31, జులై 2017, సోమవారం

ప్రబంధాల్లో ప్రాసయతి ప్రయోగాలు - 2

ఇప్పుడు ఈ పరిశీలనలో రెండవ భాగం మొదలు పెడదాం.

తెలుగులో పంచకావ్యాలని పేరుపడ్డవి కొన్ని ప్రబంధాలున్నాయి. అవి మనుచరిత్రము, వసుచరిత్రము, ఆముక్తమాల్యద, పాండురంగమాహాత్మ్యము, పారిజాతాపహరణము అనేవి.

వరుసగా వీలైనన్ని ప్రబంధాలను చూడాలని అనుకుంటున్నాం‌ కదా. అందులో ఈ‌పంచకావ్యాలనూ‌ ముందుగా చూదాం. ఇప్పటికే మను, వసు చరిత్రములను చూడటం‌ జరిగింది.

ఈ‌భాగంలో ఆముక్తమాల్యదను పరిశీలిద్దాం.

అన్నట్లు ఇప్పటిదాకా ఈ ఐదురోజుల్లోనూ‌ కలిపి మొదటిభాగాన్ని చదివిన వారి సంఖ్య 46. ఇది ఎక్కువంటే ఎక్కువ, తక్కువంటే తక్కువ.  మరొక నిరుత్సాహకర విషయం ఏమిటంటే మొదటి ఇరవైనాలుగ్గంటల్లోనే 35 మంది చదువగా మిగిలిన నాలుగురోజుల్లోనూ‌ పదకొండు మంది చదివారు! బాగుంది కదా. ఒకరోజులో నా టపాకు రమారమి ఇరవైమంది దాకా చదువరులు వస్తున్నారు. అందుచేత ఒకరకంగా ఒకరోజులో ముఫైయైదు అంటే ఎక్కువే. ఇకపోతే ఒక సాహిత్యప్రక్రియకు సంబంధించిన వ్యాసానికి కేవలం నలభైయారుమంది చదువరులు రావటం ఒకింత నిరుత్సాహం‌ కలిగించేదే మరి.  అన్నట్లు శంకరయ్యగారు దయతో తమబ్లాగులో వ్యాఖ్యానిస్తూ మిగిలిన కవిమిత్రులను కూడా చదువమని సూచించిన సంగతిని కూడా అనుసంధానం చేసుకొంటే ప్రజలకు ఛందస్సంబంధి విషయాలపై ఉన్న ఆసక్తి చక్కగా వెల్లడవుతున్నది కదా అనుకుంటున్నాను.  ఇక విషయానికి వస్తున్నాను.

ఆముక్తమాల్యద.
ఆము. ౧.౩ పిండీకృతాంగ భీతాండజములు
ఆము. ౧. ౩ ధృతకులాయార్థ ఖండితసమిల్లవరూప
ఆము. ౧.౩ చరణాంతిక భ్రమ త్తరువరములు
ఆము. ౧.౩ దుందుభీకృత మేరు మందరములు
ఆము. ౧.౧౨ నీలమేఘముడాలు డీలు సేయఁగఁ జాలు
ఆము. ౧.౧౨ ఆయతంబగు కన్ను దోయితోడ
ఆము. ౧.౧౨ పులుఁగురాయనిచట్టుపలవన్నె నొరవెట్టు
ఆము. ౧.౧౨ హొంబట్టు జిఁగురెంటెంబు తోడ
ఆము. ౧.౧౨ లేములుడిపెడు లేఁజూపు లేమతోడఁ
ఆము. ౧.౧౩ రసికు లౌ నన మదాలసచరిత్ర
ఆము. ౧.౧౩ భావధ్వనివ్యంగ్య సేవధి గాఁగఁ జె
ఆము. ౧.౧౩ శ్రుతిపురాణోపసంహిత లేర్చి కూర్చితి
ఆము. ౧.౧౭ పొత్త మిటు సేయ నీ కుత్తరోత్తరాభి
ఆము. ౧.౧౯ అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాఁడు
ఆము. ౧.౧౯ పుట్టు కామని లేని మెట్టపంట
ఆము. ౧.౧౯ ఎవ్వాడు తొగకన్నె నవ్వఁజేయు
ఆము. ౧.౧౯ వేవెలుంగుల దొరజోడు రేవెలుంగు
ఆము. ౧.౨౭ వనజేక్షణామనోధన పశ్యతోహరుం(డు)
ఆము. ౧.౨౭ మార్జితశ్రీవినిర్జిత నిర్జరాల(య)
ఆము. ౧.౩౦ అంభోరివసన విశ్వంభరావలయంబు
ఆము. ౧.౩౦ కకుబంత నిఖిల రాణ్ణికరంబుఁ జరణ మం(జీర)
ఆము ౧.౩౪ (భూమి)భృత్కటకం బెల్ల నెత్తువడియె యతిభంగం.
ఆము. ౧.౩౪ చారుసత్త్వాఢ్య యీశ్వరనారసింహ
ఆము. ౧.౩౪ పెంపుతో నీవు ధాత్రిఁ‌ బాలింపఁ గాను
ఆము. ౧.౩౬ తొలుదొల్త నుదయాద్రిశిలఁ దాఁకి కెరలు నీ
ఆము. ౧.౩౬ కోన బిట్టేర్చెఁ గొట్టానఁ దగిలెఁ
ఆము. ౧.౩౬ అవుల నా పొట్నూర రవులుకొనియె
ఆము. ౧.౩౯ తను భృశ శ్రాంతవేష్టన లగ్నబర్హి బ(ర్హంబు)
ఆము. ౧.౩౯ గోప వేషంబు సెడి తొంటి భూపవేష
ఆము. ౧.౫౯ (అం)జలికి నింద్రుండు నక్కొలువుఁ గోర
ఆము. ౧.౫౯ గవర లుంకించి వ్రేయఁ గొప్పవియు నవలి
ఆము. ౧.౫౯ కరమున నమర్పఁ బైఁటలో మరుని బటువు
ఆము. ౧.౬౦ (ని)గ్గులు దేరఁ బసుపిడి జలకమాడ
ఆము. ౧.౬౦ ముదుక గాకుండఁ బయ్యెదలోనె గేలార్చి
ఆము ౧.౬౦ కలయఁ జంటను వెంటఁ గలప మలఁద
ఆము. ౧.౬౦ (ముత్తె)ములు రాల గరగరికలు వహింపఁ
ఆము. ౧.౬౦ పొలసిననె యెట్టి నరునైనఁ గులముఁ తెలియఁ
ఆము. ౧.౭౬ నునుఁ బోఁక పొత్తిఁ గుట్టిన దొప్పగమితోడ
ఆము. ౧.౭౬ శాల్యన్య సూపాజ్య కుల్యాబహువ్యంజ(న)
ఆము. ౧.౮౫ ఇత్తెరంగున నవ్వైష్ణవోత్తముండు
అము. ౧.౮౫ జాగరూకత దైర్ధిక భాగవతుల
ఆము. ౧.౮౫ అలయ కవి పెట్టి సంతుష్టి సలుపుచుండె
మొత్తం ౮౯ గద్యపద్యాలు.


పంచకావ్యాలలో మూడవదైన రాయలవారి ఆముక్తమాల్యదా ప్రబంధంలో ప్రథమాశ్వాసంలో ప్రాసయతి నిర్వహణ చూసాం.  ఇందులో‌ హ్రస్వదీర్ఘాలసంకీర్ణత కొద్ది తావుల్లో వచ్చింది.  అవి

ఆము. ౧.౩ పిండీకృతాంగ భీతాండజములు
ఆము. ౧.౧౭ పొత్త మిటు సేయ నీ కుత్తరోత్తరాభి
ఆము. ౧.౨౭ మార్జితశ్రీవినిర్జిత నిర్జరాల(య)
ఆము. ౧.౭౬ శాల్యన్య సూపాజ్య కుల్యాబహువ్యంజ(న)
ఆము. ౧.౮౫ ఇత్తెరంగున నవ్వైష్ణవోత్తముండు

ఈ నాలుగు సందర్భాల్లోనూ ప్రాసస్థానంలో ఉన్నది ద్విత్వాక్షరమో సంయుక్తాక్షరమో, బిందుపూర్వకాక్షరమో కావటం గమనార్హం. అటువంటి సందర్భాల్లో తత్పూర్వాక్షరం ఎలాగూ‌ గురువే అవుతున్నది. అంతవరకూ చాలని రాయలవారి ఉద్దేశమా అన్నది ఆలోచనీయం. ఐతే ఈవిషయంలో మరింత లోతుగా - అంటే - ఆముక్తమాల్యద లోని మరికొన్ని అధ్యాయాలను కూడా పరిశీలించిన తరువాతనే ఒక అభిప్రాయానికి రావటం సబబు అనుకుంటాను.

మరొక సంగతి.  ప్రాసాక్షరం బిందుపూర్వకం ఐనప్పుడు పై ఉదాహరణల్లో ప్రాసయతికూడా బిందుపూర్వకం కావటం గమనార్హం. ఆ సందర్భాలు క్రింద విడిగా చూపుతున్నాను.

ఆము. ౧.౩ పిండీకృతాంగ భీతాండజములు
ఆము. ౧.౩ దుందుభీకృత మేరు మందరములు
ఆము. ౧.౧౨ హొంబట్టు జిఁగురెంటెంబు తోడ
ఆము. ౧.౩౦ అంభోరివసన విశ్వంభరావలయంబు
ఆము. ౧.౩౪ పెంపుతో నీవు ధాత్రిఁ‌ బాలింపఁ గాను

ఈ విషయంలో కూడా ఏమైనా సంప్రదాయం ఉన్నదా అని కూడా చూదాం పనిలో పనిగా.


27, జులై 2017, గురువారం

ప్రబంధాల్లో ప్రాసయతి ప్రయోగాలు

కొద్ది రోజుల క్రిందట కంది శంకరయ్యగారు ఈబ్లాగులో ఒక వ్యాఖ్యను ఉంచారు. చదువరుల సౌలభ్యం కోసం దానిని ఇక్కడ చూపుతున్నాను.

"ప్రాసయతిలో ద్విత్వాక్షరమైన ప్రాసాక్షరానికి ముందు రెండు చోట్లా కేవల గురువుంటే చాలదు, అవి కచ్చితంగా దీర్ఘాలై ఉండాలన్న నియమం ఒక టున్నదని చాలామంది భావిస్తూ ఉన్నారు. కాని ఇది (నేను చూచిన) ఏ లక్షణ గ్రంథంలోను లేదు. గతంలో 'శంకరాభరణం' బ్లాగులో శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారు ఈ విషయాన్ని ప్రస్తావించినపుడు అది తప్పని నేను భారత, భాగవతాలలోని ఉదాహరణాలతో చూపాను. ఆ పోస్ట్ ఇప్పుడు దొరకలేదు. పోచిరాజు కామేశ్వర రావు గారిచ్చిన అప్పకవీయంలోని క్రింది పద్యాన్ని చూడండి.
ప్రాఙ్నగ సమానధృతి సుధా*రుఙ్నిభాస్య
స్రఙ్నిచయ సక్తకంఠ దా*వాగ్ని పాయి (స్రఙ్ని- వాగ్ని)
వాఙ్మనోహరనుత యస*దృఙ్మహాత్మ
దిఙ్మహితకీర్తి యర్జున*యుగ్మభేది (దిఙ్మ- యుగ్మ) - (అప్ప. 3-328)
అలాగే ఈ ఉదయం పైపైన కర్ణపర్వాన్ని పరిశీలించినపుడు క్రింది ఉదాహరణలు కనిపించాయి.
ధాత్రిఁ బాలింపు సుస్థితిఁ *బుత్రపౌత్ర (కర్ణ.౫౭)
దీప్తకాంచన రస*లిప్తమై చెలువొంద (కర్ణ. ౬౦)
పాండవు చాపంబు *ఖండించె నీకోడు...(కర్ణ. ౧౯౨)
ఉ।దీర్ణదర్పుఁడై కప్పె న*క్కర్ణుఁ డధిప (కర్ణ. ౨౦౫)
పై ఉదాహరణలను పరిశీలిస్తే ప్రాసయతిలో ప్రాసకు ముందున్న అక్షరం గురువైతే చాలు. దీర్ఘహ్రస్వాల పట్టింపు లేదని అర్థమౌతుంది."

శంకరయ్యగారికి నేను ఇచ్చిన సమాధానం కూడా ఇక్కడ చూపటం సముచితంగా ఉంటుంది.  "మీ అభిప్రాయం బహు సబబుగా ఉంది. అప్పకవీయంలో చాలానే కప్పదాట్లున్నట్లుగా ప్రతీతి. దాన్ని కొంచెం ప్రక్కన పెడదాం. కవిత్రయమూ ప్రబంధకవులూ ఎలా వాడారో చూడాలి. మీరిచ్చిన భారతోదాహరణలు బాగున్నాయి. ఐతే కవిత్రయంలో ఇటువంటి ప్రయోగాలు సకృత్తుగానే ఉన్నాయా విస్తృతంగా ఉన్నాయా అన్నది చూడాలి. అదే విధంగా ప్రబంధప్రయోగాలూ పరిశీలించాలి. ఐనా అంత అభ్యతరకరం కానప్పుడు వీలైనంతవరకూ పాటించుతూ అది ఒక చాదస్తంగా మాత్రం అవలంబించనక్కర లేదనుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ నియమం వలన కొంత శ్రావ్యత కలుగుతున్నదిగా భావించి పాటిస్తున్నాను. తెలుగు ఛందస్సుల్లో సంస్కృతఛందస్సుల్లోవలె అంతర్లీనమైన లయ అంటూ ఉండదు కాబట్టి దాన్ని ఇతరవిధాలుగా సముపార్జించవలసి ఉంటుంది. వాటిలో ఒకటి ప్రాసయతి కూడా - నిజానికి ప్రాసయతి ఇచ్చిన అందం తెలుగు పద్యాలకు అక్షరసామ్య మైత్రి అంతగా ఇవ్వటం లేదనే నా అభిప్రాయం. ఎందుకంటే అక్షరసామ్యమైత్రిలో ఉన్న కిట్టింపువ్యవహారం ప్రాసయతిలో లేక అది చాలా సహజమైన యతిమైత్రిగా విరాజిల్లుతోందని నా మతం. ఇప్పుడు మనం ఉందా లేదా అని వితర్కిస్తున్న నియమం ప్రాసయతికి అందాన్నిచ్చేదే - దీన్ని కొంచెం సడలించటం అభ్యంతరం కాదు కాని పాటించటం మరింత సొగసు. ఇప్పుడు నాకు మరొకటి తోస్తోంది. తెలుగు జానపదసాహిత్యంలో ప్రాసయతి చాలా సాధారణం అది ఈ నియమాన్ని సమర్థిస్తున్నదా లేదా అన్నది కూడా అవశ్యం పరిశీలనీయం.

లోగడ ఈనియమం గురించి తెలియక నేను ఇటువంటి ప్రయోగం నేను చేసినప్పుడు గురువర్యులు నేమాని రామజోగిసన్యాసిరావుగారు నాకీ నియమం గురించి తెలియజేసారు.
"

ఐతే ఈ విషయంలో కొంత లఘుపరిశీలన అవసరం అనిపించిది.  వివిధప్రబంధాల్లో  మనమహాకవులు ప్రాసయతిని ఎలావాడారో అన్నది స్థాలీపులాకన్యాయంగా పరిశీలిద్దాం. కొన్ని ప్రబంధాలు తీసుకొని వాటిలో ప్రథమాధ్యాయాలు మాత్రం పరిశీలిద్దాం. అన్నీ‌ ప్రథమాధ్యాయాలేనా అంటే అవును. పక్షపాతం‌ ఉందని అనుకోరాదు కదా ఎవరైనా? కావాలని నాకు నచ్చిన సిధ్ధాంతానికి అనుకూలంగా ఉండే కావ్యాలో అధ్యాయాలో తీసుకొని పాఠకులను తప్పుదారి పట్టించానన్న అనుమానం ఎవరికీ రాకూడదు కదా.

మనుచరిత్రము
1.5 రుచి కించిదంచిత శ్రుతుల నీన
1.5 ఇంగిలీకపు వింత రంగులీన
1.5 పుండరీకాసనమున కూర్చుండి మదికి
1.5 నించు వేడుక వీణవాయించు చెలువ
1.5 నలువరాణి మదాత్మలో వెలయుగాత
1.8 (భా)షగ నొనర్చి జగతిఁ బొగడు గనిన
1.8 నన్నపార్యు దిక్కనను గృతక్రతు శంభు
1.11 ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమా
1.11 అరిగాపు లెవ్వాని ఖరతరాసి
1.11 ఆపంచగౌడ ధాత్రీపదం బెవ్వాని
1.11 రాజపరమేశ బిరుద విభ్రాజి యెవ్వఁ(డు)
1.12 శరదిందు ముఖులు చామరము లిడగ
1.12 సామంతమండనోద్దామ మాణిక్యాంశు
1.12 మండలం బొరసి యీరెండ కాయ
1.12 మూరురాయరగండపెండారమణి మ(రీచి)
1.18 అనలాక్షు ఘనజటావనవాటి కెవ్వాడు
1.18 పుట్టు గానని మేని మెట్టపంట
1.18 ఎవ్వాడు దొగనన్నె నవ్వజేయు
1.18 వేవెలుంగుల దొరజోడు రేవెలుంగు
1.26 వనజేక్షణా మనోధన పశ్యతోహరుం(డు)
1.26 ఆర్జితశ్రీ వినిర్జిత నిర్జరాల(యేశ్వరుడు)
1.30 అంభోధివసన విశ్వంభరావలయంబుఁ
1.30 కకుబంత నిఖిలరాణ్ణికరంబుఁ జరణ మం(జీరంబు)
1.34 పెంపు మీఱంగ ధాత్రిఁ బాలింపుచుండ
1.37 తొలుదొల్త నుదయాత్రి శిలఁ దాఁకి తీండ్రించు
1.37 కోన బిట్టేర్చెఁ గొట్టానఁ దగిలెఁ
1.37 అవుల నా పొట్నూర రవులు కొనియె
1.42 వేదండ భయద శుండాదండ నిర్వాంత
1.42 శ్రమబుర్చురత్తురంగమ నాసికా గళ
1.42 (ఖే)లనములు దండఘట్టనలు గాఁగఁ
1.42 మూరురాయర గండాక వీరకృష్ణ
1.50 ముదిమది దప్పిన మొదటివేల్పు
1.50 బింకాన బిలిపింతు రంకమునకు
1.50 మునుసంచి మొదలిచ్చి మనుపదక్షు(లు)
1.52 పులుపు మధుకరాంగనలకుఁ బోలె
1.54 వరణాతరంగిణీ దరవికస్వర నూత్న
1.54 కమలకాషాయ గంధము వహించి
1.54 తతియు నుదికిన మడుఁగుదోవతులుఁ గొంచు
1.54 వచ్చు నింటికిఁ బ్రజ తన్ను మెచ్చి చూడ
1.59 మొగముతోలు కిరీటముగ ధరించి
1.59 ఐణేయమైన యొడ్డాణంబు లవణిచే
1.59 అక్కళించిన పొట్ట మక్కళించి
1.59 మిట్టయురమున నిడుయోగ పట్టె మెఱయఁ
1.59 చెవుల రుద్రాక్షపోగులు చవుకళింప
1.60 ఇష్టమృష్టాన్న కలన సంతుష్టుజేసె
1.66 దొడ్డిఁ బెట్టిన వేల్పుగిడ్డి కాఁపు
1.66 కడలేని మమృతంపు నడబావి సంసారి
1.66 సవిధమేరునగంబు భవనభర్త
1.69 కాన వేఁడెద ననిన న మ్మౌనివర్యుఁ (డు)
మొత్తం 83 పద్యాలు.

వసుచరిత్రము
1.2 సకలలోకాభివంధ్యకలాకలాపంబు
1.2 దొరయు నెమ్మోము చందురుని తోడ
1.2 గిరిమథనయత్నమున దోఁచు సిరి యశేష
1.6 ఘనఘనాఘనలక్ష్మి నెనయు కొ ప్పిరుగడ
1.6 ఇరువంకఁ కుండలిస్ఫురిత కర్ణ(ము)
1.6 ముడివోని మిన్కులీనెడు పేరు లిరుదెస
1.6 ఇరుదెస కమలబంధురకరంబు
1.6 ఇరుమేన రతిమనోహరవిభూతి
1.6 మగని సామేన నిలచిన యగతనూజ
1.8 ధరణి నెవ్వాడు దానవద్విరదదళన
1.9 బడి నాగమము లెల్ల నడపె నెవ్వఁ(డు)
1.15 (చామ)రములు వీవంగఁ బేరోలగమున నుండి
1.28 అతులిత శ్రుతిమార్గగతుల నెసఁగఁ
1.28 పరగు కఠినాద్రి జడలుఠజ్జరఠకమఠ
1.28 కుటిలతాసహభూసౌఖ్యఘటన భూరి
1.30 ఏరాజు భూరితేజోరుణాలోకంబు
1.30 లోకంబు తమము నిరాకరించు
1.30 ఏ ధన్యు బాహాధరాధరాభోగంబు
1.30 ఏ పుణ్యు నభిరూప రూపానుభావంబు
1.30 ఏ భవ్యు శుభకీర్తిశోభావిహారంబు
1.30 అనుపమస్వాంతు డాశ్రితవనవసంతు(డు)
1.30 (ని)శాంతుఁ డగు రామమేదినీ‌కాంతుఁ డలరు
1.34 వలయంబు చేకొని నిలువఁ డేని
1.34 శ్రుతిదూరభోగసక్తత విఱ్ఱవీఁగి తాఁ
1.34ఆర్య సత్కారకారి యౌదార్య విభవ
1.34 ధారియై మించు శ్రీరంగ‌శౌరి కెపుడు
1.36 తన కూర్మిఱేని నప్పుననె ముంచె
1.36 కమల యే నిశ్చల రమణు పేరెదకు మో(పై)
1.36 సతి యే యచండిక పతి జట్టుకూఁతురై
1.36 జగడాలు పచరించి సగము చేసెఁ
1.36 కీర్తి బలవృధ్ధి నిర్మలస్ఫూర్తు లొసఁగు
1.41 జగతి నీ మేటికని నృపుల్ వొగడ నెగడె
1.41 కాహళుఁడు తిమ్మవిభుఁ డాజిదోహలుండు
1.46 బిబ్బీలకు ముసుంగు లబ్బఁ జేసె
1.46 ఘనభేరికాధ్వనుల్ విని గుండియలు వ్రీల
1.46 వ్రాలు మల్కలకు గోలీలు సేసె
1.46 ఉడుగని విభ్రాంతి దడగాళ్ళు వడనిల్చు
1.46 జడధు లెల్లను గాలి నడలు సేసెఁ
1.46 అనుచు శిరముల దాల్తు రెవ్వని సమగ్ర
1.48 రతినిభ రామానుగతమైత్రిపై రోసి
1.48 సేతుకాశీతలాంతరఖ్యాత యశుఁడు
1.56 పలు చాపలములఁ బుట్టలు మెట్టఁ జనువారిఁ
1.56 తత్తరంబున గ్రుచ్చి యెత్తుకొనదు
1.56 కాంచదో విజయశ్రీల బెంచదో ప్ర(తాప)
1.58 పఱచునెడ శక్తిమఱచియు మఱవఁడయ్యెఁ
1.60 నలత నొందదు వినిర్మల సుధాధామ కో(పరి)
1.60 శ్రమము నొందదశేష కమలాకరాభోగ
1.62 ఘనశీధురక్తలోచన యుక్తిఁ గడ నుండు
1.62 నరకహేతుహిరణ్యహరణవృత్తిఁ‌ జరించు
1.63 పుట్టినింటికి మథనంబు మెట్టినింటి
1.63 అమితదోషాహతయుఁ గూర్చు కమలఁ దెగడి
1.65 అనుచు ధర నిందిరను భోజతనయ నార్య
1.68 బలునాహినుల మించు మలకల ఘననామ
1.68 కంబులు దూల మూలంబు లెత్తు
1.68 అనఘ తిరుమలరాయనందన సమిద్గ(భీర)
1.68 సాహసోదగ్రబిరుదవరాహమూర్తి
1.74 (అ)పారకీర్తిమతల్లి హారవల్లి
1.74 వారినిర్ఝరధార హీరరశన
1.74 అంగమున కెవ్వని చమూతురంగకోటి
1.76 బింకంపుసానుల నంపరావడి నెల
1.80 చెక్కునొక్కదె యంచు దిక్కరిగ్రామణి
1.80 అక్కుజేరదె యంచు రిక్కరాయ(డు)
1.80 కంటికబ్బదె యంచు దంటచిలువ
1.80 తన చెలిమి కాసపడ నొచ్చె మునికి వారిఁ
1.82 ముదిపన్నగములలో మొదటివాఁడు
1.82 తన యొంటిపంటిచేతనె యంటునాదికా(లము)
1.82 (కా)లము ఘోణి పాండురోమములవాఁడు
1.82 తన భుజాదండమున నుండఁ దనరుచుండు
1.82 భావజనిభుండు వేంకటక్ష్మావిభుండు
1.85 ఎంతకాలము మహాశాంతసంగతి దివ్య
1.85 ఎంతకాలము గిరుల్ సంతతాభ్యున్నతి
1.94 వరసుమనోభవ్యతరుల కావల మ(త్యలఘు)
1.94 అలఘుకలాపాలికలకు భరణి
1.94 సరిలేని తెలిముత్తె సరుల కొటారు క(ల్యాణ)
1.94 సురుచిరమణుల కాకరసీమ శ్రుతిహిత
1.94 సరసుల కారామసరణి శ్రీరంగగే(హ)
1.94 (వజ్ర)దంతురప్రాంతగంగా నిరంతరాగ్ర
1.98 అని వెన్కముందు జూడని కుమారు(లు)
1.98 అరిమెచ్చఁ గరములు నెరపని యిను లాల(మున)
1.98 అనయంబు నడకతప్పని గోత్రపతు లెప్పు(డును)
1.98 (ఎప్పు)డును సీదరములేని యనఘభోగు(లు)
1.107 అలరుఁ దొడలును మృదుపదంబులు నొనర్చి
1.109 చెలువ మాటితివేల కలువచాలదియుఁ గ(ప్ప)
1.116 తనదానధారాఖ్యవనధికి మిన్నేఱు
1.126 లలనాజనాపాంగ వలనా వస దనంగ
1.126 అసానిలవిలోల సాసవరసాల
1.126 (క)మలినీసుఖిత కోకకులధూక(ము)
1.26 అతికాంతసలతాంతలతికాంతర నితాంత
1.26 రతికాంతరణ తాంతసుతనుకాంత
1.126 భాసరము వొల్చు మధుమాసవాసరంబు
1.129 మును సుమనోరాగమున వసంతము సూపెఁ
1.129 మదనదేవోత్సవక్రీడఁ‌ బొదలు ననిన
1.126 వరులుఁ దరుములు విరిలయోవరుల వరలు
1.134 ఏపారు పొదరిండ్ల నాపాటలాశోక
1.134 దీపార్చిఁ గనకకలాప మరసె
1.134 సాలావలులు దాఁటి యేలాలతావార
1.134 నానామధురనవ్యగానామృతము మెచ్చి
1.134 శంకారహితధీరహుంకారశుకభటా
1.134 ఒలికిన రసంబు లురులిన ఫలము లధిపు
1.134 మ్రోలనిడి పల్కి రుద్యాలపాలు రపుడు
1.134 అలరె విరులెల్ల పూపలు దలలు సూపెఁ
1.134 ఇమ్ములై మరుహజారమ్ములై పొదలుండ
1.134 తెప్పలై నెత్తావి కుప్పలై పుప్పొళ్ళు(రుల)
1.134 (ఉ)రుల గందవొడి త్రోవఁ జిలుకవలదు
1.134 మొత్తమై మారుతాయత్తమై గంబూర(ము)
1.134 ఎగయ వితానముల్ బిగియవలదు
1.144 తగుపచ్చపని నిగనిగనినొగలు
1.144 ధట్టంబు మాడ్కిఁ గెంబట్టుపరపు
1.144 పగడాల కంబాల జిగిమించుపుష్యరా(గపు)
1.149 నృపమౌళిభవసువర్ణపరాగములు సువ(ర్ణ)
1.149 లలితమాగధలోక కలకంఠగానంబు
1.149 కలకంఠగానంబు నలిమి కొనియె
1.149 తతవాదకసమీరహతకిన్నరీరుతుల్
1.151 కీరరాజీకృతసజీవతోరణములుఁ
1.151 పొంగు నెలమావి కురుజు లభంగ నవఫ(లా)
1.158 కీరభాషలఁ‌ గర్ణికారశాఖ
1.158 వన్నెగా నగియె లేఁబొన్న తీఁగె
1.158 సురభిళస్వసనంబు నెరపె సింధుకవల్లి
1.158 సన్నుతాచారముల కడి సన్నకతన
మొత్తం 166 పద్యాలు.

ఇప్పటికి మనుచరిత్రము, వసుచరిత్రము అనే రెండు ప్రబంధాలనుండి ప్రథమాధ్యాయాలు పరిశీలించాం. మనుచరిత్రం ప్రథమాధ్యాయంలో ఒక సందర్భంలోనూ వసుచరిత్రం ప్రథమాధ్యాయంలో రెండుసందర్భాల్లోనూ తప్ప, మిగిలిన అన్నిసందర్భాల్లోనూ‌ ప్రాసయతిని వాడిన చోట్ల ప్రాసపూర్వాక్షరదైర్ఘ్యాన్ని పరిగణనలోనికి తీసుకోవటం కనిపిస్తున్నది. ఈపరిగణన తప్పిన స్వల్పసంఘటనలను ఎరుపురంగు అద్ది చూపాను. వసుచరిత్రలో ఒక సందర్భంలో ల-ళ ప్రాసకనిపిస్తే దానికీ రంగువేసాను!

లక్షణకారులు ప్రాసపూర్వాక్షరదైర్ఘ్యాన్ని పరిగణనలోనికి తీసుకోవటం అనే విషయాన్ని ఎందుకు అక్షరబధ్ధం చేయలేదో తెలియదు.

ఐనా కేవలం రెండుప్రబంధాలను అందులోనూ‌ చెరొక అధ్యాయమూ చూసి ఎలా నిర్ణయిస్తారూ అన్న అభ్యంతరాన్ని అవశ్యం ఆమోదించవలసిందే.

ఇప్పటికే టపా దీర్ఘంగా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడితో ఆపుదాం. మరొక టపాలో మరొక రెండు ప్రబంధాలనూ పరిశీలిద్దాం. క్రమంగా వీలైనన్ని ప్రబంధాలను గాలించిన తరువాతే ఒక నిర్ణయానికి రావచ్చును. ఇబ్బంది లేదు.

25, జులై 2017, మంగళవారం

పొరబడినాను పుడమి జేరితిని

పొరబడినాను పుడమి జేరితిని
నరునివేషం బిది నాకేలా రామ

పొలుపుగ నీతోకలసి యుందు దు
ర్బలచిత్తుడనై  పడితి నిచ్చట
యిల నీసన్నిధివలె నుండేనా
తెలిసివచ్చెను నా తెలిమిలేమియే

నీపద సన్నిధి నెలకొని యుండక
యాపద కేటికి నాత్రపడితిని
కాపగు నీదయ కడబెటట్టితిని
పాపినైతి నన్ను కోపగించకు

ఇందున నీకుట్ర యేముండునులే
ఎందుకు  చెడితినో యేమిదోసమో
పొందిన చేదెల్ల పోగొట్టవె చే
యంది కావవె ఓ అనురాగమూర్తి



ఎన్నెన్ని జన్మంబు లెత్తెనో వీడు

ఎన్నెన్ని జన్మంబు లెత్తెనో వీడు
వెన్నంటి నీవుండ వేడుకొను వాడు

తన్ను తానెరుగునో తానెరుగడో కాని
నిన్ను మరువక యుండు నియతి కలవాడు
మన్నించు నీవుండ మరియింక కొరత
యున్నదా యేమి యనుచున్నట్టి వాడు

ఏమాయ లోకాల నెల్ల ముంచెత్తునో
యామాయ నీలోన నడగు ననువాడు
భూమి నేరూపమును పొంది వీడున్నను
తామసించక నిను తవిలియుండెడువాడు

ఏనాడు నీకన్య మెంచకుండెడు వాడు
కానరాని నీకై కలలెన్నొ కనువాడు
తాను నీవాడనని తలచుచుండెడి వాడు
ఏ నాటి వాడొ యీ జీవుడు శ్రీరామ



23, జులై 2017, ఆదివారం

ఎంత చెడినను నీతో కొంతపోలిక కలదు


ఎంత చెడినను నీతో కొంతపోలిక కలదు
సుంత విచారించి చూడవయ్యా రామ

చేరి భక్తులు నీకు చేర్చినవియే కాక
పేరేమియును లేని పెద్దవాడవు నీవు
సారెకు ధరణిపై జనియించితిని కాన
పేరు లేని నాకు వేలాది పేర్లాయె

హృదయమిచ్చిన వారి యెదుట నుందువు గాన
ఇది నీకు నెల వనుచు నేరీతి జెప్పుదు
పదివేల చోటుల నుదయించితి గాన
యుదదిమేఖల నన్ని యూళ్ళు నావాయె

కోరుజీవుని యూహ కొలది రూపమె కాని
యూరు పేరేనా నీ కొకరూపమును లేదు
ప్రారబ్ధమున జేసి పలురూపులగు గాని
యారయ నొకరూప మనగ నాకును లేదు


21, జులై 2017, శుక్రవారం

నీ యలసట తీరునటుల ..


హాయిగా మదీయహృదయహర్మ్య మందు విడిదిసేసి
నీ యలసట తీరునటుల నిలువుమా దయాంబురాశి

మూడులోకముల లోని వాడవాడ లందు జనుల
గోడువినుచు తిరుగుచుండు వాడవైతివే రామ
చూడు మెంత అలసితివో నేడే విచ్చేయవయ్య
గూడుకట్టినట్టి వేసట వీడుదాక విశ్రమించ

కొంతతడవు విశ్రమించ కొంపమునిగి పోవునా
యెంతమంది లేరు తమ వంతుసేవ చేయగా
సుంతసేపు లోకావనశుభకార్యము తీర్చువార
లంతటి నీ పరివారుల కథికారము లిచ్చి రమ్ము

ఆవియివి నిన్నడుగదలచి యరుగుదెంచు మందునా
కవనంబులు వినిపించ గలుగుదునని తలతునా
భువనంబులు నన్ను చాల పొగడునని పిలుతునా
అవసరమిది నీకు వచ్చి హాయిగా విశ్రాంతి గొనుము


20, జులై 2017, గురువారం

నువ్వూ నేనూ - 7


కనరాని నీ కొఱకై కలలుగనుట మానేనా
వెనుకటి మనయింటి జాడ వెదుకుట మానేనా

వినరాని మాటలెన్నో విన్నానే నినుగూర్చి
నను నీవు నేలపై మనవిడచినా వంటూ
పనిగొని అది లీల అని చాటుకొనే వంటూ
మనమిద్దర మొకటేగా నను నీవు విడచేవా

నిందకూడ విన్నానే నీవు పెద్దదొంగ వంటూ
ఎందెందో దాగుంటూ ఏనాడూ చిక్కవంటూ
ఎందుకిలా చేసేవో ఎవరికైన తెలిసేనా
ముందటి మనస్నేహమే మొనసి నాకు తెలిపేను

తెలిసి తెలియని తత్త్వమవై దాగుట నీక్రీడ
తెలియాలని తహతహతో తిరుగుట నా క్రీడ
తెలియునిది నీకు నాకు తెలియదు జగ మీక్రీడ
కలసితినా నిన్ను రామ నిలుచిపోవు నీక్రీడ


దేవుడికో విన్నపం

నీకు మ్రొక్కుట కొఱకునై నాకు రెండు
హస్తములు కల్గె దేవుడా యందువలన
చెడ్డ వారల కెన్నడు చేతులెత్తి
వందనము చేయు దుర్దశ పట్టనీకు

నీవిభూతులు మీఱిన తావులందు
సంచరించగ కలిగె నీ చరణయుగళి
దుష్టులుండెడు చోటులు త్రొక్కకుండ
వాని నేవేళ రక్షించ వయ్య నీవు

నిన్ను చూచుట కొఱకునై నాకు రెండు
కన్నులివి కల్గె దేవుడా కనుక నీవు
కలుష మతులను కనులలో కనులు పెట్టి
చూచు దుర్దశ గలుగక కాచవయ్య

నీ కథామృతమాలింప నాకు గల్గె
శ్రవణములు రెండు దేవుడా చవుకబారు
సంగతులు విన నెప్పు‌డు పొంగులెత్తు
నట్టి దుర్దశ రాకుండ నరయవయ్య

సర్వదా నీదు నామాళి జపము చేయ
కలిగె దేవుడా యీ జిహ్వ కనుక నీవు
పనికిరానట్టి మాటలు పలుకు నట్టి
బేల తనమది రానీక యేల వయ్య

నీకు తగినట్టి దివ్య మందిరము కాగ
నొప్పి యున్నది మనసిది యుర్విజనులు
దాని దరిజేరు నట్టి దుర్దశను నాకు
పట్టనీయక రక్షించ వలయు నీవు

దేహమా యిది నీదయా దృష్టి వలన
కలిగె నిది నిన్ను సేవింప కాంక్షచేయు
నితరులను కొల్వ దిది దీని వ్రతము గాన
దేవుడా యది నెఱవేర నీవె నీవు

19, జులై 2017, బుధవారం

నేను - 6


నిజమా ఆ నిజమేదో నీవు నే నెఱుగుదుము
ఋజువులు కావలయునా కృపతో నను బ్రోవుము

నేను నీవను మాట యేనాడు కలిగెనో
ఆనాడే నీవు నేను నయ్యో యెడమైతిమి
కానరాని దైవమవై కదలిపోతివి నీవు
దీనుడనై నీకొఱకై తిరుగుచుంటిని నేను

వెలుగుచీకటుల మధ్య వెదకుదునో లేదో
యిలను స్వర్గమును గాలించుదునో లేదో
కలలలో నిన్నే నే పలవరింతునొ లేదో
తెలియరాని నీకే తెలియును నిజమేదో

నేను నేనను వీని నీవే కలిగించితివో
మానక యే మాయయో మరి నన్ను చేసెనో
కాని మ్మీ దూరమే కఠినమైన నిజము
పూనుకొని నీవే నను పొదువుకొనుము రామ


17, జులై 2017, సోమవారం

నేను - 5


మాటలాడ వలెను నీతో మరల నొక్కసారి రావో
నాటకాలు కట్టిపెట్టి నన్ను కలియ నిటకు రావో

నా గాటపు చింత నీకు నమ్మకము కాదేమీ
దాగియుండి నీవు నన్ను దయచూచెడి దేమీ
బాగున్నది నీవైఖరి పంతగించ కతమేమీ
నా గోడును వినుటకైన నన్ను కలియ రావేమీ

ఉదితమైన అహమిక న న్నుర్విపైకి తేనేలా
అదిగో ఆనాడు నన్ను వదలి నీవు పోనేలా
ఇదిగో ఈనాటి దాక నెదురు చూపు నాకేలా
సదయా యికనైన నీవు జాలి చూపి రావేలా

నీవిభూతి కాని దొకటి నిఖిలవిశ్వమున లేదు
నీ వినోదమే సృష్టి నీవు నేను వేఱు కాదు
జీవుడ నని నాటకాలు చేయపాడి కాదు కాదు
రావయ్య రామచంద్ర రమ్ము మిన్న కుండరాదు


4, జులై 2017, మంగళవారం

నల్లనయ్య ఎందుకు నలుపు?

ఈరోజున నీ కెలా గంటు కొనె నల్పు నీరజాక్ష ! అంటూ లక్కాకుల వేంకట రాజారావు గారు తమ సుజన - సృజన బ్లాగులో ఒక మంచి ప్రశ్న వేసారు.

అంతటా తెలుపే నీ చుట్టూ - కాని నీకే ఎలా వచ్చిందీ నలుపూ అంటూ ఆయన ఒక మంచి పద్యం వ్రాసారు.
సమగ్రత కోసం ఆయన పద్యాన్నీ ఇక్కడ ఉటంకిస్తున్నాను.

దేవకీ వసుదేవు దేహచాయలు తెల్పు
నంద యశోద వర్ణాలు తెలుపు
రాధికా రమణీయ రాగబంధము తెల్పు
రుక్మిణీ భక్తిస్థ రుచియు తెలుపు
తగ రతీ మన్మథ తాదాత్మ్యములు తెల్పు
మునుల తపో ఙ్ఞాన ములును తెలుపు
భారతాంతర్గత భావ జాలము తెల్పు
గీతామృతంపు సత్కీర్తి తెలుపు

బ్రహ్మ తెలుపు సరస్వతీ ప్రమద తెలుపు
లక్ష్మి తెలుపు శేషాహి తల్పమ్ము తెలుపు
పాల సంద్రమ్ము తెలుపు మా భక్తి తెలుపు
నీకెలా గంటుకొనె నల్పు నీరజాక్ష !


ఈ ప్రశ్నకు ఆ శ్యామలాంగుడే వచ్చి సమాధానం చెప్పాలి మనకు న్యాయంగా. కాని ఏంచేస్తాం?  తన గురించి ఎవరేమనుకున్నా ఆయనకు పట్టదాయె. దూషణభూషణాలకు ఆయన అతీతుడు కదా. ఐనా మనం మాత్రం ఏమీ దూషణ చేయటం లేదే. ఏదో మన ఆశ్చర్యాన్ని మనం వెలిబుచ్చాం. ఇందువల్ల నయ్యా అంటే నల్లనయ్య సొమ్మేం పోతుంది చెప్పండి. కాని ఆయన మహా మొండి వాడు.

మొండివాడు రాజుకన్నా బలవంతుడని ఒక సామెత. మరి  ఆ రాజే మొండివాడైతే అన్న చిలిపి ప్రశ్న మనకి బోల్డు సార్లు తట్టి ఉంటుంది కదా? ఒప్పుకుంటారా? అలాంటప్పుడూ,   అన్ని లోకాల్నీ యేలే మహాప్రభువు మహావిష్ణువే మొండి వాడైతే ఇంకేం చెప్పేదీ అని!

చెప్పేందు కేమీ లేదు. సమాధానం ఇదీ అని మనం ఊహించుకో వలసినదే. తప్పదు మరి!.

అవునయ్యా కన్నయ్యా ఇందు చేత కదా అని అంటే?

ఆయన ఒక చిరునవ్వ్హు విసిరి ఊరుకుంటాడు.

అది తప్పైనా చిరునవ్వే అయన మన కిచ్చే జవాబు!
అది ఒప్పైనా చిరునవ్వే ఆయన మన కిచ్చే జవాబు!

అంచేత చూసారూ? మన కొక సదుపాయం ఉంది.  అన్నటు సదుపాయం అంటే రూఢార్థంగా ఇంగ్లీషు వాడు ఫెసిలిటీ అంటాడే అది అనేసుకుంటున్నాం కదూ. తప్పులేదు. కాని యోగికమైన అర్థం వేరే కూడా ఉందిగా? సదుపాయం అన్న మాటని విడదీస్తే సత్+ఉపాయం అని కదా. అంటే మంచి ఉపాయం అన్నమాట. ఇక్కడ ఆ యోగికార్థం ఎలా పనుకొస్తుందయ్యా అంటే అపాయం లేనిదే కదా అసలైన ఉపాయమూ అన్నమాట ఇక్కడ వర్తించేస్తోంది మరి. అదెలాగో చూడండి.

సదుపాయమా,  అదేమిటీ? అంటే మనకు తోచిన జవాబును మనం తయారుచేసుకోవటమే ఆ సదుపాయం అన్నమాట.

కాదని ఆయన అనడుగా మరి?

ఆయన అవునన్నా అనకపోయినా కాదని అనడు కాబట్టీ అసలే కరుణాసముద్రుడూ వగైరా బిరుదులన్నీ మీదేసుకున్న వాడు కాబట్టీ మననేమీ అనడు కాబట్టీ మన ఊహ మనం చేసేయటం వలన అపాయం లేదూ అన్నది ఇక్కడ అసలు విషయం అన్నమాట.

అందుచేత ఏమీ బదులీయడే ఈ శ్యామలాంగుడూ,  అసలు సంగతి ఏమిటా అంటే ఇదే ఐయ్యుంటుందీ  అని శ్యామలీయం ఒక ఆలోచన చేసేస్తున్నాడు.

వర్ణముల పట్ల లోకవివక్ష మెండు
తెల్లవాడికి కోరిక తెల్లపిల్ల
నల్లవాడైన కోరేది తెల్లపిల్ల
నల్లపిల్లను కోరెడు నాథు డెవడు

అంత వరకేల నలుపన్న కొంత లొచ్చు
తోచియేక దా యీప్రశ్న దాచకుండ
ఓరి దేవుడా నీకేల కోరరాని
నల్లదనమని ప్రశ్నించు ప్రల్లదనము

అబ్బెబ్బే మరి యూరకే యడిగినామయ్యా మహాత్మా హరీ
యిబ్బందేమియు లేదు మాకు మరి నీ వేరంగుగా దోచినన్
మబ్బే కొంతనయం బటన్నదొక  మైచాయతో నుండినన్
అబ్బో శ్వేతవరాహమూర్తి వయి మాకానందమున్ కుర్చినన్

శ్యామవర్ణ మనగ సౌందర్య చిహ్నంబు
శ్యామవర్ణ మెన్న చాల గొప్ప
నిన్నమొన్నదాక నీరేజదళనేత్ర
తెలుపుపైన నేడు వలపు మెండు

ఊరక నీవెందులకై
కూరిమితో నల్లరంగు గొనినావని మా
తీరని సందేహమయా
శౌరీ యొకయూహ చేయజాలుదు వినుమా

అది యెట్టిదనగా నవధరింపుము.

అరయ నంతటను సామాన్యమాయె తెలుపు
చిన్నబోయిన నలుపేమొ చింతచేసి
విష్ణుదేవుని పాదారవిందములను
చేర నాతడు దయమీఱ చేర్చె మేన

పరమదయాళువై పరమపావన దివ్యనిజాంగమెల్ల సం
బరమున నీలవర్ణరుచిభావన సేసి ధరించినంతటన్
హరిశుభదేహమంటి యది యంతట మిక్కిలి వాసికెక్క నం
దరు నిక నల్లనయ్య యని తామరసాక్షుని గొల్చి రత్తరిన్

ఇది నాయూహ మహాత్మా

దీనినిబట్టి శ్రీహరికి దీనుల యందు విశేషమైన జాలిగా
మానవదేవరాక్షసుల మానసముల్ గ్రహియించ మేలగున్
కాన సరైన కారణము కావలయున్ భవదీయదివ్యదే
హాన ధరించియుండ నిటు శ్యామలవర్ణము ప్రేమమీఱగన్

వెనుక నొక్కనాడు వేడుక యగు నల్పు
కాలమహిమచేత ఘనత చెడగ
నీదు మరువు సొచ్చి నిండుగౌరవమును
పొంది వెలిగె మరల పుడమి మీద

అట్టు లయ్యు కలిని యందచందంబుల
యందు బుధ్ధి కొంత మందగించ
మరల నలు పనంగ నరులకు లోకువ
కరుణలేని వారు కారె జనులు

ఇట్టిది నాయూహ యని
గట్టిగ నీతోడ మనవి కావింతును నే
నెట్టుల జనులకు చెప్పుదు
వట్టిది నా కంఠశోష వసుదేవ సుతా