24, జనవరి 2016, ఆదివారం

శ్రీరామమనోరమ







       మనోరమ.
       సురలకోర్కెదీర్చుస్వామియే
       ధరనుమానవోత్తముండుగా
       బరగి రావణు న్వధించ సం
       బరము నొందెనీ ప్రపంచమున్
       (7వస్థానం యతిమైత్రితో)

       మనోరమ.
       నరుడు రామనామ మొక్కటే
       తరచు నోటదాల్చు చున్నచో
       మరలిరాని మంచిచోటికిన్
       తరలిపోవు తాను ధన్యుడై
       (6వస్థానం యతిమైత్రితో)
      

మనోరమ.

ఈ‌ మనోరమావృత్తానికి గణవిభజన న-ర-జ-గ. అంటే గురులఘుక్రమం IIIUIUIUIU అవుతున్నది. పాదానికి 10 కాని అంతకంటే హెచ్చు స్థానాలు కాని ఉన్న వృత్తాలకు యతిస్థానం తప్పక ఉండాలి. ఇక్కడ యతిస్థానం 7వ అక్షరం. ప్రాసనియమం ఉంది.

మనోరమావృత్తానికి కల బంధుగణాన్ని చూదాం. మనోరమ పాదానికి ముందు రెండు లఘువులను చేర్చితే అది ప్రశృమరాళికా వృత్తం (IIIIIUIUIUIU) అవుతుంది. ముందు మూడు లఘువులను చేర్చితే అది అశోకపుష్పవృత్తం (IIIIIIUIUIUIU) అవుతుంది.  మనోరమావృత్తపాదానికి ముందొక లఘువునూ చివరన ఒక గురువునూ‌ చేర్చితే అది బలోర్జితావృత్తం (IIIIUIUIUIUU) అవుతుంది.  మనోరమావృత్తపాదానికి చివర ఒక య-గణాన్ని తగిలిస్తే అది సుకర్ణపూరం (IIIUIUIUIUIUU) అనే వృత్తం అవుతుంది.

నడక విషయం చూదాం. త్రికగణాలతొ న-ర-జ-గ అని చూసినప్పుడు దీనిలోని నడకను గ్రహించటం ఒకింత కష్టమే. మరొక విధానం కావాలి. ఈ వృత్తపు గురులఘుక్రమాన్ని మనం III UI UI UI U  అని న-హ-హ-గ వలె కూడా చూడవచ్చును. ఈ విధంగా చూస్తే నాలుగు త్రిమాత్రాగణాల పిదప ఒక గురువుగా ఉన్నది. నడకను త్రిస్రగతిగా చూడటం బాగుండేలాగు ఉన్నది. అటువంటప్పుడు యతిస్థానం 6వ అక్షరంగా బాగుండవచ్చును. అదీ కాక వీలైన సందర్భాల్లో గురువుపైన యతిమైత్రి వచ్చేలా చూడటమే వృత్తాల్లో అందగిస్తుంది.

ఈ చర్చ తరువాత మనోరమావృత్తానికి రెండు విధాల యతిస్థానాలతోనూ పద్యాలు చెప్పుకుంటే విషయం మరింతా సుగమంగా ఉంటుంది.

విశ్వనాథవారు మనోరమావృత్తాన్ని వాడినట్లు తెలుస్తున్నది.

మనోరమా వృత్తానికి 6వ అక్షరం యతిస్థానంగా వ్రాసిన పద్యం‌ నడకను చూడండి.

నరుడు రామ నామ మొక్క టే
తరచు నోట దాల్చు చున్న చో
మరలి రాని మంచి చోటి కిన్
తరలి పోవు తాను ధన్యు డై