7, జనవరి 2023, శనివారం

మహిమగల నామము

మహిమగల నామము మహా మంచినామము

ఇహపరంబుల నిచ్చే యింపైన నామము


మహామహులు జపముచేయు మధురమైన నామము

మహాదుఃఖములను బాపి మనను కాచు నామము

మహాశివుడు మక్కువపడు మధుసూదను నామము

మహానంద మిచ్చి మేను మరపించే నామము


భోగాతురులగు వారలు పొందలేని నామము

యోగీంద్రులు వినుతించగ నొప్పుచుండు నామము

రాగద్వేషముల నణచు రమ్యమైన నామము

భాగవతోత్తముల కెపుడు భావ్యమైన నామము


క్రూర కామక్రోథాదుల కుళ్ళబొడుచు నామము

దారిద్ర్యము నివారించి దయజూపే నామము

శ్రీరాముని శుభనామము చింతలణచు నామము

ఆరూఢిగ మోక్షమిచ్చి ఆదరించు నామము