16, జనవరి 2023, సోమవారం

శ్రీరాము డున్నాడురా మనకు

శ్రీరాము డున్నాడురా మనకు శ్రీరాము డున్నాడురా

యుల్లము నటునిటు లింద్రియకూటమి యూపగనీయక నిలబెట్టుటకు
కల్లగురువుల డొల్లమాటలను చెల్లగ నీయక చల్లగ జూడగ

కొంచెపువారల మాటలు చేష్టలు మించువేళ బాధించ నీయక
పంచమలముల ప్రభావము బుధ్దిని పడదోయగ నెగదోయుచు సఖుడై

విశ్రమ మెఱుగక చాకిరి జేయుచు వీఱిడియై పడి యుండిన వేళల
ఆశ్రయ మన్నము దొరుకని వేళల అన్నివిధంబుల తోడుగ నీడగ

అందరి మొఱలను విని రక్షింపగ అందరి బాధల నంతము చేయగ
అందిరికిని సుఖశాంతుల నీయగ అందరి యోగక్షేమము లరయగ

భ్రమలను గొలిపే‌ కలిపురుషునకు పరుగులు పెట్టే పనిచెప్పుటకు
యముడో గిముడో ఎదురైతే మన కండగ నిలచి రక్షించుటకు

అనేకజన్మల పాపములన్నియు నతిసులభముగా భస్మము చేయగ
అనంతమగు ఈజన్మపరంపర నంతము చేయగ మోక్షము నీయగ

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.