7, జనవరి 2016, గురువారం

మత్త వృత్తంలో విన్నపం.


    మత్త.
    భారంబెల్లన్ వడిగొని నాపై
    కారుణ్యంబుం గనబరచేవో
    నేరంబుల్ లో నిపు డరసేవో
    శ్రీరామా యో శ్రితకమలాక్షా
    మత్త.

ఈ మత్త వృత్తానికి గణవిభజన మ-భ-స-గ. పాదం నిడివి 10అక్షరాలు. లక్షణ గ్రంథాలు యతిస్థానం 7వ అక్షరం అని చెబుతున్నాయి. కాని నిజానికి 5వ అక్షరంపైన యతిస్థానం సముచితంగా ఉంటుంది కాని 7వ స్థానం పైన కాదు.

ఈ వృతాన్ని నాగవర్మ హంసశ్రేణి అన్నాడు.

ఈ వృత్త పాదంలోని గురులఘుక్రమం UUU UII IIU U. ఇందులో కూడా గురువులూ లగువులూ విడివిడి గుంపుల్లా వస్తాయి. పాదం మొదలు పెడుతూనే నాలుగు గురువులు! మొత్తం మీద ఆరు గురువులూ నాలుగు లఘువులతో పదహారు మాత్రల నిడివి కేవలం‌ పది అక్షరాల్లోనే. త్రికగణాల్లో కాకుండా, నడకను దృష్టిలో పెట్టుకొని మాత్రాగణాలుగా ఈ‌వృత్తపాదాన్ని చూసినప్పుడు మనకు ఈ వృత్త పాదంలోని గురులఘువుల అమరిక UU UU IIII UU అని కనిపిస్తుంది. అంటే నాలుగేసి మాత్రలుగా గగ-గగ-నల-గగ అన్న విభజన కనిపిస్తుంది.

ఇకపోతే యతిస్థానం గురించి ఆలోచిద్దాం. ఏడవస్థానం యతిమైత్రి కుదర్చాలి, అక్కడ ఉండేది గురువు కాదు ఒక లఘువు. అదలా ఉంచి నాలుగేసి మాత్రల నిడివికల నాలుగు మాత్రాగణాల పాదంలో తృతీయమాత్రాగణం ప్రారంభంలో యతిమైత్రి కూర్చటం అందంగా ఉంటుంది కాని ఆ మూడవ మాత్రాగణం మధ్యన ఉంచటంలో సామంజస్యం కనబడటం‌ లేదు. నిజానికి యతిస్థానం అంటే అది విరామస్థానం. ఈ మూడవ మాత్రాగణం మధ్యలో విరామం ఎలా కుదురుతుంది? అందుచేత అది అసందర్భంగా అనిపిస్తోంది. నాల్గవ అంటే చివరి మాత్రాగణం గగ-గణం ప్రథమాక్షరం పైన యతి కూడా బాగుంటుందా, పైగా అది గురువుకూడాను అని అంటే ఆ అక్షరం పాదం కొసకి వచ్చేసింది, మరొక అక్షరంలో పాదవిరామం వస్తుండగా ఈ అక్షరం ముందు విరామం కుదరదు. కాబట్టి మూడవ మాత్రాగణం నల-గణం ప్రథమాక్షరమే యతిస్థానంగా బాగుంటుంది, ముఖ్యంగా ఈ వృత్తానికి కల చతురస్రగతికి అనుగుణంగా అని నిర్ణయించుకుంటున్నాను.

ఈ మత్తవృత్తానికి ఐదవస్థానమే నిజమైన యతిస్థానం అనటానికి మరొక కారణం‌ కూడా ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ‌మత్త వృత్తానికీ విద్యున్మాలావృత్తానికీ మంచి చుట్టరికమే ఉంది. మత్తవృత్త లక్షణం గగ-గగ-నల-గగ ఐతే విద్యున్మాలకు గగ-గగ-గగ-గగ. అంటే, విద్యున్మాలలోని మూడవ గగ-గణాన్ని నల-గణంగా మారిస్తే అది మత్తవృత్తం అవుతున్నది. అందుచేత నాలుగేసి చతుర్మాత్రాగణలతో నిర్మితమైన విద్యున్మాల, మత్త వృత్తాలకు నడక ఒక్కలాగే ఉంటుంది. మరి యతిమైత్రి భిన్నంగా ఉండటంలో ఔచిత్యం లేదు. విద్యున్మాలకు సంప్రదాయికంగా ఐదవ అక్షరం యతిస్థానం అనుకుంటున్నాం‌ కదా అలాగే మత్తవృత్తానికీ ఐదవస్థానమే యతిస్థానం అనుకోవటం సముచితం.

ఈ విధంగా మత్తవృత్తానికి యతిస్థానం ఐదవ అక్షరం అని నిర్ణయం చేసి పద్యం వ్రాయటం‌ జరిగిందని విఙ్ఞులు గమనించ కోరుతాను.

ఇక్కడ చెప్పుకున్న పద్యం‌ నడక చతురస్రగతితో ఇలా ఉంది.

భారం బెల్లం వడి గొని నాపై
కారు ణ్యంబుం గనబర చేవో
నేరం బుల్ లో నిపు డర సేవో
శ్రీరా మా యో శ్రితకమ లాక్షా

ఈ‌ మత్తవృత్తం‌ జలధరమాల (UUUUIIIIUUUU), లీలాలోల (UUUUIIIIUUUUU), కాలధ్వానం (UUUUUUIIIIUUUU), పరిణాహి (UUUUIIIIUUIIUU),  వాసంతి (UUUUUIIIIUUUUU), వాణీభూష (UUUUUUUUIIIIUUU) మొదలైన దాదాపు ఇరవై వృత్తాల్లో అంతర్భాగంగా ఉంది.