25, జనవరి 2023, బుధవారం

ఏమి చేయువాడ నింక


ఏమి చేయువాడ నింక రామచంద్రుడా నేను

పామరుడ నైతినిరా భగవంతుడా


భాగవతుల సేవ యనెడు భాగ్యము నాకబ్బలేదు

త్యాగబుధ్ధి యన్న నేమొ యసలు తెలియనేలేదు

యోగధనుల గూ ర్చి నాకొక్కింతయు నెఱుకలేదు

రాగరహితచిత్తవృత్తి రామరామ అడుగరాదు


తెలిసీతెలియక చెడినది దేవుడా కొంతగ బ్రతుకు

తెలిసి తప్పులే చేయుచు తిరుగ చెడెను మిగిలినది

తెలియనైతి సన్మార్గము తెలియనైతి నిన్నుగూర్చి

తెలిసి నేడు నీదు పాదములను శరణు జొచ్చచుంటి నేడు


దయాశాలి యన్న బిరుదు దాల్చినట్టి వాడ వీవు

రయంబున భక్తజనుల రక్షించెడు వాడ వీవు

ప్రియవిభావనా వేదవేద్య నన్ను రక్షింపుము

భయార్తుడను పతితుండను పాహిపాహి యనుచుంటిని