4, జనవరి 2023, బుధవారం

సీతాకళ్యాణవేళ చెలగె దేవదుందుభులు

సీతాకళ్యాణవేళ చెలగె దేవదుందుభులు
ప్రీతులైరి దేవతలు భీతులైరి రాక్షసులు

పెండ్లికొడుకాయెను రఘువీరుడు రామయ్య
పెండ్లికూతురాయె సిరివెలుగుల సీతమ్మ
కండ్లలోన మిలమిలలు కన సురల కసురుల
పెండ్లాముల పుస్తె లవి పెరుగుట కననాయె

అమ్మవచ్చె కథ లోని కమ్మవచ్చె ననుచు
కమ్మగా నారదముని గాన మదే చేసె
నెమ్మది చేకూరెను నింగిని దేవతలకు
ఉమ్మలిక మూరకయే యొప్పె రాక్షసులకు

రాముడు పుస్తెకట్ట రంభాధు లాడిరి
భూమియు పులకించినది భూమిజనుల తోడ
కామిత మీడేరునని కడుపొంగగ సురలు
ఆమూల లంకలోన నాయె భూకంపము