23, జనవరి 2016, శనివారం

భుజగశిశుభృత రామనామం.       భుజగశిశిభృతము.
       పలుకవలయు శ్రీరామా
       పలుకవలయు నీ‌ నామం
       బలుపు నెఱగుకుండంగం
       జిలుకవలెనె తీయంగన్
భుజగశిశుభృతము.

ఈ భుజగశిశుభృత వృత్తానికి గణవిభజన న-న-మ. గురులఘుక్రమం IIIIIIUUU. పాదానికి కేవలం‌ తొమ్మిది అక్షరాలు.  చిన్నవృత్తం‌ కాబట్టి దీనికి యతిమైత్రి అవసరం లేదు. ప్రాసనియమం మాత్రం ఉంది.

లక్షణసారసంగ్రహమూ ఛందోబుధీ దీనిని భుజగశిశురుతము అన్నాయి. కవిజనాశ్రమమూ, కావ్యాలంకారసంగ్రహమూ, అప్పకవీయము భుజగశిశురుతానికి లక్షణాన్ని న-న-య అని వేరు వృత్తంగా చెప్పాయి.

ఈ భుజగశిశుభృతవృత్తానికి పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

ఈ వృత్తం నడక చూదాం. దీని పాదంలో గణవిభజన న-న-మ కాబట్టి మెత్తం మాత్రల సంఖ్య పన్నెండు.  మొదట వచ్చే ఆరుమాత్రలూ పూర్తిగా లఘువులతోనూ‌, చివరి ఆరు మాత్రలూ మొత్తంగా గురువులతోనే యేర్పడుతున్నాయి. మొదటి ఆరు మాత్రలూ‌ పూర్తికాగానే విరుపు కనిపిస్తోంది. అందుచేత ఈ‌వృత్తపాదం మూడవగణం‌ ఐన మ-గణం వద్ద సమద్విఖండనం చేస్తూ విరుగుతున్నది.

పలుక వలయు శ్రీరామా
పలుక వలయు నీ నామం
బలుపు నెఱగ కుండంగం
చిలుక వలెనె తీయంగన్

ఈ వృత్తం వ్రాయటానికి సులభంగానే కనిపిస్తోంది. ఔత్సాహికులు ప్రయత్నించండి.


4 కామెంట్‌లు:

  1. భుజగశిశురుతము బదులుగా ప్రణవము అనే ఉంచారు సరిచేయగలరు.

    రిప్లయితొలగించండి
  2. చిలుక వలె తీయగా అన్న అర్థంలో ' తీయంగన్ ' అనే ముగుస్తుంది. తరువాత పర పదమేమీ లేనప్పుడు, సంధి జరుగనప్పుడు పదాంతంలో / పద్యాంతంలో ద్రుతము పూర్ణ బిందువు కానేరదు. ( X తీయంగం X )

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.