8, జనవరి 2016, శుక్రవారం

శ్రీరామ రాజరాజీయం


    రాజరాజి.
    శ్రీరామ నామంబునే
    నోరార సేవింపరా
    ప్రారబ్ధముం ద్రోయరా
    నీ రామునే చేరరా

    రాజరాజి.
    వే రెవ్వడున్ లేడు సం
    సారంబు దాటింప లో
    కారాధ్యుడౌ రామునే
    మీ రెల్లరున్ వేడరేరాజరాజి.

ఈ రాజరాజి వృత్తానికి గణవిభజన త-త-గ. పాదానికి 7అక్షరాలు. అందుచేత యతిస్థానం ఏమీ‌ లేదు.

ఈ రాజరాజి వృత్తానికీ, విశాలాంతికా వృత్తానికి చాలా దగ్గర చుట్టరికం. విశాలాంతికలో నుండి మొదటి త-గణాన్ని తొలగిస్తే అది రాజరాజి అవుతుంది. తిరగేసి చెప్పాలంటే, రాజరాజీవృత్తపాదానికి ముందు మరొక త-గణాన్ని తగిలిస్తే అది విశాలాంతిక అవుతుంది. కాని విశాలాంతికకు పాదానికి పది అక్షరాలు కాబట్టి యతినియమం తగులుకుంటుంది. పదక్షరాలలోపు పాదం నిడివి ఉన్నప్పుడు యతిస్థానం అక్కరలేదు కాబట్టి రాజరాజి బ్రతికిపోయింది. ఐతే వృత్తం అన్నాక అన్నింటికీ ప్రాసనియమం తప్పదు.

నడక విషయానికి వస్తే మొదటి పద్యంలో, అది గణానికొక విరుపుగా ఉంది.

శ్రీరామ నామంబు నే
నోరార సేవింప రా
ప్రారబ్ధ ముల్ ద్రోసి నీ
వా రాము నే చేర రా

ఐతే మనం నేను పైన చెప్పిన రెండవ పద్యం చూస్తే దాని నడక మొదటిదాని కన్నాకొంచెం తేడాగా ఉందనిపిస్తుంది.

వే రెవ్వ డుం లేడు సం
సారంబు దాటింప లో
కారాధ్యు డౌ రాము నే
మీ రెల్ల రుం వేడ రే

ఈ పద్యం‌ నడక అంత సాఫీగా లేదు కదా? పద్యం సలక్షణంగా ఉందా అన్నది ఒక సంగతి. గానయోగ్యంగా ఉందా అన్నది మరొక సంగతి. ఈ పద్యంలో ప్రవాహగుణం పాటించబడింది. అంటే సంసారంబు, లోకారధ్యుడు అన్న పదాలు ఒక పాదంలో మొదలై తరువాతి పాదంలో ముగుస్తున్నాయి.  అందుచేత పాదాంత విరామం రాలేదు ఆ సందర్భాలలో. పెద్దపద్యాలలో నడకను వివిధ గతుల్లో చూపటానికి సావకాశం హెచ్చుగా ఉంటుంది. అలాంటి వాటిలో‌ పాదోల్లంఘనం అంత పెద్ద చిక్కు కాకపోవచ్చును. చిన్నపద్యాల సంగతి వేరు. వాటికి పరిధి చిన్నది. కొద్ది కాలంలో వాటి మొత్తంగా చదవటమో పాడటమో చేయవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో నడకకు తగిన విరామాలను చూపగలిగితే పద్యం అందంగా నడుస్తుంది. పై పద్యం ఐతే ఆ మాటను నొక్కి చెబుతున్నది.  చిన్న పద్యాలను వ్రాసే వారు అందుకే నడకమీద కూడా మంచి దృష్టి పెట్టాలి.

ఈ‌ పద్యం‌ నడకలో విశేషం. ఈ‌ రాజరాజీ వృత్తంలో మొదటి రెండు త-గణాలకూ ఐదు మాత్రల కాలపరిధి ఉంది. అందుచేత మూడవ గణంగా వచ్చిన గురువును తగినంతగా దీర్ఘం తీయగలగటం ఇక్కడ కీలకం. అది కుదిరిన పక్షంలో దీని అందం తెలుస్తుంది.

మరలా మరొక సంగతి ఉంది. కథాసందర్భంలో ఈ‌ రాజరాజీ‌ కాని  మరొక పొట్టి పద్యం కాని వచ్చినప్పుడు గాన యోగ్యత గురించి ఎక్కువగా పట్టించుకోక పోవచ్చును. ఇబ్బంది లేదు. విడివిడి పద్యాలను ఒక విషయం మీద కూర్చుతున్న పక్షంలో‌ఈ నడకలూ గానయోగ్యతలూ అన్న వాటి గురించి తప్పక ఆలోచించాలి.

ఈ రాజరాజీ వృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.