19, జనవరి 2023, గురువారం

వందమార్లు తలలు ద్రుంచి

వందమార్లు తలలు ద్రుంచి ఫలము లేదు రామా
సందిది బ్రహ్మాస్త్రమును సంధించుటకు సూవె

మారీచు నణచిన శరము మరి వీని జంపదనుచు
ఘోరఖరవిరాధుల జంపి కుందె శరము లితని కనుచు
వారిధి నణచిన‌ శరములు పనిచేయ వేమి టనుచు
ఊరక చింతించి తలల నుర్వివేయు టొప్పుగాదు

ఏ డహోరాత్రము లాయె నింతటితో నీవు వీని
తోడ కయ్యమాడు టనెడు దివ్య లీల ముగియ జేసి
వేడుకతో‌ బ్రహ్మాస్త్ర మింక విడువవయ్య వీని పైన
చూడవయ్య యన్యంబుల వీడు చచ్చుమాట కల్ల

కన్నుమిన్ను గానని ఈ కామపిశాచము చావగ
మున్ను సురలు నిశ్చయించి యున్నదీ సుమూహూర్తము
నిన్ను నమ్మి వారెల్లరును నింగి నిలిచి వేచి రదే
తిన్నగాను బ్రహ్మాస్త్రమును దేవా పరగించవయ్య

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.