19, జనవరి 2023, గురువారం

ఆనంద మెట్టిదొ తెలియవయా

ఆనంద మెట్టిదొ తెలియవయా బ్రహ్మానందమే పొందవయా

కాసులకొఱకై యల్పుల కొలువుల కష్టపడుట యేమానందం
దాసుడవై శ్రీహరికొలువున కడు ధన్యతగాంచుటె యానందం

సురలను గొలుచుచు  స్వల్పంబులకై వరము లడుగుటే మానందం
హరినే గొల్చుచు ఆత్మానందమె వర మడుగుటయే యానందం 

జిహ్వకు నానాచెత్తను మేపుచు చిక్కులు పడుటే‌ మానందం
జిహ్వకు తారకనామము బెట్టి చిక్కుల నణచుటె యానందం

పాపపుపనులను చేసి యంతకుని పాలబడుట యేమానందం
శ్రీపతిపనులను చేసి మోక్షమును చెందుటలోనే యానందం

ముక్తినొసంగని బహుశాస్త్రంబుల పొగడి నేర్చి యేమానందం
భక్తిపరుడవై హరిచరితంబులు పఠియించుటయే యానందం

భామాదాసుండను నొక బిరుదము పొందుటలో యేమానందం
రామదాసుడను బిరుదును పొంది రాణించుటయే యానందం

పలుదుఃఖముల సంసారములో‌ పడియుండుట యేమానందం
కులుకుచు శ్రీహరి పదసన్నిధిలో నిలబడుటే పరమానందం

దేహమె తానను భ్రమలో సృష్టిని తిరుగుచుండుటే మానందం
మోహము విడచి రాముని కొలిచి మోక్షము నందుటె యానందం