18, జనవరి 2016, సోమవారం

జలోధ్దతవృత్తంలో రామస్తుతి


     జలోధ్ధతము.
     అమాయకుడనై యనేక  భవముల్
     తమిన్ వలచితిన్ ధనాదికములన్
     భ్రమల్ విడెను సూర్యవంశతిలకున్
     సమానరహితున్ సదా కొలిచెదన్జలోధ్ధతము.

ఈ వృత్తానికి గణవిభజన జ-స-జ-స. పాదానికి 12అక్షరాలు. యతిస్థానం 7వ అక్షరం. అంటే యతిస్థానం దగ్గర పాదం సమద్విఖండితం అవుతున్నది.

ఈ జలోధ్ధత వృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు,

నడక విషయానికి వస్తే ఈ జలోధ్ధతవృత్తంలో ఉన్న జ,స గణాలు చతుర్మాత్రాగణాలు. కాబట్టి ఈ వృత్తం అంతా చతురస్రగతిలో‌ నడుస్తున్నది.

అమాయ కుడనై యనేక భవముల్
తమిన్ వ లచితిన్ ధనాది కములన్
భ్రమల్ వి డెను సూ ర్యవంశ తిలకున్
సమాన రహితున్ సదా కొ లిచెదన్

ఈ వృత్తంలోని గణాలైన జ, స గణాలకు కొంతగా ఎదురు నడక లక్షణం ఉన్నది జ అంటే IUI  స అంటే IIU. ఈ రెండు గణాల్లోనూ గురువుకు ముందు లఘువు వస్తున్నది. జ-గణం వెంబడే స-గణం రావటంతో, ఆ గురువుల తరువాత కూడా లగువు విధిగా వస్తున్నది, ఒక్క చివరి అక్షరానికి తప్ప.అంటే జాగ్రత్తగాగమనిస్తే ఇందులో ఎదురు నడక పెత్తనం బాగానే కనిపిస్తుంది. చూడండి ఈ జలోధ్ధతవృత్తపు గురులఘుక్రమం IUIIIUIUIIIU లో 1-3, 5-7, 7-9  స్థానాల్లో జగణం ఉన్నది! లగ లేదా వ-గణం‌ నికార్సైన ఎదురు నడక కాబట్టి అలా చూస్తే 1-2, 5-6, 7-8, 11-12 స్థానాల్లో వ-గణం‌ ఉన్నది.

అంతే కాదు, పాదారంభంలోనే‌ కాక విరామానంతరమూ జగణమే రావటం ఈ వృత్తం ప్రత్యేకత.  ఇలాంటి నడుముకి సరిగ్గా విరిగే వృత్తాల్లో యతిస్థానం దగ్గర పదం విరిగితే అందం ఇనుమడిస్తుంది.