31, జనవరి 2023, మంగళవారం

కోపమేల తాపమేల కొంచ మాగి వినుము


        (కాఫీ)

కోపమేల తాపమేల కొంచ మాగి వినుము
పాపమైన పుణ్యమైన పరగు నీ కర్తృత్వము

నా వద్ద కీవు వచ్చి న న్నడుగుచున్న దేమి
కావలయు ధనము లని కావలయు పదవు లని
నా విభవమేమి నీవు నాకు లంచ మిచ్చు టేమి
నీవు చేయు పాపములను నేను మన్నించు టేమి

జీవుల స్వాతంత్ర్యమును దేవు డేల హరించును
భావించి మంచిచెడుగులు వర్తించ వలయును
నీవు ప్రకృతివశుడ వైన నేనేమి చేయుదును
కావ మన్న నాడు కద కాపాడ రాగలను

నీ నిజ తత్త్వమును నీవెఱుగక యుండి
నే నుంటినా యని లోన శంకించు టేమి
పూని నేను నాదను బుధ్ధి పోనాడి కర్మము లెల్ల
మాను దేని నీవే నేను నేనే నీ వంతియె రామ


నేను నేనే కాను నీవాడ గాని...

నేను నేనే కాను నీవాడ గాన
నేను నీ దయచేత నిలచితి గాన


ఏనేల నైతినో యిటుల నీవాడ
నేనాడు నేలోప మింతయును లేదు
నీ నా విబేధము లించుక లేక
ప్రాణంబుగా నిలిచి పాలించె దీవు
నేను

నాలోన నిలచిన నావాడ వీవు
నాలావు నీవయ్య నాయున్కి వీవు
చాలు నాకిది యింత చక్కని చెలిమి
కాలమైనను గాని కదలించ లేదు
నేను

ఇది నీదు లీల యని యెఱుగుదు నేను
ఇది నాకు వరమని యెఱుగుదు నేను
వదలి యుండగలేని వాడనైతి నేను
వదలి యహమును నిన్ను బడసితి రామ 
నేను


ఇంకొక్క మాట....

మరల నింకొక మాట మనవిచేసెడు లోన
మరలిపోతివి నిన్న మంచి స్వప్నము లోన


చిరునవ్వు వెన్నెలలు చిక్కగా కురిపించి
మురిపించి ఎన్నెన్నొ ముచ్చటలు పలికి
నిరుపమానం బైన నీ దయలు చిలికి
మరి నాదు పొగడికలు మన్నించి వినుచు
మరల

నా కడకు వత్తువు నన్ను మన్నింతువు
నీ కడకు యేనాడు నేను వచ్చెదనని
వేడుక మీరగ వినయంబుతో‌ నిన్ను
వేడగ నెంచి నే విన్నవించగ నుండ
మరల

ఎన్నాళ్ళ నుండియో నన్నెఱుగిన రామ
అన్నియు నెఱిగి నా యాశ నీ వెఱురగవా
ఇన్ని యాశలు దీర్చి యీ యాశ దీర్చవా
అన్న మాటను నే నడుగ బోయెదనని
మరల


పొందినవే చాలు

పొందినవే చాలు పుడమిపై నీ జీవి
చెందనీ యిక రామ చెలగి నీ సన్నిధి

మాటికొక వేషమున మరలి వచ్చుట చాలు
పూటపూటకు భుక్తి నాటకమ్ములు చాలు
ఆటుపోటుల కోర్వ కలమటించుట చాలు
నేటికైనను నిన్ను నేను చేరుట మేలు

తొల్లింటి ప్రజ్ఞను తొలగియున్నది చాలు
డొల్లచదువుల వలన కొల్లపడినది చాలు
కల్లనడతల వలన కలతబడ్డది చాలు
చల్లగా నిను చేరి సంతసించుట మేలు

భయదభవవార్ధిలో పడి యీది నది చాలు
పయనించి పయనించి బడలుకొన్నది చాలు
దయలేని కాలమిడు దండనంబులు చాలు
రయమున నినుచేరుటయె చాల మేలుపొద్దుపోక నేను నిన్ను పొగడేనా

పొద్దుపోక నేను నిన్ను పొగడేనా రామా
వద్దన్నా పొగడకుండ వదలను గాక

పొద్దు పొడవక ముందుగనే పొగడుచును నీగుమ్మము
వద్ద గుమిగూడుదురే బ్రహ్మాదులు
పొద్దుపోక వచ్చువారే పొగడగను వారందరును
వద్దయ్యా దెప్పుడుమాటలు వద్దేవద్దు

వేళాపాళా లేకుండగ వచ్చి పొగడు నారదునకు
కాలక్షేపము కాదనా కమలాక్ష
నీలగళుడు ప్రొద్దుపోక నిన్నుపొగడు చున్నవాడో
చాలునయ్యా పొగడకుండజాలకే కదా

అంతటివారు నిన్ను పొగడు నంతగా నేపొగడలేను
ఇంతవాడ వనుచు తెలియ నెంతవాడ
ఎంతోకొంత నాకు తెలిసినంతగాను పొగడకున్న
అంతేలే ప్రొద్దుపోదని యనుకో నాకు

 

అప్పుడు కోపగించవయ్య నారాయణా

అప్పుడు కోపగించవయ్య నారాయణా నీవిప్పుడేల పలుకవయ్య నారాయణా

ఒక్కనాడు నిన్ను మరచి నారాయణా వేరొక్కని భజించితేను నారాయణా
ఒక్కనాడు నిన్ను కాక నారాయణా వేరొక్కని పూజించితేను నారాయణా
ఒక్కనాడు స్వల్పములకు నారాయణా వేరొక్కని నే పొగడితేను నారాయణా
ఒక్క కల్లగురువు నైన నారాయణా నేనొక్కసారియు నమ్మితేను నారాయణా
ఒక్కనాడు నీకీర్తనము నారాయణా నేను చక్కగాను చేయకున్న నారాయణా
ఒక్కచోట నిన్ను గూర్చి నారాయణా నేను చక్కగాను పొగడకున్న నారాయణా
ఒక్కరు నిన్ను నిందించిన నారాయణా నేనక్కట బుధ్ధిచెప్పకున్న నారాయణా
ఒక్కమాట నిన్ను గూర్చి నారాయణా నేను తక్కువపరచితేను నారాయణా
ఒక్క దుర్మతమును మెచ్చి నారాయణా నే నొక్కమాట పలికితేను నారాయణా
ఒక్క సుఖము నందు మునిగి నారాయణా నిన్నొక్కక్షణము మరచితేను నారాయణా
మ్రొక్కకుండ రామా యనుచు నారాయణా నే నొక్కపనికి పూనుకొన్న నారాయణా
ఒక్క తప్పు నిట్టి దొకటి నారాయణా నేనొక్కసారి చేసితినేని నారాయణా

30, జనవరి 2023, సోమవారం

అంటకాగి యుండుటే

అంటకాగి యుండుటయే హరికి సంతోషం

కంటిపాపలే భక్తులు కమలాక్షునకు


పాపకార్యములు మాని కోపతాపములు విడిచి

శ్రీపతియే శరణమని చిత్తశుధ్ధి

దీపించ శరణుజొచ్చి దీనజనావనుని తనను

కాపాడు మనుచు నరుడు కడు నిర్ణలుడై


మనసారా తనను నమ్మి తనను చిత్తమున నిలిపి

మనుజు డొక్కడు రాముని మహిని నిలిచి

అనయంబును గొలిచేనో అతని యోగక్షేమములు

కనుగొనుచును ప్రీతుండై కటాక్షించి వానినే


ఇన్నిపాట్లు పడనేల

ఇన్నిపాట్లు పడనేల యిన్నిచిక్కులేలనే
అన్నీ శ్రీరామచంద్రు నడుగవె మనసా

అడ్డమైన వారి గొలిచి అన్నివేళలను నీవు
గొడ్డుచాకిరితో నీవు కుములగ నేల
నడ్డివిరుగగొట్టు వారి నమ్ముటెందుకు నీవు
దొడ్దదొర రాముని దయ దొరకుచుండగ
 
బంటుగాళ్ళు దేవతలను బ్రతిమలాడు టెందుకే
కొంటెవాళ్ళు వారు నీకు కొసరేదేమి
అంటకాగి రామునితో ఆన్నీ నీవందుకొనక
తంటాలేల అదేవతలతో నీకు

ఎవరెవరో గురువులనుచు నెంచి సేవించుకొని 
చివరకు మోసపోవు చీదరెందుకే
పవనజసంసేవ్యుడై భువనత్రయనాథుడై
రవికులేశుడై గురువై రాముడుండగా
 
 

పరవశించి శ్రీరాముని పరంధాముని

పరవశించి శ్రీరాముని పరంధాముని
హరిని పొగడ కున్నచో నదియొక బ్రతుకా

మది నిండుగ విమతీయుల మాటలు గ్రుక్కి
మదమెక్కి హరినిందను మానకజేసి
విదుడ ననుచు గర్వించెడు వెంగళి నరసి
యది వాని కర్మమనుచు మది నెఱుగుడీ

హరిని చూచి కాని నమ్మ ననువా డొకడు
హరి లేడు నమ్ముటేమి యనువా డొకడు
హరి చరితము దుష్టమని యనువా డొకడు
బిరుసు లిట్టు లాడువారు వెఱ్ఱు లెఱుగుడీ

హరిని పొగడు టానందం బనెడు సంగతి
హరిని పొగడు వారెరుగుదు రన్యులు కారు
హరిని తెగడుచుండు వారి దాత్మవంచన
సరిసరి కన్నులు మూసిన జగ మబధ్దమె

నిన్ను మెచ్చే కన్నులున్నవి

నిన్ను మెచ్చే కన్నులున్నవి నిన్ను పొగడే నాలుకున్నది
నిన్ను కోరే చిత్తమున్నది నిన్ను విడువని బుధ్ధి యున్నది

ఇంకా యేమేముండా లయ్యా యేమయ్యా ఓ రామయ్యా
శంకా వంకా అంటూ తండ్రీ యింకా నీకే ముంటుం దయ్యా

తెల్లారిందే చాలంటూ నీ దివ్యకీర్తనలె పాడెదనయ్యా
కల్లాకపటం లేకుండా నే నెల్లవేళలను పొగడెద నయ్యా

ఊళ్ళోవాళ్ళను మెప్పించాలని ఒక్కనాటికిని పలుకను గదరా
మళ్ళీమళ్ళీ పుట్టించక నీ మరుగున నుండే భాగ్యమీయరా


మౌనస్వామివిరా నీవు హరి

మౌనస్వామివిరా నీవు హరి మాతో నెన్నడు మాటాడవురా

పోనీలే నీచల్లనిచూపులు భూరికృపామృతవర్షముతో
పూని వచించెడు నభయవాక్యములు పురుషోత్తమ హరి సర్వేశా

పోనీ వయ్యా నీదగు త్రిభువనమోహనకరదరహాసమ్మే
దీనత నీకెన్నడు రాదనుచు తెలుపుచు నుండును రఘురామా

పోనీలే నీవరదాభయకరముద్రలు యోగక్షేమములు
మానక మేమే చూచెద మనుచును మాతో పలుకుచు నుండునులే

పోనీలే నీపదనఖతేజఃపుంజములే మము పొదవుకొని
నీ నిజతత్త్వము నెఱుకపరచుచు నిత్యము మాతో‌ పలుకునులే

పోనీలే నీనామస్మరణము మానక యుండిన నొకనాడు
నీనివాసమున సంతోషముగా నీతో ముచ్చట లాడుదులే


చేసినట్టి సంసారమునే చేసి చేసి చేసి రోసి

చేసినట్టి సంసారమునే చేసి చేసి చేసి రోసి
రోసి రోసి తుదకు హరికి దాసుడ నైతి

పేరాశల పల్లకి నెక్కి వేల వేల మార్లూరేగి
సారెకు సారెకు నేలకు జారి పడుచునే

మెచ్చనట్టి పరివారమునే మేపి మేపి మేపి వారి
పిచ్చిపిచ్చి కోర్కులిచ్చి  పిచ్చి నగుచునే

ధనపిశాచి కరుణను కోరి పనవి పనవి పనవి దాని
వెనుకవెనుక తిరిగి చెడుచు వెఱ్ఱి నగుచునే

శరణు జొచ్చి శ్రీహరి నిప్పుడు మరల మరల మరల వేడి
మరల మరల పుట్టని యటుల వరము పొందితి


29, జనవరి 2023, ఆదివారం

హరి హరి హరి యనవయ్యా

హరి హరి హరి యనవయ్యా హరినామము చాలయ్యా
హరిని మరచు నరుడు భవము తరియించుట లేదయ్యా

రామనామము నాలుకపై రవళించుచు నున్న చాలు
నామ మదే తారకమగు నారాయణుడు తోడు

హరేరామ యన్న చాలు హరేకృష్ణ యన్న చాలు
నరుడు మరల పుట్టబోడు నారాయణుడు తోడు

పరాత్పరుని నామములను భక్తితో స్మరించునట్టి
నరోత్తములు తరించెదరు నారాయణుడు తోడు


భక్తి లేదా ముక్తి లేదు

భక్తి లేదా ముక్తి లేదు

భక్తి వినా యుక్తి లేదు


భక్తుడై శ్రీరామనామము పలుకువాడు నేడోరేపో

ముక్తుడగుట తథ్యము ముమ్మాటికి నిది నిజము


రక్తుడై సంసారమందున రామా కృష్ణా యనుటొకటే

యుక్తి యన్న సంగతి మ‌రచిన యొక్కడును తరింపడే


మరులుగొలుపు సంసారమ్మే మంచి సుఖంబనే భ్రమను

న‌రుడు విడిచిపెట్టిన నాడే హరిని హృదయ మందు గనును


హరిపైనను గురియే లేనిది తరణోపాయ మన్నది లేదు

హరిభక్తుడు చెడుటే కలుగదు మరలమరల పుట్టబోడు


మాకు ప్రసన్నుడవు కమ్ము


మాకు ప్రసన్నుడవు కమ్ము మంగళనామా మాకు

నీకన్నను హితులెవ్వరు నీరదశ్యామా


సాకేతరామ హరి లోకాభిరామ

వైకుంఠధామ హరి పట్టాభిరామ

శ్రీకర హరి సుగుణధామ శివవినుతనామ

మాకు వరములీయ వయ్య మాదైవమా


నీనామము విడువము హరి నిన్నెన్నడు మరువము

ఏనాడును పరులను హరి లోనెంచి వేడము

దానవకులకదళీవనదావానల రఘురామ

మానవేంద్ర దీనావన మాదైవమా


28, జనవరి 2023, శనివారం

ఇంత మంచి నామమని యెఱుగ నైతిని

ఇంత మంచి నామమని యెఱుగ నైతిని
ఎంత పొరబడితిని ఎంత వెఱ్ఱి నైతిని

సదాశివు డెల్లప్పుడు జపియించు నామమట
ముదంబున బోయనైన మునిగా నొనరించునట

నాతినైన కోతినైన నమ్మకముగ బ్రోచునట
ఆతురుడై పలికితే అభయమ్ము నొసంగునట

పాపాటవు లన్నిటిని భస్మమొనరించునట
శాపగ్రస్తు లాశ్రయించ చల్లగ రక్షించునట

మరందమే దీనిముందు మరీచప్పనైనదట
స్మరించితే భవంబునే తరించుటే తధ్యమట

శ్రీరామా నీనామము చేయక పొరబడితిని
ఔరౌరా యెఱుకలేని కారణమున చెడిపోతిని

 

మానను నీనామము మాను మనుమానము

మానను నీనామము మాను మనుమానము
నానాలుక నీనామము కాని రుచి కాదనును

మునుల కెల్ల రుచియైనది మోహనాశకరమైనది
హనుమదాదు లుపాసించి ఘనత గన్నది
మనుజుల కిది భవతారక మంత్రమై వెలసినది
వినుము దాని విడచి పెట్టు వెఱ్ఱివాడనా

ఆనక చేసెద నేనని యాలసించి యాలసించి
మేను విడచి చెడిపోవగ నేను వెఱ్ఱినా
మానక భక్తుల నెల్ల మానక రక్షించు నట్టి
నీనామము మానుదునా నేను వెఱ్ఱినా

రామనామమునకు సాటి యేమియు లేదనుచు నెఱిగి
నీమముగ స్మరింతునే నిశ్చయంబుగ
నీమహామహిమ నెఱిని నీవు ముక్తి నిచ్చు టెఱిగి
ఏమిటికని విడచెద నేనేమి వెఱ్ఱినా


ఆ రామనామమే

 ఆ రామనామమే అన్నియు మాకు


ఆడంబర గృహములపై ఆశలు లేవు

రత్నభూషణముల పైన భ్రమలవి లేవు

వాహనముద్రాధికారవాంఛలు లేవు

దేహసౌఖ్యములను గూర్చి దిగులే  లేదు

అన్నపానంబుల చింత యన్నది లేదు

పదుగురి మెఱమెచ్చులతో పనియే లేదు

రాజగౌరవములపైన భ్రాంతియె లేదు

శాస్త్రంబుల నెఱుగమను విచారమె లేదు

మంత్రదీక్షలందు మాకు మనసే లేదు

బుద్బుదములు తనువులపై మోహము లేదు

దుష్టులకడ చేయుచాచు దుర్గతి లేదు

తడవకొక్క దైవంబును తలచుట లేదు

పేరుప్రతిష్టలను గూర్చి పిచ్చియె లేదు

పిచ్చిలోకమున సుఖము వెదకుట లేదు


శ్రీరాముని శుభనామము

శ్రీరాముని శుభనామము స్మరించుమా నిరంతరము

మారుజన్మ మికలేదని మనసులోన నమ్ముకొనుము


నిరంతరము పరులసేవ నిజదారాసుతసేవల

నరజన్మము లెన్ని గడపినావో యది లెక్కలేదు

స్మరించుచు ధనములకై చాలసాధనములు నీవు

తరించెడు మార్గమునే స్మరియించక తిరిగినావు


బహుదైవముల స్మరించి బ్రతికితవి బహుభవములు

బహుమంత్రములు జపించి వదలినవియు బహుళములు

ఇహపరముల నుభయమ్ముల నిచ్చు రామనామమునే

బహుశ్రధ్ధగ చేయకున్న ఫలితమేమి నీకు గలదు

పిచ్చివాడను కాలేనా అచ్చుతుడా నీకొఱకు

పిచ్చివాడను కాలేనా అచ్చుతుడా నీకొఱకు
పిచ్చివాడనైతి మున్నే వేలమార్లు వేయింటుకి
 
పిచ్చివాడ నైతినిరా వీరరాఘవా నేను
మచ్చెకంటులు వలపుల మరగి వేలమార్లు
పిచ్చివాడ నైతినిరా వెండిబంగారములకై
హెచ్చుగ ప్రయాసపడుచు నెన్నోవేల మార్లు
 
పిచ్చివాడ నైతినిరా ప్రేమనందుకొను వారే
పిచ్చి నిందలు మోపగ వేలమార్లు సురుగి
పిచ్చివాడ నైతినిరా పిదపబుధ్ధి యదికారుల
హెచ్చుగ సేవించలేక నెన్నో వేల మార్లు
 
పిచ్చివాడనై గడపితి వేలాదిగ జన్మముల 
పిచ్చివాడను కాలేనా విభుడా నీకొఱకు
ముచ్చటగ రామా నిన్ను ముప్పూటల స్మరించుచు
పిచ్చియెక్కి ప్రపంచమే విడిచితే తప్పేమి


27, జనవరి 2023, శుక్రవారం

చాలదా రామనామము జనులారా మీకు

చాలదా రామనామము జనులారా మీకు
చాలదా రక్షించగ సర్వవిధముల

చాలవా మీరెత్తిన జన్మంబులు కోట్లకొలది
చాలవా పొందినట్టి సకలకష్టములను
చాలవా మీకు భూమిజనులతోడి సంగతులు
చాలవా యీ బ్రతుకులు సంసారములు

చాలవని సుఖములేవో చాల పాట్లు పడిపడి
చాలవని నూరేండ్లును సతమతమై నంత
చాలునా యుగములైన జనులారా మీకు
చాలునిక బయటపడుట మేలు సుండీ

రామనామ మిచ్చునండి కామితార్ధములను మీకు
రామనామ మెల్లప్పుడు రక్షించును మిమ్ము
రామనామ మిచ్చునండి రక్తిముక్తు లందరకు
రామనామమే చాలని రండి తరింప

నీనామము పలుక నొల్లని నిర్భాగ్యులతో

నీనామము పలుక నొల్లని నిర్భాగ్యులతో
నేనాడును సాంగత్యము నీయకుమయ్య
 
కలరు కదా లోకమందు ఘనులు సత్యవర్తనులు
కలనైనను నీనామము తలచునట్టి వారు
కలరు కదా లోకమందు తలపులన్ని నీమీదను
నిలిపి చరించెడు వారు నీరేజాక్ష

చక్కగా భాగవతుల సాంగత్యము నీయవయ్య
నిక్కువముగ బాగుపడ నేర్తును గద నేను
మక్కువ నీపైన నున్న మహాత్ముల సాంగత్యము
చిక్కినట్టి వాడికింక చింతలుండునా
 
హరేరామ హరేకృష్ణ యనెడు వారితో గాక
హరిసేవాపరాయణు లగు వారితో గాక
పరమపురుష మూర్ఖుడనై  భ్రష్టబుధ్ధు లగుచు తిరుగు
నరు లితరులతోడ గలియ నాకు పనేమి

25, జనవరి 2023, బుధవారం

రామా నీనామమేరా సులభము

 

రామా నీనామమేరా సులభము
రామా నీనామమేరా సుఖదము

సతతనియమసహితులకును
పతితులకును భ్రష్టులకును
చతురులకును జడులకును
అతిశయముగ నందరకును

బహుసరళము పలుకుటకు
బహువిధముల భక్తులకు
బహుఫలముల నహరహమును
బహుళముగను ప్రసాదించు

చపలత్వవిసర్జజకమును
అపమృత్యుభయాపహమును
అపవర్గప్రదాయకమును
జపనీయము సర్వులకును

 

ఏమి చేయువాడ నింక


ఏమి చేయువాడ నింక రామచంద్రుడా నేను

పామరుడ నైతినిరా భగవంతుడా


భాగవతుల సేవ యనెడు భాగ్యము నాకబ్బలేదు

త్యాగబుధ్ధి యన్న నేమొ యసలు తెలియనేలేదు

యోగధనుల గూ ర్చి నాకొక్కింతయు నెఱుకలేదు

రాగరహితచిత్తవృత్తి రామరామ అడుగరాదు


తెలిసీతెలియక చెడినది దేవుడా కొంతగ బ్రతుకు

తెలిసి తప్పులే చేయుచు తిరుగ చెడెను మిగిలినది

తెలియనైతి సన్మార్గము తెలియనైతి నిన్నుగూర్చి

తెలిసి నేడు నీదు పాదములను శరణు జొచ్చచుంటి నేడు


దయాశాలి యన్న బిరుదు దాల్చినట్టి వాడ వీవు

రయంబున భక్తజనుల రక్షించెడు వాడ వీవు

ప్రియవిభావనా వేదవేద్య నన్ను రక్షింపుము

భయార్తుడను పతితుండను పాహిపాహి యనుచుంటినిస్మరించుమా స్మరించుమా

స్మరించుమా స్మరించుమా సదా రామనామము
తరించుమా తరించుమా తప్పక భవసాగరము

రాతినే నాతిని జేసిన రమ్యనామము
కోతినే బ్రహ్మను జేసిన గొప్పనామము

ప్రీతిగాను శివుడు చేసెడు విష్ణునామము
భూతలవాసులను బ్రోచెడు పుణ్యనామము

వాతాత్మజ సన్నుతమైన పూతనామము
సీతాహృదయంబున వెలుగు చిందునామము

మహిమ నెంతో గొప్పదైన మంత్రరాజము
మహిమాన్వితు లర్చించెడు మంత్రరాజము

 

కోటిజన్మముల నెత్తును కానీ

కోటిజన్మముల నెత్తును కానీ కొంచెము బుధ్ధియు రానేరాదే

ఎన్నో మారులు ప్రోగిడి విడచిన యీకాసులనే యేరుచు తిరుగును
ఎన్నో మారులు పడిపడి చదివిన యూచదువులనే యింకను చదువును
ఎన్నో మారులు రోయుచు చేసిన యీసంసారమునే తాజేయును
ఎన్నో మారులు చేసినపాపము లేమరిమరియును చేయుచు పోవును

ఎప్పటి వలెనే అల్పములకునై తిప్పలు పడుచును తిరుగుచు నుండును
ఎప్పటి వలెనే దేవత లందర కెన్నో ముడుపులు కట్టుచు పోవును
ఎప్పటి వలెనే చెనటుల స్నేహము లెన్నడు మానక చేయుచు నుండును
ఎప్పటి వలెనే తప్పుల పైనను తప్పులు చేయుచు బ్రతుకుచు నుండును

మాటిమాటికిని నిన్నుమరచును మసలుచు నుండును జడుడై ధరపై
మాటిమాటికిని తారకనామము మరువగ రాదను మాటే‌ మరచును
మాటిమాటికిని ముదిమి మీదబడ మరిమరి రామా నిన్నే తలచును
ఏటికి నీశుభనామము వయసున నెంచడు మనుజుడు దేవా


సీతారామా సీతారామా చిన్మయరూపా

సీతారామా సీతారామా చిన్మయరూపా సీతారామా

శ్రీరఘునందన సీతారామా శ్ర్రితజనపోషక సీతారామా
నారాయణ హరి సీతారామా నారదసన్నుత సీతారామా

వారిజనయనా సీతారామా వాసవవందిత సీతారామా
కారణకారణ సీతారామా కంజదళాక్షా సీతారామా

యజ్ఞస్వరూపా సీతారామా యజ్ఞవివర్ధన సీతారామా
యజ్ఞరక్షకా సీతారామా యజ్ఞఫలప్రద సీతారామా

నీరదశ్యామా సీతారామా నిర్మలచరితా సీతారామా
మారజనక హరి సీతారామా మంగళదాయక సీతారామా

దశరథనందన సీతారామా దైత్యవినాశక సీతారామా
దశముఖమర్ధన సీతారామా దర్మస్వరూపా సీతారామా

పరమానందా సీతారామా వైకుంఠధామా సీతారామా
పరమపురుష హరి సీతారామా పతితపావనా సీతారామా

 

24, జనవరి 2023, మంగళవారం

ఆరయ శ్రీరామభక్తుని

ఆరయ శ్రీరామభక్తుని జీవనం బద్భుతంబుగ నుండవలెను

శ్రీరామచంద్రుడే పరదైవతంబని యూరకే పలుకుట కాదు ఆ
శ్రీరామచంద్రునే చిత్తమందున నిల్పి చింతించుచుండగ వలెను

రామనామము నాకు ప్రాణాధికంబని యేమేమో పలుకుట కాదు శ్రీ
రామనామపు దివ్యమాధుర్యమే తన ప్రాణంబుగా నుండ వలెను

రామకోటిని వ్రాయుచున్నంత మాత్రాన ప్రత్యేక పలమేమి లేదు శ్రీ
రామనామము నొక్క ఘడియైన మరువక ప్రేమతో జపియించ వలెను

రామభక్తులకన్న యోగు లుండరనుచు ప్రకటించి ఫలమేమి లేదు శ్రీ
రామచంద్రుని సర్వాత్మనా గొలుచుచు ప్రభుసేవలో నుండ వలెను


23, జనవరి 2023, సోమవారం

నీవే గొప్పవాడవు శ్రీరామ

నీవే గొప్పవాడవు శ్రీరామ నీవేలే మాదొరవు
నీవంటి దొరలేడు నిజముగవేరొకడు

చూడ దిక్కుల నేలుచుండు వేల్పుల కన్న
ఏడేడులోకాల నేలు నింద్రున కన్న
వేడుక సృష్టి గావించు నజున కన్న
ఱేడా చాలాగొప్ప వాడవురా నీవు

నీవేల తెలియవో నీగొప్ప శ్రీరామ
భావింతువు నరపతికొడుకు నని
దేవుడవని నిన్ను తెలిసిన బ్రహ్మాది
దేవతలే పొగడ తెల్లబోదువు గాని

త్యాగధనుడవు నీవు యోగీంద్రవరదుడవు
భోగీంద్రశయనుడవు మోక్షప్రదుడవు
రాగాది రహితుడవు రాక్షసాంతకుడవు
నీగొప్ప తెలియగ నేర రింకొక్కరు


ఎటుల నిన్ను వేడుకొందురా

ఎటుల నిన్ను వేడుకొందురా రామయ్య నే

     నెటుల నిన్ను చేరుకొందురా


నారాయణ నీమహిమలు నమ్మనట్టి మొండివాడ

సారసాక్ష నీదు దివ్యచరిత మెఱుగనట్టి వాడ


త్యాగములకు యోగములకు నామడదూర ముండువాడ

భోగంబుల మీద చాల బుధ్ధినిలిపి చెడిన వాడ


లోగిలిలో నినునిలిపి సాగిలపడి మ్రొక్కనివాడ

భాగవతుల సేవనైన బాగుగను చేయనివాడ


వ్రతములు జపములు తపముల వంక కెపుడు బోనివాడ

సతతము నీనామస్మరణ చక్కగను చేయనివాడ


భ్రష్టుడనై యీనాటికి భక్తి కలిగినట్టి వాడ

యిష్టునిగా నెంచి యాదరింప మందు నింతకన్న


21, జనవరి 2023, శనివారం

రామగేహినీ నీయానతిని

రామగేహినీ నీయానతిని రయమున తెలుపుము సీతమ్మా
రాముడు రావలె హనుమన్నా యింకేమని చెప్పుదు హనుమన్నా

వినుము రావణుని పరిభవించి రఘువీరుని సన్నిది చేరెదనో
నిను బాధించెడు నీరాకాసుల దునుమి రాముని చేరెదనో
ఘనమగు ఈలంకాపుర శోభను కలచి రాముని చేరెదనో
నిను నా మూపున బహుభద్రముగా మన ప్రభువుకడ చేర్చెదనో

రావణు పరివారమ్మును బలిగొని రాముని సన్నిధి చేరేదనో
రావణు సైన్యము నంతయు బొరిగొని రాముని సన్నిధి చేరెదనో
రావణు పదితల లందున తొమ్మిది రాముని పదముల నుంచెదనో
రావణసహితముగా యీలంకను రాముని పదముల నుంచెదనో

గాలిపట్టి నిజరూపము నిప్పుడు కంటివి చక్కగ సీతమ్మా
ఆలసించ వలదానతి యిచ్చిన నట్లు చేయుదును సీతమ్మా
నీలమేఘస్వరూపుడు రాముడు నేడో రేపో సీతమ్మా
కాలగతికి యీ రావణు బుచ్చును కళవళపడకుము సీతమ్మా
 

వట్టిమాట లెందుకయ్య

వట్టిమాట లెందుకయ్య పట్టాభిరామ చేయి

పట్టి విడువకుంటే చాలు పట్టాభిరామ


సకలలోకములకు నీవు చక్రవర్తివై భక్తు

డొకడు బాధలనుభవింప నొప్పుకొందువా

ఒకనాటికిని నొప్పననుచు నురక జెప్పేవో వచ్చి

చకచక చిక్కలు తీర్చుట గలదో సాకేతరామ


కుమతుల గూల్చు.వాడననుచు గొప్పలు చెప్పేవు వారు

సుమతుల నేర్చుచుండ నురక చూచుచుందువో

శ్రమయనుకొనుక నీవు వచ్చి రక్షణనిచ్చేవో యింక

సమవర్తికిని జంకను నేను సాకేతరామ


తారకనామము చేసిన ముక్తి తథ్యమందువు నిన్ను

కూరిమి తలచువాని కష్టము కూలద్రోయవా

ప్రారబ్ధములు తప్పవనుచు పాటపాడేవో వచ్చి

సారెకు చక్రమడ్డేవో ఓ సాకేతరామ


20, జనవరి 2023, శుక్రవారం

వెన్నవంటి హృదయమున్న వెన్నుడా

వెన్నవంటి హృదయమున్న వెన్నుడా నీవు
మన్నింతు వని నమ్మి మనవి జేసెద

సురలకష్టములను నీకు సురపతిప్రముఖులు వచ్చి
మొఱలిడకయ తెలియకుండ బోలు గాక
సురలమాట మన్నించుచు ధరను జొచ్చి రాముడవై
పరమపురుష కష్టములను పడితి వయ్య

నరుల కష్టములను నీవు నారదుండు వచ్చి చెప్పు
వరకు తెలియకుందు వనుచు భావింపను
నరుడవై ధరపై తిరిగి నరులకష్టములను తెలిసి
మరల నిదేమి మావిన్నపములు వినవు

రామచంద్ర నీవు పూని రక్షించక యుందువేని
భూమి నింక నెవరు మమ్ము బ్రోవగలరు
స్వామీ రావలయునింక జాగుచేయవలదనుచును
మేము విన్నవించుచుంటి మేమందువు

 

రాముడే నాకొడుకు పొమ్మని

రాముడే నాకొడుకు పొమ్మని రాణి కైకమ పలుకును
రామరో యిక భరతు డెవడని రాజు పకపక నవ్వును

భరతుడా శ్రీరాము బంటని భామినియు వివరించును
భరతు డొప్పు కొనని యపుడని ప్రభువు నవ్వుచు పలుకును
పురమును శ్రీరాము డేలును భరతు డాతని బంటని
తరుణి తర్కము లేవదీయును దాని కాపతి యొప్పును
 
ఎంత కాదను కొన్న గానియు నింతి భరతుని తల్లివి
ఎంత కఠినురాల వాతని నిపుడు బంటుగ జేస్తివి
సుంత యోచన చేసిచూడవె సుదతి బంటుకు తల్లివై
అంతలో నృపు బంటుతండ్రివి యంటివని పతి నవ్వును
 
ఏమి నృపుడవు బాలరామున కిపుడు గుఱ్ఱము వైతివి
రాము డేమో గుఱ్ఱమెక్క భరతుడు వానికి వెంట నడచె
భూమి పతుల వెంట నడచెడు బుధ్ధి బంటుల కమరదె
రామచంద్రుని  బంట్లు గూడను భూములేలుదు రను సతి 
 


శ్రీరఘురామా సీతారామా

నారాయణ హరి దయగనరా నమ్మితిరా నిను దయగనరా

శ్రీరఘురామా సీతారామా శ్రితజనపోషక దయగనరా
తారకనామా దశరథరామా దనుజవిరామా దయగనరా
నేరక యెన్నో తప్పులు చేసితి నేడు మారితిని దయగనరా
మారజనక నీనామామృతమును మరిగితినయ్యా దయగనరా
 
మునిజనకామిత మోక్షప్రదాయక మోహవిదారక దయగనరా
వనజదళేక్షణ వనజాసననుత వందితశతమఖ దయగనరా
తనువు నిత్యమని తలచి చెడితిని తప్పు తెలిసితిని దయగనరా
ఇనకులతిలకా నీనామము నిక నెన్నడు విడువను దయగనరా
 
కామితదాయక కరుణాసాగర కారణకారణ దయగనరా
కోమలనీలసరోజశ్యామా కోదండధరా దయగనరా
పామరుడను నే సంసారంబున పడియుంటిమిరా దయగనరా
ఏమరకను నీ‌నామము చేసెద స్వామీ నన్నిక దయగనరా
 
త్రిజగత్కారణ త్రిజగన్నాయక త్రిజగత్పోషక దయగనరా
త్రిజగస్సేవితదివ్యపదాంబుజ దీనజనావన దయగనరా
గజగజలాడుచు యమునకు నేను కడువెరతునురా దయగనరా
విజయరాఘవా నీనామము నే విడువను విడువను దయగనరా

రాతికి నైనను ప్రాణముపోసిన రామచంద్ర నను దయగనరా
కోతికి నైనను బ్రహ్మపదంబును కొలిచిన స్వామీ దయగనరా
ఖ్యాతిగ భక్తజనావళి నేలు విభీషణవరదా దయగనరా
ప్రీతిగ నీదుపదాబ్జము లంటిన వీనిని నీవిక దయగనరా


హరినామమే రమ్యము

హరినామమే రమ్యము శ్రీ
హరిపాదమే గమ్యము

హరి స్మరణమె జిహ్వకు రుచికరము
హరి చరితమె శ్రవణాలంకారము
హరి రూపమె నేత్రానందంబును
హరి భావన మాకతిప్రియము ఆ

హరికార్యములే యతిప్రియంబులు
హరిసేవకులే యాత్మబంధువులు
హరికొఱకే మాయారాటంబును
హరివిరోధులే యన్యులును అ

హరినామములవి యనంతమైనను
పరమేశ్వరునకు బహుప్రియమైనది
సురుచిరసుందర శోభననామము
నరపతి రాముని నామమట ఆ 

 

19, జనవరి 2023, గురువారం

ఆనంద మెట్టిదొ తెలియవయా

ఆనంద మెట్టిదొ తెలియవయా బ్రహ్మానందమే పొందవయా

కాసులకొఱకై యల్పుల కొలువుల కష్టపడుట యేమానందం
దాసుడవై శ్రీహరికొలువున కడు ధన్యతగాంచుటె యానందం

సురలను గొలుచుచు  స్వల్పంబులకై వరము లడుగుటే మానందం
హరినే గొల్చుచు ఆత్మానందమె వర మడుగుటయే యానందం 

జిహ్వకు నానాచెత్తను మేపుచు చిక్కులు పడుటే‌ మానందం
జిహ్వకు తారకనామము బెట్టి చిక్కుల నణచుటె యానందం

పాపపుపనులను చేసి యంతకుని పాలబడుట యేమానందం
శ్రీపతిపనులను చేసి మోక్షమును చెందుటలోనే యానందం

ముక్తినొసంగని బహుశాస్త్రంబుల పొగడి నేర్చి యేమానందం
భక్తిపరుడవై హరిచరితంబులు పఠియించుటయే యానందం

భామాదాసుండను నొక బిరుదము పొందుటలో యేమానందం
రామదాసుడను బిరుదును పొంది రాణించుటయే యానందం

పలుదుఃఖముల సంసారములో‌ పడియుండుట యేమానందం
కులుకుచు శ్రీహరి పదసన్నిధిలో నిలబడుటే పరమానందం

దేహమె తానను భ్రమలో సృష్టిని తిరుగుచుండుటే మానందం
మోహము విడచి రాముని కొలిచి మోక్షము నందుటె యానందం

వందమార్లు తలలు ద్రుంచి

వందమార్లు తలలు ద్రుంచి ఫలము లేదు రామా
సందిది బ్రహ్మాస్త్రమును సంధించుటకు సూవె

మారీచు నణచిన శరము మరి వీని జంపదనుచు
ఘోరఖరవిరాధుల జంపి కుందె శరము లితని కనుచు
వారిధి నణచిన‌ శరములు పనిచేయ వేమి టనుచు
ఊరక చింతించి తలల నుర్వివేయు టొప్పుగాదు

ఏ డహోరాత్రము లాయె నింతటితో నీవు వీని
తోడ కయ్యమాడు టనెడు దివ్య లీల ముగియ జేసి
వేడుకతో‌ బ్రహ్మాస్త్ర మింక విడువవయ్య వీని పైన
చూడవయ్య యన్యంబుల వీడు చచ్చుమాట కల్ల

కన్నుమిన్ను గానని ఈ కామపిశాచము చావగ
మున్ను సురలు నిశ్చయించి యున్నదీ సుమూహూర్తము
నిన్ను నమ్మి వారెల్లరును నింగి నిలిచి వేచి రదే
తిన్నగాను బ్రహ్మాస్త్రమును దేవా పరగించవయ్య

 

బంతులాడె నమ్మా నేడు

బంతులాడె నమ్మా నేడు భగవంతుడు రాముడు దు
శ్చింతుడైన రావణుని శిరముల నెగిరించుచు

బంగారు కుండలములను బంగారు మకుటములతో
శృంగారమై యున్న చెనటి శిరము లొక్కొక్కటిగ తరిగి
భంగపడి దుఃఖితులైన భామినులకు పగలు దీర
నింగినుండి చూచుచున్న నిఖిల సురగణములు మెచ్చ

ఇంద్రుని గని నవ్విన తల యెగిరె నదే ఇంద్రుడు నవ్వ
చంద్రుని గని నవ్విన తల చక్కగ నెగిరె శశి నవ్వ
చంద్రేద్రాదు లిదె రామచంద్రుని మిక్కిలి పొగడగా యు
పేంద్రుడు బంతులాడగను భీకరుడాయె నసురులకు

ఎగిరిన తలలు పదులాయె నింత లోన నవి వందాయె
తెగిపడు తలలకు సరిపడ తీరుగ శిరములు మొలవగ
జగదీశ్వరుడు రోసమున చకచక నరకుచు నెగిరింప
తగ నవి కొండలుగా భువిని దడదడ రాలుచు నుండగను


18, జనవరి 2023, బుధవారం

గొప్పగొప్ప వాళ్ళు వచ్చి గోవిందుని

గొప్పగొప్ప వాళ్ళు వచ్చి గోవిందుని చాల
గొప్పజేసేరు రామగోవిందుని

ఒడలంతా కళ్ళుజేసుక నొకడు చూచుచున్నా డదె
కడు శ్రధ్ధ మూడు కన్నుల గాంచుచు నున్నా డొకడు
అడిగో నయనాష్టకమున నరయుచు నున్నా డొకడు
వెడద పండ్రెండుకండ్ల వీక్షించు నున్నా డొకడు

అన్నన్ని కన్నులు వెట్టక నందరు మన శ్రీరామునే
తిన్నగాను రెప్పలార్పక తిలకించు చున్నా రిపుడు
ఎన్నగాను వీనికన్నను నెవ్వ డందగాడు సృష్టిని
అన్నన్నా యెంతగ జూచిన నంత బ్రహ్మానంద మనుచు

కన్నుల హరియందాల గ్రోలి కడు మెచ్చి వీరందరును
మిన్నుముట్టగా కీర్తించుచు నున్నారిదే శ్రీరాముని
ఎన్నిమార్లు చూచిన తృప్తియున్నదా యీ గోవిందుని
ఎన్నిభంగుల పొగడిన తృప్తియున్నదా ఎవ్వరికైన


కులుకవే నానోటను గోవిందుని నామమా

కులుకవే నానోటను గోవిందుని నామమా

సలలితమగు నామమా చక్కని రామనామమా


పంచదార కన్న తీపి పంచే మంచి నామమా

మంచివారి కెల్లప్పుడు మదినుండే నామమా

కొంచెము బుధ్ధుల కెపుడు కొరుకుపడని నామమా

అంచితముగ సౌఖ్యతతుల నందించే నామమా


మించు కలిమాయలను మ్రింగివేయు నామమా

వంచనలకు చెడక కాపాడుచుండు నామమా

సంచితమును నాగామిని చక్కబరచు నామమా

మంచిమంచి బుధ్ధులిచ్చి మమ్ము బ్రోచు నామమా


కొంచెపఱచు లోకములలో గొప్పనిచ్చు నామమా

కుంచాలుగ సంపదలను కొలిచిపోయు నామమా

ముంచు శత్రుషట్కమును ద్రుంచునట్టి నామమా

ఎంచి మది స్మరించ మోక్ష మిచ్చునట్టి నామమా


ఎంత మధురం రామనామం

ఎంత మధురం రామనామం ఎంత సరళం రామనామం
ఎంత సులభం రామనామం ఎంత సుఖదం రామనామం

పలికే జిహ్వకు బహురుచికరమై పాటై సాగే రామనామం
పలికే కన్నుల నానందాశ్రువు లొలికించే నీ రామనామం

పలికే తనవున రోమహర్హణము కలింగించే నీ రామనామం
పలికే మనసున మధురభావములు వాహినులయ్యే రామనామం

పలికే బ్రతుకన శుభపరంపరలు ప్రతిదిన మాయే రామనామం
పలికే వారికి భక్తిని ముక్తిని కలిగించే శ్రీరామనామం


రామనామం నాకు సర్వం

రామనామం నాకు సర్వం రామనామం నాకు ప్రాణం

పవలు రాత్రులు నాదు జిహ్వను పలుకుకుండును రామనామం
దివిని భువిని నాదు జిహ్వను తిరుగుచుండును రామనామం

నిలువ నొంటిగ నాదు జిహ్వను నిండినుండును రామనామం
నలుగురెదుటను నాదు జిహ్వను నాట్యమాడును రామనామం

సుదినమందున నాదు జిహ్వను వదలకుండును రామనామం
కుదినమందును. నాదు జిహ్వను కొలువుతీరును రామనామం

నాయదృష్టము నాదు జిహ్వను నడచుచుండును రామనామం
హాయిగొలుపుచు నాదు జీహ్వనె అమరియుండును రామనామం

మాయనణచుచు నాదు జిహ్వను మసలుచుండును రామనామం
పాయకుండగ నాదు జిహ్వను ప్రబలుచుండును రామనామం

రామనామం రామనామం రక్తిగొలిపే రామనామం
రామనామం రామనామం ముక్తినొసగే రామనామం


17, జనవరి 2023, మంగళవారం

రామనామము చాలు నంటే

రామనామము చాలు నంటే రామభక్తుడు శ్రీ

రాముడే నా దేవు డంటే రామభక్తుడు


వ్యాధులై పురాకృతంబులు పాపములు బాధించువేళల

బాధలను తొలగించి తనను బాగుగా రక్షించవలె నన


ఇతరులు నిష్కారణముగా నెంతో నింద చేయువేళల

చతురత చూపించి పరువు చక్కగా నిలబెట్టవలె నన


చోరరాజరుణాదిబాధలు ధీరతను చెడగొట్టువేళల

దారిచూపి భయముబాపి మహోపకారము చేయవలె నన


మోయలేని బరువు తలపై మోపబడిన వేళలందున

హాయిగా విజయమును గూర్చి యండగా తన కుండవలె నన


ఎఱుకగావని వేదవిద్యలు యెడదలో చింతించువేళల

ఎఱుకనిచ్చి స్వస్వరూపము నింపుగా చూపించవలె నన


దారితెన్నని లేని ఈ సంసారజలధిని డయ్యువేళల

భూరికృపతో తనను మోక్షపురమునకు గొనిపోవవలె ననవినవే వినవే రామనామములు

వినవే వినవే రామనామములు వీనుల విందుగను మనసా


దశరథసుతుడై ప్రభవించుటచే దశరథరాముడు రాముడు

సీతమ్మకు మగడైనందులకు సీతారాముడు రాముడు

కోదండముతో దైత్యాంతకుడై కోదండరాముడు రాముడు

రఘువంశమునకు కీర్తిని పెంచిన రాఘవరాముడు రాముడు

పట్టముగట్టుక ప్రజలను బ్రోచిన పట్టాభిరాముడు రాముడు

సాకేతపుర సార్వభౌముడై సాకేతరాముడు రాముడు

రాజై ధర్మప్రభువుగ నిలచిన రాజారాముడు రాముడు

భద్రముగా త్రిజగంబుల నేలుచు రామభద్రుడు రాముడు

సోముని వలెనే చల్లని దొరయై  రామచంద్రుడు రాముడు

జగము లన్నిటికి హితకరు డగుటను జగదభిరాముడు రాముడు


శ్రీరామనామదివ్యమహిమ

శ్రీ‌రామనామదివ్యమహిమ చెప్పతరము కాదు మనకు


సీతమ్మకు బహుచక్కగ చేతనగును వివరింపగ

వాతాత్మజు డాంజనేయు వలననగును వివరింపగ


కామవైరి సదాశివుడు ఘనముగ వివరింపగలడు

రాముని తమ్ముడు సౌమిత్రి రమ్యముగా చెప్పగలడు


విరించియును సమర్ధుడే వివరింపగ చక్కగాను

పురుహూతుడు చెప్పగలడు పులకించుచు నామహిమను


వేయితలల శేషఫణికి వివరించుట సాధ్యమగును

ఆయహల్యావిభీషణుల కది చెప్పుట సాధ్యమగును


వలనుపడదు పండితులకు ప్రజ్ఞకొలది వివరింపగ

లలితంబుగ సద్భక్తులు తెలిసి కొంత పొగడగలరు


రామనామజపసిధ్ధులె రామమహిమ నెఱుగగలరు

పామరులకు తెలియరాదు భగవంతుని దివ్యమహిమ


ఎవరెవరో దేవుడంటే యేమౌతుందండీ

ఎవరెవరో దేవుడంటే యేమౌతుందండీ
భువిని కొలుపు వ్యర్ధమగును దివిని తావు వట్టిదగును

జాతిరత్నమను భ్రమతో చచ్చు గాజుపూసను
ప్రీతితో కొన్న ధనము బూడిద పాలైనట్లే

భూతప్రేతములను చాల ప్రీతితోడ పూజించిన
భూతప్రేతముల గతిని పొంది వాడు చెడినట్లే

అల్పుల దేవతల గొలిచి అల్పవరంబులను పొంది
అల్పుడగుచు దివికి దివికి అతడు తిరుగుచున్నట్లే

శ్రీరామచంద్రప్రభుని సేవించుచు మనసారా
తారకనామమును చేయ తరించునే గాని నరుడు


16, జనవరి 2023, సోమవారం

విన్నవించే దేమీ లేదు

విన్నవించే దేమీ లేదు విన్నవించి లాభమేమి
యన్నీ యెఱిగిన దొరకు కొన్ని క్రొత్తవా

పుట్టించునది వీడే పోషించునది వీడే
పట్టి ఆడించు కర్మపాశముల వీడే
వట్టి మాటలు కావు పదిపది జన్మలెత్తి
గట్టిగా తెలిసి చెప్పునట్టి మాటలే యిక

వీడే ఆడించితేను నాడైన నేడైనను
ఆడే బొమ్మనే కాని అన్యమే కాదే
ఆడేది వీడి యాటట వీడిదే బెత్తమట
నేడందు తప్పులకు నిందలు నాకట యిక

అట యిట్లురా యనుచు అంతలో రాముడై
మేటి యాటకాడై వచ్చి మేలుచేసె నిపుడు
అటలో పట్టు తెలిసి ఆడిన మెచ్చుకాని
మోటుదనము మెచ్చక బుధ్ధి చెప్పునట యిక


నీదే యీచిత్తము నిన్నంటి యుండనీ

నీదే యీచిత్తము నిన్నంటి యుండనీ
కాదందువా యిది కలిగి లాభ మేమి

నీయాన మేరకే నేలపై నాడేటి
యూయుపాధిలోన నిది యున్నది కాదా
నీయాట బొమ్మ నీదై నిలువగ దానిలో
పాయక నుండేదిది బాగుగ నీదేగా

పదిమందిలో మాటవచ్చెనో యేడ్చేను
పదుగురు మెచ్చితేను బహు సంతసించేను
పదుగురిలో నిది పాడేది నీపాట
అది మెప్పుపొందితే ఆకీర్తి నీదిగా

రాముడవు నామనో రమణుండవు నీవు
నీ మెప్పు కోరియిది నిన్ను సేవించునని
నీ మనసులో నెఱిగి నియమించుకొన వయ్య
ఈమంచి బొమ్మ ఆట లింపు గొలిపేనయ్య

 

శ్రీరాము డున్నాడురా మనకు

శ్రీరాము డున్నాడురా మనకు శ్రీరాము డున్నాడురా

యుల్లము నటునిటు లింద్రియకూటమి యూపగనీయక నిలబెట్టుటకు
కల్లగురువుల డొల్లమాటలను చెల్లగ నీయక చల్లగ జూడగ

కొంచెపువారల మాటలు చేష్టలు మించువేళ బాధించ నీయక
పంచమలముల ప్రభావము బుధ్దిని పడదోయగ నెగదోయుచు సఖుడై

విశ్రమ మెఱుగక చాకిరి జేయుచు వీఱిడియై పడి యుండిన వేళల
ఆశ్రయ మన్నము దొరుకని వేళల అన్నివిధంబుల తోడుగ నీడగ

అందరి మొఱలను విని రక్షింపగ అందరి బాధల నంతము చేయగ
అందిరికిని సుఖశాంతుల నీయగ అందరి యోగక్షేమము లరయగ

భ్రమలను గొలిపే‌ కలిపురుషునకు పరుగులు పెట్టే పనిచెప్పుటకు
యముడో గిముడో ఎదురైతే మన కండగ నిలచి రక్షించుటకు

అనేకజన్మల పాపములన్నియు నతిసులభముగా భస్మము చేయగ
అనంతమగు ఈజన్మపరంపర నంతము చేయగ మోక్షము నీయగ

 

ఏవిధమున తరింతురో

ఏవిధమున తరింతురో మీరే గ్రహింపుడు తప్పక

భ్రమలుగొల్పెడు రత్నభూషణరాశి గలిగి తరింతురా
రమణకెక్కిన రామనామ రత్న మున్న తరింతురా

ఊరిలో పదిమంది బంధువు లున్నచో తరియింతురా
చేరి రాముడు బంధు వైతే శీఘ్రమే తరియింతురా

చేతిలో ముద్రాధికారము చేరితే తరియింతురా
ప్రీతిగా శ్రీరామసేవను వేడితే తరియింతురా

నిరతమును నానా వ్రతంబులు నెఱపితే తరియింతురా
మరువక శ్రీరామనామము మరిగితే తరియింతురా

యెక్కడెక్కడి గురుచరిత్రల నెఱిగితే తరియింతురా
చక్కగ శ్రీరామచరితము చదివితే తరియింతురా

మంత్రతంత్రము లన్ని యెఱిగిన మానుగ తరియింతురా
మంత్రరాజము రామనామము మానక తరియింతురా


ఎన్ని శాస్త్రములు చదివి యేమి లాభము

ఎన్ని శాస్త్రములు చదివి యేమి లాభము నీ
వెన్ని సంపదలు కూర్చి యేమి లాభము

ఎవరి నెంత పొగడినను యేమి లాభము నీ
న్నెవరెంతగ పొగడినను యేమి లాభము
భువనేశ్వరుడైన రామభూపాలుని బొగడక
నవివేకివిగ బ్రతికినచో నంతా నష్టమే

ఎన్ని పూజలను చేసిన నేమి లాభము నీ
వెన్ని తీర్ధములు చుట్టిన నేమి లాభము
ఎన్నడు శ్రీరామచంద్రు నించుక సేవించక
చన్న బ్రతుకు నందంతయు సర్వనష్టమే

రామచంద్రు నెఱుగకున్న నేమిలాభము శ్రీ
రామచంద్రు పూజించక యేమి లాభము
రామరామ యనకుండగ నామోక్షము లేదని
యేమాత్రము తెలియనిచో నెంతో‌ నష్టమే


రామదాసుల మండీ

రామదాసుల మండీ మాకండీ రాముడొకడే దైవ మండీ మేము
ప్రేమతో శ్రీరామ నామమే చేయుచు భూమిపై తిరిగెద మండీ

ప్రాకటంబుగ సర్వలోకంబులను జేసి పాలించు శ్రీహరి యండీ
లోకరక్షణ కొఱకు కరుణతో శ్రీరామరూపంబు దాల్చినాడండీ

శ్రీరామనామమే స్మరియించు సజ్జనుల చేరువలోనుందు మండీ
సారసాక్షుని రామనామవైభవమును చాటించుచుండెద మండీ

మది నుంచి పదిమంది దైవంబులను గొలువ మాకేమి పిచ్చి యటండీ
విదితంబుగా సర్వభూతాత్మకుడు రామవిభునే కొలుచు వార మండీ

బహుదేవతలు వద్దు బహుపూజలును వద్దు బహుమంత్రములను వద్దండీ
బహుళమైతే శ్రధ్ధ బాగుపడునది లేదు భావించి రామా యనండీ

శ్రీరామ శ్రీరామ యనువారి కేనాడు చీకుచింతలు కలుగవండీ
శ్రీరామ నామస్మరణముచే నందరును చెందవచ్చును మోక్షమండీ

ఈమాట నమ్మండి యేనియమములు లేని ఈరామమంత్రమే‌ నండీ
కామితార్ధము లిచ్చు మోక్షమ్ము నందించు కాదనక చేసిచూడండీ


15, జనవరి 2023, ఆదివారం

కలియుగమండీ కల్లదేవుళ్ళును కలిగెదరు

కలియుగమండీ కల్లదేవుళ్ళును కలిగెద రిలపై జాగ్రత

కల్లగురువులు మహిమలుచూపుచు కన్నులముందే తిరిగేరు
చల్లగ వారు మీమనసులలో స్థానము సంపాదించేరు

కల్లబొల్లి గురుదేవుల చరితలు ఘనముగ శిష్యులు వ్రాసేరు
కల్లాకపటము తెలియనివారవి గట్టిగ మనసున నమ్మేరు

కొత్తగురువులను దేవుళ్ళనుచును గుడ్డిగ పలువురు నమ్మేరు
కొత్తదేవుళ్ళకు గుడులు కట్టుచును గోవిందుని విడనాడేరు

గోవిందుని స్మరియించెడు వారలు గోవిందపదమును పొందేరు
ఏవారల కీ కొత్తదేవుళ్ళే ఇంపో వారే చెడగలరు

తారకనామము చేసిన భవమును దాటుడు రందరు నిక్కముగ
నేరక ఈ కొత్తదేవుళ్ళ పేర్లను నిత్యము పలికిన చెడగలరు

కలియుగమందున రామనామమును కల్లగురువు లిటు మాన్పేరు
తెలివిడి గలిగిన సుజనులు శ్రీరామదేవుని మానక గొలిచేరు

 

శ్రీరఘురామా నీశుభనామము

శ్రీరఘురామా నీశుభనామము జిహ్వకు రుచియని పలికెదనా భవ
తారకనామము దొరికెను నాకని తలచి మురియుచును పలికెదనా

పాపములను తొలగించు నామమును పట్టాభిరామా వదలనయా
తాపత్రయమును బాపు నామమును దాశరథీ నే వదలనయా

వనితగ రాతిని మార్చిన నామంబును నే నెన్నడు వదలనయా
మునిగా బోయను మార్చిన నామంబును నే నెన్నడు వదలనయా

కోతికి బ్రహ్మపదంబు నొసంగిన గొప్పనామమును వదలనయా
ప్రీతిగ శివుడు జపించుచు నుండెడి విష్ణునామమును వదలనయా

వదలను వదలను నామస్మరణము వదలను గాక వదలనయా
నిదురనైన నీ నామస్మరణము వదలను రామా వదలనయా

శ్రీరామరామ శ్రీరామరామ

శ్రీరామరామ శ్రీరామరామ 
శ్రీరామరామ  శ్రీరామరామ 

శ్రీరామరామ సీతానాయక
శ్రీరామరామ శ్రితపారిజాత
శ్రీరామరామ చింతితఫలద
శ్రీరామరామ క్షిప్రప్రసాదన

శ్రీరామరామ చిన్మయరూప
శ్రీరామరామ శ్రీకంఠార్చిత
శ్రీరామరామ శూరవరేణ్య
శ్రీరామరామ నారాయణ హరి

శ్రీరామరామ చిత్తజజనక
శ్రీరామరామ జీవగణేశ్వర
శ్రీరామరామ కారణకారణ
శ్రీరామరామ తారకనామ
14, జనవరి 2023, శనివారం

శ్రీహరినే కొలుచు చిత్తమయ్యి యిది

శ్రీహరినే కొలుచు చిత్తమయ్యి యిది 
సాహసించి యితరుల స్మరియించునా

మూడులోకముల జేసి మచ్చటగ పోషించు
వాడు శ్రీహరియైతే వేడ నేల
నేడన్య దైవంబులను నియమమును చాలించి
కాడా కోరికలు తీర్చు ఘనుడు వాడు

సురలు కోరిరని వాడు చొచ్చి తానినకులము
నరుడై శ్రీరాముడాయె సురవైరిని
పరమదుష్టుడైన రావణుని జంపి లోకములు
తరియింప నిచ్చె నంత తనదు నామము

తారకనామము చాలు ధరమీద వారందరు
వారిజాక్షు పదమునకు చేరుకొనగను
శ్రీరామ నామమహిమ శివుడు చాటిచెప్పెను
చేరనేల నాకన్యుల సిగ్గువిడచి

ఎంతో దొడ్డమనసున్న యీరామచంద్రుని

ఎంతో దొడ్డమనసున్న యీరామచంద్రుని
చెంతనే యుండరాదో సేవించుకొనుచు

అడుగుటే యాలస్యమా యడిగిన విచ్చేను వాడు
అడుగకనే యెన్నో యిచ్చు హరి వాడే
కడు నిష్ఠ సేవించిన కడతేరు కోర్కులన్నీ
పడి వాడి చెంతనుండ వలె గాదా

నీకంత సిగ్గేమిటికే నీరేజాక్షు కొలువులో
పాకారి యంతటి వాడును భటుడేనే
లోకులేల నవ్వేరే లోకేశుడైన రాముని
ప్రాకటముగ వారు కొలుతురని వినవే 
 
మనసా నీదేవుడెంత మంచివాడో వినవే
తననామమే చాలు ననును తరియింపగ 
మనసున్న దేవుని సేవ మనకదే చాలనుకొనక
గొణిగేవు చాలింక నీవు సణగవద్దు


నిన్నే నమ్మి యుంటి రామా

నిన్నే నమ్మి యుంటి రామా నీదే భార మంటి
చిన్నచితక తప్పు లెన్ని చీకాకుపడ కంటి

నరులును నాతప్పులెన్ని హరియును నాతప్పులెన్ని
కరకుదనమును చూప కరుణించువా రెవరు
ధరమీద నెవడైన నరజన్మ మెత్తినపుడు
మరి వాడు తప్పులు చేయు టరుదేమి కాదంటి

హరి నీకు తెలియని దేమి సురలందును తప్పులుండు
సురలదొరయె మునిపత్నిని చూచి మోహపడను కాద
నరుడ నని నాతప్పుల వరుసపెట్టి చెప్పవద్దు
సురల తప్పు లెన్నకుండ నరుల తప్పు లెన్న కంటి

ఎన్ని తప్పు లున్న గాని యేనాడును నేనితరులను
యెన్న లేదు నీకు సరిగ నెఱుగుదు వది నీవు కూడ
మన్నించి నన్నేలుటకు మరి యాసుగుణమే చాలు
సున్న చేసి దొసగు లన్ని సొగసుగ నన్నేల వయ్య

 

13, జనవరి 2023, శుక్రవారం

శ్రీరామనామ మొక్కటి చేసిన చాలు

శ్రీరామనామ మొక్కటి చేసిన చాలు సం
సారలంపటాలన్నీ చప్పున పోవు

శ్రీరామరామ యనగానే చికాకు లణగు
శ్రీరామరామ యనగానే చిక్కులు తొలగు
శ్రీరామరామ యనగానే చింతలు తొలగు
శ్రీరామరామ యనగానే క్షేమము కలుగు

శ్రీరామనామమున జేసి చేరు శాంతము
శ్రీరామనామమున జేసి చెదరు పాపము
శ్రీరామనామమున జేసి చిక్కు పుణ్యము
శ్రీరామనామమున జేసి శ్రీలు కలుగును

శ్రీరామనామమే సకల క్షేమంకరము
శ్రీరామనామమే సర్వ సిధ్ధిప్రదము
శ్రీరామనామమే పరమశివోపాస్యము
శ్రీరామనామమే మోక్షశ్రీకర మిలను


రామం భజేహం సతతం

రామం భజేహం సతతం సీతా
రామం భజేహం సతతం

నారదాదిముని వినుతం రామం నయనమనోహర రూపం
వారిజసంభవ వినుతం రామం పశుపతినుతశుభనామం

నీరదనీలశ్యామం రామం నిరుపమకరుణాధామం
నీరేజాయతనేత్రం రామం నిర్మలదివ్యచరిత్రం

ధీరం రణగంభీరం రామం దితిసుతదుష్కులకాలం
శూరం ధర్మాధారం రామం సురగణశుభదాకారం

భవకాంతారకుఠారం రామం పవనజప్రస్తుతనామం
ప్రవిమలపుణ్యస్వరూపం రామం భవతారకశుభనామం


నారాయణాఽనంత గోవిందా

నారాయణాఽనంత గోవిందా హరి
శ్రీరామ శ్రీకృష్ణ గోవిందా

లీలలు చేసే గోవిందా నీ లీలల సురలును గోవిందా
లీలగ నైనను గోవిందా కనజాలరుగా హరి గోవిందా
నీ లీలల నే గోవిందా లో నెఱుగగ వశమా గోవిందా
జాలిని చూపుము గోవిందా కరుణాలవాల హరి గోవిందా

నా గుణహీనత గోవిందా మరి నరసహజంబని గోవిందా
ఓ గరుడధ్వజ గోవిందా యది యొక తప్పనకో గోవిందా
నీ గుణగానము గోవిందా బహునిష్ఠగ జేయుదు గోవిందా
యోగులు పొగడే గోవిందా దయ యుంచుము నాపై గోవిందా

చింతలు తీర్చే గోవిందా నను చిక్కుల బెట్టకు గోవిందా
కంతుని తండ్రీ గోవిందా నిను ఘనమున పొగడుదు గోవిందా
చెంత నుండి నను గోవిందా రక్షించుము నన్నిక గోవిందా
అంతులేని దయ గోవిందా నీదందురు భక్తులు గోవిందా

కోరుకున్న విచ్చు వాని కోదండరాముని

కోరుకున్న విచ్చు వాని కోదండరాముని
కోరకుండ నుండరాదు కోరండి మోక్షము

ఘనముగ నిచ్చెడు వానిని ఘనమైనది యడుగవలెను
ఘనమైనది యడుగకున్న ఘనుడు చిన్న బుచ్చుకొనును
కనవచ్చిన దేని మీకు కల్పవృక్ష మపుడు మీరు
తినుట కొక మామిడి పండు దేబిరించేరా

కామదేనువును జూచిన గంగడోలు నిమిరి మీరు
ఏమి చక్కదనం బనుచు నెంతో మెచ్చుకొని దాని
నేమి యడుగకుండ వచ్చు టెంతటి వెఱ్ఱిదన మట్లె
స్వామి వరదు డయిన కాని యేమీ యడుగరా

అదుగవలెను పగులగొట్ట వయ్యఈ భవచక్రమనుచు
అడుగవెలెను మరల పుట్ట నట్టి వరము నియ్యమనుచు
అడుగవలెను సాయుజ్యము హరి నా కిప్పించు మనుచు
అడుగవలెను రామచంద్రు నాలస్యమేలా


దాసానుదాసులమో రామా

దాసానుదాసులమో రామా దయచూపుము మాపై
మోసాలమారి కలిని వేగ మొత్తి రక్షించవయ్య

కలి యండ జూచుకొని కష్టాత్ము లైనట్టి
తులువలు మామీద దొరలై కూర్చున్నారు
బలవంతులగు వారు పాపవాక్యంబులను
కులుకుచు నిత్యమును పలుకుచున్నారయ్య

భూవలయమున దుష్టబుధ్ధులే ఘనులైరి
నీవు దుష్టుడవనెడు నిర్భాగ్యు లున్నారు
రావణుని కీర్తించు రాకాసు లున్నారు
దేవ దేవా నీవె దిగివచ్చి చూడవలె

కుజనులు నినుగూర్చి కూయ నసత్యములు
ప్రజలేమొ విమతముల పాలగుచు నున్నారు
ఋజువులు నీవెవచ్చి ఋజువుగ కనవయ్య
నిజసత్యధర్మముల నిండించు మిక ధరను


విరక్తి వచ్చేసింది

సినిమాల మీద విరక్తి వచ్చేసింది
క్రికెట్ మీద విరక్తి వచ్చేసింది
రెండు చోట్లా వయసైపోయిన వాళ్ళదే రాజ్యంగా ఉంటోందని

రాజకీయాల మీద విరక్తి వచ్చేసింది
తెలుగుసాహిత్యం మీద విరక్తి వచ్చేసింది
రెండు చోట్లా మతిలేని వాళ్ళదే రాజ్యంగా ఉంటోందని

ప్రపంచం మీద విరక్తి వచ్చేసింది
జీవితం మీద విరక్తి వచ్చేసింది
ఎక్కడా సంతోషించదగ్గది ఏమీ కనిపించటం లేదని

 

చేసేరు శ్రీరామనామం ఓహో కోసేరుగా భవపాశం

చేసేరు శ్రీరామనామం ఓహో కోసేరుగా భవపాశం

క్రూరరోగంబులను కురిదించి రక్షించి ఆరాట మణచునని నేడే
ఘోరపాపము లెల్ల గొబ్బున ఖండించి భారముడుపు ననుచు నేడే
తారకం బనుపేర ధరమీద మిక్కిలి పేరుపొందిన దనుచు నేడే
శ్రీరామదాసులై సంతోషముగ మీరు చిత్తశుధ్ధిని కలిగి నేడే

పామరంబుగు బుధ్ధిగల మూర్ఖులను కూడ కరుణించు నని తెలిసి నేడే
కామక్రోధములను కడముట్ట తొలగించి కాపాడు నని తెలిసి నేడే
తామసత్వం బుడిపి తత్త్వజ్ఞానము గఱపి దయజూపు నని తెలిసి నేడే
శ్రీమంతులను జేయు ధీమంతులను జేయు ప్రీతిగ నని తెలిసి నేడే

శ్రీరామనామమున చేకూరనట్టి దన క్షితిలోన లేదనుచు నేడే
శ్రీరామభక్తులను సమవర్తి యెన్నడును శిక్షించ లేడనుచు నేడే
శ్రీరామనామమును చేయువారల కెపుడు చింత లుండవనుచు నేడే
శ్రీరాము డొక్కడే మోక్షప్రదాతయని చిత్తంబు లోనెఱిగి నేడే


రామచంద్ర రామచంద్ర రవికులాబ్ధిపూర్ణచంద్ర

 
రామచంద్ర రామచంద్ర రవికులాబ్ధిపూర్ణచంద్ర
ఏమి చెప్ప మందువయ్య ఇంతకు మించి

ఏమి జపములు చేయగలను ఏమి తపములు చేయగలను
రామచంద్ర మంత్రదీక్ష లేమి పొందని వాడ నైతిని

ఏమి పూజలు చేయగలను ఏమి వ్రతములు చేయగలను
రామచంద్ర అట్టి విధము లేమి యెఱుగని వాడ నైతిని

ఏమి రూపము నెన్నగలను ఏమి వర్ణన చేయగలను
రామచంద్ర నీవు నాకు మోము నెన్నడు చూప లేదే

ఏమి భావన చేయగలను ఏమి తత్త్వము తలపగలను
రామచంద్ర నేను నీదు నామ మొకటే తెలుసుకొంటిని

ఏమి వరములు కోరగలను ఏమి బ్రతుకులు బ్రతుకగలను
రామచంద్ర ఐహికంబు లేమి వలదని పలుక నేర్తును

ఏమి నిన్ను కోరుకొందును ఏమి పొందిన తృప్తిగలుగును
రామచంద్ర నీదు పాదసీమ నుండుట కోరుకొందును


ఎత్తిన జన్మములు చాలు నేడ్చిన యేడుపులు చాలు

ఎత్తిన జన్మములు చాలు నేడ్చిన యేడుపులు చాలు
కొత్తది మరియొక్క తనువు గొనమని కోరకుమయ్యా

భూమిపైకి వచ్చుటయును బుధ్ధిలేక తిరుగుటయును
కామాదుల పాలబడుచు కడుదుష్టుడ నగుటయును
రామయ్యా అవుసరమా రక్షించుము దేవదేవ
ఆమోక్షము నందించుము అదే నాకు చాలునయా

రామభక్తు డయ్యు నొకడు సామాన్యుండెట్లగురా
రామనామము చేసియును పుట్ట నేల మరల మరల
భూమినిట్లే పుట్టిచచ్చు నీమము సడలింపనిదే
రామనామ మేల నయ్య రామభక్తి యేలనయా

ఒక రాతిని నాతిజేసి ఒక కోతిని బ్రహ్మ చేసి
ఒక పక్షికి మోక్ష మిచ్చిన ఓ రామచంద్రప్రభూ
ఒక భక్తుని మొఱలు వినక యూరకుండరాదు కదా
ఇక చాలును మోక్షమును ప్రకటించుము నాకిపుడే

12, జనవరి 2023, గురువారం

సురప్రముఖు లిదే నరులైనారు

సురప్రముఖు లిదే నరులైనారు
హరిని చూడ బోయిరి తిరుమలకు

ఘనులైన వాసుకి కర్కోటకు లట
అనుశ్రుత యదిగో యప్సరోమణి 
కను డహ వసు వచట గంధర్వుల నట
కనుడు కింపురుషుల గరుడుల నేడు

అందరు సామాన్యులగు భక్తుల వలె
సందడించుచు ముచ్చటలాడుచు గో
వింద నామములను వేడ్కను పాడుచు
అందగించుట కననాయెను నేడు

శ్రీరామచంద్రుడ శ్రీకృష్ణదేవ
శ్రీరమావల్లభ శ్రీహరి యనుచును
నారాయణుని నానావిధములుగా
నోరార కీర్తించే రిదె నేడు


10, జనవరి 2023, మంగళవారం

కొసరికొసరి పిలిచినచో

కొసరికొసరి పిలిచినచో గోవిందుని మనకు

కొసరడా మోక్షమునా గోవిందుడు


తనవారని పెఱవారిని తలచకుండు గోవిందుని

మనసా‌రగ పిలిచినచో మన్నించు గోవిందుని

మనతప్పుల నెంచనట్టి మహాత్ముని గోవిందుని

వినయముగా మధురవాక్య విన్యాసముతో


ఆనాడా కరిని గాచి యాదుకొన్న గోవిందుని

ఆనాడా యంబరీషు నాదుకొన్న గోవిఃదుని

మానిని మానమును గాచి మన్నించిన గోవిందుని

ఈనాడే మధురముగా నెల్లవారు నిప్పుడే


పరమభక్తి గొలుచువారి పాల నుండు గోవిందుని

హరేరామ హరేకృష్ణ యనిన పలుకు గోవిందుని

నిరంతరము తలచువారి నేలుకొనెడు గోవిందుని

నరులారా మీరు మధురతరమైన వాక్యముల


9, జనవరి 2023, సోమవారం

పట్టుకొన్నావా పట్టుకొన్నావా

పట్టుకొన్నావా పట్టుకొన్నావా పట్టాభిరాముని పాదాబ్జద్వయము
గట్టిగ శ్రీరామ పాదంబులను నీవు పట్టుకొన్నావా యిక మోక్షమే

వారి పాదములనో వీరి పాదములనో పట్టుకొంటే బుధ్ధిహీనుండవై
దారిద్ర్యశమనంబు తగినంత నగు నని తలపోసి పొందేది స్వల్పంబురా
ఆరాటపడి కొంత ఆర్జించి భోగించి అతల నెఱసిన పిమ్మటను
శ్రీరామ శ్రీరామ యని దొంగ జపములు చేసిన ఫలమేమి ముందుగనే

దారాపుత్రుల మీద వ్యామోహమును బొంది వారికై మిగుల ప్రయాసపడి
కోరికలను తీర్చ ధారుణి వెలసిన గొప్పయంత్రము వోలె నిత్యమును
ధారాళముగ నిండ్లు వాకిళ్ళు భూముల తళుకుబెళుకు నగల నీనుచును
నోరార శ్రీరామ నామము నేనాడు నుడువక చాకుండ ముందుగనే

కామాదులకు లొంగి భూమిపై చరియించి కడుదుష్టులను చేరి తిరిగితివి
రామనామము మఱచి తిరిగితి వని నిన్ను తామసించి యముడు తిట్టునని
నీ‌మానసము నందు నిశ్చయంబుగ నెఱిగి నిష్ఠగ శ్రీరామ నామమును
ప్రేమతో నిత్యంబు పఠియించుచును నీవు వేడుకతో చాల ముందుగనే

ఏదేమైతే తనకేమి ఎవరేమైతే తనకేమి

ఏదేమైతే తనకేమి ఎవరేమైతే తనకేమి
ఏదెట్లైతే నట్లగుపో నీమాత్రమునకు తనకేమి

పోయేదెవడు వచ్చేదెవడు పుట్టేదెవడు గిట్టేదెవడు
మాయజగమున చిత్రాలు మరియెట్లైతే తనకేమి

ఆయువు నడిగే వాడెవడో ఆయువు పొందేవాడెవడో
ఆయువు తనువున కేగాన అది యేమైతే తనకేమి

ధనముల కేడ్చే వాడెవడో ధనములు పొందే వాడెవడో
ధనముల తనతో నుండేవా ఆ ధనములగోల తనకేమి

రామ రామ యను వాడెవడో రాముని నమ్మని వాడెవడో
రాముని నమ్మిన చాలు గదా పామరజనులతో తనకేమి

నమో నమో హరి నారాయణాఽచ్యుత

నమో నమో హరి నారాయణాఽచ్యుత
నా మనవులు విని నవ్వకు రామా

ధనము లల్పమని తగ నెఱుగుదును
ధనములు నాకిమ్మని యడుగుదును
ధనములు లేనిది మనుగడ లేదని
యనుకొందును నేనని నవ్వకుము

తనువు బుడగ యని తగ నెఱుగుదును
తనువున కాయుర్దాయ మడుగుదును
తనువే లేనిది మనికియె లేదని
యనుకొందును నేనని నవ్వకుము

ఆశలు చెడ్డవి యని యెఱుగుదును
ఆశలు వీడక నవియివి గోరుదు
నీశుడ వన్నియు నెఱిగిన వాడవు
ఆశపోతు వీడని నవ్వకుము

మదిలోన నీవే మసలుచు నుండగ

మదిలోన నీవే మసలుచు నుండగ
నుదయించునా భయ మొకనాడేని

ఇంచుక కర్పూర ముంచిన నచట వ
సించగ చీమలకు చిక్కగు నటుల
అంచితముగ గంధ మలదిన నెండల
నించుక బాధించ నీయని యటుల

ముగ్గున పురుగులు ముసరని యటుల
అగ్గికి చెదలే యంటని యటుల
లగ్గుగ నెద నుండ రామా నీవు
దగ్గర కాలేదు తండ్రీ భయము

చేదా శ్రీరామనామము

చేదా శ్రీరామనామము - లేదా మీవద్ద సమయము
కాదా మోక్షమే గమ్యము - ఏదీ మీ సమాధానము

శాపంబులు తగులుకొనిన చక్కగా విడిపించునే
పాపంబులు పట్టుకొనిన వదలించి రక్షించునే
తాపంబులు చుట్టుకొనిన తప్పక కాపాడునే
లోప మేమి గలదనుచును రూపించి వదలితిరో

అపదలను దాటజేయు నట్టిదగు నామము కోప
తాపము లణగించు దశరథాత్మజుని నామము జ్ఞాన
దీపమును వెలిగించెడు దివ్యమగు నామము దాని
నేపగిదిని విడచిపెట్ట నిచ్చగించినారయా

అడిగిన సంపదల నెల్ల నమితంబుగ నిచ్చునే
అడిగితిరా మోక్షమే హాయిగా నందించునే
అడుగదే నియమంబుల నతిసులభము స్మరణము
వడివడిగా గైకొనరే చెడిపోయెద రేలనో


7, జనవరి 2023, శనివారం

తారకనామము తారకనామము

తారకనామము తారకనామము దశరధరాముని పావననామము
అనవరతంబును మదనాంతకుడు ధ్యానము చేయును తారకనామము
ఘనముగ ముల్లోకంబుల వ్యాప్తిని గాంచి చెలంగును తారకనామము
యోగివరేణ్యుల హృదయము లందున నొప్పుచు నుండును తారకనామము
భోగపరాయణులగు మానవులకు బుధ్ధికి తోచదు తారకనామము
పామరజనులకు పండితవరులకు వరలును సమముగ తారకనామము
రాముని నమ్మిన వారల కెపుడును రక్షణ నిచ్చును తారకనామము
పాపారణ్యదవానల మగుచును పరగుచు నుండును తారకనామము
శాపోపహతులు శరణము జొచ్చిన చక్కగ బ్రోచును తారకనామము
కామాద్యరిషడ్వర్గమునణచి కాచుచు నుండును తారకనామము
భూమిని సర్వముముక్షుజనాళికి మోక్షము నొసగును తారకనామము

నామమె చాలని నమ్మితి మయ్యా

రామ గగనశ్యామ నీ
నామమె చాలని నమ్మితి మయ్యా

సారసదళనేత్ర సాకేతపురనాథ నీ..
వీరాధివీరగంభీర శ్రీరఘువీర నీ..
వారిధిబంధన క్రూరరావణనిధన నీ ..
కారణకారణ కరుణారసవార్ధి నీ ..
సీరధ్వజుని పుత్రి చిత్తమ్ములో నుండు నీ ..
నారదాదిమునినాథు లుపాసించు నీ ..
వారిజాసనపాకవైరిప్రముఖవినుత నీ..
ఘోరపాపాటవుల గొబ్బున దహియించు నీ ...
నోరార పిలచిన నొప్పుగ రక్షించు నీ ...
చేరి కొలిచెడు వారి చేపట్టి కాపాడు నీ ..
ఈరేడు లోకాల కేలిక వైయుండు నీ ..
నారాయణా జ్ఞానగమ్యా సదానంద నీ ...

మహిమగల నామము

మహిమగల నామము మహా మంచినామము

ఇహపరంబుల నిచ్చే యింపైన నామము


మహామహులు జపముచేయు మధురమైన నామము

మహాదుఃఖములను బాపి మనను కాచు నామము

మహాశివుడు మక్కువపడు మధుసూదను నామము

మహానంద మిచ్చి మేను మరపించే నామము


భోగాతురులగు వారలు పొందలేని నామము

యోగీంద్రులు వినుతించగ నొప్పుచుండు నామము

రాగద్వేషముల నణచు రమ్యమైన నామము

భాగవతోత్తముల కెపుడు భావ్యమైన నామము


క్రూర కామక్రోథాదుల కుళ్ళబొడుచు నామము

దారిద్ర్యము నివారించి దయజూపే నామము

శ్రీరాముని శుభనామము చింతలణచు నామము

ఆరూఢిగ మోక్షమిచ్చి ఆదరించు నామము5, జనవరి 2023, గురువారం

రావణుడే లేకుంటే

రావణుడే లేకుంటే రాము డెక్కడ ఆ

రావణుని పుణ్యమే రామసత్కథ 


వెలుగు చీకటులు రెండు వెంటవెంట నడువగ

కలిసిమెలసి రెండు నుండ కలుగు నొక దినము

వెలుగు చాలు చీకటియే వలదు పొమ్మనలేము

వెలుగు విలువ చీకటి వలన తెలియును


తెల్లని కాగితము పైన తెల్లని రంగుబొమ్మ

వల్లకాదు చిత్రింపగ వర్ణ మన్యమును

నల్లనిదో మరొక్కటో నదురుగా గైకొనక

కల్ల  సజ్జనులే గల కావ్య మొక్కటి


రావణుని కారణమున రాముడై హరి వచ్చె

పావనతారకనామము ప్రభవమందెను

భూవలయంబున నిదే ముముక్షువు లందరును

భావించి తరించు నుపాయము గలిగె


భజభజ శ్రీరామమ్ మానస

భజభజ శ్రీరామమ్ మానస
భజభజ రఘురామమ్

కరుణాలవాలమ్ కమనీయగాత్రమ్
సరసీరుహాక్షమ్ జలధరశ్యామమ్
కరిరాజవరదమ్ కామితవరదమ్
సురరాజప్రస్తుత వరవిక్రమమ్

భోగీంద్రశయనమ్ పుణ్యోపేతమ్
యోగీంద్రవినుతమ్ రాగాదిరహితమ్
వాగీశవినుతమ్ పరమేశవినుతమ్
నాగారితురగమ్ నారాయణమ్

రవిచంద్రనయనమ్ రాజీవనయనమ్
వివిధార్తిశమనమ్  భవరోగశమనమ్
అవనీజనేశమ్ అవనీశమౌళిమ్ 
రవికులతిలకమ్ రమ్యాననమ్

అనరే శ్రీరామ రామ యని

అనరే శ్రీరామ రామ యని మీరు మనసారా

అనెడు వారి కపవర్గ మను మాట విన్నారా


మనసా శ్రీరామనామ మంత్రపఠన చేసి

తనియు వారలకు మించి ధన్యులే వసుధపై 

కనరారు కనరారు కావున జనులార

దినదినమును రామనామమున గడువగా నిండు


జయముల మనకొసగు నట్టి చక్కని మంత్రమండి

భయమును కలిగించు నట్టి నియమముల పనిలేదు

రయమున జనులార తాపత్రయముల తొలగించి

నయముగ శ్రీవిష్ణుపదమునకు చేర్చు నమ్మండి


4, జనవరి 2023, బుధవారం

రామా నీతీరు నింకేమని చెప్పవచ్చు

రామా నీతీరు నింకేమని చెప్పవచ్చు
ప్రేమించే భక్తులకు పెంపెసగ దోచవు

కనుపించినావు కాదుగా రామదాసునకు
కనుపించితివే నీవు కరకు తురకకు
నినుగొల్చు భక్తవరుని నిందించి బంధించిన
మనిషి నీకు ప్రియుడాయె మరి యేమందు

కనుపించలేదు నీవు ఘనుడు త్యాగరాజునకు
కనవచ్చితివిబో దొంగలకు ప్రేమతో
అనయము నిను గొల్చివా డాదరణీయుండనక
ధనాశాపరుల యెడల దయ గలిగెనా

తురక మున్నెవడో ఆ దొంగలెవ్వరో
మరి నీ దరిసెనంబన నురక గలగదే
హరి నీ చెయుదము లెంత యద్భుతంబులో గాని
పరమపురుష మాకెటుల నరయ వచ్చును

 

సీతాకళ్యాణవేళ చెలగె దేవదుందుభులు

సీతాకళ్యాణవేళ చెలగె దేవదుందుభులు
ప్రీతులైరి దేవతలు భీతులైరి రాక్షసులు

పెండ్లికొడుకాయెను రఘువీరుడు రామయ్య
పెండ్లికూతురాయె సిరివెలుగుల సీతమ్మ
కండ్లలోన మిలమిలలు కన సురల కసురుల
పెండ్లాముల పుస్తె లవి పెరుగుట కననాయె

అమ్మవచ్చె కథ లోని కమ్మవచ్చె ననుచు
కమ్మగా నారదముని గాన మదే చేసె
నెమ్మది చేకూరెను నింగిని దేవతలకు
ఉమ్మలిక మూరకయే యొప్పె రాక్షసులకు

రాముడు పుస్తెకట్ట రంభాధు లాడిరి
భూమియు పులకించినది భూమిజనుల తోడ
కామిత మీడేరునని కడుపొంగగ సురలు
ఆమూల లంకలోన నాయె భూకంపము


హరి నీకు మ్రొక్కేమయ్యా

హరి నీకు మ్రొక్కేమయ్యా రామయ్యా
మరిమరి మ్రొక్కేమయ్యా

సురలమేలును కోరి ధరకు వచ్చితి వంట
ధరకు వచ్చిన నీవు నరుడ వైనా వంట

జలజాప్తు కులమందు జనియించినా వంట
కలికి కోసలసుతకు కలిగినా వీవంట

మునిరాజు యాగంబు మొనసి కాచితి వంట
అనలాక్షు ధనువు చేగొని విరిచినా వంట

ధరణిజను చేపట్టి మెరసినా వీవంట
పరశురాముని గదిమి పారదరిమితి వంట

జనకు డాజ్ఞాపించ వనవాసి వైతి వట
మును లడుగ రక్కసుల పనిబట్టి నావంట

రావణుడు ధరణిజను లంకకు గొనిపోగా
నీవు చేసితి వంట నీరధికి వారధిని

సురవైరి రావణుని పరిమార్చి నావంట
ధరణిజతోడ నయోధ్యకు చేరి నావంట

పట్టాభిరాముడవై ప్రజనేలినా వంట
ఇట్టె ముముక్షువుల నేలుచున్నావంట


కోతికొమ్మచ్చులతో కొంతకాలము పోయె


కోతికొమ్మచ్చులతో కొంతకాలము పోయె
కోతిచేష్టలను జేయ కొంతకాలము పోయె

కొత్తకొత్త బుధ్ధులతో కొంతకాలము పోయె
కొత్తకొత్త కోర్కెలతో కొంతకాలము పోయె

కూలికొఱకు తిరుగుచును కొంతకాలము పోయె
కూలబడి యేడ్ఛుకొచును కొంతకాలము పోయె

కుమతులతో తిరుగుచును కొంతకాలము పోయె
విమతుల వారించుచును కొంతకాలము పోయె

క్రూరుజనుల కొలుచుచును కొంతకాలము పోయె
కూరలకై తిరుగుచును కొంతకాలము పోయె

గురికుదరక నీమీదను కొంతకాలము పోయె
గురువులకై వెదకుచును కొంతకాలము పోయె

వింతవింత రీతులుగ నింతకాలము పోయె
చింతించిన ఫలము లేదు శ్రీరామచంద్రుడా

మిగిలినట్టి కాలమైన మీనామస్మరణమున
తగిలియున్న చాలునయ్య ధన్యుండ నగుదును


3, జనవరి 2023, మంగళవారం

ఏమయ్యా రామయ్యా యేమందువు

ఏమయ్యా రామయ్యా యేమందువు మే
మేమీ చేయలేకున్నా మేమందువు
 
వేదభూమి పైన నేడు విమతుల తాండవమాయె
ఈదీనత తొలగుదారి యేమియు కనరాదాయె
మేదినిపై గద్దెలెక్క మ్లేఛ్చమతావలంబులు
నీదివ్యనామమునకె నిందలాయె

చెలరేగు దైవనింద చెవులతో వినగలేము
చెలరేగు నకృత్యముల చేతులెత్తి యాపలేము
బలవంతుల నెదిరించుచు బ్రతికియుండగ లేము
కలవు నీవే సరిదిద్ద గలవందుము

కొత్తకొత్త చదువులకు కొత్తకొత్త బుధ్ధులాయె
యుత్త యవివేకులైరి యుర్వి నందరీనాటికి
వత్తువో సరిదిద్దగ పట్టని యట్లుందువో
ఇత్తరి మాచేతిలోన నేమున్నది

ఏలుకొను దొరా నేను మేలుకొంటిని

ఏలుకొను దొరా నేను మేలుకొంటిని కరు
ణాలవాల సేవింపగ నరుదెంచితిని

జగదేకవీరుడనుచు సత్యవిక్రముడనుచు
జగన్నాథు డిత డనుచు జానకిరామ
పొగడుచు నిను పాడుచుండ పురుషోత్తమ నీవును
తగునిది నీవొనరింపగ తగినసేవ యంటివి 

ఎన్ని జన్మల పుణ్యమో యీజన్మలో నేను
నిన్ను సేవించుకొనుచు నిలచియుంటిని
ఎన్న నాకీ భాగ్యమే ఈజన్మకు చాలందునా
నిన్ను చేరుకోనిమ్మని నేను వేడుకొందునా

మరి కొన్ని జన్మ లిట్లు మహిని నిన్ను పొగడచు
తిరుగుదునో వైకుంఠపురము నీకు
సరియైన తావు రమ్మని చక్కగా పిలిచెదవో
హరి నీదు కృపగలిగిన ధరయును వైకుంఠమే

నిదురించుటకు ముందు నీలమేఘశ్యామ నిను

నిదురించుటకు ముందు నీలమేఘశ్యామ నిను
మదినెన్ని ముదమార నిదురింతు నోయి
 
నేడు నాదు పెదవులు నీ దివ్యనామంబును
వేడుకగా పాడుటలో విఫలమైన వేమో
జూడ నది పెనుదోషము సుప్రసాద శ్రీరామ
వేడెద మన్నింపు మనుచు విన్నపములుచేయుచు
 
వదలలేక వదలలేక వదలి నీనామంబును
పెదవులు నీ సెలవడిగి విశ్రమించే నిదే
నిదురించుచుంటి ప్రభూ నీవు నాకు కలలోన
సదయా కనుపించు మనుచు చక్కగా వేడుకొనుచు
 
కలదో యొక రే పన్నది కన నిది తుదిసారియో
జలజాప్తకులభూషణ తెలియదు రామయ్య
తెలిసిన నీయండ చక్కగ కలదని నాకెప్పుడును
తలచి నీతలపులనే తలను నించి యుందు నని


2, జనవరి 2023, సోమవారం

మారామనామమే మాకు చాలని

మారామనామమే మాకు చాలని పలుకు
డారాట పడకుండు డన్యంబులకు

రామనామస్మరణమున రాని దేమున్నదని
భూమి నితరముల మీరు పొందవలయును
స్వామినామమే చేసి చక్కగా మోక్షమును
మేము పొందువారమని మీరు చాటుడీ

అన్యదేవతల గొలిచి అర్ధకామములకై
అన్యనామజపాయాస మనుభవించక
ధన్యులై తలపరే దాశరథి నామమును
పుణ్యాత్ములార యదే మోక్షప్రదము

నాలుకపై శ్రీరాముని నామముండిన నదే
చాలు నింకేమి వలయు జన్మధన్యము
మేలు చేయు మనకదే మిక్కిలిగా నన్నది
కాలమునకు నిలచిన ఘనసత్యము

శ్రీరామనామమే చేయండీ

శ్రీరామనామమే చేయండీ మీ

రారూఢిగా మోక్ష మందండీ


వారిజాక్షుల మీద వ్యామోహములు వదలి

భూరిసంపదలపై బుధ్ధినే వదలి

నారాయణుని దయను నమ్మినామని పలికి

ధీరులై ధికృతసంసారులై నిలచి


పరమాత్మపై మనసు పదిలంబుగా నిలిపి

హరిసేవ కన్యంబు నాదరింపకను

మరిమరి హరినామ మాధుర్యమును మరిగి

సరిసిజాక్షుని దయయె చాలనుచు దలచి


యుక్థి కసాధ్యంబు లుండవచ్చును కాని

భక్తి కసాధ్యంబు వసుధపై లేదు

రక్తిముక్తుల గూర్చు రామనామము మీరు

శక్తి కొలదిగ జేయ సాయుజ్యమే నండి


పాపహరణము హరినామస్మరణము

పాపహరణము హరినామస్మరణము 
    భవతాపహరణము మన కిపుడు శరణము

ఆలసించక శ్రమ పరిగణించక 
     నిరాకరించక సేవించవలయును

పదవులపైన సతి పెదవులపైన బహు
     మొదవులపైన మది నిలుపగరాదు

భక్తుల గూడి అనురక్తుల గూడి యధా
     శక్తిగ చేయు మహాసక్తి వలయును

ఆప్తకాముడై వైకుంఠధాముడై లో
    కాభిరాముడై శ్రీరాముడున్నాడు

ఏదినమున నీనామస్మరణము

ఏదినమున నీనామస్మరణము నెడబాయుదునో రామా
ఆదినమే కడు దుర్దినము కదా అట్టిది రానీ కయ్యా

బహుదుర్దినములు గడచినపిదప వచ్చెను నీపై మనసే
యిహసౌఖ్యంబులు మృషలని తెలిసితి నిక నిను విడువను రామా
అహరహమును నీకర్పించుటకే తహతహ పుట్టెను లోలో
మిహిరకులైకవిభూషణ నాకొక మేలొన గూర్చుము దేవా

మనసున నీశుభనామము తలచుచు మరిమరి తలచుచు మురిసే
దినమే కాదా శుభదిన మనగా యినకులతిలకా నాకు
దినదినమును మరి శుభదిన మగుచు తీయగసాగే వరమే
కనికరించరా మునిజనవినుతా కమలదళాక్షా రామా

భవతారకమను ప్రఖ్యాతిగల పావనమగు నీనామం
బవగుణములతో నల్లల్లాడెడు నర్భకమగు చిత్తములో
రవళించగ జేయగదే దయతో రామా నీదయ లేదా
వివిధంబులగు కలిమాయలకు విచ్చిపోవురా దేవాశ్రీరామచంద్రం భజామ్యహం

శ్రీరామచంద్రం భజామ్యహం సంసారనివారం భజామ్యహం

శ్రీరఘురామం సంగరభీమం సీతారామం భజామ్యహం
తారకనామం మునిజనకామం దనుజవిరామం భజామ్యహం
పరమోదారం శ్రితమందారం పాపవిదారం భజామ్యహం
జగదాధారం ధర్మోధ్ధారం నిగమవిహారం భజామ్యహం
త్రిభువనవినుతం హరిగణవినుతం ఋషిగణవినుతం భజామ్యహం
పవనజవినుతం యోగీంద్రనుతం పశుపతివినుతం భజామ్యహం
సద్బుధ్ధిప్రదం సత్కీర్తిప్రదం సంతోషప్రదం భజామ్యహం
అఖిలార్ధప్రదం అతిసౌఖ్యప్రదం అపవర్గప్రదం భజామ్యహం


1, జనవరి 2023, ఆదివారం

అవశ్యము రామనామ మందుకో అందుకో

అవశ్యము రామనామ మందుకో అందుకో

భవచక్రము పగులగొట్టి పారిపో పారిపో


పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టలేదా విసుగు

పుట్ట నేల చావ నేల భూమిపై నిటులని

పుట్టి యేమి యుధ్ధరించి పోవుచున్నామని

పట్టుబట్టవలె నింక పుట్టువే వలదని


రామ రామ యన్నావో రాదింక పుట్టు వని

ప్రేమమీఱ చేయవయా రామనామ స్మరణము

నామ మిదే భవతారక నామమని తెలుసుకో

నామమే శ్రీరాముడని నమ్ముకో మనసున


తారకనామమును నీవు తలచుకో నిత్యమును

శ్రీరామచంద్రుని నీవు చేరుకో చేరుకో

శ్రీరాముని భక్తు లెపుడు చెడరన్నది తెలసుకో

ఆరూఢిగ మోక్షపదవి నందుకో అందుకోసరిసాటి యెవరు మా సాకేతరామునకు

సరిసాటి యెవరు మా సాకేతరామునకు
హరి కాని మరి యీత డన్యుడు కాడు

సుర లడిగిరి శ్రీహరీ ధర మీద నరుడవై
చరియించవె రావణుని సంహరించగ
సరియైన సమయ మిది సాటిలేని వీరుడవై
పరమపురుష రాముడవై పరగు మనుచును

హరి వీడు రావణుడో‌ హరిభటుడు పూర్వము
తిరుగులేని మునిశాప తీవ్రత వలన
సురవైరి కులములో జొచ్చి లోకము లెల్ల
హరివైరియై కలచు నన్ని విధముల

హరి గాక రావణుని యణచగల వాడెవ్వడు
నరుడు గాక రావణుని ధరను గూల్చగ
మరి యన్యల వలన గామి నరుడాయె నాహరి
హరిభటు డెఱిగె శాప మంత మంత మగుటను

సురల కొరకు శ్రీహరి నరుడైనాడు

సురల కొఱకు శ్రీహరి నరుడైనాడు ఆ

హరి కొఱకు సురలు హరివరులైనారు


ధరకు దిగిన శ్రీహరి యొక నరపతి యింట

మురిపెముగ ముగురమ్మల ముద్దుబిడ్డగ

పెరుగుచున్నా డిదే వీక్షించండి

మరి మువ్వురు తమ్ముల మంచి యన్నగ


హరికి తమ్ము కుఱ్ఱలై యరుగుదెంచిన

పరమధన్యు లెవరండి పరమాత్ముని

వరశంఖచక్రములే పర్యంకమే

హరికి తోడబుట్టె హరిపరివారము నేడు


సురవైరుల కొంపలింక చురచుర మండు

హరేరామ భవతారక యనగా మునులు

ధర మీదకు రాముడై హరి వచ్చెను

హరి వచ్చె నసురులను పరిమార్చును