడునదియును నై యున్న కార్యమే ముఖ్యము గాని కించిద్విషయంబులైన దేశప్రయోజనాదులు కావు. తెలంగాణామువారికి వారి మనోభీష్టము నెఱవేరి తెలంగాణము ప్రత్యేకరాష్ట్రముగా నావిర్భవించుటే ముఖ్యము గాని దానివలన నితరులకు గలగు వెతలతో గాని దేశప్రయోజనము వంటి  యల్పవిషయముతో గాని యిసుమంతైననను పని లేదు.  పని యుండవలయు నని భావించుట అమాయకత్వము. అనగా రాజకీయముల తీరు దెన్నులను గ్రహించ లేక పోవుట.  దీనిని కాంగ్రేసు దొరతనము వారు దుస్సాహసుముగా పరిగణించి శిక్షింతురు మరియును తెలంగాణమువారు దుష్టత్వముగా పరిగణించి  క్రోధపరవశులై యీసడించి దూషించి శపించి పట్టి పల్లార్చగలరు. కావున తస్మాత్ జాగ్రత జాగ్రత యని తెలియ జేయడమైనది.

ఇది యంతయును యావద్దేశవాసులైన తెలుగువారును బాగుగా గ్రహించి కాంగ్రేసు దొరతనము వారితో గాని తెలంగాణము వారితో గాని యీషణ్మాత్రంబును విబేధించక వారి కోరికమేరకు వర్తించుట కాలోచితమైన కార్యము. ఈ తెలుగుగడ్డను నేటి దనుక నెందరో పరాయివారు పాలించలేదా మరియును ఖండఖండములుగా విభజించి పాలించలేదా యని యూరడిల్ల వలసినది. ఈ విషయములో కాంగ్రేసుదొరతనము వారి యొద్ద పెద్దపాలేర్లుగా పనిచేయుచు హస్తినాపురవాస్తవ్యులై చెలంగుచున్న మన కేంద్రమంత్రులు మిగుల బుధ్ధిమంతులై యున్నట్లు తోచుచున్నదన్న నతిశయోక్తి యించుకయును లేదు కదా. వారు సేవాధర్మపరాయణులై తెలుగు జాతిలో కొందరు ప్రాప్తకాలజ్ఞులు నేటికిని కలరని చాటుట మిక్కిలి ముదావహము మరియు తెలుగుజాతి యని యొకటి నిజముగా నున్నచో దానికి నిశ్చయముగ గర్వకారణము.

కాల మన్నది  యొకే తీరుగా నుండదని మనకు తెలియని విషయము కాదు.  చక్రనేమిక్రమముగా  నుండును గదా దాని విధానము.  నీచైర్గచ్ఛత్యుపరి చ దశా చక్రనేమి క్రమేణ యనియును సుఖం దుఃఖం భ్రమత్యేవ చక్రనేమి క్రమేణ చ  యనియును గదా వినబడు చున్నది.  నే డొకరికి మంచి రోజు వచ్చిన రేపు మరొకరికి రావచ్చును.  ఇంత సామాన్యమైన దానికి  కాలబలగర్వితులు కన్నుమిన్ను గానక సాటివారిని  విషముఖులని నిందించుచుటయును నోళులు మూసుకొమ్మని దూషించుటయును కేవలము పిల్ల చేష్టలు. కాని కాలవంచితులీ మాటలు పడక తీరదు కదా.  పోనిం డిట్లు పడ్డ వారందరును చెడ్డవారు కాదనెడు సామెతను గురుతు చేసుకొని వారు దురపిల్లుట మాని యూరడిల్లక తీరదు.  ఏ పాలనమునుండి ఏ ప్రాంత మెప్పుడు జారిపోవునో మరల నే పాలనములోని కే ప్రాంతము వచ్చి కలయు చుండునో యన్న విషయమును గూర్చి వ్యగ్రత నిరర్థకము.  అంతయు కాలము చేతులో నున్న వ్యవహారము.  మానావమానములు కాలము చేతనే కలుగుచున్నవి కాని వ్యక్తుల ప్రయోజకత్వగరిమావిన్యాస మందు శూన్యమని బలి చక్రవర్తి యింద్రునకు చేసిన బోధను స్ఫురణకు దెచ్చుకొన వలయిను సుమా.

నేడు తెలంగాణావారి దృష్టిలో భద్రాద్రీశుడు తెలంగాణపు నవాబుల యేలుబడి కొకప్పుడు లోనై యుండిన కారణము చేత పునర్దాస్యయోగ్యుడై నాడు. శాంతం‌ పాపమ్‌.  తెలంగాణమువారి దృష్టిలో నిది భద్రాద్రిరామచంద్రునకు విడుదల ప్రసాదించి రక్షించుట కావచ్చును కదా.  కానిండు దానికేమి.  కట్టబెట్టువారు కలిగినచో కాశీక్షేత్రంబును తెలంగాణావారిదే కావచ్చును.  శక్తి కలిగినచో కాలబలము గలవార లితరుల యూళ్ళలో నెండయు వెన్నెలయును గూడ కాయరాదని శాసింతురే కదా.  వృధా విచారము మాని యోచించవలయును.  రామాలయమను నొక కట్టడము తెలంగాణములోనికి వచ్చినంత మాత్రము చేత శ్రీరాముడు తెలంగాణవారి కట్టుబానిస కాబోడు కదా యని చక్కగా గ్రహించి తెలంగాణాప్రాంతవాసులు కాని వారును నిర్విచారముగా నుండ వచ్చును.  విజ్ఞులైన వారు కాలగమనంబుచే గలుగు వింతలకు చింతించక జరుగుచున్నది  నిర్వికారులై సాక్షిమాత్రులై గమనించు చుందురు. మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః అని గీతాకారుడు చెప్పినట్లుగా నుండుటయే తెలుగువారికి కర్తవ్యము.  ముఖ్యముగా సీమాంధ్రప్రాంతవాసులైన తెలుగువారికి కాలము ప్రసాదించిన కర్తవ్యము.  శుభం భూయాత్.