8, జనవరి 2016, శుక్రవారం

రామ విశాలాంతికం.


   విశాలాంతికం.
     శ్రీరామ నామంబు సేవించు చో
     నోరార నేవేళనుం బ్రీతుడై
     నారాటము ల్దీరి యానందియై
     శ్రీరామసాన్నిధ్యసిధ్ధిం గనున్
    విశాలాంతికం.

ఈ విశాలాంతికం వృత్తానికి గణవిభజన త-త-త-గ అని. అంటే పాదానికి 10అక్షరాలు. యతిస్థానం 7వ అక్షరం.

ఈ వృత్తలక్షణం లోని ఒక చమత్కారం ఏమిటంటే ఇది ఒక అల్పాక్కర కూడా అవుతుంది. యతిస్థానం కూడా సరిపోతుంది అల్పాక్కరకూ చంద్రగణం ప్రథమాక్షరం పైన యతిస్థానం కాబట్టి.

 అల్పాక్కర అనేది దేశిఛందస్సులోని అక్కరలు అనే ఒకరకం పద్యజతికి చెందినది. అల్పాక్కరకు లక్షణం పాదానికి ఇం-ఇం-చం. ఇక్కడ ఇంద్రగణం అంటే భ,ర,త, నల, నగ, సల అనే ఆరింటిలో ఒకటి. దేశిఛందస్సులో విస్తారంగా వాడతారు కాబట్టి వీటిగురించి అందరికీ తెలుసు.  చంద్రగణాలు తెలుగు కవిత్వంలొ మహా అరుదు, వాడకం లేదనే అనవచ్చును.  ఇవి మొత్తం 14. నగగ, నహ, భల, సలల, భగ, మల, సవ, సహ, తల, రల, నవ, సలల, రగురు, తగ అనేవి.  చంద్రగణాల అవసరం కారణంగా అక్కరలూ అంతగా వాడుకలో లేవు. ఈ మధ్యకాలంలో మధ్యాక్కర మాత్రం ప్రచారంలోనికి వచ్చింది. విశ్వనాథవారే ఏకంగా మధ్యాక్కరలతో పది శతకాలు వ్రాసారు. మధ్యాక్కరలో చంద్రగణం ప్రసక్తిని యుక్తిగా తప్పించుకోవచ్చును - ఎందుకంటే అందులో చంద్రగణం బదులు సూర్యగణం వస్తుంది కాబట్టి.

దేశిఛందస్సులలో రాములవారిపైన పద్యాలు మరొక వరుసలో చెప్పుకుందాం. 

ఈ విశాలాంతికానికి పూర్వకవి ప్రయోగాలున్నట్లుగా లేదు.

అధునికులు జె,కె.మోహనరావుగారు వ్రాసినవి రెండు విశాలాంతికాలు:

    నారాజు లేకుండ - నా మానస-
    మ్మీరాత్రి మాడెన్గ - నిట్లగ్నిలో
    నౌరా విశాలాంతి - కయ్యెన్ గదా
    భారమ్ము చిత్తమ్ము - బాధించెనే

    ఆనంద సంద్రమ్ము-నం దీదనా
    గానాబ్ధిలో గంగ-గాఁ జేరనా
    మౌనమ్ములో నేను - మాటాడనా
    ప్రాణామృతమ్మీయఁ - బ్రార్థించనా

ఈ విశాలాంతికం నడక దండకం నడకలాగా ధ్వనిస్తుంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.