31, జనవరి 2023, మంగళవారం

పొందినవే చాలు

పొందినవే చాలు పుడమిపై నీ జీవి
చెందనీ యిక రామ చెలగి నీ సన్నిధి

మాటికొక వేషమున మరలి వచ్చుట చాలు
పూటపూటకు భుక్తి నాటకమ్ములు చాలు
ఆటుపోటుల కోర్వ కలమటించుట చాలు
నేటికైనను నిన్ను నేను చేరుట మేలు

తొల్లింటి ప్రజ్ఞను తొలగియున్నది చాలు
డొల్లచదువుల వలన కొల్లపడినది చాలు
కల్లనడతల వలన కలతబడ్డది చాలు
చల్లగా నిను చేరి సంతసించుట మేలు

భయదభవవార్ధిలో పడి యీది నది చాలు
పయనించి పయనించి బడలుకొన్నది చాలు
దయలేని కాలమిడు దండనంబులు చాలు
రయమున నినుచేరుటయె చాల మేలు2 కామెంట్‌లు:

  1. చాలు చాలు అంటున్నాం కాని ఆయనొప్పుకోవద్దండీ :) మనిష్టమా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదీ నిజమే ననుకోండి. కాని ఇది చాలు అది మేలు అన్న గమనిక స్థిరమైన నాడు ఆయనా చేరదీస్తాడని ఆశిద్దాం. నిజానికి ఆయన చేరువగానే ఉన్నా మనం వేరే ఏవో ఏవో అనిత్యవస్తువుల పట్ల భ్రమలు పెంచుకొని పరుగులు తీస్తున్నాం‌ కాని ఆయన పాపం ఎంతని వారిస్తాడు చెప్పండి. వీళ్ళే మెల్లగా తెలుసుకుంటారులే అని ఈపిల్లకాయల ఆటలు తిలకిస్తూ‌ ఉంటాడు.

      తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.