31, అక్టోబర్ 2015, శనివారం

రామునికి సేవ     మ. కనులా రాముని మూర్తినే కనగ
          నాకాంక్షించెడున్ నేత్రముల్
     వినగోరున్ రఘురామకీర్తనము
          నేవేళన్ సదాభక్తిమై
     మనసా చక్కని మందిరం బగుచు
          రామబ్రహ్మమున్ గొల్చు కా
     ళ్ళును జేతుల్ భటులౌ ప్రభూత్తమున
          కే లోపంబు రాకుండగన్
    
    


తామసబుధ్ధుల మాటలు     ఉ. రాముడు లేడు లే డనుట
          రాముని దివ్య చరిత్రమందు నే
     మేమొ యనౌచితుల్ వెదకి
          హీనముగా పరిహాసమాడుటల్
     తామసబుధ్ధిజాడ్య
          జనితంబగు దోసములంచు సజ్జనుల్
     తా మటువంటి మాటలకు
          తాపము నొందక నుందు రెప్పుడున్ 
    
    


మోక్షాధికారులు     ఉ. రాముని తోడనే బ్రతుకురా
          యను వారలు కొందరుందు రా
     రాముని దక్క వారలు పరాకున
          నైనను బుధ్ధి నెంచబో
     రా మహితాత్ము లాశపడ
          రన్యుల మెప్పుల కెన్నడేని యే
     కామన లేని వారె
          అధికారులు మోక్షపదంబు చేరగన్
    
    


28, అక్టోబర్ 2015, బుధవారం

నోటికి హితవు రామనామమే.     ఉ.నాలుక రామచంధ్రఘన
          నామజపంబున ప్రొద్దుపుచ్చుటే
     మేలగు గాని కుక్షికిడ
          మెక్కుచు నుండిన లాభమున్నదే
     చాలును షడ్రసంబు లనిశంబును
          గోరుట కోరవయ్య ము
     క్కాలము బ్రోచు మోక్షఫల
          కారక తారక నామ మంత్రమున్
    
      


21, అక్టోబర్ 2015, బుధవారం

హతభాగ్యుడు     చ. కరయుగళంబు రామహిత
          కార్యప్రయుక్తము కాక యున్నచో
     చరణయుగంబు రామహిత
          కార్యనియుక్తము కాక యున్నచో
     నిరతము రామనామజప
          నిష్ఠను నాలుక యాడకున్నచో
      హరహర యేమి జన్మమది
            యా హతభాగ్యుని కేది దిక్కయా

      


20, అక్టోబర్ 2015, మంగళవారం

రాముని సత్యముం గన పరాకుబడం దగదయ్య     ఉ. రాముని సోయగంబు నొక
          రాక్షసి కన్గొని సంభ్రమించెనే
     రాముని ధర్మరూపుడని
          రాక్షసుడొక్కడు చాటిచెప్పెనే
     రాముని ధర్మనిష్ఠ నొక
          రాక్షసు డారసి పోయి మ్రొక్కెనే
     రాముని సత్యముం గన
          పరాకుబడం దగదయ్య మానవా

      


16, అక్టోబర్ 2015, శుక్రవారం

అవశ్యం మోక్షపదం     చ. ఎవనికి రామగాథ యన
          నెక్కుడు ప్రీతి రహించు చుండునో
     ఎవనికి రామనామ మన
          నెక్కుడు ప్రేమ జనించు చుండునో
     ఎవనికి రామపాదముల
          నెక్కుడు భక్తివివిశేష ముండునో
     భవము తరించి యా నరు
          డవశ్యము మోక్షపదంబు నందెడిన్

    


రామసన్నిధి విధానం     ఉ. రాముని పూర్ణసత్కృపను
          రాముని దివ్యమనోహరాకృతిన్
     రాముని ధర్మమార్గమును
          రాముని నిత్యయశోవికాసమున్
     రాముని సచ్చరిత్రమును
          రాముని తారక నామమంత్రమున్    
     ప్రేమను గొల్చు మానవుడు
          వేడుక రాముని సన్నిధిం గొనున్

    


15, అక్టోబర్ 2015, గురువారం

రాముని సన్నిధి శాశ్వతంబురా


     ఉ. రాముని మిత్రుడై యొకడు
          రాజ్యపదంబు నలంకరించెరా
     రాముని పాదమంటి యొక
          రాక్షసుడే చిరజీవి యాయెరా
     రాముని దాసుడై యొకడు
          బ్రహ్మపదంబును బొంది మించెరా
     రాముని భక్తు లందరకు
          రాముని సన్నిధి శాశ్వతంబురా
రాముడు సర్వజగద్విభుడు


      ఉ. రాముడు నేడు మా ప్రభువు
         రాముడు నిన్నను మా ప్రభుండె ఆ
      రాముడు రేపు మా ప్రభువు
         రాముడు సర్వజగద్విభుండు మా
      రాముడు మూడుకాలముల
         రక్షణ గూర్చుచు నుండ ప్రీతిమై
      రాముని దివ్యతత్త్వమునె
         వ్రాయుచు పాడుచు నుందు మెప్పుడున్