20, జులై 2017, గురువారం

దేవుడికో విన్నపం

నీకు మ్రొక్కుట కొఱకునై నాకు రెండు
హస్తములు కల్గె దేవుడా యందువలన
చెడ్డ వారల కెన్నడు చేతులెత్తి
వందనము చేయు దుర్దశ పట్టనీకు

నీవిభూతులు మీఱిన తావులందు
సంచరించగ కలిగె నీ చరణయుగళి
దుష్టులుండెడు చోటులు త్రొక్కకుండ
వాని నేవేళ రక్షించ వయ్య నీవు

నిన్ను చూచుట కొఱకునై నాకు రెండు
కన్నులివి కల్గె దేవుడా కనుక నీవు
కలుష మతులను కనులలో కనులు పెట్టి
చూచు దుర్దశ గలుగక కాచవయ్య

నీ కథామృతమాలింప నాకు గల్గె
శ్రవణములు రెండు దేవుడా చవుకబారు
సంగతులు విన నెప్పు‌డు పొంగులెత్తు
నట్టి దుర్దశ రాకుండ నరయవయ్య

సర్వదా నీదు నామాళి జపము చేయ
కలిగె దేవుడా యీ జిహ్వ కనుక నీవు
పనికిరానట్టి మాటలు పలుకు నట్టి
బేల తనమది రానీక యేల వయ్య

నీకు తగినట్టి దివ్య మందిరము కాగ
నొప్పి యున్నది మనసిది యుర్విజనులు
దాని దరిజేరు నట్టి దుర్దశను నాకు
పట్టనీయక రక్షించ వలయు నీవు

దేహమా యిది నీదయా దృష్టి వలన
కలిగె నిది నిన్ను సేవింప కాంక్షచేయు
నితరులను కొల్వ దిది దీని వ్రతము గాన
దేవుడా యది నెఱవేర నీవె నీవు