17, జనవరి 2016, ఆదివారం

నారాచక వృత్తంలో రామడికొక ప్రశ్న.






        నారాచకము.
        శ్రీరామ నిన్నుగాక సం
        సారంబు నెన్ను వాడనా
        కారుణ్య మేల బూనవో
        మారాడ వేల దైవమా
                
       

నారాచకము.

ఈ నారాచక వృత్తానికి గణవిభజన త-ర-వ. గురులఘుక్రమం UUI UIU IU. పాదదైర్ఘ్యం ఎనిమిది అక్షరాలే కాబట్టి యతిస్థానం ఏమీ‌ లేదు. వృత్తం‌ కాబట్టి ప్రాసనియమం పాటించాలి.

ఈ వృత్తానికి నారాచ , నారాచిక అనే పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

అంతర్జాలంలో ఒక ఉదాహరణ కనిపిస్తోంది. ఏ‌కవి ప్రయోగమో వివరం తెలియదు.

     ఈతండు రాఘవాగ్రజుం
     డేతెంచు శత్రునిం గరా
     ఘాతంబుచే వధించు ని
     ర్ఘాతంబు నామహాజిలో

ఇతర పూర్వకవి ప్రయోగాలు తెలియవు.

ఈ‌వృత్తంలో పాదానికి 13మాత్రలున్నాయి.  ఇవి 5+3+5 మాత్రలుగా నడుస్తూ అందగిస్తున్నాయి. ఇక్కడ నేను ఇచ్చిన పద్యానికి నడకను చూద్దాం.

 శ్రీరామ నిన్ను గాక సం
సారంబు నెన్ను వాడనా
కారుణ్య మేల బూనవో
మారాడ వేల దైవమా

ఇదేదో‌ మిలట్రీ బాండు మేళం‌ నడకలా మీకు అనిపిస్తే అందులో మీ తప్పేమీ లేదు.

ఈ‌ నారాచక వృత్తంలో పద్యం వ్రాయటం సులభంగానే కనిపిస్తోంది కాబట్టి ఔత్సాహికులు తప్పక ప్రయత్నించండి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.