20, జనవరి 2016, బుధవారం

రుక్మవతీ శ్రీరామం.        రుక్మవతి.
        తల్లివి నీవే తండ్రివి నీవే
        చల్లగ జూచే స్వామివి నీవే
        యుల్లమునన్ ధ్యేయుండవు నీవే
        నల్లనివాడా నా రఘురామా
రుక్మవతి
ఈ రుక్మవతీ వృత్తానికి గణవిభజన భ-మ-స-గ. అంటే పాదానికి పది అక్షరాలు. పాదం నిడివి పది ఐనా అంతకన్నా ఎక్కువ అక్షరాలైనా యతినియమం ఉంటుంది. ఇక్కడ యతిస్థానం 6వ అక్షరం. అన్ని వృత్తాలకూ‌ వలె ప్రాసనియమం ఉంది. ఈ వృత్తపు గురులఘుక్రమం UII UUU IIU U.

ఈ వృత్తానికి రుగ్మవతి అని లక్షణకారులు ఎందుకు అంటున్నారో తెలియదు. రుక్మం అంటే రోగం. కాబట్టి రుగ్మవతి అంటే రోగిష్టిది అని అర్థం వస్తున్నది. బాగోలేదు కదా! అందుకని ఈ వృత్తాన్ని మనం కొంచెం పేరు సరిచేసి రుక్మవతి అందాం. రుక్మం అంటే బంగారం కాబట్టి రుక్మవతి అంటే బంగారుతల్లి అన్నమాట హేమవతి అన్నా అదే అర్థం కదా.

ఒక తమాషా ఏమిటంటే ఈ రుక్మవతికి చంపకమాల, చంపకమాలి  అన్న పేర్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ‌వృత్తం‌లోని గురులఘుక్రమం మనకు కందవినోద (UIIUUUIIUUU), కాముకలేఖ (UIIUUUIIUUI), కృతమాల(UUIIUIIUUUIIUU), నాసాభరణం (UUIIUUUIIUUIIU), మణిజీర(UUUUUUUIIUUUIIUUUU), నిష్కళాకాంతి (UIIUUUIIUUUIIUUIIUUIIU), వాసకలీల(UIIUUUIIUUUIIUUUIIUUUU), కోకపదం (UIIUUUIIUUIIIIIIIIIIIIUU), క్రోశపద (UIIUUUIIUUIIIIIIIIIIIIIIU) వృత్తాల్లో కనిపిస్తోంది. సౌలభ్యతకోసం క్రీగీటులతో చూపాను గమనించండి.

 ఈ రుక్మవతిలో చివరన ఉన్న గురువును తొలగిస్తే అది మణిమధ్యం అవుతుంది.

గురులఘుక్రమం UII UUU IIU U. పాదానికి మొత్తం 16మాత్రలు. యతిస్థానం 8మాత్రల తరువాత వస్తున్నది సమద్విఖండనంగా. గురులఘుక్రమాన్ని UII UU UII UU అని భ-గగ + భ-గగ అని కూడా చూస్తే విషయం మరింత స్పష్టంగా బోధపడుతుంది.  నడక విషయానికి వస్తే ఈ విభజన ప్రభావం‌ చక్కగా కనిపిస్తుంది.ఇవన్నీ చతుర్మాత్రాగణాలు కాబట్టి పద్యం నడక చతురస్రగతిలో ఉంటుంది.

తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగ జూచే స్వామివి నీవే
యుల్లము నన్ ధ్యే యుండవు నీవే
నల్లని వాడా నా రఘు రామా