31, జనవరి 2016, ఆదివారం

ప్రమితాక్షరము.







           ప్రమితాక్షరము.
           కరుణాలవాల నిను కన్నులతో
           నరయంగ రామ యెటు లబ్బునయా
           యరుదైనభాగ్యమది యట్లగుటం
           బరమాత్మ వచ్చెదవు స్వప్నములన్
         



ప్రమితాక్షరము.

ఈ ప్రమితాక్షరవృత్తానికి గణవిభజన స-జ-స-స. అంటే పాదానికి పన్నెం డక్షరాలు. గురులఘుక్రమం IIUIUIIIUIIU.  యతిస్థానం తొమ్మిదవ అక్షరం.

ఈ ప్రమితాక్షరంలో ఉన్న గణాలన్నీ చతుర్మాత్రాగణాలన్నది గమనార్హం. కాబట్టి నడక చతురస్ర గతిలో  IIU IUI IIU IIU అనే విరుపులతో ఉంటుందని పించవచ్చును. కాని దీని నడక IIUI UIII UIIU అని నాలుగేసి అక్షరాలకు ఒక విరుపుతో కనిపిస్తున్నది ఇక్కడ నేను చూపిన పద్యంలో.

కరుణాల వాల నిను కన్నులతో
నరయంగ రామ యెటు లబ్బునయా
యరుదైన భాగ్య మది యట్లగుటం
బరమాత్మ వచ్చెదవు స్వప్నములన్

విశ్వనాథవారు ప్రమితాక్షరాన్ని రామాయణకల్పవృక్షంలో వాడలేదు. ఇతరకవు లెవరన్నాఈ ప్రమితాక్షరాన్ని వాడిన వివరం తెలియదు..

11 కామెంట్‌లు:

  1. బాగు బాగు
    విశ్వదేవి, మత్తమయూరము,చెప్పండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అహా. బరువైన వృత్తాలు. తప్పకుండా రేపు చెప్పుకుందాం.

      తొలగించండి
  2. ఈ జనవరి నెలలోనే ముప్పదియైదు పద్యాలతో రామార్చన జరిగింది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమం తప్పకుండా వ్రాస్తున్న మీరు, మీకు గట్టి ప్రోత్సాహమిస్తున్న "కష్టేఫలి" శర్మ గారు, ఇద్దరూ అభినందనీయులే.

      తొలగించండి
    2. ధన్యవాదాలు విన్నకోటవారూ. శర్మగారు అందిస్తున్న ప్రోత్సాహం అమూల్యం. ఆయన తప్ప ఎవరూ ఫలాని విశేషవృత్తంలో పద్యం చెప్పమని అడగలేదు ఇంతవరకూ. ఎంత ఎక్కువమంది ఈ రామకార్యంలో పాలుపంచుకుంటే అంత ఎక్కువ సంతోషం.

      తొలగించండి
    3. ఆ.వె॥ పద్య మడుగువారి భాగ్య మెంతటి దన్న
      పద్య మల్లు వాని భాగ్య మంత
      తారతమ్య మేల తలచునా రాముడు
      కోరు వారి కెల్ల కురియు దయలు

      తొలగించండి
  3. పద్యాల విషయంలో శర్మ గారు నివురుగప్పిన నిప్పు అని ఇప్పుడే తెలుస్తోంది. వారికున్నంత విస్తార పరిజ్ఞానం లేని కారణాన ఫలానా రకం పద్యం కావాలని కోరుకోవడం సాధ్యపడటంలేదు :(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోటవారు,

      మీరు చెప్పినట్లే శర్మగారికి ఛందస్సుపై ఉన్న అవగాహన అబ్బురపరుస్తోందండి. ఐనా అనందం బహుముఖం‌ కదుటండీ. వ్రాసి ఆనందించటం‌ ఒకరకం ఆనందం, అడిగి చెప్పించుకొనటం‌ ఒక ఆనందం. చదివి సంతోషించట‌ం‌ ఒక ఆనందం. మననం చేసుకొని ఆనందించటం ఒక రకం... ఇల్లాగు బహువిధాలుగా అన్నమాట. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్। ఆనన్దాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే। ఆనన్దేన జాతాని జీవన్తి। ఆనందం ప్రయంత్యభిసం విశంతీతి। అని ఉపనిషద్వాణి.

      తొలగించండి
    2. పామరులకు ఊరట కలిగించే మాటలు బాగా చెప్పారు.

      తొలగించండి
  4. ప్రమితాక్షరం గురించి : సరస బారతి ఉయ్యూరు : గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ఇలా అన్నారు

    కుమార రామదాసీయం

    కుమార దాసు కావ్యాన్ని చాలా గొప్పగా రాశాడు .ఇరవై సర్గల మహా కావ్యం ఇది .దశరదునిపై కమ్మని కవిత్వం చెప్పాడు .సందర్భాలను ఎన్నుకొని మహాకవ్యానికి తగినట్లు వర్ణనలు చేశాడు .బృహస్పతి మహా విష్ణువుతో రావణుడి దురాగతాలను అంతం చేయమని ప్రార్ధిస్తాడు . దాసు జలక్రీడల్ని, సూర్యోదయ సూర్యాస్తమయాలను నేర్పుగా వర్ణించాడు .తరువాత కద మిధిలకు చేరుతుంది .విశ్వామిత్ర ,జనకుల సమాగమం కమనీయం గా కాళిదాస మార్గం లో వర్ణించాడు .కవిత్వం లో ‘’వైదర్భీ రీతి ‘’ని వాడి కావ్య గౌరవాన్ని ఇనుమడింప జేశాడు .కుమార దాసు గొప్ప వ్యాకరణ పండితుడు .అనుకూలమైన ఛందస్సులను సందర్భాన్ని బట్టి వాడి కదాగమనానికి ,రామ ణీయతకు తోడ్పడ్డాడు .ద్రుత విలంబితం ,ప్రమితాక్షరం ,ఇంద్ర వజ్ర ఉపజాతులు బాగా వాడి సమర్ధతనిరూపించాడు .వంకస్త ,వైతాళీయ ,రదోద్ధత ,ఛందో భేదాలను సద్వినియోగం చేసుకొన్నాడు .శార్దూలం శిఖరిణి ,స్రగ్ధర ,పుష్పితాగ్ర , ప్రహర్శిణి వసంత తిలక ,అవితా మందాక్రాంత ,మాలిని లను అవసరాన్ని బట్టి ప్రయోగించాడు .వాల్మీకానికి పూర్తీ విదేయకం గా రామాయణ పాత్రల ఉదాత్తతకు ఉన్నత స్తానం కల్పించేట్లుగా మనో భావాలను,భావోద్వేగాలను పరిపూర్ణం గా స్పష్టం గా వ్యక్త్యం చేసేట్లు రాశాడు కుమార దాసు .అంతకు ముందు ఏకవీ వాడనికొన్ని పదాలను కుమార దాసు వాడి నూతనత్వానికి దారి వేశాడు .

    రిప్లయితొలగించండి
  5. నేను కీ.శే.కీసర సరస్వతి ప్రసునాంబ గారి తృతీయ పుత్రుడను. మీకు పాదాభివందనాలు. కీ.శే.శ్రీ రాపర్ల జనార్ధన రావు గారి మేనల్లుడను.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.