31, జనవరి 2016, ఆదివారం

రామప్రియంవద          ప్రియంవద.
          మొదట చేయవలె మోక్షగామియై
          మదిని రామునకు మందిరంబుగా    
          వదలిపెట్ట వలె బంధసంతతిన్
          వదలరాదు హరిభక్తి మార్గమున్
         ప్రియంవద.
ఈ ప్రియంవదావృత్తానికి గణవిభజన న-భ-జ-ర. గురులఘుక్రమం  IIIUIIIUIUIU. పాదానికి 12అక్షరాలు. యతిస్థానం 8వ అక్షరం. 

విశ్వనాథవారు ప్రియంవదావృత్తాన్ని ఉపయోగించినట్లు తెలుస్తున్నది.

ఎవరు చెప్పినదో తెలియదు కాని ఒక ఉదాహరణ పద్యం కనిపిస్తున్నది.

    దివిషదీశ్వరుఁడు తేపమౌనులున్
    గవురుగప్పుచుపొగల్ వెలార్పఁగా
    నవుదపస్సుల మహాగ్నిరేగఁగా
    నవురయచ్చరలనంపునంటఁగా


ఈ ప్రియంవద నడకను పరిశీలిద్దాం. ఈ వృత్తపు గురులఘుక్రమాన్ని త్రికగణాలతో III UII IUI UIU న-భ-జ-ర అని చెబుతున్నాం. మొత్తం‌ మాత్రలసంఖ్య పదహారు. వీటిని  IIIUIII  UIUIUఅని గురులఘుక్రమాన్ని యతిస్థానం వద్ద రెండు కాలఖండాలుగా చేసి చూస్తే బాగుంటుంది. పూర్వాపరభాగాల్లో ఎనిమిఎదేసి మాత్రలు వస్తాయి.  ఇంకా వివరంగా ఒక్కొక్క భాగాన్ని మూడు ఖండాలు చేసి III UI II UI UI U అని 3+3+2  మాత్రలుగా ప్రతిభాగాన్ని చెప్పుకోవచ్చును.

మొదట చేయ వలె మోక్ష గామి యై
మదిని రాము నకు మంది రంబు గా
వదలి పెట్ట వలె బంద సంత తిన్
వదల రాదు హరి భక్తి మార్గ మున్

ఇతర విధాలైన నడకలు సాధ్యపడవచ్చును. కాని పైన చెప్పుకున్నది దీనికి సహజమైన నడక అనుకుంటున్నాను.