వసంతతిలకము.
శ్రీరామభక్తులను చేరని జన్మ మేలా
శ్రీరామనామమును చేయని జన్మ మేలా
శ్రీరామచంద్రవిభు చిన్మయు నాత్మబంధున్
కారుణ్యమూర్తి నెద గాంచని జన్మ మేలా
జన్మ మెత్తిన తరువాత శ్రీరామచంద్రుని భక్తులలో చేరవలసినదే. లేదా అది వృథా అవుతున్నది. నిత్యమూ శ్రీరామనామమును చేయవలసినదే లేదా ఆజన్మము వృధా అవుతున్నది. చిన్మయుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి మనకు విభుడు, ఆత్మబంధువు. ఆయనను హృదయంలో ప్రతిష్ఠించుకొని దర్శించలేని జన్మం వృథాయే.
లక్షణచర్చ.
ఈ వసంతతిలకం (త-భ- జ-జ-గగ) వృత్తానికి వాడుకే తక్కువ తెలుగు కవిత్వంలో. దీనికి యతిమైత్రిస్థానంగా తెలుగుకవులు 8వ అక్షరం గ్రహించారు. కాని 9వ అక్షరం యతిమైత్రిస్థానంగా మరింత పసందుగా ఉంటుందని కొందరికి అనిపిస్తుంది .కాని ఎనిమిదవ అక్షరంపైన యతిమైత్రి చేయటమే సబబు. ఎందుకో వివరిస్తాను.
ఈ వసంతతిలకం (త-భ- జ-జ-గగ) వృత్తానికి వాడుకే తక్కువ తెలుగు కవిత్వంలో. దీనికి యతిమైత్రిస్థానంగా తెలుగుకవులు 8వ అక్షరం గ్రహించారు. కాని 9వ అక్షరం యతిమైత్రిస్థానంగా మరింత పసందుగా ఉంటుందని కొందరికి అనిపిస్తుంది .కాని ఎనిమిదవ అక్షరంపైన యతిమైత్రి చేయటమే సబబు. ఎందుకో వివరిస్తాను.
త-భ- జ-జ-గగ = 5+4+4+4+4 = 21 మాత్రలు ఊనిక కోసం మొదటి మాత్ర. దాన్ని విడిగా ఉంచి లెక్కించితే 1+20 మాత్రలు. సమద్విఖండనంగా 1+10+10 మాత్రలు అవుతున్నాయి. ఇప్పుడు 1+10=11 మాత్రల తరువాత యతిమైత్రి చేయటం సముచితంగా ఉంటుంది. కాని 11 మాత్రల తరువాత ఎలా కుదురుతుందీ 11వ 12వ మాత్రలు ఒక గురువుగా జమిలి ఐపోతే? ఇప్పుడు 12 మాత్రల తరువాత యతిమైత్రిస్థానం అనవలసి ఉంది. అంటే పాదం UUI - UII IUI - IUI - UU అనే గురులఘుక్రమంలో పూర్వభాగం UUI - UII - IU ఉత్తరభాగం I - IUI - UU అవుతున్నది.
కాని పూర్వకవుల పధ్ధతి ప్రకారం పూర్వభాగం UUI - UII - I ఉత్తరభాగం UI - IUI - UU అవుతున్నది. ఇది అక్షరక్రమంగా పాదద్విఖండనం అవుతున్న విధానం - దీనిలో పూర్వభాగంలో 10 మాత్రలూ ఉత్తరభాగంలో 11 మాత్రలూ వస్తున్నాయి.
ఐతే ఏవిధానం ప్రశస్తం అన్న మీమాంస వస్తుంది. దీన్ని విచారించటానికి మరొక మంచి మార్గం ఉంది. ఈ వసంతతిలకాన్ని మరొకలాగు కూడ చూడవచ్చును. UUI - UII - IUI - IUI - UU అనే గురులఘుక్రమం UUI - UII - IU - IIUI - UU అనే గురులఘుక్రమంగా చూస్తే ఇక్కడ 5+4+3+5+4 మాత్రల విభజన కనిపిస్తోంది. అంటే ఇది నిజానికి మూడు ఖండాలు అన్నమాట. UUI - UII, IU IIUI - UU అని. ఇప్పుడు యతిమైత్రిస్థానం ఈమధ్యన ఉన్న త్రిమాత్రాఖండానికి యీవల ఐనా ఉంచాలి లేదా ఆవల ఐనా ఉంచాలి. అంతేకాని మధ్యఖండంలోని ఏఅక్షరం పైన ఉంచినా బాగుండక పోవచ్చునేమో.
మధ్యఖండానికి ముందే ఉంచితే పూర్వార్ధం మరీ పొట్టి అవుతున్నది. అందుచేత ఆవలనే ఉంచటం శ్రేష్ఠం అనక తప్పదు. ఇలాగైతే యతిమైత్రి 9వ అక్షరం పైన ఐతే సరిగ్గా ఉంటుంది.
కాని ఇదంతా ఆలోచించి కూడా పూర్వకవులు ఎనిమిదవ అక్షరాన్ని యతిమైత్రిస్థానంగా గ్రహించటానికి కారణం అక్కడ ఒక గురువు ఉండటం అని భావిస్తున్నాను. ఇలాచేయటం వలన పూర్వభాగం సరిగా రెండు పంచమాత్రాగణాలుగా వచ్చిందని గమనించవచ్చును. తెలుగుపద్యంగా నడపటానికి పంచమాత్రాగణాలు మంచి అందంగా ఉంటాయి. ఆ సంగతి ఇక్కడ కీలకాంశం! ఇప్పుడు నడకను మరొకసారి పరికిస్తే అది UUI - UIII - UII - UI - UU ( 5+5, 4+3+4) అన్నట్లుగా తేటపడుతుంది. ఇక్కడ ఉత్తరభాగంలో భగణం పిదప చిన్న విరుపు వస్తున్నది గమనించండి.